దేశమంతా స్వాతంత్ర్య సంబరాల  జెండా పండుగ

Aug 20, 2024 - 07:46
Aug 21, 2024 - 21:03
 0  3
దేశమంతా స్వాతంత్ర్య సంబరాల  జెండా పండుగ

అయితేనేమి  మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇప్పటికీ లభించలేదు.

అణచివేత, నిర్బంధం,  దోపిడీ మమ్ముల వెంటాడుతుంటే  ప్రజాస్వామ్య దేశమని ఎలా అంగీకరిస్తం ?

హక్కుల కార్యకర్తలు, సగటుజీ వులు ,ఉద్యమకారులు, మేధావుల   ఆవేదన ఇది!

----వడ్డేపల్లి మల్లేశం 
అన్నపురాసులు ఒకచోట ఆకలి కేకలు మరొక చోట...  మింగ మెతుకు లేని వాళ్ళు కొందరైతే  మీసాలకు సంపెంగ నూనె  తో విరాజిల్లే వాల్లు మరికొంద రు. కొద్దిమంది చేతుల్లో సంపద కేంద్రీకరించబడి  పెట్టుబడిదారుల అండతో పాలకవర్గాలు  పేద వర్గాలను వంచిస్తూ  కనీసం మనుషులుగా చూడకుండా  వెలివేస్తున్న సందర్భాలు అనేకం.  పైగా సంపన్న పారిశ్రామిక వర్గాలకు దేశ సంపదను  పేద ప్రజల కష్టార్జితాన్ని అప్పనంగా కట్టబెడుతున్న తీరు  సిగ్గుచేటు కాక మరేమిటి ? హక్కులకై ప్రశ్నించినా,  తమ వాటా కోసం డిమాండ్ చేసినా,  వాస్తవాన్ని నోరు విప్పి మాట్లాడినా  జీర్ణించుకోలేని పోలీసు, పాలకవర్గాలు, అధికార యంత్రాంగం  ఉగ్రవాదులు తీవ్రవాదులు  దేశద్రోహులు  అనే  ముద్ర వేసి  అక్రమ కేసులు బనాయించుతున్న తీరు  హాస్యాస్పదం .  దేశవ్యాప్తంగా  స్వాతంత్ర సంబరాలు  జెండా పండుగ  ముసుగులో కొనసాగుతున్న  ఆ పండుగ ఫలితాలను అనుభవించనటువంటి పేద అట్టడుగు సామాన్య వర్గాలు మాత్రం తమకు ఇంకా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రాలేదని  ప్రస్తుతం అమలవుతున్నటువంటి స్వతంత్రం  ఒక ఊహ బూటకం మాత్రమేనని  నిరసన వ్యక్తం చేస్తున్నారు, నిజమైన స్వాతంత్రం కోసం తిరిగి మరో పోరాటం కావాలని ఆరాటపడుతున్నారు ."ఈ నేపథ్యంలో  ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది భూస్వాములు పెట్టుబడిదారులు సంపన్న వర్గాలు పారిశ్రామికవేత్తలు  తోటి వర్గాలను పీడించి దోపిడీ చేసి అణచివేసి  నిలువ నీడ లేకుండా చేస్తున్నటువంటి కొన్ని వర్గాలకు మాత్రమే ." ఈ దేశ రాజ్యాంగ పలాలు సామాన్యులకు అందనప్పుడు  స్వాతంత్రాన్ని అంగీకరించడానికి పేద వర్గాలు సిద్ధంగా ఉండరు కదా! అందుకే తమ ఆవేదనను  ,నిరసనను,  అవిశ్వాసాన్ని  నిర్భయంగా వ్యక్తం చేయడానికి  ముందుకు వస్తున్నారు.  ఆ నిరసన  ప్రతిఘటన  నుండే  పాలకవర్గాలకు  స్పృహ ,సోయి ,బాధ్యత వస్తుందని ఆశిద్దాం.
       జ్ఞాని జైల్ సింగ్ గారు ఈ దేశ రాష్ట్రపతిగా కొనసాగిన కాలంలో  స్వతంత్ర భారతదేశంలో దేశాధినేతగా  ఉండి కూడా చేసిన వ్యాఖ్యలు  ఈ దేశం యొక్క  అసమానతలు దోపిడీ  వివక్షతకు అద్దం పడుతున్నాయి.  "ప్రజల యొక్క కనీస అవసరాలు తీరనంతవరకు,   స్వాతంత్రాన్ని అనుభవించి  తమ హక్కులకై  పోరాడగలిగే స్వేచ్ఛ    లేనప్పుడు , అసమానతలు అంతరాలు కొనసాగుతూ  రాజ్యాంగం  ఒక మిధ్యగా అమలైన సందర్భంలో  ఈ దేశంలోని  కోట్లాది సగటు జీవులకు స్వాతంత్రం రానట్లే ".  సహజంగా ఉండే పాలకవర్గ స్వభావానికి భిన్నంగా రాష్ట్రపతిగా ఈ మాటలు  ఈ దేశ వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంటే  ప్రస్తుత పాలకులు మాత్రం  అంగీకరించడానికి సిద్ధంగా లేరు అనేది  నగ్న సత్యం .

సగటు జీవుల ఆవేదనలో   అసహనం  :-

"74సంవత్సరాల గణతంత్ర దేశంలో  నాకు స్వాతంత్రం రానే రాలేదు . హక్కుల కోసం , ఆకాంక్షలు  ప్రయోజనాల కోసం నోరు తెరిచి మాట్లాడే హక్కు , పిడికిలెత్తి నినదించే పోరాట స్ఫూర్తి కి  అనేక ఆటంకాలు  ఉ 0టే నేను కోరుకునే స్వేచ్ఛ  నేటికీ రా కదా ! స్వతంత్ర భారతదేశమా!!! పేద వర్గాల పట్ల ఇంతటి వివక్షత తగునా? ఆకృత్యాలు అరాచకాలు దోపిడీ, పీడన  ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతున్న ఈ దేశ పాలనలో  గాలి గట్టిగా పీల్చు కున్న నేరమేనా?  పాపిష్టి పాలకులు  బడా నేరస్తులైన  చట్టసభల సభ్యుల మధ్యన.  తెల్లవాడి నుండి నల్లవాడికి అధికార మార్పిడి జరిగిందే  తప్ప  స్వావలంబన , ఆత్మగౌరవం ఈ దేశ ప్రజలకు ఇప్పటికీ అందలేదు."  ఎలుకలను తినేవాడి నుండి ఏనుగుల్ని తినేవాడికి   దేశ అధికార మార్పిడి జరిగిందే తప్ప
వికషిత్ భారత్,  దేశభక్తి,  ప్రజల విశ్వాసాలు,  దైవభక్తి  ముసుగులో, మతాల మంటల్లో , కులాల  కు0 పట్లలో  అమాయక ప్రజల దేహాలు ఖాళీ బూడిద అవుతుంటే  ఇది మామూలే అని  పెదవి విరిచిన పాలకులున్నదేశం మనది.మానవాక్రమ రవాణా,అత్యాచారాలు,  అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న  మహిళా డాక్టర్ను  గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన  దుర్మార్గులున్న దేశంలో పాలకులు కూడా  వాళ్లకే మద్దతు ఇవ్వడం విచారకరం . అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణను ప్రోత్సహించి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి  దేశ సంపదని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న  పాలకులు న్యాయస్థానాలకు కూడా సంకెళ్లు వేస్తూ ఉంటే  కనీస న్యాయాన్ని అయినా అందించాలనే స్పృహ ఉన్న న్యాయవాదులు న్యాయమూర్తుల సంగతి ఏమిటి ? నల్ల చట్టాల ముసుగులో  దేశద్రోహం నేరంతో  ప్రజల పక్షాన ప్రశ్నించిన పాపానికి మేధావులు హక్కుల కార్యకర్తలను  జైలు పాలు చేస్తూ  అమరవీరులను చేస్తుంటే  ఈ దేశంలో   ఇప్పటికీ స్వాతంత్రం లేనేలేదు.  స్వాతంత్రం వచ్చిందని అంటే అది పెట్టుబడిదారులు, భూస్వామ్య వర్గాలు,  నేరస్తులు, దోపిడి దొంగలు, అత్యాచార  కామాంధులకు మాత్రమే. .. ఈ డి, ఐటి,  సిబిఐ దాడులతో  ఈవీఎంల జిమ్మిక్కులతో   పాలక వర్గాల  రాజకీయం ఇప్పుడు  సేవకులు కాదు  డబ్బులున్నోడే రాజ్యమేలాలనే దు డ్డు కర్ర న్యాయం  అమల్లోకి వచ్చింది.  "నిజాయితీపరులైన సమర్థులైన పేదోళ్లకు  బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లోనూ  స్థానిక సంస్థల్లోనూ అధికారం ఇవ్వడానికి  బిచ్చమేసినట్లు  వ్యవహరిస్తున్న పాలకవర్గాల  పాలనలో మాకింకా స్వాతంత్రం రాలేదు." .

  "మేం కోరుకునే స్వాతంత్రం మెజారిటీ ప్రజల చేతిలో అధికారం ఉండాలి , మేమెంతో మాకు అంత వాటా దక్కాలి , ఈ దేశ సంపద ప్రజలందరికీ చెందాలి,  అణచివేత వివక్షత  పీడనలేని  సమానత్వం సా కారం కావాలి . మరింత మెరుగైన సమాజ నిర్మాణం కోసం  రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన  స్వేచ్ఛ, న్యాయం, సార్వభౌమాధికారం, సౌబ్రాత్రుత్వం , సామ్యవాదం  దేశమంతా విస్తరిల్లాలి . ఆ ఆనవాళ్లు ఏమాత్రం లేని ఈ దేశంలో 77 సంవత్సరాలు ముగిసినంత మాత్రాన స్వాతంత్రం వచ్చిందని నమ్మడానికి  సామాన్య ప్రజలు సిద్ధంగా లేక పోవడమే కాదు  విసుక్కుంటున్నారు....  ఎదురు తిరుగుతున్నారు ... "ఎవలురా స్వతంత్రం వచ్చిందని  నినదిస్తున్న వాళ్లు" అని  హెచ్చరించడానికి సిద్ధంగా ఉన్నారు  .సామాన్యుల మేధావుల హక్కుల కార్యకర్తల అసహనాన్నీ    పరీక్షిస్తే రాబోయేది గడ్డు కాలమే  పాలకులకు పరేషానే.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333