చిరు మనస్సులపై గాయాల దెబ్బ.
పేదరికం వల్ల వివక్షతకు గురవుతున్న అభాగ్యులు.
అసమానతలు అంతరాలతో ఒత్తిడికి గురికావాల్సిందేనా.?
ప్రత్యామ్నాయ ఆలోచనలేనే లేదా ?
పాలకులను తోటి సమాజాన్ని ఎందుకు ఆలోచింప చేయడం లేదు.?
--- వడ్డేపల్లి మల్లేశం
ఒకే దేశంలో పుట్టి పెరిగిన ప్రజల మధ్య పెను వ్యత్యాసాల కారణ వాళ్ల అనుభవాలు జ్ఞాపకాలలో రోదనలు, వేదనలు, విషాదం నెల కోవడం కొట్ట వచ్చినట్లు కనపడుతున్న వాస్తవం . పెద్దలు వృద్దులు మధ్య వయస్కులతో పాటు ప్రధానంగా చిన్నపిల్లల్లో ఈ వివక్షతను గమనించినప్పుడు వాళ్లు అనుభవించే ఆవేదన వర్ణనాతీతం. తెలిసీ తెలియని బాల్య దశలో కనపడుతున్న వ్యత్యాసాలు,కులవివక్షత నిందలు దూషణలతో గాయాల పాలవుతున్న బాల బాలికల సంగతిని తోటి సమాజంతో పాటు ముఖ్యంగా పాలకవర్గాలు ఎందుకు ఆలోచించడం లేదు. పక్క పక్కనే ఉన్న రెండు ఇండ్లలో గమనించినప్పుడు తి 0డికి లేక నకనకలాడి, ఎలాంటి సౌకర్యాలకు నోచుకోక , చదువుకు దూరమై, పాఠశాలకు వెళ్లడానికి కనీస సౌకర్యాలు లేక, చిన్నపిల్లలను పాఠశాలల్లో చేరవేయడానికి ఎలాంటి వసతులు కానరాక , కాళ్లకు చెప్పులు కరువై, శరీరానికీ పుస్తకాలు బరువై అరకొర తిండితో అల్లాడుచుంటే....... మరొక ఇంటిలో!!!! అదొక రాజభవనం, మనుషుల మీద బంగారు ఆభరణాలు, తిని పడవేసినది మరో కుటుంబానికి ఉపయోగపడే స్థాయిలో వృధా రాజసాలు, కారులో పిల్లలను పాఠశాలకు పంపించి ఆడంబర జీవితాలకు ఆలవాలమై, పది రకాల వంటకాలతో పరిచయమై, ఆంగ్ల భాష వ్యామోహంలో ట్యూషన్లు లక్షల ఫీజులను చెల్లించి కంటికి రెప్పలా చూసుకుని పెంచే కుటుంబాలు తెలిసి తెలియని బాల్యంలో ఇంత తేడాతో కొనసాగుతుంటే పేదింటి బాలలకు తగులుతున్న దెబ్బలు గాయాలకు అంతే లేకుండా పోతున్నది . చిన్ననాటి నుండే ఈ వ్యత్యాసం, వివక్షత, నిరాదరణ, అవమానాలతో జీవిస్తున్న కొంతమంది చిన్న పిల్లల మనసులకు ఊరట కలిగించే అవకాశం లేనేలేదా? ఆ పిల్లలు చేసిన నేరం ఏమిటి ? వాళ్లకు పేదరికానికి తల్లిదండ్రులను బాధ్యులను చేద్దామా? తల్లిదండ్రుల దుస్థితికి ఎవరు బాధ్యులు? సంపద ,ఆదాయము, జీవన విధానము, ఆహారము , ఆలోచన సరళి, భోగభాగ్యాలలో ఇంత తేడా ఉండడానికి ఎవరు కారణం? ఈ విషయాలను చర్చించుకోవడం అవసరం లేదా? గుడ్డిగా చాలామంది చెప్పే మాటలు సర్దుకోవాలని, తేడా తప్పదని, ఎవరి కుటుంబ పరిస్థితి వాళ్లకు ఉంటుందని, పేదవాడు కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఉన్న వాడి మీద అసూయ చెంది ఆరోపణ చేస్తే ఫలితం ఏముంది? అని ప్రశ్నించే వాళ్ళు మనలోనే ఉన్నారు అది కూడా పేద వర్గాలకు చెందిన వాళ్లే ఈ మాటలు అనడం విచారకరం.
మౌలిక ప్రశ్నలను వేసుకోవాలి:-
తాత ముత్తాతల నుండి కొనసాగుతున్న పేదరికం ఇంకా ఇప్పటి తరాలు కూడా అనుభవించవలసిందేనా? సంపన్న వర్గాల అందరిది కూడా నిజాయితీతో కూడిన సంపాదన అవుతుందా ? పేదరికం అంటే పనిచేయక సోమరితనం వల్లనే అనుభవించవలసి వస్తున్నదా ?అక్రమ దందాలు, భూ కబ్జాలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసం , అవినీతి బాగోతాలు, పేద కుటుంబాల మీద దాడుల ద్వారా ఆస్తులను సంపాదించుకోవడం వంటి దుర్మార్గపు ఆగడాలకు కొందరు పూనుకోవడం లేదా ? పేదరికం సహజమైనదే అయితే ఈ దేశంలో 40 శాతం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాలకే ఎందుకు సాధ్యమైంది? రాజ్యాంగంలో ఎక్కడ కూడా సంపద కొద్దిమంది చేతుల్లో ఉండాలని లేదు కదా!? దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ చెందాలని రాజ్యాంగం చెబుతుంటే దానిని గత 77 ఏళ్లుగా పాలకులు ఎందుకు అమలు చేయడం లేదు ? రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల ద్వారానైనా కనీసం మానవ అభివృద్ధికి నోచుకోని లక్షలాది కుటుంబాల దుస్థితికి భాద్యులు ఎవరు ? శ్రమచేసి ఉత్పత్తులు పెంచి, దేశ సంపదకు స్వయం ప్రతిపత్తికి కారణమవుతున్నటువంటి కార్మిక లోకం అష్ట కష్టాలు పడడానికి కారణం ఏమిటి? ఉత్పత్తిలో భాగస్వాములు కావడమే నేరమా? శ్రమను శ్రమైక జీవన సౌందర్యాన్ని ఏనాడు ఆరాధించని సంపన్న వర్గాలకు ఈ రాజ లాంఛనాలు ఎక్కడివి ? భూములున్నటువంటి వాళ్ళవి కష్టపడి చెమటోడ్చి వ్యవసాయం చేసి ఉత్పత్తులు పెంచి సంపాదించిన భూములేనా? లేదా ఆక్రమించినవా?
ఇలాంటి మౌలికమైన ప్రశ్నలు వేసుకోవడం ద్వారా సమాజంలో పేద వర్గాలు సామాన్య ప్రజానీకం ప్రజాస్వామిక వాదులు ఆలోచనపరులు ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది .అప్పుడు గాని ఈ అసమానతలు అంతరాలు వ్యత్యాసాలు వివక్షతకు దోపిడీ పీడన వంచనకు కారణాలు బయటికి రావు. ఈ అంశాలు దేశవ్యాప్తంగా చర్చజరగాల్సి ఉన్నది .గుడ్డిగానే పేదరికం ఉంటుందిలే! అందరూ సంపన్నులైతే చేసే వాళ్ళు ఎవరు ? సేవ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా! అడుక్కు తినే వాళ్ళు లేకపోతే పెత్తందారులు పారవేసే ఆహార పదార్థాలు ఎవరు తినాలి? ఈ జన్మకు ఇంతే! ఎలాంటి మార్పు సాధ్యం కాదు! ప్రశ్నిస్తే మాత్రం పరిస్థితులు మారుతాయా? అని మనకు మనమే తృప్తిపడి నoత కాలం పేద వర్గాల పిల్లలతో సహా వృద్ధుల వరకు ఈ బాధలు తప్పవు.
వివక్షత పై ఉక్కుపాదం మోపాలీ :-
అయితే చిన్న పిల్లల పైన పడుతున్నటువంటి భారం మనసుకు అవుతున్న గాయాలు చదువులోనూ, జీవన విధానంలోనూ, వస్త్రధారణలోను, ఆహార అలవాట్లు, గృహ సౌకర్యం, ఆరోగ్యం ,అనారోగ్యం వంటి అంశాలలో ప్రధానంగా మనం చూడవచ్చు . ముఖ్యంగా చిన్నపిల్లలకు పోల్చుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది అక్కడ దేనికి నోచని పేద కుటుంబాల వాళ్ళు అప్పుడప్పుడు తేడాలని గమనించి మనసు చిన్న బు చ్చుకుంటారు. మనకెందుకు లేదు? మన బతుకులు ఇంతేనా? పేదరికానికి కారణమేమిటి? పక్క వాళ్ళ లాగా మనకెందుకు సౌకర్యాలు లేవు? అని తల్లిదండ్రులను ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నలు ఇనుప రాడులతో కుచ్చి నట్లుగా తల్లిదండ్రులు బాధపడడమే తప్ప పరిష్కరించుకోలేని పిల్లలకు జవాబు చెప్పలేని దుస్థితిలో ఉంటారు.
అందుకే 1966 లో ఈ దేశంలో కొఠారి కమిషన్ చిన్నపిల్లల్లో కనీసం ఈ వివక్షత వ్యత్యాసాలను రూపుమాపడానికి, సమానత్వాన్ని సమాన ఆలోచన విధానాన్ని పరిపుష్టి చేయడానికి పాఠశాల విధానములో కామన్ స్కూలు పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా రాజువైన పేదవాడైనా ఆ ప్రాంతంలో నివసించే పిల్లలు ఒకే పాఠశాలలో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తే సమానత్వం సాధ్యమవుతుంది అని సూచించినది. రాజైనా,పెదైనా కలిసి మా ట్లాడుకుంటారు, మనసు విప్పి పలకరించుకుంటారు, వ్యత్యాసాలు వివక్షతను మరిచిపోతారు, ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకుంటారని కొఠారి ఆలోచనను ఈనాటికి పాలకులు అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం ఇప్పటికైనా బహుశా తెలిసే ఉంటుంది. సమానత్వం ఈ దేశంలో కొనసాగకూడదు, పేదవాళ్లు సంపన్నులు కలిసి జీవించకూడదు, ఆ తేడా కొనసాగాల్సిందే అనే పెట్టుబడిదారీ విధానపు ఆలోచనకు ప్రతినిధులైన పాలకులు 58 ఏళ్ల తర్వాత కూడా అమలు చేయడానికి సిద్ధపడలేదు. ఈ దుర్మార్గపు వివక్షత అసమానతల పైన ఉక్కు పాదం మోపాల్సినటువంటి బాధ్యత ప్రజలు ప్రజాస్వామిక వాదులు పేదవర్గాలు సగటు జీవుల పైన ఉన్నది. ఈ వివక్షత పాలకుల వల్ల పోదు . ప్రజల పోరాటాలతోనే సాధ్యమవుతుందనేది నిర్వివాదాంశం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)