ఉత్పత్తిలో భాగస్వాములు కాని వాళ్ళు ప్రజా సంపదను దోచుకుంటున్నారు
.శ్రమ చేసి ఉత్పత్తులు పెంచే వాళ్ళు సంపదకు దూరమవుతున్నారు.
చెమట వడిసే శ్రమజీవులకు రాజ్యాంగ పలాలు దక్కకుండా పోతే అది అక్రమార్కుల దోపిడీ, పీడన, వంచన, అక్రమార్జన కాదా ?
---వడ్డేపల్లి మల్లేశం
అన్నపు రాశులు ఒకచోట ఆకలి కేకలు మరొకచోట అన్న కాళోజి మాటలు, సంపద ఒకరికైతే చాకిరి ఒకరిదా? అన్న కవి వాక్కులను, "సకల సంపదలు గల్ల దేశములో దరిద్రం ఎట్లుండే" అన్న ప్రజా కవి ప్రజా యుద్ధ నౌక గద్దర్ గానం , "భారతదేశ0 పేదలున్న సంపన్న దేశం" అన్న విశ్లేషకుల మాటలు భారతదేశంలోని అసమానతలు అంతరాలకు సజీవ సాక్షాలు. ఈ దేశ సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలను ఆదేశిస్తుంటే ప్రజలకు మార్గ నిర్దేశం చేస్తుంటే, రాజ్యాంగ సవరణ ద్వారా పీటికలో చేర్చిన సామ్యవాదం ప్రకారం అయినా దేశ సంపద ప్రజలందరికీ చెందే నూతన సమాజ ఆవిష్కరణ పాలకుల కర్తవ్యమైనా సోయి లేని ప్రభుత్వాల కారణంగా ప్రజలు సంపన్నులు పేదలుగా నిట్ట నిలువునా చీల్చబడి వర్గ సంఘర్షణకు దారితీస్తున్నది నిజం కాదా! ఈ సజీవ సాక్షాన్ని కల్లా రా చూస్తూ కూడా ప్రజలు మౌనంగా ఉండడం, ప్రశ్నించి ఆలోచింపజేసిన మేధావులను విచారణ ఖైదీలుగా దశాబ్దాలు కారాగారాలలో బంధించడం తప్ప ప్రశ్నలోని సారాన్ని వాస్తవాన్ని ఏనాడు ప్రభుత్వాలు గుర్తించకపోవడం పేదలు మరీ పేదలు కావడానికి కారణమవుతున్నది .ఎంత శక్తితో బంతిని గోడకు కొడితే అంతకు మించిన శక్తితో వెను తిరిగినట్లు పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, శూన్య వాగ్దానాలు, శుష్క హామీలపై ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధి జీవులు శక్తి మేరకు కలిసి పోరాడుతున్నారు. పాలకులను ఆలోచింప చేస్తున్నారు కూడా. కానీ మెజారిటీ ప్రజానీకం ఈ పోరాట కార్యక్రమాలలో పాల్గొనని కారణంగా ఉత్పత్తిలో భాగస్వాములైన సామాన్యులు నిస్సహాయులైతే ఉత్పత్తికి దూరంగా దోపిడీకి చేరువలో ఉన్న పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు భూస్వామ్య వర్గాలు ప్రజల మీద స్వారీ చేస్తూ ఆధిపత్యాన్ని చలాయిస్తున్న కారణంగా అసమానతలు అంతరాలు అలాగే కొనసాగుతున్నాయి.
20 శాతం గా ఉన్నటువంటి సంపన్నుల చేతిలో 80 శాతం ప్రజా సంపద కేంద్రీకరించబడి సామాన్య ప్రజలకు అందకుండా దోచుకున్న తీరు ఈ దేశంలోని అసమానత, వివక్షతకు అద్దం పడుతున్నది. ఇక 80% గా ఉన్నటువంటి సామాన్య అట్టడుగు పేద ప్రజానీకం చేతిలో
10 శాతం సంపద మాత్రమే ఉన్నదంటే ఇది నిజంగా దోపిడీ కాదా? కాయ కష్టం చేసే శ్రమజీవులు, కార్మికులు, రైతులు, చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, దినసరి కూలీలు, దారిద్రరేఖ దిగువన కలవాళ్ళు, ఉపాధి కరువై వలస జీవులు, అరకొర సౌకర్యాలతో జీవితాలు గడుపుతున్న వాళ్లు ఉత్పత్తిలో మాత్రం భాగస్వాములవుతూ గనులు కార్ఖానాలు భవనాల నిర్మాణం ప్రతి చోట తమ సేవలు అందిస్తున్నా వీరి పట్ల ఏ వర్గానికి గౌరవము సానుభూతి ప్రేమ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం . ప్రపంచ కుబేరుల జాబితాలో మన దేశ పెట్టుబడిదారులకు స్థానం దక్కిందని సంబరపడి మురీ సిపోవడమే కానీ పేదరికాన్ని తొలగించే క్రమంలో పెత్తందారీ విధానాలు సంపద పోగు కాకుండా చూడవలసిన బాధ్యతను ప్రభుత్వాలు మరిచి పేదవాళ్లకు మరీ ద్రోహం తలపెడుతుంటే సహజంగా అందవలసిన రాజ్యాంగ పలాలు అందకుండా పోతున్నప్పుడు ఇది నిజంగా రాజ్యాంగ ద్రోహమే. ఇంత చేదు వాస్తవాన్ని కల్లారా చూస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసే స్థితిలో లేకపోవడం, అప్పుడప్పుడు న్యాయ వ్యవస్థను పాలకులు తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడం ఈ రెండు కూడా అధికార యంత్రాంగానికి అడ్డు అదుపు లేకపోవడానికి ప్రధాన కారణాలు. పనిచేయని వాడికి ఆదాయం ఎక్కడిది? కష్టపడ్డవానికి పిడికెడు మెతుకులు కరు వెందుకు? ఇది కనీసమైన సామాన్యునికీ కూడా అర్థమయ్యే విషయం.
అసమానతలు రాజ్యాంగబద్ధమని, అంతరాలు తప్పవని, పేదరికం నిర్మూలన సాధ్యం కాదని, ప్రపంచం ఉన్నంతవరకు ఈ తేడాలు ఇలాగే కొనసాగుతాయని, వీటిని ఎవరు నిర్మూలించలేరని తీయటి మాటలు మాట్లాడే వాళ్లు మనలో ఉన్నంతవరకు అసమానతలు వివక్షతను అంతం చేయడం కష్ట సాధ్యమే. మద్యపానం, ధూమపానం, పబ్బులు, క్లబ్బులు ,ఈవెంట్లు, అశ్లీల శృంగార ప్రదర్శనలు సామాజిక ఎదుగుదలకు అవరోధాలను తెలిసి కూడా పాలకులు ఆదాయం కోసం మెప్పుకోసం పెట్టుబడుదారి వర్గ ప్రయోజనం కోసం అనుమతిస్తున్న కాలమిది. అలాగే పేదరికం, అసమానతలు, దారిద్యం, ఉపాధి లేకపోవడం, కరువు కాటకాలు మెజారిటీ ప్రజానీకానికి అవరోధాలనీ తెలిసి కూడా పాలకులు వాటి నిర్మూలనకు కృషి చేయకపోవడం అంటే ఈ వ్యవస్థ మరికొంత కాలం ఇలాగే ఉండాలని కోరుకోవడమే కదా ! అంతే కాదు విద్యా వైద్యాన్ని సామాజిక న్యాయాన్ని ఉచితంగా అందించాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచిస్తే విచారణ ఖైదీలుగా అకారణంగా శిక్షించి ఎందరికో అన్యాయం చేస్తూ చట్టం సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కింది. విద్య వైద్యం గనుక ప్రజలకు ఉచితంగా అందిస్తే సామాన్య ప్రజలు ఆరోగ్యవంతులై విద్యావంతులై పాలకులను ప్రశ్నిస్తారని ఆ ముప్పు నుండి తప్పించుకోవడం కోసమే విద్యా వైద్యాన్ని ప్రైవేటుపరం చేసి పేద ప్రజలకు అందకుండా చేస్తున్నారని స్వయంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రజలను హెచ్చరించినాడంటే పాలకులు కావాలని చేస్తున్న దుష్టపన్నాగాలకు హద్దు ఎక్కడిది? ప్రస్తుత లోక్సభలో 83 శాతం మంది సభ్యులు నేర చరిత్ర కలిగిన వాళ్లు ఉంటే రాజ్యసభలో 36 శాతం మంది అక్రమార్కులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి . చట్టసభల్లోనే అవినీతిపరులు ఉంటే ఇక ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తుందో తెలుసు కదా ! ఇప్పటికీ దారిద్ర రేఖ దిగువన 15% ప్రజలు ఉక్కిరి బిక్కిరిగా జీవిస్తుంటే కనీస సౌకర్యాలకు నోచని కోట్లాది ప్రజానీకం మానవాభివృద్ధికి దూరంగా వెలివేయబడితే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశo సాధించిన ప్రగతి ఇదేనా అని సామాన్యుడు ప్రశ్నిస్తుంటే రాజకీయ నాయకులు పెట్టుబడిదారులు మాత్రం అసమానతలు అంతరాలే తమ హక్కుగా భావిస్తున్నారు. ఈ అంతరాలు అసమానతలు దోపిడీ పీడన వంచనకు ముగింపు పలకాల్సిందే . ఆ కోవలో ప్రజా ఉద్యమాలు ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రతిఘటన కొనసాగకుండా రాజ్యాంగం మేరకు పీటిక మేరకు న్యాయం జరగాలని కోరుకోవడం ఏకపక్ష విధానాలు గల ఈ ప్రభుత్వాలలో అత్యాశె అవుతున్నది. ఎన్నికల సంఘం ,మానవ హక్కుల సంఘాలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలు ప్రభుత్వాల కనుసన్నల్లో కాకుండా స్వతంత్రంగా వ్యవహరించి పాలకుల అవినీతి వివక్షత ఒంటెద్దు పోకడలకు చరమగీతం పాడిన రోజు తప్పకుండా కొంతైనా మార్పు కనపడుతుంది. ఆలోచించకుండా ఇదంతా మా కర్మ అని, దురదృష్టం అని చేతులు ముడుచుకొని కూర్చుని నిస్తేజంగా వ్యవహరిస్తే ఎవరో వచ్చి ఏదో చేస్తారని నమ్ముకోవడం అసంభవం . నిజం తెలిసి నిద్ర మాని చైతన్యముతో ఉద్యమించడమే సకల సమస్యలకు పరిష్కారం అవుతుంది ఇది చరిత్ర చెప్పిన సత్యం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )