ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఐక్య కార్యాచరణ కమిటీలు( జేఏసీ ) తోడ్పడాలి

Feb 23, 2025 - 19:26
Feb 23, 2025 - 09:51
 0  0

ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఐక్య కార్యాచరణ కమిటీలు( జేఏసీ ) తోడ్పడాలి .*

ప్రభుత్వాలకు సమాంతరంగా పనిచేసినప్పుడే వీటి ఉనికికి సార్థకత ఉంటుంది.* అంతిమంగా వీటి లక్ష్యం ప్రజా ప్రయోజనాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే .*

--వడ్డేపల్లి మల్లేశం 

ఐక్య కార్యాచరణ కమిటీ( J A C )అనేటువంటి పదం ఇటీవల కాలంలో గమనించినప్పుడు తెలంగాణ ఉద్యమ తుది దశ కాలంలో ప్రధానంగా అందరి దృష్టికి వచ్చింది ఉద్యమం తీవ్రమైన పరిస్థితిలో 2007ఆ ప్రాంతంలో ఉద్యమం ఎగిసిపడుతున్న సందర్భంలో కేవలం టిఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష ప్రజలందరిలో బలంగా ఉన్న నేపథ్యంలో అప్పటికి కొనసాగుతున్నటువంటి విద్యావంతుల వేదిక తో పాటు అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సారథి చేతిలో టీజేఏసీ అనే పేరుతో ఏర్పడినదే. దీనికి సారథిగా ఆనాడు రాజకీయ శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరాం గారు పనిచేయడం అందరికీ తెలుసు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోవడంతో పాటు ఒకే రాజకీయ పార్టీ చేతిలో ఉద్యమం నీరు గారకుండా చేయడం కోసం ఇదే సందర్భంలో అన్ని రకాల ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థ ల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసే క్రమంలో

ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించిన విషయం మనందరికీ తెలుసు. అదే క్రమంలో శాఖల వారీగా ఏర్పాటు కావడం జెఏ సి అనే పదం ప్రాచీర్యంలోనికి రావడానికి కారణమైంది. అయితే ఏ రకమైన జేఏసీ లేదా ఐక్య కార్యాచరణ కమిటీ అయినా పాలకవర్గాలకు అధికార పార్టీకో వత్తాసు పలకడానికి మాత్రం కాదు అనే విషయాన్ని ఆనాడు ఈనాడు ఏనాడైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ప్రతి విషయం పైన ప్రశ్నించే ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు అఖిలపక్షాలు లేదా ఇతర మేధావులు బుద్ధి జీవులు ఎవరైనా ప్రజల పక్షాన పని చేయవలసిందే ప్రజల గొంతుకగా నిలబడాలి. అదే సందర్భంలో చట్టబద్ధ సంస్థలైనటువంటి అసెంబ్లీ శాసనం మండలి లోపల కూడా ఎన్నిక కావలసిన సందర్భంలో అలాంటి బుద్ధి జీవులు మేధావులకు మాత్రమే అవకాశం ఇస్తే వాళ్లు పూర్తిగా ప్రజల పక్షాన పని చేస్తారు అధికార పార్టీకి అమ్ముడుపోకుండా కృషి చేస్తారని మనం ఆశించడం అత్యాశ కాదు.

       ప్రభుత్వాలకు సమాంతరంగా పనిచేయాలి

పార్టీ వేరు కావచ్చు కానీ అధికారానికి వచ్చిన తర్వాత ప్రజలను మోసగించడం, వంచించడం, పెట్టుబడిదారీ వ్యవస్థకు దోహదం చేయడం అనేవి పాలక పక్షాల యొక్క వర్గ స్వభావంగా కనిపిస్తున్న తరుణంలో పాలనా రీతిని ప్రజా ఆకాంక్షలను ప్రజా సమస్యల పరిష్కారo కోసం జేసీలు ప్రతి చోటా ఏర్పడవలసిందే. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జేఏసీ పేరుతో బుద్ధి జీవులు మేధావుల ఆధ్వర్యంలో ఏర్పడే కమిటీలు ప్రభుత్వానికి సమాంతరంగా పని చేసినప్పుడు మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పటికీ కొన్నిచోట్ల జేఏసీల పేరుతో కొనసాగుతున్నప్పటికీ స్పష్టమైనటువంటి విధాన నిర్ణయం లేకపోవడం, అధికార పార్టీకి ప్రభుత్వ పెద్దలకు వంత పాడడం, మెప్పు కోసం ప్రయత్నించడా న్ని విమర్శించవలసిన అవసరం ఉంది. అదే సందర్భంలో కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ కొనసాగినప్పుడు మాత్రమే ప్రజల ఆకాంక్షలకు ఒక రూపం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేదరిక అసమానతలు అంతరాల నిర్మూలనతోపాటు, వివక్షత, సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల అణచివేత కొనసాగుతున్న సందర్భంలో ప్రజల గొంతుకగా నిలబడాలి, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని ఎండగ ట్టడానికి కూడా ఈ జేఏసీ కమిటీలు తీవ్రంగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది.

     కొన్ని ముఖ్యమైన సందర్భాలు 

----ఇటీవల వరకు ఆప్ ఆధ్వర్యంలో కొనసాగిన ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా 25% బడ్జెట్లో నిధులు కేటాయించడం విద్యకు, కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టడం, విద్యారంగాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించడానికి ఈ జేఏసీలు ప్రభుత్వం పైన పోరాటం చేయవలసి ఉంటుంది. 

--విద్యా వైద్యం సామాజిక న్యాయం అనేది ప్రజలు డిమాండ్ చేస్తున్న ప్రధానమైనటువంటి అంశాలు వీటి కోసం ప్రజలు చేస్తున్న ఖర్చు వారి సంపాదనలో పెద్ద మొత్తం కోల్పోవడం వలన కొనుగోలు శక్తి తగ్గి పేదరికం మరింత పెరుగుతున్న విషయాన్ని జేఏసీ పరిశీలించి దృష్టికి తీసుకువెళ్లాలి.

--- విద్యారంగంలోనూ వైద్యరంగంలోనూ ప్రైవేటు సంస్థలను ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్న విషయాన్ని గమనించి వాటిని కూలదోసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే వరకు వెంట పడాలి ప్రభుత్వాన్ని ఒప్పించాలి.

--- జనాభాలో అల్ప శాతం లో ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేస్తే వెనుకబడిన ఇతర కులాలకు నామమాత్రపు ప్రవేశం కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని కూడా అంచనా వేయవలసి ఉంటుంది. ఈ ఆధిపత్య కులాల ఆగడాలను అంతం చేయాలంటే తప్పనిసరిగా జనాభాలో ఆయా వర్గాల దామాషాలో రిజర్వేషన్లు కేటాయించడం ద్వారా వాళ్ల దుర్మార్గానికి గండి కొట్టవచ్చు. అలాంటి పాలనలో రాజ్యాధికారంలో వాటాను పొందడానికి అవకాశం ఉంటుంది ఇదంతా కూడా జేఏసీ తన బాధ్యతగా తీసుకోవాలి 

---మద్యం, మత్తు పదార్థాలు, ధూమపానం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ లైంగిక వేధింపులు అత్యాచారాలు, హత్యలకు సంబంధించినటువంటి వాతావరణాన్ని ప్రభుత్వమే చట్టబద్ధం చేస్తూ కొన్ని అసాంఘిక సామాజిక రుగ్మతలను పెంచి పోషిస్తున్న నేపథ్యంలో వాటిని నిషేధించే వరకు పోరాటాన్ని ఉదృతం చేయాలి.

--- కనీస అవసరాలను తీర్చుకోగలిగిన మానవాభివృద్ధిని సాధించే వరకు, పేదరికం నిర్మూలించేవరకు, సంపద కొద్దిమంది చేతుల్లో నిక్షిప్తం కాకుండా ప్రజా సంపదను ప్రజలందరికీ సమానంగా పంచాలి అని రాజ్యాంగబద్ధసూత్రీకరణను అమలు చేసే విషయంలో చొరవ చూపాలి.

     ఈ రకంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలను నిజం చేయడానికి ప్రభుత్వాలు కొంత వెనుకడుగు వేసినప్పుడు, పెత్తందారీ వర్గానికి వంత పాడినప్పుడు ఆ ప్రభుత్వాల యొక్క మెడలు వంచి పని చేయించడానికి ఉపయోగపడేది జేఏసీ అని విద్యావంతులు మేధావులు జేఏసీలో సభ్యులు ఆలోచించాలి.కానీ ప్రభుత్వాలకు వంత పాడి వాళ్ళ మెప్పుకోసం ప్రయత్నం చేయడమే తమ బాధ్యత అనుకుంటే అంతకుమించిన సిగ్గుచేటు మరొకటి ఉండదు. వాతావరణ కాలుష్యంతో పాటు పంటల ఉత్పత్తిలో జరుగుతున్నటువంటి లోపాలు భూమి కాలుష్యం పోషకాహారం ప్రజలందరికీ అందకపోవడం మొక్కుబడిగా దొడ్డు బియ్యాన్ని మాత్రమే ప్రజలకు అందించి దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వాలకు గుణపాఠం నేర్పవలసిన బాధ్యత కూడా జేఏసీలదే. కవులు కళాకారులు మేధావులు సంపాదకులు జర్నలిస్టులు ప్రధానంగా ఇలాంటి సంఘాలలో పనిచేయడంతో పాటు ప్రభుత్వాల అణచివేత, నిరంకుశత్వం, నిర్బంధం, ప్రజాస్వామ్య విచ్ఛిన్నాన్ని భగ్నం చేయవలసిన బాధ్యత కూడా జేఏసీలది. ఆ రకంగా సమాంతరమైనటువంటి జేఏసీ వ్యవస్థ ఈ దేశంలో కొనసాగిన నాడు ప్రభుత్వాలు కూడా దా రికి వస్తాయి. గ్రామస్థాయి నుండి స్థానిక ప్రభుత్వాలతో సహా కేంద్ర ప్రభుత్వం వరకు కూడా తమ కార్యకలాపాల ద్వారా నిబద్ధతగా కార్యాచరణను ప్రకటించినప్పుడు ప్రభుత్వాల కంటే ఎక్కువగా జేఏసీల వల్లనే ప్రజలకు మేలు జరుగుతుంది ఆ వైపుగ పరిణామం చోటు చేసుకోవాలని ఆశిద్దాం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333