- ధరూర్ తహశీల్దార్ కు వినతి పత్రం అందజేసిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి.
- దేవాలయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయానికి పాల్పడుతున్న దానిని వెంటనే నిలుపుదల చేయాలి.
జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్: మండల పరిధిలోని నీలహళ్లి గ్రామంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయ ఇనాం భూమి కబ్జాదారుల చేతిలో ఆక్రమణకు గురైందని కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రామస్తులు ధరూర్ తహశీల్దార్ కు వినతిపత్రం అందజేసి కబ్జాకు గరైన భూమిని తిరిగి ఆలయానికి చెందే విధంగా చూడాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
సర్వే నంబర్ 355లోని 5 ఎకరాల 16 గుంటల భూమిని ప్రస్తుతం రాజకీయ నాయకుల అండదండలతో కబ్జాకోరులు కాజేయాలని కుట్ర చేస్తున్నారని, దేవస్థానం భూమిని రియల్ ఎస్టేట్ గా మారుస్తూ కబ్జాకు పాల్పడడటమే కాక గ్రామ ప్రజలను నయ వంచనకు గురి చేస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఉన్న నాయకులు ఏకమై రాత్రికి రాత్రే పొలాన్ని చదును చేయించి ఆక్రమణకు పాల్పడ్డారన్నారు. ఇప్పటికే ఈ భూమి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని, సంబంధం లేని కిష్టాచారిపై దత్తపుత్రుడిగా చిత్రీకరించి కొత్త నాటకానికి తెరలేపారన్నారు. దేవాలయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయాలకు పాల్పడుతున్నారని వెంటనే దాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు మునెప్ప, మల్దకల్, సుభాష్, రామకృష్ణ, జగదీష్, చిలుక మునెప్ప, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.