గ్రామీణ ప్రాంత సౌకర్యాలు  గాలికి వదిలితే ఎలా?  అక్కడ ఉన్నది మనుషులు కాదా?

Aug 22, 2025 - 18:27
 0  4

  జాతీయ ఆదాయంలో వాళ్ల వాటా లేదని ప్రభుత్వాలు భావిస్తున్నాయా?  అసలు ఉత్పత్తిలో  భాగస్వాములయ్యేది గ్రామీణ వాసులే కదా! 
**************
---వడ్డేపల్లి మల్లేశం 90142206412 
----16....02....2025*****
శ్రమ, ఓర్పు,  కష్టాలు కన్నీరు, సర్దుబాటు, పేదరికం,  నిరక్షరాస్యత  వంటి  లక్షణాలతో గ్రామీణ ప్రాంత ప్రజలు  రాజీ పడుతూ జీవించడమే కాదు  ఆధునిక నాగరికత  అవకాశాలు కూడా  వీరికి అంతంత మాత్రమే.  ఇటీవల కాలంలో  టీవీ మీడియా  సెల్ఫోన్ వ్యవస్థ ద్వారా  కొంత అదనపు సమాచారం చేరుతున్నప్పటికీ  ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే కదా  సుఖంగా జీవించడానికి, అవకాశాలను అనుభవించడానికి,  పేదరికం నుండి గట్టెక్కడానికి,  స్థిరమైన జీవితం గడపడానికి  వీలు కలిగేది. కుల వృత్తులు చేతివృత్తులు వ్యవసాయము  కుటీర పరిశ్రమల తో పాటు ఉత్పత్తిలో భాగస్వాములు కావడం, వ్యవసాయంలో క్రియాశీలకంగా పని చేయడం ద్వారా ఆహార ధాన్యాలను పండించడం, దేశ ప్రజలందరికీ తి o డి పెట్టేది పల్లెటూర్లు  అని మరిచిపోకూడదు.  అయితే నేమి గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల గ్రామీణ సంస్కృతి పట్ల  మిగతా సమాజానికి  కనీసమైన సానుభూతి  గౌరవము లేకపోవడం విచారకరం.  గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కరువై  ప్రభుత్వాల యొక్క అలసత్వం కారణంగా కూడా  పనులు దొరకక  పల్లెటూర్ల నుండి పట్టణాలకు ప్రజలు యువత తరలి వెళుతున్న సందర్భంలో కూడా  గ్రామ సీమ లు  చతికిలబడి పోతున్నవి. ప్రభుత్వాలు కూడా  పట్టణ ప్రాంతాలకు కేటాయించిన స్థాయిలో పల్లెటూర్లకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క దృష్టి కూడా పట్టణ ప్రాంతాల అభివృద్ధి మీదనే ఉండడం  వంటి కారణాల వలన   పల్లెటూళ్లు వెనుకబడి పోతున్నవి.కనీస మైనటువంటి రహదారులకు కూడా   నోచుకోకపోవడం   మరి విడ్డూరం. గ్రామీణ ప్రాంతాల పట్ల ప్రభుత్వాలు చూపుతున్న వివక్షతను  ఖండించవలసిన అవసరం కూడా ఉన్నది. ఒక అంచనా ప్రకారం  పంచవర్ష ప్రణాళికలు బడ్జెట్లో  సుమారు 90 శాతం ఉన్నటువంటి సామాన్య ప్రజానీకానికి  10 శాతం నిధులను కూడా కేటాయించకపోవడం ఖర్చు చేయకపోవడం వంటి  అంశాలను  ఆలోచించినప్పుడు ఏ రకంగా గ్రామ సీమలు  పట్టణ సమాజాలతో ప్రభుత్వాలతో చీత్క రించబడుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే  తారాస్థాయికి చేరుకున్న ప్రతివాడు,  రాజకీయ నాయకులు, కలెక్టర్లు, అధికారులు, ఇతర బడా  పెట్టుబడిదారులుగా ఎదిగిన వాళ్లo తా  గ్రామీణ ప్రాంతాల నుండే వచ్చిన వాళ్ళు అనే విషయాన్ని మరిచిపోకూడదు.  ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కష్టపడి  చెమట వడిచి కూలి నాలి చేసుకునే బ్రతికే కుటుంబాల నుండి  పిల్లలు  ఎదిగి  ఐఏఎస్, ఐపీఎస్ ఇతర ఉన్నతాధికారులుగా ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వాళ్లను గనుక గమనించినప్పుడు  నిజంగా శ్రమ పట్టుదల తగిన ప్రతిఫలం పల్లెటూర్లలోనే  ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.  
    గ్రామ సీమల పట్ల వివక్షత ఎందుకు:-
**********
  మీడియా ప్రభావం వలన పట్టణ జీవితం లోని  అంశాలు పల్లెటూరి ప్రజానీకానికి కూడా పరిచయం అవుతున్నప్పటికీ  ఆ స్థాయిలో పల్లెటూర్ల అభివృద్ధికి నిధులను పాలకులు కేటాయించకపోవడం, గ్రామ సీమలను నిర్లక్ష్యం చేయడం,  సర్దుబాటు చేసుకోమని ప్రజలను చిన్నచూపు చూడడం వంటి సంఘటనలు నిత్యం పునరావృతం అవుతూనే ఉన్నాయి.  పల్లెటూర్లను కలుపుతూ వేసిన రహదారులు  నిరంతరము వాహనాల ఒత్తిడితో  కనిపించినప్పటికీ  ఆ స్థాయిలో రహదారుల మరమ్మత్తులు గాని డబుల్ రోడ్ల నిర్మాణం కానీ చేయడం మనకు కనిపించదు.  అలాంటి పరిస్థితిలో అనేక ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు పట్ట ప్రాంతాలకు సకాలంలో చేరుకోవడం కూడా గగనమే. చాలా రహదారులు కూడా సింగల్ రోడ్డు గా ఉండడం,  ఎదురుగా వచ్చే భారీ వాహనాలను తప్పించే క్రమంలో  ప్రమాదాలకు గురికావడం,  రాత్రిపూట ఉండి  లేని సౌకర్యాల మధ్యన ప్రమాదాలు మరిన్ని ఎక్కువ   కావడం నిత్యం జరుగుతున్నప్పటికీ ఆ రోడ్లను మాత్రం వెడల్పు చేయడానికి లేదా  మరమ్మత్తులు చేయడానికి ప్రభుత్వాలకు మనసొప్పడం లేదంటే  ఈ ధోరణిని ఏమనాలి? ఇప్పటికీ వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లడానికి దారి లేక  సొంతంగా దారులను తీసుకొని  వ్యవసాయం నడిపిస్తున్న వారు ఎందరో. గ్రామీణ ప్రాంతాల వ్యవసాయం కూడా యాంత్రికరణ లో  కూరుకుపోయినటువంటి నేటి కాలంలో  మారుమూల ప్రాంతాలకు కూడా ట్రాక్టర్లు, జెసిబి లు,  వ్యాన్లు  వరి కోత మిషన్లు,వరి నాటు మిషన్లు  రావలసినటువంటి అవసరం చాలా ఉన్నది కానీ చాలా ప్రాంతాలకు రహదారులే లేకపోవడం నేల బాటపైననే ఈ వాహనాలు  వెళ్లడంతో  గుంతలు, వాగులు, వంకల గుండా  ప్రయాణించేటప్పుడు అనేక ప్రమాదాలు జరగడాన్ని కూడా మనం పసిగ ట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇ న్ని బాధల మధ్యన గ్రామీణ ప్రాంత ప్రజలు రైతులు కూలీ చేసేవాళ్లు సర్దుబాటు అవడమే తప్ప ప్రశ్నించి తమ హక్కుల కోసం డిమాండ్ చేసిన సందర్భాలు కూడా బహు తక్కువ. ఇక వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగే గ్రామీణ ప్రాంత కార్మికులు సభ్యులు ప్రజలు  ఆయా రాజకీయ పార్టీలను ప్రభుత్వాలను విమర్శించలేక సమస్యలను వారి దృష్టికి తీసుకుపోలేక పరిష్కారాలను అడగలేక  రాజీ పడుతున్న కారణంగా కూడా సమస్యలు మరిన్ని పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంత రోడ్లు సక్రమంగా లేని చోట్ల నిరసనగా రోడ్డుపైననే  నాటు వేసి  తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్న గ్రామీణ ప్రజల యొక్క చైతన్యాన్ని మనం చూడవచ్చు. రోడ్డు పక్కన అగాధాలు లోయలు వాగులు, వంకలు  బావులు ఉండడం  వాటిని overtake చేస్తూ వెళ్లడం  వలన కూడా ఎన్నో వాహనాలు రోడ్డు పక్క బావిలో పడి మృత్యువాత పడిన సందర్భాలు కూడా అనేకం.  క్రమంగా గ్రామీణ ప్రాంత ప్రజా ప్రతినిధులు నాయకులు రాజకీయ  కార్యకర్తలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ  ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాలకు ఖర్చు ఎందుకు?  నిధుల కేటాయింపు ఎందుకు? అని  మూస ధోరణిలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి .
       పొలాలు   పంట చేల వరకు  కనీసం నడిచి వెళ్లడం కూడా గగనమవుతున్న సందర్భాలు అనేకం.  ఇక బైకులు  ఇతర వాహనాలు అక్కడికి వెళ్లడం  గగన కుసుమమే. పండించిన పంటను ఇంటికి చేర్చాలంటే కూడా ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితిలో  కొంత దూరం తలపైన పెట్టుకుని మో సుకొని రావాల్సి వస్తున్నది ఇవన్నీ పాలకులకు కనిపించడం లేదా? ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ పార్టీల ప్రతినిధులు  గ్రామీణ ప్రాంత రోడ్లన్నింటిని డబుల్ రోడ్లుగా మార్చాలని, వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే దారులను పక్కా రహదారులుగా తీర్చిదిద్దాలని,  అక్కడి వరకు యంత్రాలు వచ్చి పోయే విధంగా అవకాశం కల్పించాలని, వాహనాలు వెళ్లడానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే గ్రామీణ ప్రజలు ని సందేహంగా కృషిని కొనసాగించడానికి  పట్టుదలతో పనిచేయడానికి  వ్యవసాయం చేతివృత్తులు  శ్రమ పట్ల నిబద్ధతను కనపరచడానికి అవకాశం ఉంటుందిఅని డిమాoడ్ చేసిన విషయం తెలిసిందే.  సొమ్ము ఒకరిది అయితే సోకు ఒకరిది అన్నట్లుగా కష్టపడి పని చేసి ఉత్పత్తులు పెంచేది గ్రామీణ ప్రాంత ప్రజలు అయితే  ఆ సంపదను ధాన్యాన్ని ఉత్పత్తులను  అనుభవిస్తున్న వాళ్లు పట్టణ ప్రాంతాల వాళ్ళు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల పట్టణ ప్రాంత ప్రజలకు  కనీస మైనటువంటి సానుభూతి కూడా లేకపోవడం  ఈ దేశ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం ద్వారా 50 శాతానికి పైగా  ఆదాయం వచ్చినప్పటికీ ప్రభుత్వాలు కూడా నిధులను కేటాయించే విషయంలో వివక్షత చూపడం  పైన గ్రామీణ ప్రాంత ప్రజలు ఇప్పటికైనా తమ హక్కుల కోసం ఉనికి కోసం మనగడ కోసం ఆత్మవిశ్వాసం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం పాలకుల పైన పోరాటం చేయాల్సిందే. పట్టణాలకు దూరంగా సౌకర్యాల లేమిని ఓర్చుకొని తమ పిల్లల  చదువును కూడా పక్కనపెట్టి గ్రామాలనే అంటిపెట్టుకొని  శ్రమ పైన ఆధారపడి బతుకుతున్నటువంటి అశేష సామాన్య ప్రజానీకం గూర్చి కనీసమైన అవగాహన జ్ఞానం లేన ప్పుడు  పల్లెటూర్ల గురించి అవగాహన కల్పించడానికి గుణపాఠం రావడానికి కొన్ని చర్యలు చేపట్టడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడైనా పల్లెటూర్లను పట్టణవాసులు గౌరవించే కాలం రాక తప్పదు.  కనీసమైన వైద్య సౌకర్యాలు విద్యా సౌకర్యాలు లేకపోవడం  సురక్షితమైన రక్షిత మంచినీరు  పోషకాహారం గ్రామీణ ప్రజలకు సరైన మోతాదులో అందకపోవడం  రోజువారి అవసరాలకు నగదు చేతిలో అందుబాటులో లేకపోవడం వలన  ఎన్నో కుటుంబాలు వీధి పాలు కావడం అప్పుల పాలు కావడం చివరికి ఆత్మహత్యలు చేసుకోవడాన్ని మనం అనునిత్యం పరిశీలిస్తూనే ఉన్నాము. విద్యా వైద్యము సామాజిక న్యాయము  రహదారులు విద్యుత్ శక్తి గృహ వసతి  కొనుగోలు శక్తిని పెంచడం  వంటి మానవ అవసరాలను  కల్పించకుండా  మొక్కుబడి జీవితానికి గ్రామీణ ప్రాంత ప్రజలను  అలవాటు చేసినటువంటి ఈ దేశ పాలకుల  నిర్లక్ష్యం పైన  నిరంతరం పోరాటం జరగాల్సిందే. దారిద్రరేఖ దిగిన జీవిస్తున్న వారు,    మానవాభివృద్ధికి  అర్హత కలిగిన వాళ్లు,  అంతంత మాత్రంగానే ఉన్న పరిస్థితులలో  మానవ అభివృద్ధిని సాధించకుండా  కొన్ని ప్రాంతాలు మాత్రమే బాగా అభివృద్ధి చెంది సౌకర్యాలతో  తులతూగినప్పుడు దానిని దేశాభివృద్ధి అని అంటే కుదరదు.  ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు  పల్లె దవాఖానాలను ఆ ప్రజలకు అందుబాటులో ఉంచడంతో పాటు  నిపుణులైన వైద్యులు యంత్రాలు యంత్ర పరికరాలు నాణ్యమైన మందులు  వివిధ రకాల పరీక్షలను కూడా  అందించగలిగితేనే గ్రామీణ ప్రజలు ఆరోగ్యంగా జీవించి  నాణ్యమైన విద్య ద్వారా అధునాతన పరిజ్ఞానాన్ని ఔపాసన పట్టి  అభివృద్ధిలో ప్రజాస్వామిక పాలనలో భాగస్వాములు కావడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వాల యొక్క తీరును గమనిస్తే పల్లెటూరి ప్రజలతో సంబంధం లేకుండానే పట్టణాలతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచనలు తప్పు. ప్రభుత్వాలు నిపుణులతోని కమిటీలను వేసి గ్రామీణ ప్రాంతా అవసరాలను గుర్తించి వ్యవసాయము కార్మికులు చేతివృత్తుల వాళ్ళు విద్య వైద్యం ఇతర అవకాశాలను మరింత మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ క్షేత్రాలకు డబుల్ రోడ్లను నిర్మించడంతోపాటు  అసలే బాటల్ లేనటువంటి ప్రాంతాలకు కూడా దారులను కల్పించి  వ్యవసాయం చేసే రైతన్నల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు ప్రకృతి విశ్వశించి  నష్టపోతున్నటువంటి రైతన్నలకు  ఆర్థిక భరోసాను ఇవ్వడం ద్వారా  ఈ దేశ ప్రజలకు  మెతుకులను  అందించే రైతుల  కృషిని ముమ్మరం చేయాలి. క్రిమిసంహారక మందులు రసాయ నికి ఎరువుల వాడకం పెరిగిపోవడంతో రైతుల కొనుగోలు శక్తి తగ్గి  ఆఛేతనావస్థకు చేరుకుంటున్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించడం పాలకుల బాధ్యతనే అవుతుంది. 
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333