మందుబాబులకు మార్గం చూపిస్తున్న బోర్డు మంచి సంకేతమేనా
మునగాల 26 ఫిబ్రవరి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
ఇటువైపు మద్యం షాపు ఉందని సూచిక బోర్డు ఏర్పాటు..
విద్యా,వైద్యం,ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు
సూచిక బోర్డులు ఉండవా?
సమాజంలో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల,వివిధ మతాల మందిరాల గురించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం సహజం,అది ప్రజలకు ఉపయోగం కూడా.విద్యా, వైద్యం,ప్రభుత్వ ఇతర కార్యాలయాలు,దేవాలయాలకు,రహదారులకు దారి సూచికలు కనిపించవు. సమాజాన్ని పతనం చేసే మద్యం దుకాణాలకు మాత్రం దారిచూపే సూచిక బోర్డు ఏర్పాటు చేసిన విషయం పలువురిని ఆలోచింప చేస్తుంది.సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామంలో వైన్స్ కు దారి చూపుతూ సూచిక బోర్డు ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మద్యం తాగండి,మత్తులో మునగండి జీవితాలను అగం చేసుకోండి అంటూ యువతను రమ్మని పిలుస్తున్నట్లుగా ఉందని,ఇది సమాజానికి మంచి సంకేతం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు మన సమాజానికి ఏమైంది? సమాజాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే పాఠశాలలకు, ప్రమాదాలకు గురైన ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో దారి చూపే ప్రభుత్వ వైద్యశాలలకు చూచిక బోర్డులు ఉంటే ప్రాణాలు కాపాడగలుగుతాం. కానీ,మద్యం దుకాణాలకు దారి చూపే సూచిక బోర్డు
ఉంటే ప్రాణాలనే హరిస్తుందని తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా మండల అధికారులు స్పందించి తక్షణమే మద్యం దుకాణానికి మార్గం చూపే సూచిక బోర్డును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.