మరణం లేని జీవి ఉంటుందా.. ?
జవాబు : విశ్వంలో చాలా చోట్ల జీవులుండటానికి ఆస్కారం ఉన్నా, సైద్ధాంతిక అవకాశం వున్నా మనకు లభించిన వైజ్ఞానిక ఆధారాల ప్రకారం, ఒక్క భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదు.
అంగారక గ్రహం మన సౌర మండలంలోనే మన పొరుగున ఉన్న గ్రహమే. దాని మీద గతంలో ఎపుడో జీవం వున్నట్లు అరకొర ఆధా రాలు అగుపించినా అవి బలమైన ఆధారాలు కావు.
ఒకదాన్ని జీవి అనాలి అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. మన భూమ్మీద వృక్ష జాతులు, జంతు జాతులు అటుయిటూ గాని జాతులు లక్షలాదిగా వున్నా జీవులన్నింటికీ సార్వత్రికంగా (Universal or Common) కొన్ని సాధారణ లక్షణాలున్నాయి.
రాయిని చూపి పుస్తకమని అనలేం. ఇటుకను చూపి మొబైల్ ఫోన్ అనం. నదిని చూపి పర్వతం అనం. అలాగే వేటిని జీవులు అనకూడదో, వేటిని జీవులు అనాలో నిర్ద్వంద్వంగా చెప్పగలం.
మిల్లీమీటరులో సుమారు వెయ్యోవంతు ఉన్న తిత్తిలాంటి కోశంలో DNA లేదా RNAఅనే పొడవాటి బృహదణు (macro molecular) సముదాయం వుండడం జీవికి వున్న ప్రాథమిక లక్షణం.
దీనికి ఏ జీవీ (చెట్టూ చేమా, చీమా దోమా, పురుగు పుట్రా, కప్పలు పాములూ, ఆవూ పందీ, తులసీ తుమ్మా, ఉమ్మెత్త ఉలవ, నత్త నల్లి, అమీబా అనకొండ, తేయాకు తిమింగలం, నువ్వు నేను) ఉపేక్షణీయం (exception) కాదు.
ఇలాంటి తిత్తినే కణం (cell) లేదా జీవకణం (biological cell) అంటాము. తిత్తిలో RNA మాత్రమే వున్న అత్యంత ప్రాథమిక కణం వైరస్. ఇవి జీవికి, నిర్జీవికీ మధ్యస్తంగా వుంటాయి. కానీ నిజమైన జీవకణంలో ప్రవేశించాక వీటికి జీవ లక్షణాలు అబ్బుతాయి. అది వేరే విషయం.
జీవికి ఉన్న మరో లక్షణం ప్రత్యుత్పత్తి (reproduction). ఒక రాయి తన చుట్టూ తనలో ఎలాంటి రసాయనాలు ఉన్నాయో అలాంటి రసాయనాల్ని ఎన్నిరోజులు ఉంచినా.. ఆ రాయి తనలాంటి మరో రాయిని తయారు చేసుకోలేదు. పదార్థాలు, రాయి విడివిడిగా స్వతంత్రంగా అరకొర మార్పులతో ఉంటాయి తప్ప మరో రాయి ఏర్పడదు.
కానీ జీవకణం అలాకాదు. తనలో వున్న అంతర్ భాగాలలోని లక్షణాలున్న రసాయనిక భౌతిక పరిస్థితుల్ని ఒనగూర్చితే తన లాంటి (Xerox కాపీ లాగా) మరో కణాన్ని నిర్మించు కొంటుంది.
ఏకకణ జీవి (monocellular organism) మరో ఏకకణ జీవిని, కుక్కలాంటి బహుకణ జీవి (multicellular organism) కుక్కలాగే వున్న మరో బహుకణ జీవిని నిర్మించుకొంటుంది. వరి మొక్క మరో వరిమొక్కను, తులసి చెట్టు మరో తులసి చెట్టును నిర్మించుకొంటుంది.
అంతేగాని ఇటుక మరో ఇటుకను, మొబైల్ ఫోన్ మరో మొబైల్ ఫోన్‌ను, ఒక గడియారం మరో గడియారాన్ని నిర్మించుకోలేవు.
జీవికున్న మరో లక్షణం పరిణామం (evolution). ఏ జీవి అనంతకాలం పాటు తనలాంటి జాతి జీవినే నిర్మించుకోదు. తక్కువ కాల వ్యవధిలో (అంటే సెకన్లు గంటలు కాదు సుమా, కొన్ని వేల లేదా లక్షల సంవత్సరాలు) పెద్దగా తేడాలు కనిపించని పునరుత్పాదక సంతానం వచ్చినట్టున్నా లక్షలాది సంవత్సరాల పర్యంతంలో మొదటి జీవి లక్షణాలకు, తదుపరి జీవి లక్షణాలకు ఎంతో కొంత తేడా వుంటుంది. తద్వారానే ఈ భూమ్మీద వివిధ వృక్ష, జంతు జాతులు రూపొందాయి.
దీనినే మహనీయుడు చార్లెస్ డార్విన్ తన 'ప్రకృతివరణం ద్వారా జాతుల ఆవిర్భావం (Origin of Species by Natural Selection), గ్రంథంలో సోదాహరణంగా విపులీకరించాడు.
ఇక నాల్గవ లక్షణం: జీవులు ప్రకృతితో ఘర్షించు కొంటాయి. ఆ ఘర్షణలో రక్షణను, అపాయాన్ని రెంటినీ ఎదుర్కొంటాయి. దీనినే గతితార్కిక భౌతికవాదం (Dialectical Materialism) అనే సర్వ వైజ్ఞానిక సమాకలిత తత్వశాస్త్ర (Integrated Scientific Philosophy) పరిభాషలో సంఘర్షణ (contradiction) అంటాము.
ఉదాహరణకు భూమి ఆకర్షణకు విరుద్ధంగా పైకి చెట్టు ఎదగడం ప్రకృ తికి విరుద్ధం. కానీ అదే భూమి ఆకర్షణ వల్లే చెట్టు నేలలో కుదురుగా నిలబడింది. ఉష్ణోగత పెరిగితే జీవకణం చనిపోతుంది. కానీ ఉష్ణోగ్రతే లేకుంటే కూడా జీవకణం చనిపోతుంది. గాలి లేకుండా బతకలేము. కానీ మరీ ఎక్కువయితే కొట్టుకుపోయి తునాతునకలవుతాము. ఇంకా ఇలాంటివే ఎన్నో లక్షణాలు జీవులకు వున్నాయి.
ఇక జీవులకున్న అత్యంత ముఖ్యమైన లక్షణం శక్తిని పొందే విధానం. దాదాపు 99.99 శాతం వరకు జీవులన్నీ ప్రకృతి అవరోధాన్ని ఎదుర్కొని ఎదుగుతాయి.
ఇలా అవరోధాన్ని ఎదుర్కొని పదార్థాన్ని స్థానభ్రంశం (positional displacement) చేయించడాన్నే పని (work) అంటాము. పని చేయడానికి శక్తి (energy) అవసరమనేది ప్రకృతి నియమం (natural law).
ఎదగడం, కదలడం, పారిపోవడం, తలపడడం, మాటువేయడం, కాటు వేయడం, కనడం, కూడడం, నవ్వడం, కవ్వడం, ఏడ్వడం, ఏర్పడడం వంటివన్నీ పనులే. జీవి మొత్తంగా కదిలినా, భాగాలు భాగాలుగా కదిలినా పని జరిగినట్టే. ఇన్ని విధాల పనులు చేయాలంటే శక్తి అవసరం.
అదీ యిదీ అని తేడాలేకుండా పైన చెప్పినట్టు 99.9999 శాతం జీవులన్నీ రసాయనిక శక్తి ఆధారంగానే జీవాన్ని ఈడేరిస్తున్నాయి. ఆ రసాయనిక యింధనం గ్లూకోజు. గ్లూకోజులో వున్న రసాయనిక శక్తి దానిని ఆక్సిజన్‌తో కలిపితే వచ్చే కార్బన్ డైయాక్సైడ్, నీటి అణువుల శక్తి కన్నా ఎక్కువ. కాబట్టి గ్లూకోజును కార్బన్ డయాక్సైడ్, నీటి అణువులుగా మార్చగా దొరికే అదనపు శక్తిని వాడుకోవడం వల్లే దాదాపు అన్ని జీవులు జీవించగలుగుతున్నాయి.
బాబాలు, ఆస్తికులు, నాస్తికులు, అమెరికన్లు, అల్బేలియన్లు, అన్ని జంతువులు, అన్ని వ క్షాలు, అన్ని మొక్కలు, అన్ని జీవులు ఈ గ్లూకోజులోని శక్తితో తప్ప మరేదో దివ్య శక్తితోనో, అభూత శక్తితోనో, వారికే ప్రత్యేకమైన (reserve) శక్తితోనో జీవించడం లేదు.
జీవకణం (లేదా జీవి) బయట గ్లూకోజును కార్బన్ డయాక్సైడ్, నీటి అణువులుగా మార్చడం ద్వారా శక్తిని రాబట్టు కోవాలంటే గ్లూకోజును మండించాలి లేదా దహనం (combustion) చేయాలి.
అందుకోసం గ్లూకోలను ఆక్సిజన్ వున్న గాలి సమక్షంలో సుమారు 300 సెంటిగ్రేడు ఉష్ణోగతకు వేడి యాలి. కానీ ఏ జీవిలోను ఇంత ఉష్ణోగత ఉండదు. అంతటి వేడితో ఏ జీవకణమూ బతకదు. మరి జీవకణములకు గ్లూకోజు నుంచి శక్తి ఎలా లభ్యమవుతుంది?
అందుకోసం దశలు ఉన్నాయి. అంచెలంచెల ఆ దశల్ని కూడగట్టి క్రెబ్స్ వలయం లేదా సిట్రికామ్ల వలయం (Citric Acid Cycle- CAC) లేదా త్రయ కార్బాక్సిలిక్ ఆమ్ల వలయం (Tricarboxylic Acid Cycle- TAC) అంటాము.
తమాషా ఏమిటంటే ఈ క్రెబ్స్ వలయం దాదాపు పైన పేర్కొన్నట్టుగా గ్లూకోజుల నుంచి శక్తిని దండుకొని బతికే 99.99 శాతపు జీవులన్నింటికీ సార్వత్రికం.
ఇలా ఎన్నో సాధారణ జీవ లక్షణాల ఆధారంగానే నేడు ఆధునిక జీవశాస్త్రం డార్విన్ పరిణామవాద సిద్దాంతానికి తిరుగులేని సాక్ష్యాధారాల్ని ఇస్తోంది. అయినా అమెరికా లాంటి అభివృద్ధి(?) చెందిన దేశాలలో పాఠశాల విద్యలో పరిణామ సిద్ధాంతాన్ని తీసివేశారు.
తమ మత గ్రంథాల ఉవాచలకు పరిణామ వాదం గొడ్డలి పెట్టుగా వుండడం వల్ల మతతత్వ రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాల బలంతో నడిచే పాలకవర్గాలు పరిణామ వాదానికీ, శాస్త్రీయ దృక్పధానికి తరతరాలుగా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ 'సత్యమేవ జయతే (సత్యమే జయిస్తుంది) అన్న నానుడిలాగే నిజాలు బయటపడుతూనే వున్నాయి. అది వేరే విషయం.
ఇక మీరన్న ప్రశ్నకు సమాధానం పైన పేర్కొన్న వివరణ ద్వారా లభిస్తుంది. జీవికున్న ప్రతి కార్యకలాపంలోను పని యిమిడి వుంది. ప్రతి పనిలోనూ శక్తి మార్పిడి వుంది. జీవి చేసే చాలా పనుల్లో తన ప్రమేయం లేని విధంగా సహజత్వం వుంది.
ఉదాహరణకు నాకు యిష్టం వున్నా లేకపోయినా నా గుండె కొట్టుకుంటుంది. బాబాలు లేదా దైవాంశ సంభూతులు అనుకొనేవారు అలా నమ్మబలికే వారు కూడా తమ గుండెల్ని ''ఆగిపో హృదయమా, నా స్వంత హృ దయమా, ఓ నిముషమే సుమా నీ కదెంత సమయమా'', అని నాజూగ్గా అడిగినా గుండె ఆగదు. ఆగితే యిక మరణించడం ఆగదు.
ఇలాంటి ప్రకృతి సిద్ధ సహజ కార్యకలాపాల్ని వైజ్ఞానిక శాస్త్ర పరిభాషలో ఇర్రివెర్సిబుల్ చర్యలు (Irreversible Processes) అంటారు. ఇలాంటి చర్యల్లో సహజంగానే ఎంట్రోపీ (Entropy) పెరుగుతుంది. ఇది కూడా ఓ సార్వత్రిక ప్రకృతి నియమం.
ఎంట్రోపీ అంటే పదార్థాల్లో క్రమ రాహిత్యాని (disorder) కి, చంచలిత (randomness) కు, చలనాల (motions) కు కొలమానం. జీవుల్లో జీవిత పర్యంతం జరిగే సహజ ఇర్రివెర్సిబుల్ చర్యలే జీవిలో క్రమరాహిత్యాన్ని పెంచుతాయి. ఓవైపు సహజ చర్యల ద్వారా తన జీవకణంలో వున్న క్రమానుగత చర్యల సమాకలనం ద్వారా జీవిస్తూనే అవే సహజ చర్యల ద్వారా ఉత్పన్నమయ్యే ఎంట్రోపీ ద్వారా కణాలకి క్రమరాహిత్యాన్ని పెంచుకొంటుంది. ఇది కూడా గతితార్కిక భౌతికవాదపు మొదటి నియమ మయిన contradiction of the oppositesకి బలాన్ని చేకూర్చు తుంది.
ప్రతి జీవి ఈ భౌతిక ప్రపంచంలో అంతర్భాగమే కానీ, ప్రకృతికి ఆవల ఏమీ లేదు. అందుకే జీవిలో వున్న క్రమత్వపు రక్షణ, అక్రమత్వపు ఆపదలలో ఆపదపాలే కాలక్రమేణా ఎక్కువవుతుంది. గతితార్కిక భౌతికవాదంలో కూడా ఘర్షణ చెందే రెండు పరస్పర విరుద్ధ అంశాలలో ఒకదానిది పైచేయి అయ్యే సందర్భం వస్తుంటుంది.
ఇలా జీవానికే ప్రతినిధి అయిన జీవకణంలో ఎంట్రోపీ స్థాయి పెరిగేకొద్దీ జీవకణపు హంగులు, ఆర్భాటాలు, చలాయింపులూ, గెలుపులూ మందగిస్తాయి. ఈ విశాల విశ్వంలో కాలక్రమేనా ఎంట్రోపీ పెరుగుతోందన్న సార్వత్రిక నియమానికి జీవకణం దాసోహమంటుంది.
అందుకే కొంతకాలమయ్యేక జీవకణపు చర్యలు కాలక్రమేనా క్రమరాహిత్యానికి లోనవుతాయి. అపుడు ఆ కణం చనిపోయింది అంటాం. అందుకే ప్రాణం పోయాక కూడా పదార్థం అలాగే వుంటుంది. బహుకణ జీవులయిన మనము ఇతర వృ క్ష జంతు జాతులు కొన్ని కణాల్ని పునరుత్పత్తి చేసుకోగలవు. కానీ అన్నింటినీ కాదు. ఇక జీవి నిర్మాణాన్ని బట్టి, జీవి జాతిని బట్టి ఎప్పుడోకప్పుడు జీవి మొత్తంలో జీవలక్షణాలు సన్నగిల్లుతాయి. ఇదే సహజ మరణం. దీనికి ఏ జీవీ ఉపేక్షణీయం కాదు.
ఆయా జీవుల ఆంతరింగిక నిర్మాణం, జీవన కార్యకలాపాల ఆధారంగా ఆయా జీవులకు ఆయుర్దాయం వుంటుంది. ఏదీ, ఎవరు చిరంజీవి కాదు కాబట్టి ప్రశ్నలో రెండవ భాగానికి అర్థమే లేదు. ఎక్కువకాలం ఆరోగ్యంగా బతకడమెలా అన్నదే మిగిలిన తంతు. అది వేరే సమాధానం.
-ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక.