మేధావి, హక్కుల, పౌరసంఘాలతో ప్రభుత్వ చర్చలు ఆహ్వానించ తగినవే.*
అయితే చర్చనీయా0శాలపై చిత్తశుద్ధి నిరంతరం కొనసాగాలి.
పెట్టుబడిదారీ వ్యవస్థలో పౌరహక్కులు ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ పై సంఘాల అనుమానంలో అర్థముంది.
డిమాండ్లను పరిష్కరించి హామీకి ముఖ్యమంత్రి కట్టుబడితే ఉద్యమ శక్తులకు విశ్వాసం పెరుగుతుంది.
---- వడ్డేపల్లి మల్లేశం
తెలంగాణలో గత పాలనలో ప్రజల ఆకాంక్షలు అమలుకు నోచుకోక, నిర్బంధం అణచివేత పెరిగి, ప్రజాస్వామిక విలువలు మృగ్యమై, పౌర హక్కులు కాలరాచి వేయబడిన తీరు పర్యవసానంగా ప్రజలు,ప్రజాస్వామిక వాధులలో నిరాశ నిస్పృహలు ఆగ్రహము అసంతృప్తి పెల్లుబికిన దానికి బుద్ధి జీవుల పోరాటం తోడు కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దారి సుగమమైనది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఇప్పటికీ అంగీకరిస్తూ తమ కృషి, నెలకొన్న పరిస్థితులు, ప్రజల తీర్పు కారణంగానే నూతన ప్రభుత్వం ఏర్పడినదని విశ్వాసాన్ని వ్యక్తం చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కారానికి నిదర్శనం గా భావించవచ్చు. అదే సందర్భంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మీడియా ఇంటర్వ్యూలో "తెలంగాణ ప్రజలు ఆకలితో అలమటించడానికి అయినా అంగీకరిస్తారు కానీ ఆత్మగౌరవం కోల్పోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారని " చేసిన ప్రకటన ఇటీవల సచివాలయంలో పౌర సంఘాలతో జరిగిన చర్చలకు ఒక రకంగా ప్రాతిపదిక కావడాన్ని స్వయంగా చర్చల్లో పాల్గొన్న పౌర హక్కుల సంఘం నాయకులు రాజనీతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ గారి మాటల ద్వారా తెలుస్తున్నది. మార్చ్ 1, 2024 శుక్రవారం రోజున ముఖ్యమంత్రి గారు ఇతర అధికారులు మంత్రులు సిబ్బందితో పౌర సంఘాల నాయకులతో జరిపిన చర్చల సారాంశాన్ని మరొక ఇంటర్వ్యూలో హ రగోపాల్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఈ వ్యాసరచనకు ప్రాతిపదిక అని మీకు తెలియ చేస్తున్నాను .
పౌర సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు నేపథ్యం:-
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికల సమయంలో చేసిన ప్రజాస్వామ్య విలువల పట్ల సానుకూల వైఖరితో పాటు వివిధ ఛానల్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు
ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సందర్భంలో పౌర హక్కులు కాపాడి, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించి, నిర్బంధం అణచివేతను అంతం చేస్తామని చేసిన అధికారిక ప్రకటన ఈ చర్చలకు ప్రాతిపదిక అయినట్లుగా తెలుస్తున్నది . ఈ సమావేశం డిసెంబర్ లోనే ఏర్పాటు చేస్తారని ఆశించినప్పటికీ కొంత ఆలస్యంగా నైనా ఏర్పాటు చేయడాన్ని హరగోపాల్ గారు ప్రస్తావించారు. విద్యా వైద్య రంగాలు, రైతుల సమస్యలు, సామాజిక సమస్యలతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధము, అన చివేత , పోలీసుల దాడులు, ఉపా చట్టం అమలు, ఎన్ ఐ ఎ దాడుల పైన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు.
250 నుండి 300 మంది వరకు ఉపా చట్టం బాధితులు ఉన్నట్లు మహారాష్ట్రలో పేరుగాంచిన న్యాయమూర్తి సురేష్ గారు చనిపోయినప్పటికీ తాడ్వా య్ కేసులో ఇరికించడం,బెయిల్ పై ఉన్నవారిపై కేసులు పెట్టడాన్ని పోలీసుల యొక్క అతి ఉత్సాహానికి నిదర్శనమని అదే సందర్భంలో ఉపా చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేసినట్లుగా వారు తెలిపారు. వాస్తవంగా శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ దానికి భిన్నంగా ప్రశ్నించి, ప్రతిఘటించి, ప్రజల పక్షాన పని చేసే ఉద్యమకారులపై జాతీయ సంస్థ అయినటువంటి (జాతీయ నేర పరిశోధనా సంస్థ) ఎన్ఐఏ దాడులకు పాల్పడడం తనిఖీలు చేయడం అప్రజా స్వామికమని వెంటనే ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చేసిన సూచనకు ఉపా చట్టం కేసుల పైన సమీక్ష చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎన్ఐఏ జాతీయ సంస్థ కనుక రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు సంబంధించిన అంశాలపై పునరాలోచన చేసి తప్పకుండా ముందుకు పోతామని ముఖ్యమంత్రి తెలిపినట్లు హరగోపాల్ గారు వివరించడం జరిగింది. ఉపా చట్టాన్ని కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఉన్నప్పుడే రూపొందించిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించి కేసులను నమోదు చేయకుండా , నమోదు చేసిన కేసులను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా ఉన్నది. అప్పుడు మాత్రమే ఇచ్చిన హామీకి అర్థం ఉంటుంది . పరిశీలిస్తామని హామీ ఇచ్చి తన సిబ్బంది మంత్రులు పెట్టుబడిదారులు పోలీసు విభాగం సహకరించకపోతే ప్రజాస్వామిక డిమాండ్లు మరుగున పడిపోయే ప్రమాదం ఉన్నదని ఈ చర్చలపై స్పందించిన కొందరు మేధావులు అనుమానం వ్యక్తం చేయడాన్నీ కూడా మనం గమనించాలి.
విద్యా వైద్యం సామాజిక న్యాయం ఇప్పటికే ప్రైవేట్ పరమైపోయినది . ఢిల్లీ కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో విద్య పైన అక్కడి ప్రభుత్వాలు నిధులను కేటాయించడంతోపాటు ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాములో విద్యారంగంలో వైద్యరంగంలో దిగజారిన పరిస్థితులను మనం గమనించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత మెరుగైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చర్చల్లో కోరినట్లుగా తెలుస్తుంది. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో విద్యకు 11 శాతం నిధులు కేటాయిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 శాతం మాత్రమే కేటాయించి గత ప్రభుత్వం విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేసినట్లు ఆ దుస్థితి నుండి ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ నిధులను కేటాయించి నిరంతరం సమీక్షించడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాలు కోరినట్లుగా మనకు తెలుస్తున్నది . రాష్ట్రంలో రైతాంగం అలాగే విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు సంక్షోభాన్ని నివారించే క్రమంలో రెండు కమిషన్లను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ప్రకటన చేసినట్లు తెలుస్తుంటే ఆ రంగాలలో నిపుణులు సామాజికవేత్తలతో కమిషన్లను వేసి అర్థవంతమైనటువంటి పరిపాలన అందిస్తే బాగుంటుందని సమావేశంలో సూచనలు వచ్చినట్లుగా ప్రొఫెసర్ హర గోపాల్ గారు ఈ సందర్భంగా తెలియజేశారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా పెట్టుబడిదారుల చేతుల్లో పావులుగా మిగిలిపోతున్న సందర్భం, ఎన్నికల సమయంలో ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వాలకు నిధులు ఇస్తున్న విషయం , అన్ని రంగాలు కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లిపోయిన ఈ తరుణంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను యధాతంగా అమలు చేయడం కొంత సందేహాస్పదమేనని కానీ ముఖ్యమంత్రికి ఆలోచన ఉన్న స్థాయిలో తన మంత్రివర్గం, అధికారులు, పోలీసు వ్యవస్థను సిద్ధం చేసినట్లయితే ఇలాంటి చర్చలు తరచుగా జరిగితే చర్చల సారాంశం అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని అందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నప్పుడు మాత్రమే ప్రజాసానిక విలువలు అనే మాటకు అర్థం ఉంటుందని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పడం ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మనం భావించవలసి ఉంటుంది.
అడుగడుగునా ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న ప్రజాసామిక విలువలు పౌర హక్కుల పునరుద్ధరణ వంటి అంశాలను పారదర్శకంగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలంటే, గత ప్రభుత్వాన్ని తలదన్నే రీతిలో పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రి ప్రజాస్వామిక పౌర మేధావి హక్కుల సంఘాలతో నిరంతరం చర్చలు జరపాల్సిందే. అదే సందర్భంలో పాలనాపరమైన కీలక రంగాలకు సంబంధించి కమిటీలు కమిషన్లను వేయడంతోపాటు ప్రభుత్వానికి ఒక విజన్ అంటూ ఉండాలని రొటీన్ గా జరిగే పరిపాలనకు భిన్నంగా రాష్ట్ర ఆకాంక్షలు, తెలంగాణ చారిత్రక వారసత్వం నేపథ్యం, గతంలో ధ్వంసమైన పరిస్థితులపై రాజీలేని పోరాటం చేయడం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే బాధ్యత ముఖ్యమంత్రిపై ఉన్నదని ఈ సమావేశం నిర్మోహమాటంగా ప్రకటించినట్లుగా తెలుస్తున్నది. అప్పుడు మాత్రమే పౌర సమాజం, సామాన్య ప్రజలు, బుద్ధి జీవులు, విద్యావంతులు , ప్రజాస్వామిక వాదులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పైన విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. మాటలకు మాత్రమే పరిమితమై చేతల్లో మళ్ళీ పోలీసు వ్యవస్థ జులుం చలాయించి ఎక్కడికి అక్కడ అక్రమ అరెస్టులకు పాల్పడి , ఇప్పటికీ న్యూ డెమోక్రసీ వంటి ఇతర పార్టీల పైన నిషేధం విధించడంతో పాటు కార్యకర్తలను అరెస్టు చేసి ఇచ్చిన హామీని ప్రభుత్వమే విస్మరించినట్లు అవుతున్నదని ప్రభుత్వానికి హెచ్చరిక చేసినట్లు తగిన సూచనలు అందించినట్లు తెలిసింది. ఇక మిగిలింది అడపాదడపా జరుగుతున్నటువంటి ప్రభుత్వపరమైన పొరపాట్లను సవరించుకొని, సమీక్షించుకొని, ఇచ్చిన హామీలు అక్రమ నిర్బంధ చట్టాల పైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉన్నదని ఈ సమావేశం ద్వారా తెలుస్తున్నది. ఇది ఒక శుభ పరిణామమే. మాట వరసకే కాకుండా చేతల ద్వారా గత ప్రభుత్వానికి భిన్నమైన పాలన కొనసాగినప్పుడు అన్ని వర్గాల ఆమోదము లభిస్తుంది. సుపరిపాలన అంటే ఇదేనని నిర్వచించి అమలు చేసే బాధ్యత ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)