నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం

May 11, 2024 - 22:17
 0  24

 వైఫల్యాలను  అంగీకరించడంతోపాటు సమీక్షించుకుంటే మంచిది .

ఎదురు దాడికి దిగడం , లేని పోని ఆరోపణలు చేయడం  మాని  ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తించడం  అవసరం.

విద్యా ,వైద్యం  సామాన్యులకు అందకుండా పోయినది  కేంద్రానికి తెలియథా? ఎన్డీఏ  ఇచ్చిన హామీల సంగతి ఏమిటి ?
----   వ డ్డే పల్లి మల్లేశం

ప్రతి ప్రభుత్వం యొక్క పనితీరును  అంచనా వేయడానికి  వివిధ రంగాలపైన విధాన నిర్ణయాలు,  ప్రభుత్వ ప్రాధాన్యతలు,  ఇచ్చిన హామీలను అమలు చేయడం,  లేదా హామీలను విస్మరించడం,  అప్పుడప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం,  అంతకుమించిన స్థాయిలో ప్రజలను విస్మరించి పెట్టుబడిదారులకు వంత పాడడం వంటి అంశాల ఆధారంగా బేరీజు వేయవచ్చు . ఎన్డీఏ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం  దేశానికి అందించిన సేవలను  ఇచ్చిన హామీల అమలు  తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు  సామాన్యులకు  అందించిన ప్రయోజనాలు లేదా రాజ్యాంగపరమైన హక్కులను అంచనా వేసుకోవడం ద్వారా  కేంద్ర ప్రభుత్వ పనితీరును  నిర్ధారించవలసి ఉంటుంది .ఆ విషయంలో గత పదేళ్ల పాలన అనుభవాలను జోడించుకోవడం ద్వారా  పార్లమెంటు ఎన్నికల్లో  ఏ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ? విస్మరించిన అంశాలేమిటి?  మరింత ప్రాధాన్యత కల్పించవలసిన  బర్నింగ్ టాపిక్స్ గురించి  ప్రజలు ఆలోచించుకోవడం ద్వారా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది .ఆ క్రమంలోనే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం  పని థీ రును ఒక సిద్ధాంత ప్రాతిపదికన  విశ్లేషణ చేయడం ద్వారా  ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా  నిందలు మోపడం అనే కోణంలో కాకుండా వాస్తవాలను నిర్మోహమాటంగా మాట్లాడుకుంటేనే  ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది .
  ఇచ్చిన హామీలను విస్మరించిన  సందర్భాలు :-
*******
2014 ఎన్నికల ప్రచారంలో ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాటలు చెప్పి  యువత ఓట్లను దండుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ  కల్పన ఉపాధి అవకాశాలలో విఫలమైన విషయం తెలిసిందే.  దానికి కారణంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఇతర శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన యువతలో నిరుద్యోగం గత పదిలలో రెట్టింపు అయినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి . అంతేకాదు 2021 నుండి  కరోనా వల్లనయితేనేమి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల వల్లనైతే నేమి 2.5 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయినట్లుగా  అంచనా వేస్తున్నారు.  ఇక విదేశీ బ్యాంకులలోనీ సంపన్న వర్గాల నల్ల డబ్బులు తెప్పించి ప్రతి కుటుంబానికి 1500000  అకౌంట్లో వేస్తామని హామీ ఇచ్చి  ఆ వైపుగా కన్నెత్తి చూడలేదు ఇప్పటికీ ఆ విషయానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇక పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆ మాటను అనలేదని హామీ ఇవ్వలేదని చెప్పడాన్ని మనం గమనించవచ్చు . రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని కూడా నెరవేర్చకపోగా  స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని  కనీస మద్దతు ధర  చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోవడాన్ని మనం గమనించవచ్చు.
అప్రజా స్వామిక పాలన  :-
*""""""""****
ప్రజాస్వామ్యం పేరు చెప్పి  ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం  ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయకుండా  అన్ని రంగాలను సంక్షోభంలోకి నెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రశ్నించే ప్రతిఘటించి ప్రజల కోసం హక్కుల కోసం ఆదివాసీల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమకారులను మేధావులను రచయితలు కవులు కళాకారులను  చిత్రవధకు గురి చేయడం కాకుండా జైలు పాలు చేసిన సందర్భం ఎన్డీఏ హయాములో  జరిగిన విషయం తెలియదా ? మానవ హక్కుల ఉద్యమ నేత వరవరరావు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా తో సహా అనేక మందిని మేధావులను  ప్రజల హక్కుల కోసం పోరాడితే జైలు పాలు చేసి విచారణ ఖైదీలు గా దశాబ్దాల పాటు కొనసాగించినటువంటి తీరు ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యం కావడాన్నీ  సూచిస్తలేదా?  ఇటీవల మణిపూర్ అల్లర్లలో రెండు వర్గాల మధ్య జరిగిన సంఘటన పైన  రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడమే కాకుండా  మహిళలను నగ్నంగా ఊరేగించి అతి కిరాతకంగా  వ్యవహరించిన అక్కడి స్థానికుల చర్యల పట్ల ఖండించకపోగా  పార్లమెంట్లో  చర్చకు పట్టుబడితే 143 మంది పార్లమెంటు సభ్యులను  బహిష్కరించి అగ మేఘాల మీద బిల్లులను ఆమోదించుకున్న తీరు తెలియనిదా?  గతంలో సిజెఐ గా పని చేసిన ఎన్వి రమణ గారు పార్లమెంటులో చర్చించకుండా బిల్లులను ఆమోదించడం  ప్రజాస్వామ్య విరుద్ధమని  ఘాటుగానే స్పందించడం జరిగింది . ఇక అనేక ప్రాంతాలలో దళితులు ఆదివాసీలపైన జరిగిన హత్యలు, అత్యాచారాలు ఆకృత్యాలకు అంతే లేకుండా పోయింది.  రైతులు తమ హక్కుల కోసం  పోరాటం చేస్తే  బుల్లెట్ల వర్షం కురిపించి భాష వాయు ప్రయోగం ద్వారా  చెల్లా చెదురు చేయడంతో పాటు గత రెండు సంవత్సరాల క్రితం 13 మాసాలు సాగిన ఆ ఉద్యమంలో 750 మందిని పొట్టన పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ విధానం మనకు తెలిసిందే కదా!  ఇటీవల తిరిగి  రైతులు పోరాటం చేస్తే  స్వామినాథన్ కమిషన్ సిఫారసులతోపాటు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరినప్పటికీ  వారి డిమాండ్లను నెరవేర్చకపోవడం  అప్రజా స్వామ్యమే కదా  !.
     తీసుకున్న కొన్ని ప్రజా వ్యతిరేక చర్యలు-,పరిణామాలు
--******
  2014 నాటికి  50వేల  కోట్ల అప్పు ఉంటే  గత పదేళ్లలో  లక్ష కోట్ల అప్పును అదనంగా  ప్రజల నెత్తిన పెట్టిన విషయం తెలిసిందే  .ఇక జాతీయస్థాయిలో సగటున రైతుకు కుటుంబం  నెత్తిన 80000 అప్పు ఉన్నట్టుగా తెలుస్తుంటే  పదేళ్ల కాలంలో 1,50,000 మందికి పైగా రైతులు అప్పులు తీర్చలేక  ఉపాధి కానురాక  ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంటే ఇది ఎవరి ప్రయోజనం కోసం సాగిన పాలనో అర్థం చేసుకోవచ్చు.  అంతేకాదు రైతుల కోసం అంటూ మూడు ప్రజా వ్యతిరేక చట్టాలను  రూపొందించి వాటిని  రద్దు చేయించుకోవడం కోసం ఉద్యమాలు చేయక తప్పలేదు అంటే ఈ దేశంలో సాగే పరిపాలన ఎవరి ప్రయోజనం కోసం అంతే కాదు  దేశంలో ఖర్చు చేస్తున్న బడ్జెట్లో పేద వర్గాలకు సుమారు 6% మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతుంటే మెజారిటీ ప్రజా సంపద  ఏ వర్గ ప్రయోజనానికి ఉపయోగపడుతున్నదో అర్థం చేసుకోవచ్చు . గత పది ఏళ్లుగా లాభాలులో ఉన్నటువంటి 64 ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం మూసివేసి వాటిని అమ్మకానికి పెట్టినట్లు,  పెట్టుబడిదారులు  బ్యాంకులకు బాకీ పడ్డ సుమారు 12 లక్షల కోట్లను మొండి బకాయిల పేరుతో ప్రభుత్వం రద్దు చేసినట్లు  తెలుస్తుంటే ఇక  ఏమీ తెలియనటువంటి పేద వర్గాలకు ఈ ప్రభుత్వంతో వనగూరింది ఏమిటి?  ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో  కార్పొరేట్ సంస్థలకు 10 శాతం పన్నును తగ్గించడం ద్వారా  మేలు చేసింది కానీ  దేశానికి మాత్రం 1,84 వేల కోట్ల నష్టం  వచ్చిన విషయాన్ని దాచిపెట్టడం  ఆందోళనకరం.  ఇక కేంద్ర ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ  సరిగా లేదని కాగ్  పేర్కొనడాన్ని కూడా మనం గమనించాలి.
      కేంద్ర ప్రభుత్వం తన చేతిలో ఉన్నటువంటి   ఈ డి, సి బి ఐ, ఐటీ  సంస్థలను  ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల పైన అకారణంగా వినియోగిస్తున్నట్లు అనేక ఆరోపణలు రావడాన్నీ కూడా మనం గమనించాలి . ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలను రాజ్యాంగ సవరణ ద్వారా హరించి వేసినట్లు  తెలుస్తున్నది అదే సందర్భంలో అనేక రాష్ట్రాలలో  కేంద్ర ప్రభుత్వం చొరబడి  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాలను కూల్చివేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో  ఈ దేశంలో స్థిరమైన ప్రజలు మెచ్చిన ప్రజా సంక్షేమ అభివృద్ధిని కోరే ప్రభుత్వం  లేనట్లే కదా ! ఇక చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అని ప్రకటించడమే తప్ప  ఆ వైపుగా చర్యలు లేవు. అంతేకాదు 2021 లో జరగాల్సినటువంటి గృహ జనాభా గణన ఇప్పటివరకు ప్రభుత్వం ప్రారంభించలేదు.  చట్టసభల్లో బీసీలకు 56% రిజర్వేషన్ కావాలని పోరాడుతుంటే సుప్రీంకోర్టు  ప్రశ్నించినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం  బీసీ వ్యతిరేక ప్రభుత్వం అనే తెలిసిపోతున్నది.  కుల గణన చేయడం ద్వారా  ఆయా వర్గాల యొక్క సంఖ్య ఆధారంగా పథకాలను ప్రవేశపెట్టడానికి వీలవుతుందని అనేక కమిటీలు సిఫారసు చేసినప్పటికీ  కులతత్వం పెరిగిపోతుందనే సాకుతో కేంద్రం ఆ వైపుగా  నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంటే  అందుకు భిన్నంగా ఈడబ్ల్యూఎస్ పేరుతో  8 శాతం ఉన్నటువంటి ఈ డబ్ల్యూ ఎస్ లో  పేదలు ఐదు శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ కల్పించడం,  ఏ వర్గాలు ప్రశ్నించకుండానే చట్టం  రూపొందడం  అంటే మెజారిటీ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి మాత్రమే వినియోగించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో  మెజారిటీ ప్రజలు బహుజనులకు సంబంధించిన హక్కుల రక్షించుకోవడానికి  అనివార్యమైన పరిస్థితులలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం  సిద్ధం కావడం అనేది వారికి ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కు.  ఇప్పటికీ దేశంలో విద్యా వైద్యం  పైన ఉచిత హామీని ఏ ప్రభుత్వాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు . పేదరికం పెరగడానికి కొనుగోలు శక్తి తగ్గడానికి విద్యా వైద్యం ప్రైవేటు చేతుల్లో ఉండడమే ప్రధాన కారణమని,  ఆయుష్మాన్ భారత్ పేరుతో వైద్యాన్ని ప్రకటించినప్పటికీ దాని అమలు ఎక్కడా లేకపోవడం  విచారకరం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం  రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333