వ్యక్తిత్వాన్ని ఖూనీ చేసే స్వార్థ ప్రయోజనాలు

Sep 13, 2024 - 09:18
Sep 25, 2024 - 15:12
 0  4

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే అంతకు మించిన వ్యక్తిత్వం మరోటి లేదు.

విధి నిర్వహణకు మాత్రమే పరిమితమై  దేశసేవ చేస్తున్నామంటే కుదరదు.

  వృత్తి తో పాటు నమ్మిన సిద్ధాంతం కోసం  ఎంచుకున్న ప్రవృత్తిలో  రాణించడమే  నిజమైన సేవ.


----వడ్డేపల్లి మల్లేశం

వ్యక్తికి సహజంగా ఉండవలసినటువంటి   లక్షణాలు , సామాజిక చింతన, సంఘ స్పృహ  కలబోసుకుని  జీవించే మెరుగైన  విధానమే వ్యక్తిత్వం.  అందుకే మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్  ఏనాడో  చేసిన సూచనను  మనo ఒక హెచ్చరికగా భావించినప్పుడు మాత్రమే  మానవత్వానికి , వ్యక్తిత్వానికి,  సంఘ కట్టుబాటు, నియమ నిబంధనలు హద్దు మీరకుండా  జీవించే అవకాశం ఉంటుంది.  మతి తప్పితే గతి తప్పుతుంది అన్నట్లు  మనిషి  దురాలోచన, స్వార్థము  తో పాటు ఇతరుల దుష్ప్రభావానికిలోనైనప్పుడు  సానుకూల దృక్పథం నుండి వ్యతిరేక ఆలోచన వైపు మనిషి  ప్రయాణించే అవకాశం ఉంటుంది  అప్పుడు ఆ దారి అంతా ముల్ల దారి , బతుకంతా అంధకారమే కాక మానదు.  అప్పుడు వ్యక్తిగతమైన  వైఫల్యాలతో పాటు  అతన్నీ నమ్ముకుని ఉన్న వ్యవస్థ  మొత్తము చిందరవందరకు గురికాక తప్పదు . ఒక వ్యక్తి తప్పుడు విధానాలకు పాల్పడితేనే ఇంత దుష్ప్రభావము సమాజం మీద పడ్డప్పుడు  మెజారిటీ ప్రజలు  తమ జీవితంలో  తప్పుడు విధానాలకు పాల్పడి  న్యాయాన్ని ధర్మాన్ని కోల్పోయి  స్వార్థం ముసుగులో  ఇతరులకు వ్యవస్థకు హాని తలపెట్టినప్పుడు  దాని ప్రభావం ఎంత ఉంటుందో ఊహించలేము . ఒక ఇంజనీరు తప్పుడు విధానాలకు పాల్పడితే  ఒక ప్రాజెక్టు మాత్రమే ధ్వంసం అవుతుంది.  ఒక ఉద్యోగి అవినీతికి పాల్పడితే కార్యాలయంలో  కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది,  ఒక రాజకీయ నాయకుడు అవినీతికి స్వార్థ చింతనకు పాల్పడితే  కొంత పేద ప్రజానీకానికి ఇబ్బంది అవుతుంది కావచ్చు కానీ  సామాజిక బాధ్యతను  భుజానికి ఎత్తుకొని  సామాజిక స్పృహతో పని చేసే ఉపాధ్యాయులు గనుక తన ధర్మాన్ని విస్మరిస్తే  ఒక జాతి  చీకట్లోకి వెళుతుంది అనే సామెత మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం అంటే ఉపాధ్యాయ వృత్తి యొక్క ప్రత్యేకతను  చిక్కదనాన్ని చెప్పడానికి ఈ పోలికలు  ఉపయోగపడుతున్నాయి . వ్యక్తిత్వాన్ని కోల్పోయినప్పుడు  స్వార్థం ముసుగులో అకృత్యాలకు పాల్పడినప్పుడు  వ్యవస్థకు తీరని ద్రోహం జరిగే అవకాశం ఉoతుందని  ఇప్పటికైనా మనం అంతా గుర్తించవలసిన అవసరం ఉంది  .
        వృత్తిని ప్రవృత్తిని సమాంతరంగా నడిపితే  :-
********
కొందరు ఉద్యోగులు అధికారులు వైద్యులు ఇతరత్రా సిబ్బంది  తమ విధి నిర్వహణను చూస్తూనే  తమ పరిధిలో ఉన్న అవకాశం మేరకు ప్రజల ప్రయోజనాలను విస్తృతంగా కాపాడడానికి సేవ చేయగలిగినప్పుడు  తద్వారా సమాజానికి వనగూరే ప్రయోజనం అంతా కాదు.  ఇక్కడ కావలసింది పేద ప్రజానీకం పట్ల సమాజం పట్ల వారికి  తపన ఆరాటం ఉంటే ఇది సాధ్యపడుతుంది . ఒక రాజకీయ నాయకుడు ప్రజాప్రతినిది తన పరిధికి ఆవల  స్వచ్ఛందంగా పనిచేయడానికి పూను కున్నప్పుడు విప్లవాత్మకమైన అనేక మార్పులను సాకారం  చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఊహించని  సౌకర్యాలు  వెసులుబాటు అవకాశాలను జనానికి అందించవచ్చు  .ఒక వైద్యుడు,  కార్యాలయ అధినేత  ,నిర్ణయాత్మక పాత్రలో ఉన్న సూపరింటెండెంట్ , ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,  కళాశాలల ప్రిన్సిపాల్, విశ్వవిద్యాలయం యొక్క  వైస్ ఛాన్స్లర్  ఎవరైనా  తమ పరిధి అధికారము నిధులతో  పాటు అదనంగా  సాధించడానికి కనుక చిత్తశుద్ధిగా నిబద్ధతగా పూను కుంటే  అదనంగా ఎంతో ప్రయోజనం జరిగే అవకాశం ఉంటుంది .అక్కడక్కడ ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది  ఇలాంటి అదనపు కృషికి పాల్పడిన  సందర్భాలను  గమనించినప్పుడు ఊహించని మార్పులను  మనం గుర్తించవచ్చు.  "ఉద్యోగులైన వ్యాపారులైన  నిరుద్యోగ యువత  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు  రాజకీయ పార్టీల  నాయకులు నేతలు ప్రజాప్రతినిధులు  స్థాయి ఏదైనా పదవులు ఏవైనా  అంకిత భావం నిబద్ధత  తపన ఆరాటం  సేవా తత్పర త సామాజిక బాధ్యత సామాజిక స్పృహను సొంతం చేసుకున్నప్పుడు  చివరి రక్త బొట్టు వరకు కూడా ఈ నేల మీద   జీవించినంత కాలం ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకుంటానని  వృత్తిని ప్రవృత్తిని  సమాంతరంగా నిర్వహిస్తానని  శక్తి మేరకు  సమాజానికి  సహకరిస్తూ సామాజిక మార్పుకు దోహదపడతాన ని అంతిమంగా సమ సమాజ స్థాపనలో పాల్పంచుకుంటానని"  ప్రమాణం చేయవలసిన అవసరం కూడా ఉన్నది. వృత్తులు ఏవైనా  సామాజిక బాధ్యతగా మార్పును  కోరుకున్నప్పుడు  కవులు, కళాకారులు ,మేధావులు, రాజనీతిజ్ఞులు,  రచయితలు,  సామాజిక కార్యకర్తలు  వివిధ సేవా రంగాలలో పనిచేసే సేవకులుగా  తమకు ఉన్నటువంటి ప్రవేశాన్ని నైపుణ్యాన్ని బట్టి  ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని వృత్తిలో భాగంగా  వృత్తికి బయట  అవకాశమున్న మేరకు  వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా  నైతిక విలువలకు మాత్రమే పరిమితమై  ఎక్కడి వాళ్ళక్కడ కృషి సలిపినట్లైతే  వ్యవస్థ యొక్క  భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుంది అనేది నగ్నసత్యం . .అయితే "పాలకులు  రాజకీయ నాయకులు  పెట్టుబడిదారీ వర్గం  పారిశ్రామికవేత్తలు  త మవరకే ఆలోచిస్తున్నారు.  నేరస్తులు మరింత నే రసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు . మధ్యతరగతి వ్యక్తులు కూడా స్వార్థ చింతన తో ఇతరుల యొక్క ప్రభావానికీ గురై తమ నైతికతను కోల్పోయి  సేవా దృక్పథమే కాదు తన బాధ్యతను కూడా సరిగా నిర్వహించలేక  జాతికి ద్రోహం చేస్తున్నారు."  ఇక అక్కడక్కడ సామాజిక కార్యకర్తలు సామాజికవేత్తలు, కవులు కళాకారులు  కొద్దిమంది వృత్తులలో భాగమైనటువంటి ఉపాధ్యాయులు వైద్యులు కార్యకర్తలు, ఉద్యోగులు అధికారులు  మాత్రమే  పరిమిత స్థాయిలో సేవా రంగంలో పనిచేయడంవల్ల   మనం అనుకున్నటువంటి మార్పు అంతగా సాధ్యం కావడం లేదు . మంచిని చెడు పెద్ద మొత్తంలో కప్పి వేసినప్పుడు  సూర్యుని మబ్బు కమ్మినట్లుగా  వాస్తవం బయటకి  కనిపించే అవకాశం ఉండదు  అయితే అంతవరకు మాత్రమే పరిమితం కాకుండా  చెడు మార్గాన్ని అవలంబిస్తున్న ఇతరులతో పోల్చుకోకుండా  నాలాంటి వారు ఎంతో కొంత మంది ఎక్కడో ఉంటారు అని ఆలోచించుకుంటూ  సద్విమర్శ, సదాశయము , సామరస్య ధోరణి , సమన్వయము,  సమర్థతతో  మనము నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి  పనిచేస్తూ పోతే ఎంతో కొంత మెరుగైన పరిస్థితులను మనం చూడవచ్చు . దీర్ఘకాలికంగానైనా  ఇలాంటి అభివృద్ధిని కొంతమంది  చూసి నేర్చుకుంటారు,  ఆలోచించి ఆచరణకు పూనుకుంటారు,  న్యాయ వ్యవస్థ విధించే శిక్షలు  సమాజంతో నిందించబడడం  విద్యా వ్యవస్థ ద్వారా  నైతిక విలువలను పెంపొందించుకోవడం వంటి అనేక మార్గాల ద్వారా  కొంత ఆలస్యంగా నైనా వ్యక్తిత్వ వికాసం వైపు  ఈ వ్యవస్థను నడపడానికి అవకాశం ఉంది. మనమంతా ఆశావాదులుగా  భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథం కలవారిగా  సమర్థత మేధోపరమైన  నైపుణ్యాలను విశ్వసించే వాళ్ళుగా  చెడు పైన ఉక్కు పాదం మోపడంతో పాటు మంచిని  విస్తరింప చేసే క్రమంలో  మన వ్యక్తిత్వమే కొలమానంగా జీవిద్దాం.
            వృత్తికి మాత్రమే పరిమితం పై ఏదో దేశ సేవ చేస్తున్నామంటే దానిని అంగీకరించే ప్రసక్తి ఉండదు. సమాజము  తన దృక్కోణంలో  పరిశీలిస్తూ ఉంటుంది  అదే సందర్భంలో  స్వార్థపూరిత  అభిప్రాయాలు  నైతికతను వ్యక్తిత్వాన్ని  వ్యక్తిత్వ వికాసాన్ని ఖూనీ చేస్తున్నటువంటి అనేక సందర్భాలను మనం పరిశీలించినప్పుడు  ఎవరికి వారు  తగు జాగ్రత్తలతో  వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది.  ఆస్తులు సంపదలు  రాజ భోగాల కంటే కూడా  నిజమైన వ్యక్తిత్వానికి కట్టుబడినటువంటి  మనుషులు ఎక్కువగా  గుర్తించి ఆదరించబడతారు.  పుట్టుక మన చేతిలో లేకపోయినా  చనిపోయే లోగా చేసేదంతా  మన నైజాన్ని, లక్ష్యాన్ని, ఆదర్శాన్ని, వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది కనుక  చనిపోయే రోజైనా ఈ సమాజం నిన్ను  కామెంట్ చేస్తుంది  అని తెలుసుకుంటే అంతకుమించినటువంటి  సామాజిక ప్రయోజనం మరోటి ఉండదు. నీతి శాస్త్రాలు,  సామెతలు,  మానవత్వం పునాదిగా పనిచేసే కొన్ని మత  గ్రంథాలలో కూడా చెప్పబడింది ఇదే.  మా మతం మానవత్వం మా కులం మంచితనం అని  ఆ వైపుగా దృష్టిని సారి ద్దాం , మరో ప్రపంచాన్ని ఆహ్వానిద్దాం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత జేఏసీ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333