నా కులం ఏందో అందరికీ తెలుసు.. నా మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకోండి: జగన్
- నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానన్న జగన్
- 15 సార్లకు పైగా తిరుమలకు వెళ్లానన్న మాజీ సీఎం
- తనను డిక్లరేషన్ అడుగుతున్నారని మండిపాటు
- చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్న
- చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న జగన్
తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల వెళతానని చెబితే... తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో నాలుగు గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని... బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు సాంప్రదాయాలను తాను గౌరవిస్తానని, అనుసరిస్తానని చెప్పారు. తన మతం మానవత్వమని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోండని అన్నారు. ముఖ్యమంత్రిగా నాన్నగారు ఐదేళ్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలను వస్త్రాలకు సమర్పించారని... సీఎంగా తాను కూడా స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించానని చెప్పారు. తన మతం ఏందో వాళ్లకు తెలియదా? నా కులం ఏందో తెలియదా? అని ప్రశ్నించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శనం చేసుకుని తాను పాదయాత్రను ప్రారంభించానని... పాదయాత్ర పూర్తయిన తర్వాత తిరుమలకు నడకమార్గంలో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని జగన్ చెప్పారు. 15 సార్లకు పైగా తాను తిరుమలకు వెళ్లానని... అలాంటి తనను డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తుండటం దుర్మార్గమని చెప్పారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబును బీజేపీ పెద్దలు ఎందుకు మందలించడం లేదని... ఆయనను ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. నెయ్యి ధరను పెంచి, హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యిని సరఫరా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని చెప్పారు. చంద్రబాబే తప్పు చేసి, ఆయనే సిట్ వేస్తారని విమర్శించారు. మాజీ సీఎం అయిన తనకే ఇన్ని ఇబ్బందులు కలిగిస్తే... సామాన్య దళితుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హిందూయిజం అంటే మానవత్వాన్ని చూపించడమని చెప్పారు.