పార్టీ రాజకీయాలతో  ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం  పాలకుల నేరమే

Jul 2, 2024 - 22:06
 0  12

ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం  

నిబద్ధతగా పనిచేయాలి  అలాంటి ప్రభుత్వాలనే ప్రజలు డిమాండ్ చేయాలి .

పార్టీ రాజకీయాలను పాలనతో ముడిపెడితే  

సహించే ప్రసక్తి ఉండకూడదు.   ప్రశ్నించి ప్రతిఘటించి

మార్పుకు శ్రీకారం చుట్టాలి.


---వడ్డేపల్లి మల్లేశం 

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో రాజకీయాలలో  వెసులుబాటును కోరుకొని పాలకులు  పాలనతో పాటు పార్టీ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత నివ్వడం ద్వారా  ప్రజల సమస్యలు పక్కదారి పడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు దీనికి సంబంధించి అనేక దేశాలలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు కూడా జరిగిన ఆనవాళ్లు లేకపోలేదు . భారతదేశంలో  పార్టీ రాజకీయాలకు  అతిగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా  ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజా ఆకాంక్షలకు,  పెండింగ్ సమస్యలకు,  దేశం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు  ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోతున్నాయి.  ప్రభుత్వాన్ని నడుపుతూ సమాంతరంగా పార్టీని నడిపే క్రమంలోపల  రాజకీయ పార్టీలకు ఇంత పెద్ద ఎత్తున స్వేచ్ఛ ఉండడం  పాలనకు గండి కొట్టినట్లే.  పార్టీ రాజకీయాలను నడపడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని నిర్మించుకోవడం ద్వారా పార్టీని  పాలకులు పరిమితంగా  వినియోగించుకుంటేనే ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుంది. ఈ మౌలిక సూత్రాన్ని సహజ న్యాయాన్ని  ఆచరించకుండా దేశంలో మామూలు ఉప ఎన్నిక నుండి మొదలుకుంటే సార్వత్రిక ఎన్నికల వరకు  అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ వాహనాలను, పోలీసు వ్యవస్థను,  ప్రభుత్వ నిధులను  విచ్చలవిడిగా పార్టీకి వాడుకోవడంతోపాటు  నిజమైన పరిపాలనకు  చేస్తున్న ద్రోహాన్ని  ప్రజలు గమనించాలి. ప్రశ్నించడానికి సిద్ధపడాలి  పాలకులు ఏది చేస్తే అదే చట్టం అనుకొని ప్రజా  ప్రాతినిధ్య చట్టంలోనో, ఎన్నికల సంఘం నియమావళి లోనో, లేక రాజ్యాంగంలోనో వెసులుబాటు ఉండవచ్చునని పాలకులను నమ్మితే  తమ 75 శాతం సమయాన్ని పార్టీకి వెచ్చించడానికి కూడా వెనుకాడరు ఎందుకంటే దేశంలో కొనసాగుతున్నవి అవకాశవాద రాజకీయాలు ..

 ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం నేరమే:-

కారణం ఏదైనా పార్టీ పేరు చెప్పుకొని  అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రజాప్రతినిధులు పాలకులు  తమ సమయాన్ని పార్టీ అభివృద్ధి కోసం ఎన్నికల ప్రచారం కోసం  కార్యకర్తల ప్రయోజనం కోసం ఎన్నో రకాలుగా  తమ సమయాన్ని వెచ్చించినప్పుడు  దేశాభివృద్ధి సంక్షేమం  పెండింగ్ సమస్యల పరిష్కారం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి చేయవలసిన కృషి కర్తవ్యము పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నది.  ఈ రకంగా బాధ్యతను విస్మరించడం రాజ్యాంగపరమైన  నేరంగా భావించినప్పుడు మాత్రమే  దానికి ప్రత్యామ్నాయం అన్వేషించబడుతుంది. అటు పాలకులు ఇటు ప్రజలు  ఈ అంశం పైన దృష్టి సారించవలసిన అవసరం చాలా ఉన్నది . ఒక ప్రభుత్వ హయాములో రాష్ట్రం లేదా దేశం ఐదు సంవత్సరాలు పరిపాలించబడిన సందర్భంలో  వాళ్ల వాళ్ల మేనిఫెస్టో అభిప్రాయాలు ప్రణాళిక ప్రకారంగా నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయడం దుర్వినియోగం చేయడం  పెట్టుబడిదారులు భూస్వామ్య వర్గానికి వంత పాడడం  మరింత ముందుకు వెళితే ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు ఉచితంగా లేదా చౌకగా అమ్మి వేయడం లాంటి కటోర నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు మన దేశంలో ఉన్నవీ  ప్రతిపక్షాల ఆమోదం లేకుండా ప్రజల అనుమతి లేకుండా ఈ దేశ ఉమ్మడి సంపదను ఆ రకంగా కొద్దిమంది కోసం వినియోగించే అధికారం లేనప్పుడు ప్రభుత్వం అంత దురుసుగా వ్యవహరించడం అంటే  బాధ్యతారాహిత్యం మాత్రమే కాదు అది రాజ్యాంగబద్ధమైన నేరం.  అలాంటి నేరాలకు కచ్చితంగా  శిక్షలు ఉండాల్సిన అవసరం ఉంది దానిని  మానవ హక్కుల కమిషన్లు, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం  వంటి రాజ్యాంగబద్ధ సంస్థలు  ఆలోచించినప్పుడు మాత్రమే పరిష్కారం దొరుకుతుంది. లేకుంటే చట్టసభల నిండా నేరస్తులు నేర చరిత్ర కలిగిన వాళ్లు ఉండే ప్రమాదం లేకపోలేదు అలాగే సంపన్న వర్గాలకు మాత్రమే చట్టసభల్లో అవకాశం చిక్కితే పేద వర్గాలకు చట్టసభల కడప దాటడానికి అవకాశం లేకుండా చేసే అంతరాలు అసమానతలు ఇప్పటికే ఈ దేశంలో భారీగా పెరిగిపోయినవి.  ఇదంతా పార్టీ రాజకీయాలకు పాలకులు అధిక ప్రాధాన్యత ఇచ్చి  తమ సామాజిక వర్గాన్ని అధికారంలో ఉంచుకోవడం కోసం చేసే కుట్రలో భాగంగా కొనసాగుతున్న విషయమని గమనించినప్పుడు మాత్రమే పరిష్కారం దొరుకుతుంది.

 ప్రజాక్షేత్రంలో రావలసిన కొన్ని సంస్కరణలు:-

  రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న సందర్భం,  పెత్తందారీ వర్గాలకు ఊడిగం చేసే రాజ్య స్వభావం,  అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన నిరంతరం కొనసాగుతూ ఉంటే  మద్దతిచ్చే పాలకవర్గాల ధోరణి  పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలో రాయితీలు ఇవ్వడంతో పాటు రుణమాఫీలు చేయడం వంటి  వికృత చేష్టలకు పాలకులు ప్రయత్నిస్తుంటే  ఈ దేశంలో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా మానవాభివృద్ధికి దూరంగా దారిద్రేక దిగువన విసిరి వేయబడినటువంటి కోట్లాది కుటుంబాలను  నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పాలకుల ఎత్తుగడలు కుట్రపూరితంగా  కొనసాగుతున్న ఒక ప్రణాళిక బద్ధమైన చర్యలు అని  గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది.  అందుకే ప్రభుత్వాల వ్యతిరేక చర్యలను ప్రతిఘటించడానికి  కార్మికులు కర్షకులు చేతివృత్తుల వాళ్ళు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది శ్రమజీవులు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్న వారి పక్షాన కనీస హక్కుల కోసం, కనీస వేతన చట్టం సాధించుకోవడం కోసం . నిర్బంధం అణచివేతను  ప్రతిఘటించడం కోసం సమాయత్తమవుతున్నటువంటి కోట్లాది ప్రజానీకం వారికి మద్దతుగా నిలబడుతున్నటువంటి మేధావులు బుద్ధి జీవులను  అక్రమంగా జైల్లో వేసి లేనిపోని కేసులను బనాయించి  దశాబ్దాల శిక్షించిన తర్వాత నిర్దోషులని ప్రకటించిన చరిత్ర ఉన్న ఈ పాలకులకు ఎంత శిక్ష వేసినా తక్కువే .ఆ విషయాన్ని జాతీయ స్థాయిలో పరిష్కారం కాకుంటే అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకుపోయిన తప్పులేదు.  ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా నడుస్తున్న పాలకులను ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, అలాంటి ప్రభుత్వాలకు ఓటును నిరాకరించాలి.  తమ డిమాండ్లను రాజకీయ పార్టీల ముందు పెట్టి  హెచ్చరించడం కూడా అలవాటు చేసుకోవాలి ప్రజలు.  కానీ దానికి బదులుగా ఇటీవల కాలంలో దయనీయమైన పరిస్థితి ఏమిటంటే తమకు ఒక రాజకీయ పార్టీ ఓట్ల సందర్భంగా డబ్బులు ఇవ్వలేదని ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితులను గమనిస్తే  ఈ దుస్థితికి కూడా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వాలే కారణమని కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ప్రభువులుగా చూడవలసిన ప్రజలను యాచకులుగా బానిసలుగా మార్చి అనివార్యంగా  ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా తయారుచేసి  అవకాశాలను సొమ్ము చేసుకోవడానికి  కుటిలయత్నాలు చేస్తున్న పాలకవర్గాలకు  పార్టీల యొక్క ప్రయోజనమే ఎక్కువ కానీ ప్రజల సమస్యలు ముఖ్యం కాదు అని తెలిసిపోతున్నది.  ఇన్ని సమస్యలకు రాజకీయ పార్టీల నాయకులు తమ పార్టీ ప్రయోజనాలను  అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా  చేస్తున్న దుర్విని యోగాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టవలసిన అవసరం కూడా ఉన్నది.  ఇటీవల కాలంలో  తెలంగాణ రాష్ట్రంలో గత  రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా హుజరాబాద్, దుబ్బాక, మునుగోడు,  నాగార్జునసాగర్ తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో జరిగినటువంటి  ఎన్నికల సందర్భంలో కూడా అక్కడ పనిచేసినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం తన యంత్రాంగాన్ని మంత్రులను ముఖ్యమంత్రితో సహా రోజుల తరబడి ఆయా కేంద్రాలలో  ఎన్నికల ప్రచారంలో  నిలిపితే ఆ రాష్ట్రాల పాలన ఎవరు చేసినట్లు? పనిచేయని రోజులకు వేతనం ఎలా తీసుకున్నట్లు? ఈ విషయంలో ప్రశ్నించవలసిన అవసరం లేదా?  కచ్చితంగా పనిచేయకుంటే  పార్టీ పని మీదనే ఉంటే  ఉద్యోగుల మాదిరిగా సెలవు పెట్టి వేతనాన్ని కోత విధించే  సంస్కరణ రావలసిన అవసరం ఉంది. నెలల తరబడి ఉచితంగా వేతనాలను అక్రమంగా పొంది  పార్టీ పనిలో లీనమై ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి చరిత్ర ఉన్న ఈ దేశంలో అలాంటి కేసులను  విచారణ జరిపించి దోషులను శిక్షించవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. ఇందుకు రాష్ట్ర ఎమ్మెల్యేలతో సహా ప్రధానమంత్రి వరకు ఎవ్వరు కూడా మినహాయింపు కాదు   దుర్విని యోగం  జరిగిందని తేలితే కచ్చితంగా హోదాతో సంబంధం లేకుండా శిక్షించ వలసిందే అలాంటి వ్యవస్థ రావాల్సిన అవసరం ఉంది అందుకు ప్రజలు పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం మాత్రమే సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.   ప్రధానమంత్రి గాని మంత్రులు లేదా ముఖ్యమంత్రి పార్టీ కార్యక్రమాలకు  దూరంగా ఉండాలి ఆ పార్టీ శాఖల అధ్యక్షులు లేదా యంత్రాంగం మాత్రమే పార్టీ కార్యక్రమాలను నిర్వహించేటువంటి  సంస్కరణ రావలసిన అవసరం ఉంది. యి 0దుకు సంబంధించి పార్లమెంట్లో బిల్లును ఆమోదింప చేయాలి దానికి రూపకల్పన చేయడం బాధ్యతను న్యాయవ్యవస్థ తీసుకున్న నాడు మాత్రమే  ఇది చట్టంగా రూపొందుతుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333