మహిళా లోకం ఔన్నత్యాన్ని చాటి చెప్పేది
బతుకమ్మ పండుగ.... అయితే నేమి? ఎందరో వృద్ధ మహిళలు తల్లిదండ్రులు వివక్షతకు గురవుతున్నది కూడా మహిళా లోకం వల్లనే, బతుకమ్మ పండుగ రోజు ఆనందోత్సాహాల మధ్య గడిపే మహిళల్లారా! తోటి మహిళల పట్ల వివక్షతకు పాల్పడకండి .
*********************************
----వడ్డేపల్లి మల్లేశం
----29...09...2025(సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా )
బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడానికి గల అనేక చారిత్రక సామాజిక కారణాలు ప్రకృతిలో పూల పండుగను గౌరవించుకోవడం, మహిళ లోకాన్ని ఆరాధించుకోవడం, వారి ప్రాధాన్యతను ఇనుమడింపజేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలలో కొన్ని. వాస్తవానికి ఈ పండుగ మహిళలకు సంబంధించినది అయినప్పటికీ మహిళా లోకం యావత్తు ముక్తకంఠంతో అందరం ఒకటే మేమంతా సమానమే అని చెప్పగలిగే స్థాయిలో ఉన్నదా? అని ప్రశ్నించుకోవడం కూడా అవసరం. ఎందుకంటే ఇందులో వివిధ వయస్సులవారు, ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు కలవారు, వావి వరసలు విభిన్నంగా ఉన్న వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఒక వైపు సంతోష పెట్టే విధంగా కొనసాగుతూ ఉంటే మరొకవైపు అసూయ ధ్వేషాలతో అవమానవీయ పరిస్థితులలో చిన్న చూపు చూసే సందర్భాలను కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. అయితే మహిళా లోకానికి సంబంధించినటువంటి పండుగ గనుక ఈ సందర్భంగా మహిళల మధ్య ఉన్నటువంటి అంతరాలు, అసమానతలు, వివక్షత, తేడాలను చర్చించుకోవడం కార్యకారణ సంబంధాన్ని విమర్శించుకోవడం, అందుకు గల కారణాలను అన్వేషించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కరోజు బతుకమ్మ పండుగ మహిళ లోకానికి సంబంధించినది గా నిర్వహించబడుతూ ఉన్నప్పటికీ అనేకమంది మహిళలు కూడా వివిధ కారణాల వలన ఆందోళనకు గురవుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి .కొంతమంది మహిళలు అత్తవారిళ్లల్లో అమానవీయ పీడన వలన స్వతంత్ర జీవితం గడపలేక ఆందోళనకు గురవుతున్న వాళ్ళు ఉంటే, అంతకు మించిన స్థాయిలో వృద్ధులైనటువంటి అత్తమామలు తమ కొడుకులు కోడండ్ల తో అనేక రకాలుగా పీడించబడుతున్న సందర్భాలను కూడా మనం చర్చించుకోవలసినటువంటి అవసరం ఉంటుంది.
కుటుంబంలో ప్రధానంగా అనేక పాత్రలు పోషించగలిగే స్త్రీలు సహజంగాను బాధ్యతల రీత్యా కూడా అనేక రకాలైన ఒడుదుడు కులను ఎదుర్కొంటూ ఉన్నత స్థాయి నిర్ణయాలు లేదా పాత్ర పోషణ ద్వారా తన ఉనికిని చాటుకుంటున్న విషయాన్ని మనం కాదనలేము. ఆ విషయంలో మహిళల పాత్రను కొనియాడక తప్పదు. ఇంకా మరికొన్ని ముఖ్యంగా వ్యవసాయ కార్మిక పేద దళిత ఆదివాసి అట్టడుగు కుటుంబాలలో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అనేక రకాల పనులను చేస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ కూలి పనులకు వెళ్తూ కుటుంబ ఆదాయాన్ని సమకూర్చే విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి కుటుంబాలలోనే కొద్దిమంది భర్తల యొక్క దౌర్జన్యానికి, ఏవగింపుకు, మత్తుకు బలవుతున్నటువంటి వాళ్లను కూడా మనం గమనించవచ్చు. ఈ వివక్షతలు కూడా కొనసాగుతున్న సందర్భాన్ని మహిళా లోకం కూడా గమనించవలసిన అవసరం ఉంది. "కానీ మనం సాధారణంగా పండుగ అనగానే అందరం కూడా ఆనందోత్సాహాల మధ్యన జీవిస్తున్నట్లుగా అపోహ పడతాము కానీ లక్షలాది మంది అనేక రకాలైనటువంటి సమస్యల మధ్యన ఊగిసలాడుతూ వివక్షతకు, హింసతో అణచివేయబడుతూ అవమానించబడుతూ ముఖ్యంగా వృద్ధులు హింసించబడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ వృద్ధ మహిళలు పురుషులు కూడా హింసించబడుతున్నది ముఖ్యంగా స్త్రీల వల్లనే అనే విషయాన్ని కూడా మనం గమనించాలి అంగీకరించి తీరాలి .యవ్వ నంలో ఉన్నటువంటి స్త్రీలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమము లోపల వృద్ధుల పైన దాడులకు, హింసకు, అణచివేతకు పాకులాడవచ్చు ప్రయత్నించవచ్చు లేదా ప్రత్యక్షంగా జోక్యం కూడా చేసుకున్న సందర్భాలు అనేకం. మరి వీళ్ళు వృద్ధులు అయితే వీళ్లకు అది వర్తించదా? "అత్త ఒకప్పుడు కోడలే" అన్న మాదిరిగా కోడళ్ళు ఒకనాడు అత్తలు అవుతారు కదా! అప్పుడు వాళ్లు వాళ్ల కోడళ్ళతో హింసించబడతారు అనే ఆలోచన గనుక ఉండి ఉంటే, ఈ వారసత్వ లక్షణం అందరికీ వర్తిస్తుందని ఆలోచిస్తే, ఈ దుర్మార్గపు అవ లక్షణానికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టవలసింది కదా! "
బతుకమ్మ పండుగ రోజున లక్షలాదిమంది ఆ మాట కస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది బతుకమ్మలను మధ్యలో పేర్చి చుట్టూ ఆడుతూ పాడుతూ ఆనందోత్సాహాల మధ్యన తమ హావ భావాలను పంచుకుంటుంటారు అనేది వాస్తవం అయితే " వెలుతురు మాటు న చీకటి ఉన్నట్టు" "దీపం కింద నలుపు ఉన్నట్లు" బతుకమ్మ పండుగ సంబరాల వెనుక కూడా ఎందరో అభాగ్యులు అనాధలు వృద్ధులు మహిళలు వివక్షతకు అణచివేతకు అవమానానికి బలవుతున్న వాళ్లు ఉన్నారని మహిళలు అంగీకరిస్తే ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకవచ్చు. ఇది అందరికీ లాభదాయకమే. అధికారాన్ని చలాయించడం, ఆధిపత్యాన్ని ప్రదర్శించడం, వయో భారంతో వృద్ధులైనటువంటి వాళ్లపైన హింసను ప్రయోగించడం ఒక తరం పైన జరిగితే రాబోయే తరం మళ్లీ ప్రయోగించే హింసకు వీ ళ్లు కూడా బలవుతారు కదా! ఈ హింస ప్రవృత్తి ఒక్క తరానికి మాత్రమే ఉంటుందని ఎందుకనుకోవాలి? " నీ హింస ప్రవృత్తిని చూసిన నీ తర్వాత వచ్చే తరం నేర్చుకోరా " అప్పుడు ఈ రకమైనటువంటి హింస దోపిడీ పీడన అణచివేత ఎల్లకాలం కొనసాగవలసిందేనా? "మంచి మనసుతో మానవతా విలువలతో మనతోనే ఆ దుర్మార్గాన్ని ఆపి రాబోయే తరాలకు ఆ వారసత్వం లేకుండా చేయగలిగితే అంతకుమించినటువంటి మానవతా విలువ మరొకటి ఉంటుందా?"
మహిళా లోకానికి విన్నపం
**************************----*
నిజంగా ఒక జీవితాన్ని పూరించేది స్త్రీ అని అంటారు అంటే భర్తకు చేదోడు వాదోడుగానే కాదు అనేక రకాలుగా ఆ లనా పాలన చూడగలిగే శక్తి సామర్థ్యాలు కల వాళ్ళు స్త్రీలు. చారిత్రకంగా పౌరాణికంగా కూడా అనేక సందర్భాలలో పురుషులకు స్త్రీలు తోడై తమ కర్తవ్యాన్ని లక్ష్యాన్ని చేరుకున్న విషయాలను మనం ప్రస్తావించవచ్చు. అలాంటప్పుడు తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే మానవతా విలువలను ప్రధానంగా చేసుకొని సమాజాన్ని నిర్మించుకోవడం మన అందరి యొక్క కర్తవ్యం. భార్యాభర్తలు పెనుగులాడుకోవడం, విమర్శించుకోవడం, సాధింపులు బెదిరింపులతో లొంగదీసుకోవడానికి ప్రయత్నం చేయడం నిరంతరం జరుగుతున్నటువంటి సందర్భంలో వాటికి స్వస్తి పలకాల్సిన అవసరం చాలా ఉన్నది. అలాగే "మీ కుటుంబంలోని అత్తమామలను నీవు హింసిస్తే నీ తల్లిదండ్రులను అక్కడ హింసించే వాళ్ళు ఉంటారని తెలుసుకో! గమ్మత్తేమిటంటే కడుపున పుట్టిన కొడుకులే కన్న తల్లిదండ్రులను దుర్మార్గంగా అణచివేస్తున్న సందర్భాలు మరింత అ మానవీయం. ఒకరింట పుట్టిన కోడలు కొంతవరకు ప్రేమకు పాత్రురా లు కాకపోవచ్చు అప్పుడప్పుడు తప్పటడుగులు వేయవచ్చు... కానీ కడుపున పుట్టిన కొడుకులై ఉండి కూడా అభిమానం వాత్సల్యం లేకుండా సిగ్గు విడిచి తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నామంటే "నీవు నిజంగా కొడుకువు కాదు బండరాయివే" ఈ తల్లిదండ్రులను హింసించి దూరం చేసుకుంటావు కావచ్చు కానీ అదే రోజు నీ బండారం బయటపడుతుంది.నీ చుట్టూ ఉన్న సమాజం నిన్ను నీ భార్యను చీత్క రిస్తుంది, దోషిగా నిలబెడుతుంది, అందరి ముందు తలవంచుకునేలా చేస్తుంది. ఇది ఏ ఒక్క కుటుంబానికి సంబంధం ఉన్న విషయం కాదు. " ఏ కుటుంబం కూడా నవ్వుల పాలు కాకూడదని, ఏ తల్లిదండ్రులు స్త్రీలు కూడా అవమానాల పాలు కాకూడదని, అందరూ కూడా ఆత్మగౌరవంగా జీవించాలని, ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగ సందర్భంగా మానవీయ విలువలతో హుందాగా మహిళా లోకం జీవించాలనేదే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం. "నీవు విమర్శిస్తే అంతకుమించిన స్థాయిలో హింసించబడతావు. నీవు అవమానిస్తే నీవు కుమిలిపోయేలాగా దుఃఖపడేలా సమాజం చీత్క రిస్తుంది జాగ్రత్త సుమా! "కోట్లాదిమంది సంతోషంగా గడిపే బతుకమ్మ పండుగ రోజున కొద్ది మందికి దుఃఖాన్ని అవమానాన్ని హింసను కలిగిస్తే అంతకు మించిన పరాభవాన్ని మనం కూడా అనుభవించవలసి వస్తుంది అని తెలుసుకుంటే అదే బతుకమ్మ పండుగ అంతరార్థమని భావిస్తే అంతకు మించిన సంతోషం లేదు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )