పార్లమెంటు ఎన్నికలవేళ ఇచ్చిన హామీలపై పార్టీలు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
పదేళ్ల పాలనలో బిజెపి బీఆ ర్ ఎస్ కల్లబొల్లి కబుర్లతో గడిపి కాంగ్రెస్ నాలుగు నెలల ప్రభుత్వాన్ని విమర్శించడం మూర్ఖత్వమే.* బిజెపి, టిఆర్ఎస్ తమ వైఫల్యాలపై సమీక్షించుకోవాలి . *కాంగ్రెస్ తమ హామీల కార్యాచరణ పై సమీక్షించి
వినూత్నంగా అమలు చేసి రుజువు చేయాలి .* ఓటర్లు3 పార్టీల పని విధానం పై అంచనాకు రావాలి.
--వడ్డేపల్లి మల్లేశం
కాంగ్రెస్ తన పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఈనెల 6న తుక్కుగూడ బహిరంగ సభలో విడుదల చేస్తే బిజెపి మేనిఫెస్టోను 14 ఏప్రిల్ 2024 రోజున విడుదల చేయడం జరిగింది . ఒక పార్టీ మేనిఫెస్టోను మరొక పార్టీ విమర్శించిన సందర్భంలో ఆ అర్హత నీకు లేదని ఒకరంటే ఒకరు పరస్పరం విమర్శించుకోవడం మూర్ఖత్వం అవివేకం. విమర్శించడం ద్వారా ఆత్మ విమర్శ చేసుకోవడానికి సమీక్షించుకోవడానికి ఇతర పార్టీల యొక్క మంచినీ తెలుసుకొని తమ వైఫల్యాలను సవరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ బిజెపి పార్టీ అధ్యక్షుడు తమ మేనిఫెస్టోను విమర్శించే అధికారం కాంగ్రెస్కు లేదని ప్రకటించడం హాస్యాస్పదం. అట్లా అంటే మీ మేనిఫెస్టో లను స్వీకరించవలసిన అవసరం మాకు లేదని ఓటర్లు లేదా ప్రజలు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలను ప్రభువులుగా చూడని మీ మూర్ఖత్వం కారణంగా చౌకబారు రాజకీయాలుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. టిఆర్ఎస్ పార్టీ గత 10ఏళ్ల పాలన పై బిజెపి, కేంద్రంలో బీజేపీ పాలనపై కాంగ్రెస్, కాంగ్రెస్ గత నాలుగు నెలల పాలన పైన టిఆర్ఎస్ బిజెపి పరస్పరం విమర్శించుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అలాంటి పరిస్థితుల్లో మీకు ఓట్లు అడిగే అవకాశం లేదని తమ పార్టీని గెలిపించాలని ఎక్కడికక్కడ ప్రజలను ఓట్లు అడుగుతూ ప్రచారం చేయడాన్ని బుద్ధిమంతులు మేధావులు ప్రజాసంఘాలు ఆలోచనపరులు సమీక్షించవలసిన అవసరం చాలా ఉన్నది.
ఏ పార్టీ ప్రభుత్వం ఎంత కాలం పని చేసింది? ఇచ్చిన హామీలు అమలు చేసిన తీరు ఎలా ఉంది? ఎంత కాలంలో అమలు చేసింది? కొద్దికాలంలోనే అమలు చేయాలని గగ్గోలు పెట్టే గందరగోళ పరిస్థితిపై సమగ్రమైన చర్చ జరగకపోతే బుద్ధిమంతుడు మూర్ఖుడు సమానమే అనే ప్రమాదం ఉన్నది . ఈ నేపథ్యంలో మూడు పార్టీల యొక్క అనుభవాలు , హామీల అమలు తీరు, ప్రజలకు చేసిన ద్రోహం, ఆర్థిక విధ్వంసం, ప్రజలను మభ్యపెట్టిన తీరుపైన సమీక్షించుకోవడం మన కర్తవ్యం గా భావించాలి .
బిజెపి పార్టీ *-
****"
గత పదేళ్ల పాలనలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మాట ఇచ్చిన విషయంలో రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి సహకారం లభించలేదని టి ఆర్ఎస్ తన పరిపాలన కాలంలో కేంద్రం పైన ఘర్షణ కు దిగిన విషయం తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయం లోపల కేంద్రం సహకరించకపోయినా తానే కొనుగోలు చేసినట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అందుకు కేంద్రం నుండి తగిన సమాధానం రాలేదు. విభజన హామీలలో భాగంగా రాష్ట్రానికి రావలసిన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ వంటి అనేక అంశాలు కేంద్రం పెండింగ్లో ఉంచడమే కాకుండా ఒక్క నవోదయ కేంద్రం కానీ మెడికల్ కళాశాల కానీ ఈ రాష్ట్రానికి మంజూరు చేయలేదని టిఆర్ఎస్ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన అనేక పెండింగ్ నిధులు కేంద్రం నుంచి తీసుకురావడంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి మన బీజేపీ మంత్రులు ఎంపీలు కూడా కృషి చేయలేదని ప్రధానమంత్రి కేంద్ర హోం మంత్రి ఇతర మంత్రులు పార్టీ అధ్యక్షుడు పలుమార్లు సందర్శించినప్పటికీ రాష్ట్రానికి రావలసిన నిధులను రాబట్టడంలో విఫలమైనట్లు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర అన్ని రాజకీయ పార్టీలు ఆరోపించినవి.
ప్రజల విశ్వాసాలు మతం పేరుతో బిజెపి సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగడానికి చేసిన ప్రయత్నం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్రానికి సహకరించలేదని కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఆరోపణలను గత పదేళ్లుగా మనం చూడవచ్చు. అయినప్పటికీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో 8 సీట్లు గెలుచుకున్నది తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో రావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో బిజెపి పార్టీ కూడా ఇతర పార్టీలను విమర్శించడాన్నీ మనం సమీక్షించాలి.
టిఆర్ఎస్ పార్టీ *
***""""""""""""
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి ప్రభుత్వాన్ని మొదటి దఫా ప్రజలు ఆదరించినప్పటికీ ఆ ప్రభుత్వం యొక్క తిరోగమన ధోరణి అణచివేత నిర్బంధము కారణంగా బుద్ధివంతులు మేధావులు ప్రజలు సామాన్య కార్యకర్తలు ప్రజా సంఘాలలో వ్యతిరేకతను భారీగా మనం గమనించవచ్చు . తాను ముఖ్యమంత్రిగా ఉండనని దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి నిట్ట నిలువునా ద్రోహం చేసిన విషయం తెలిసిందేము ఇక ప్రతి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో "కుర్చీ వేసుకుని కూర్చుంటానని, మాట తప్పితే తల నరుక్కుంటానని, కావలి కుక్కలాగా పనిచేస్తానని" టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన మాటలను బిజెపి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని వర్గాల వాళ్ళు ఇప్పటికీ విమర్శించడాన్ని మనం గమనించవచ్చు. అవన్నీ మాటలి, కల్లబొల్లి కబుర్లతో కాలయాపనే తప్ప ఆ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ప్రజలు అభిప్రాయపడ్డారు.నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇతర ఖాయిలాపడిన పరిశ్రమలు తెరిపిస్తా అని మాటిచ్చి అమలుచేయలేదు. ఆ కారణంగానే గత ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని మనం గమనించవచ్చు . నిరుద్యోగ భృతి 3016 ఇస్తామని మాట ఇచ్చి ఇవ్వలేదు, ఉద్యోగాలను లక్షల సంఖ్యలో భర్తీ చేస్తానని యువతను మోసం చేయడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యపరిచి పేపర్ లీకేజీలతో అస్తవ్యస్తమైన విధానాన్ని అమలు చేసింది మన అందరికీ తెలుసు. ప్రకృతి వర్షాలు సహా కరించడం వల్ల కొంత వెసులుబాటు జరిగిందే తప్ప గత సంవత్సరం వర్షపాతం తగ్గిన కారణంగా ఈ మధ్యకాలంలో పంటలు ఎండిపోతుంటే ఇది తమ పార్టీ ప్రభుత్వం లేకపోవడం వల్ల జరిగిన నష్టమని గొప్పగా చెప్పుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు . కాలేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపైన ఆరోపణలు చేసినప్పటికీ కేంద్రం ఏనాడు కూడా చర్యలు చేపట్టలేదు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యలే తప్ప సీరియస్ గా దర్యాప్తు జరిగినట్లయితే అవినీతిపరులు ఈపాటికి కటకటాల్లోకి వెళ్ళవలసిందే . రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి పదేళ్లలో చివరి దశలో మొక్కుబడిగా అమలు చేసిన విషయం మన అందరికీ తెలియదా? రెండవ దఫా ఎన్నికల సందర్భంగా అఖిలపక్షాలతో సమావేశాలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటానని ఇచ్చిన హామీ ఏనాడు నెరవేర్చని ఆ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా అవుతుంది? ప్రజాస్వామిక దృక్పథం లేని టిఆర్ఎస్ కు కాంగ్రెస్ 4 నెలల ప్రభుత్వాన్ని విమర్శించడానికి అధికారం ఎక్కడిది? మంత్రులకు ముఖ్యమంత్రినీ కలిసే అవకాశం లేదు, ప్రజలకు ప్రజాప్రతినిదుల కలిసే వెసులుబాటు లేదు, ఫామ్ హౌసుల సంస్కృతిని ప్రోత్సహించిన కారణంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఫామ్ హౌస్ లు నిర్మించుకొని భూ కబ్జాలు అక్రమ దందాలకు పాల్పడి అవినీతిలో కూరుకుపోయిన విషయం మనందరికీ తెలుసు. దళిత బంధు విషయంలో శాసనసభ్యులు మూడు లక్షల రూపాయలు కమిషన్లు తీసుకున్నట్లు స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి ప్రకటించిన విషయంతో ప్రభుత్వం యొక్క నైతిక విలువలు ఏ పాటీవో అర్థమవుతూనే ఉన్నది. రైతుబంధు పేరుతో కనీస పేద రైతులకు సహకరించవలసినది పోయి వందలాది ఎకరాలు ఉన్న భూస్వాములకు పెత్తందారులకు అందులో పండించని భూములు, గుట్టలు, అడవులు, ఇళ్ల స్థలాలకు కూడా డబ్బులు పంచి ప్రజాధనాన్ని 30 వేల కోట్ల రూపాయలు సుమారు దుర్వినియోగం చేసినట్లు మేధావులు ఆరోపణలు చేస్తుంటే ఇంతవరకు నాటి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సచివాలయానికి రాకుండానే పరిపాలన చేసి చివరి దశలో బందోబస్తుగా ఉన్నటువంటి పాత సచివాలయాన్ని కూల్చి వందలాది కోట్ల రూపాయలను వృధా చేసిన విషయం పైన ప్రతిపక్షాల విమర్శకు నాటి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అనేక భవనాలను నే లమట్టం చేసి తిరిగి నిర్మించే క్రమంలో ప్రాజెక్టులు, కాలువలు, వాటర్ ట్యాంకులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నాణ్యత లోపంతో ఉన్నట్లు మనం అందరం గమనించినాము. అంటే ఆ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయినట్లే కదా అలాంటి పార్టీ అభ్యర్థులకు పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు వేయడం అంటే తిరిగి అవినీతిని ప్రోత్సహించడమే .
కాంగ్రెస్ ప్రభుత్వం :-
*****
బి ఆర్ ఎస్ ప్రభుత్వం పైన ప్రజల ఆగ్రహము అసమ్మతి నిరసనలు ఒకవైపు మేధావులు బుద్ధి జీవులు నిరుద్యోగులు ప్రజా సంఘాలు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని ఇచ్చిన పిలుపు కారణంగా రాష్ట్రంలో 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన విషయాన్ని అందరూ గమనించాలి .
రాష్ట్రానికి ఏమాత్రం నిధులను తీసుకురాక కేంద్రం సహకరించకపోయినా ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల లోపల హామీలను అమలు చేయలేదని వాగ్దానాలను తుంగలో తొక్కిందని అంతే స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాన్ని కూడా నొక్కి చెబుతూనే కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం సరైందే . కానీ పదేళ్లలో కేంద్రం, రాష్ట్ర బీఆర్ ఎస్ ప్రభుత్వాలు అమలు చేయని హామీలు వాగ్దానాలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎలా సాధ్యమో ఇంగిత జ్ఞానం ఉన్న ఏ రాజకీయ పార్టీకైనా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ బిజెపి బిఆర్ఎస్ ఒత్తిడిని పోటీని తట్టుకోవడానికి ఎన్నికల సమయంలో వాగ్దానాలు కొంత అధికంగా ఇచ్చిన మాట కూడా వాస్తవం. అదే సందర్భంలో కాల పరిమితిని విధించడం ఆ సమయం లోపల పూర్తి చేయలేక పోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించాలి. కానీ సుదీర్ఘమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలను గత ప్రభుత్వం అప్పులు చేసినప్పుడు సుమారు 70 వేల కోట్ల కోట్ల పెండింగ్ బిల్స్ చెల్లించకుండా ఉద్దెర బేరం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుందా? అని అనిపించక మానదు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే బిజెపి పార్టీ గత పది ఏళ్లలో రాష్ట్రానికి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ద్రోహం ఆర్థిక అరాచకత్వం అప్పులు విధ్వంసం వంటి అంశాల పైన నిగ్గదీసి అడగాల్సిన అవసరం మరింతగా ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరిస్తూనే బిజెపి ప్రభుత్వ విధానాన్ని హెచ్చరించడాన్ని గమనించినప్పుడు ఈ విషయంలో బిజెపి విధానపరమైన పద్ధతిలో ఒక ప్రభుత్వాన్ని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూనే బిఆర్ఎస్ తప్పుడు విధానాలను ఎండగట్టే విధంగా ప్రవర్తించి ఉంటే బాగుండేది. గుడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్తి0 చమని కాదు కానీ టిఆర్ఎస్ తొందర పెట్టినట్లుగానే బిజెపి కూడా అదే వైఖరి అవలంబించక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని గుర్తిస్తే బాగుండేది. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల వరకు ఆ ప్రభుత్వాన్ని ఎవరూ కూడా ప్రశ్నించలేదు . ఆ అవకాశాన్ని సాకుగా తీసుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు ధ పాలలో కూడా హామీలను తుంగలో తొక్కడం , అధికారాన్ని చలాయించడం, తమ వర్గానికి చెందిన వాళ్లను అధికారం యంత్రాంగంలో చేర్చుకోవడం వంటి అవలక్షణాలకు పాల్పడి ఆర్థిక అరాచకత్వము అవినీతిలో కూరుకుపోయి ఆ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలను బిజెపి ఒక ఎత్తుగడగా స్వీకరించవలసిన అవసరం ఉన్నది. బి ఆర్ ఎస్ లాగానే బిజెపి కూడా గుడ్డిగా విమర్శిస్తే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు మీరేం చేసినారు అని ప్రజలు నిలదీసే అవకాశం ఉన్నది అంతేకాదు పదేళ్ల మీ ఇరువురి పాలనా కాలంలో ఈ రాష్ట్రము గాడి తప్పి అవినీతిలో కూరుకుపోయి ఈ రాష్ట్ర ప్రజలకు అప్పును కానుకగా ఇచ్చిన మీ మాటలను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు అని తెలుసుకోవడం చాలా అవసరం .ఇదే సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయడానికి సంబంధించి సమయాన్ని నిర్ధారించకుండా ఉండి ఉంటే బాగుండేది. అదే సందర్భంలో ప్రజల ముందు కొంత గడువును కోరి ప్రజాస్వామ్యుతంగా పరిపాలనను అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజాస్వామ్య పౌర హక్కులను గౌరవిస్తూనే అక్రమ అరెస్టులు నిర్బంధాలకు సంబంధించి దేశ ద్రోహ చట్టాన్ని రాష్ట్రములో అమలు చేయకుండా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మరొక్క మారు పునరంకితం అవుతామని ప్రజలకు ఈ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో పాటు అన్ని రంగాలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలను చట్టసభల్లో చర్చించి కొంత సమయంలో ప్రకటిoచాలి. ప్రపంచముతోనే పోటీ అని ఇచ్చిన ముఖ్యమంత్రి హామీ నెరవేరే క్రమంలో ఉత్కృష్టమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజలను వంచించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి నటిస్తూ రాష్ట్రానికి ఏమీ ఇవ్వనటువంటి బిజెపి పార్టీకి గుణపాఠం కలిగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల మధ్యన రాష్ట్ర ప్రజానీకం, ఓటర్లు ప్రస్తుత ఆవశ్యకత, ప్రజాస్వామిక విలువలు , రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలను ఆసరా చేసుకుని తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి పార్టీకి కూటమికి ఓట్లు వేయడం ద్వారా డూప్లికేట్ మాటలతో నటించే రాజకీయ పార్టీలకు చెంప చెల్లుమనిపించడం ప్రజల కర్తవ్యం. ఎవరెన్ని మాటలు మాట్లాడారో, ఆచరణలో ఏవి అమలు చేసినారో, ప్రస్తుత ప్రభుత్వానికి ఎంత గడువు ఇచ్చినారో అన్నింటినీ బేరిజు వేసుకోవడం మన ముందున్న ఆలోచన.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )