అధిక వేడిమి వల్ల ముందస్తు ముసలితనం.

May 25, 2025 - 23:01
 0  4

దీర్ఘకాలం అధిక వేడిమి ఎదుర్కొంటే  వేగంగా ఆయు క్షీణత. ఆస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనం  వెల్లడి.ముందు జాగ్రత్తలే కీలకం సుమా!

---  వడ్డేపల్లి మల్లేశం
----06...12...2025
ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో  జనం నోట్లో వాడుకలో ఉన్న మాట " ఎండల తిరిగిన వాళ్లకు  పని చేసిన వాళ్లకు  డోకా లేదు" అని .అంతెందుకు ఇప్పటికీ ఎండలో పనిచేసే వాళ్లు  గర్వంగా ప్రకటించుకోవడమే కాదు  భయపడే వాళ్ల పట్ల జాలి చూపుతున్న విషయాన్ని కూడా మనం గమనించవచ్చు.  ఇదంతా మనకు  తెలిసిన పరిజ్ఞానం మాత్రమే  రోజురోజుకు  వస్తున్న  పరిశోధన అధ్యయన అంశాలు  ప్రకృతిలోని భిన్న పరిస్థితుల పైన  దీర్ఘకాలం  చేసే  పరిశీలనల  వల్ల అనేక నూతన అంశాలు  చర్చ నీయా o శాలుగా మారుతున్నాయి. అంతేకాదు మానవ మనుగడకు  సవాలుగా నిలుస్తున్నాయి కూడా.  ఇంటిపట్టున కాకుండా బయట పొలాలు  వ్యవసాయ క్షేత్రాలు  ఇతరత్రా ఎండలో అడపాదడపా తిరుగుతూ పని చేసినటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారని  రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని  కొన్ని రోగాలు అయితే వాళ్ల దరికి చేరడం లేదని గొప్పగా చెప్పుకుంటున్న  పరిస్థితులు కూడా మనకు తెలుసు. కానీ ఆ అంశాలన్నింటికీ భిన్నంగా  అధిక వేడిమి గనుక  మన మీద దాడి చేసినప్పుడు దీర్ఘకాలం ఎండలో ఉన్నప్పుడు  ముసలితనం తొందరగా వచ్చే ప్రమాదం ఉన్నదని  ఆయుష్షు కూడా క్షేనించే   అవకాశం కూడా లేకపోలేదని  ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావం వల్లనేనని  పరిశోధకుల  తాజా సిఫారసులలో తెలుస్తుంటే  కాలానుగుణంగా మన అభిప్రాయాలతో పాటు మన నడవడిని,  ఆరోగ్య రహస్యాలను, ప్రకృతితో అనుబంధాన్ని  ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం కూడా అవసరం.  అవసరమైతే తప్ప ఎండకు  పోకుండా ఉండే అవకాశం లేదా వీలున్న మేరకు  దీర్ఘకాలం ఎండలో ఉండకుండా  ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది కదా!  ఆ విష పరిణామాలు తెలిసినప్పుడు మాత్రమే ఈ రకమైనటువంటి తగిన జాగ్రత్తలకు అవకాశం ఉంటుంది కనుక  ఈ పరిశోధన భవిష్యత్తులో దీర్ఘకాలంలో ప్రభావం పడే    అవగాహన పెంచుకోవడం ప్రపంచ మానవాళికి చాలా అవసరం. శాస్త్రీయ పరిశోధనలను  దీర్ఘకాల అధ్యయనాలను  నిర్లక్ష్యం చేస్తే  ఆ ముప్పు,  ఎదుర్కొనే ఇబ్బందులు అంతా ఇంతా కావు అని తెలుసుకోవడం అవసరం. 
   ఎండ వేడిమి పై ఆస్ట్రేలియా నిపుణుల  తాజా అధ్యయనం  ఏమి చెబుతున్నది:*
**********
  సమాజం ఏ రకంగా నైతే నిరంతరము చలనశీల స్వభావం కలిగి ఉన్నదో  మానవాళి తన అవసరాలు బాధ్యతలు కర్తవ్యాలు వృత్తిరీత్యా  నిరంతరము  ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి  చలించవలసినటువంటి అవసరం ఉంటుంది .ఈ క్రమంలో ఇటీవల  సుమారు 10 సంవత్సరాలుగా గతంలో ఏనాడు లేనంతగా  ప్రతి ఏటా ఎండ వేడిమి  పెరుగుదలనే  కాదు  గత సంవత్సరాలతో పోల్చినప్పుడు భారీ స్థాయిలో ఉండడం వలన  అనేక పరిణామాలకు ప్రకృతి  బలవుతున్న విషయాన్ని గమనించవచ్చు. అంతేకాదు అనేకమంది పిల్లలు వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్లు బలహీనులు  బక్కచిక్కిన వాళ్లు కూడా  ఎండలో ప్రత్యక్షంగా తిరగకపోయినా ఎండ వేడిమి ప్రభావంతో  నీడ కున్న వాళ్లు కూడా వేలాదిమంది మృత్యువాత పడడాన్ని మనం గమనించినప్పుడు  ఇప్పటికైనా ఈ అధ్యయనం పైన దృష్టి సారించడం మన బాధ్యత అని భావిస్తే  మనం నిజంగా మన సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు లెక్క.  ఎండలో కొంతకాలం పని చేసిన తర్వాత శరీరం అలసిపోయిన భావన వస్తుంది  అయితే ఆ రకంగా అలసిపోయిన భావన మనస్సుకు వస్తే   ఇబ్బంది లేదు కానీ  వృద్ధాప్యం తొందరగా రావడం, ఆయుష్షు తగ్గడం  వంటి విపరీత పరిణామాలు  రానున్న కాలంలో అక్షర సత్యాలని తెలిపే  ఈ ఆస్ట్రేలియా పరిశోధనను  మనసుపెట్టి  చదవాల్సిందే.
     "అధిక ఉష్ణోగ్రతలు  మనిషి పై ఎలాంటి ప్రభావాలను చూపిస్తాయి" అనే అంశంపై  ఆస్ట్రేలియాలోని మొనాష్  విశ్వవిద్యాలయంలోని  రొంగ్బి న్ క్స్,యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ లోని  ఘజయ్ లీ నేతృత్వంలోని  అధ్యయన బృందం  చేసిన పరిశోధనలో  ప్రకృతిలో పర్యావరణంలో  జరుగుతున్న అనేక ఒత్తిళ్లకు  మన శరీరంలో చాలా మార్పులు జరుగుతాయని  డిఎన్ఏ లో మార్పులు జరగకపోవచ్చు కానీ  మారుతున్న ఉష్ణ  పరిస్థితులకు తగ్గట్లు  శరీరంలో  ఏ ప్రోటీన్ ఉత్పత్తి  పెరగాలో ఏ ప్రోటీన్ ఎంతగా తగ్గాలో  వేడి కారణంగా నిర్ణయాలు జరిగిపోతాయని  ఈ అధ్యయనములో  వారు వెల్లడించారు.  ఈ ఏపీ జెనెటిక్స్  శరీరం పైన ప్రతికూల ప్రభావం చూపుతుందని  తెలిపిన ఈ అధ్యయనం  ప్రపంచ మానవాళికి  ముందస్తుగా ఎంతో తోడ్పడుతుంది.
  అత్యంత ఉష్ణోగ్రతలకు లోనైనటువంటి వ్యక్తులలో వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపిస్తాయని  అంతేకాదు దీర్ఘకాలం పాటు వేడి  పరిస్థితుల ప్రభావానికి గురైతే  వృద్ధుల యొక్క ఆయుష్షు రెండేళ్లకు పైగా తగ్గే ప్రమాదం ఉన్నదని ఈ అధ్యాయం వెల్లడించినట్టు తెలుస్తుంది.    వేడి పెరిగే కొద్దీ మరింత ఒత్తిడికి గురైనటువంటి శరీరం  ప్రధాన కారణమవుతున్న సందర్భంలో  వడగాల్పులు అత్యధిక వేడి వాతావరణానికి నిలయమైనటువంటి  ఆస్ట్రేలియాలో కొంతకాలం పాటు జరిగిన ఈ పరిశోధన  పరిశీలన అంశాలు అక్కడే ప్రజల పైన స్పష్టంగా కనిపించినట్లుగా అధ్యయనం పేర్కొనడం  మరింత విశ్వసనీయతకు దారితీస్తున్నది.  ఉష్ణోగ్రత ప్రభావంతో పాటు తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా శరీరంలో మార్పులు జరుగుతాయి .పళ్ళు ఆకూరలు కూరగాయలు దుంపలు వంటి తేలిక గా  జీర్ణం అయినప్పుడు  ప్రోటీన్లు విటమిన్లు తగిన మోతాదులో అంది శరీరంలో సానుకూల మార్పులు జరుగుతాయి. కానీ  అందుకు భిన్నంగా  వేపుళ్ళు, ప్యాక్  చేసిన ఆహార పదార్థాలు నూనెలు అతిగా వాడిన  ఆహార పదార్థాలు గనుక తీసుకుంటే పోషకాలు శరీరానికి అందక ఒంట్లో ప్రతికూల మార్పులు సంభవిస్తాయి .దానివలన వయస్సు మీద పడకుండా ఆపే సామర్థ్యం  తగ్గడం ఇక్కడ పరిశీలించదగిన అంశం.  శరీరంలోని జన్యు కణాలు  వ్యతిరేకంగా స్పందించడం వలన  ఏ సందర్భంలో ఏ రకం ప్రోటీన్ ఎంత మోతాదులో ఉత్పత్తి కావాలనే  క్రమం   దెబ్బ తినడం వల్ల  శారీరక భౌతిక ప్రక్రియల పైన ప్రతికూల ప్రభావం పడడానికి  కారణమవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా మనకు తెలుస్తుంది.  అంటే  వేడిని వృద్ధాప్య రేటును నిర్దేశించే జన్యు కణాల పైన అసంబద్ధంగా  ప్రభావం చూపడం కారణంగా వృద్ధాప్యం తొందరగా రావడం కానీ ఆయుష్ క్షీణించడం కానీ జరుగుతున్నట్లుగా  ఈ పరిశోధన ద్వారా తెలుస్తున్న నేపథ్యంలో  అత్యంత వేడిమి దరిచేరకుండా చూసుకోవడంతో పాటు సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ  వికృత పరిణామాల నుండి రక్షించుకోవడానికి ఆస్కారం ఉన్నది. వయసు  మీద పడడం సహజ ప్రక్రియ అయినప్పటికీ  ఒక్కో మనిషిలో  ఒక్కోరకంగా ఉండడంతో పాటు ఒత్తిళ్లు షాక్ వంటి అనూహ్య  సంఘటనలు  శరీరంలో పెను మార్పులు సంభవించడానికి కారణం అవుతున్నాయి. పోషకాహారం తీసుకోకపోవడం చాలా కాలం పాటు సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా వృద్ధాప్య చాయలు  త్వరగా రావడానికి కారణం అవుతున్నట్లు తెలుస్తూ ఉంటే  అధిక వేడి   మనిషిలోని సత్తువను లాగేసి జీవక్రియలను పూర్తిస్థాయిలో నిర్వహించే  సామర్థ్యాన్ని శరీరం కోల్పోయేలాగా  బలహీనం చేస్తుంది.
       తద్వారా వయసు మీద పడే రేటు పెరగడంతో వృద్ధాప్యంలో రావాల్సిన రోగాలు  ముందే రావడం  వంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి  ఎండకు జీవన క్రియలకు  ఆహార అ లవాట్లకు ఏ రకంగా సంబంధం ఉన్నదో మనకు పూర్తిగా అవగాహన జరిగింది కదూ!  ఇక మన చేతుల్లోనే ఉంది  ఎండ వేడిమి నుండి ఎలా రక్షించుకోవాలి? అనివార్యమైన పరిస్థితులలో  ఏ రకమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి?  నిద్ర వ్యాయామం యొక్క పాత్ర ఏమిటి? అనేవి   కూడా ఇక్కడ ప్రధాన పాత్ర నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
  (ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333