తప్పులను అంగీకరించడం ఎంత ముఖ్యమో  ప్రజలకు విధేయులై ఉండడం కూడా ప్రభుత్వాలకు అంతే ముఖ్యం

పాలకుల కళ్ళు తెరిపించడంలో  విజయవంతమైన  ప్రజలు,  ప్రజా సంఘాలు, మేధావులు, అఖిలపక్షాలు ..

Feb 29, 2024 - 12:30
Mar 1, 2024 - 17:35
 0  1
తప్పులను అంగీకరించడం ఎంత ముఖ్యమో  ప్రజలకు విధేయులై ఉండడం కూడా ప్రభుత్వాలకు అంతే ముఖ్యం

ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అఖిలపక్షాల విమర్శలను అంత సులభంగా స్వీకరించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు .ఎందుకంటే  విమర్శలను అంగీకరిస్తే,  ప్రశ్నలకు జవాబు ఇస్తే,  ప్రతిఘటనకు స్పందిస్తే  తప్పులు చేసినట్టు భావించవలసి ఉంటుందని పాలకులకు తెలుసు  .కానీ   ఆ ప్రగల్భాలు, దాపరికాలు ఎంతో కాలం నిలబడవని చరిత్ర   రుజువు చేస్తున్నది  కాలగమనంలో  చేసిన తప్పులను అనేకమంది కూడా సవరించుకోవడమో,  అంగీకరించడమో,  లేదా అందుకు  తగిన ప్రాయశ్చిత్తం అనుభవించడమో జరిగిన విషయం  పరిశీలిస్తే  పాలకుల యొక్క బలహీనత తేటతెల్లమవుతుంది . 1980 ప్రాంతంలో కాంగ్రెస్ లోపాలవల్ల NTR  అనూహ్యంగా అధికారానికి రావడం, ఎమర్జెన్సీ తర్వాత ఇందిరఓడిపోవడం తెలిసిందే.  అందుకు బారాస ప్రభుత్వం ఏ మాత్రం మినహాయింపు కాదు.  ఇప్పటికైనా ప్రజల ముందు ఎన్నికల సమయంలో చేసిన పొరపాట్లను,  జరిగిన లోపాలను,  తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను  అంగీకరించకపోతే  ప్రజలు  యుద్ధంలో ఓడించడానికి సిద్ధంగా ఉంటారని  అంగీకరించి తీరాలి. రాష్ట్రంలో భూమి ఉన్నటువంటి రైతులకు  రైతుబంధు పేరున నిధులను జమ చేసిన విషయం తెలిసిందే. కానీ భూమిలేని  అశేష జనానికి ఏ రకమైన ప్రయోజనం కల్పించకపోవడాన్ని  ఏనాడైనా ప్రభుత్వం  అంగీకరించినదా!?  ఆ పొరపాటును సవరించుకునే ప్రయత్నం చేసినదా అంటే లేదు అనే చెప్పాలి.  ప్రస్తుతము  మేనిఫెస్టోలో గ్యాస్ సిలిండర్  కాంగ్రెస్ 500 అంటే బారాసా 400కే ఇస్తామని ప్రకటనలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు  .గత పది సంవత్సరాలుగా  కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ తో పాటు వంటగ్యాస్ ధరను భారీగా పెంచి ప్రజలను మోసగించిన విషయాన్ని  అప్పుడప్పుడు బారాషా ప్రభుత్వం విమర్శించడమే కానీ  సొంత నిర్ణయం తీసుకొని ప్రజలకు తక్కువ ధరకు అందించిన దాఖలా లేదు.  10 ఏళ్లలో ఇవ్వనిది  ప్రస్తుతం ఎన్నికల్లో 400కే ఇస్తానని మాట ఇవ్వడం అంటే ప్రజలను మళ్లీ మూడవసారి మోసగించడమే అవుతుంది.  ఇక ఉచితాలు తాయిలాలకు సంబంధించి  అనేకమంది మేధావులు బుద్ధి జీవులు  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో కూరుకు పోతుందని  విద్యా వైద్యం, సామాజిక న్యాయం,  పౌర సౌకర్యాలు,  ఉద్యోగ ఉపాధి  అవకాశాలను మెరుగుపరచడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెంచినట్లయితే  ఉచిథా లకు ప్రజలు ఆశపడకుండా స్వతంత్రంగా జీవిస్తారని ఎన్నో మార్లు  హిత బోధ చేసినప్పటికీ  ఎన్నికల్లో గెలిచే దగ్గరి దారి కోసమే ప్రయత్నం చేయడంలో బారాస పార్టీ ముందున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం బారాస పార్టీ  తన మేనిఫెస్టోలో  అనేక హామీలను పొందుపరిచిన విషయాన్ని గమనించిన కాంగ్రెస్ భాజపాలు  అనివార్యమైన పరిస్థితులలో   పోటీ పడుతున్న విషయం గమనిస్తే  ఉద్యమ పార్టీ అనుకుంటున్న భారత రాష్ట్ర సమితి  ఉచితాలను ప్రోత్సహించకుండా  ప్రజలను స్వతంత్రంగా జీవించడానికి అలవాటు చేస్తే బాగుండేది .ఈ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఎన్నికల ముందు ఆ రకమైన స్పష్టమైన హామీ ఇస్తే ప్రజలు కొంత విశ్వసిస్తారు.

పొరపాట్లను అంగీకరిo చడమా? నటనా?-  పార్టీని పూర్తి ప్రక్షాళన చేసుకుంటే మంచిది :-

పదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు విస్మరించిన హామీలు  కొన్ని వర్గాలకు జరిగిన ద్రోహాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వం గమనిస్తున్నట్లు,  అంగీకరించడానికి సిద్ధపడుతున్నట్లు ఎన్నికల ముందు  కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి.  .నిరుద్యోగులకు సంబంధించి  ఉద్యోగాలు ఇవ్వలేదని అనేకచోట్ల నిరుద్యోగులు పోటీలో కొనసాగుతూ    ఈసారి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నిరుద్యోగుల పక్షాన విశ్వవిద్యాలయ విద్యార్థులు నడుము కట్టినారని చేస్తున్న ప్రకటనలు ప్రభుత్వాన్ని  కదిలింప చేస్తున్న తరుణంలో  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మేధావుల హెచ్చరికల నేపథ్యంలో  ఇటీవల రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ నిరుద్యోగులతో ముచ్చటించడం....  అంతేకాకుండా  24 నవంబర్  2023న అనేక  పత్రికా ఎడి టర్ల సమావేశంలో మాట్లాడుతూ " మేము మనుషులమే పొరపాటు చేసి ఉంటాం సరిదిద్దుకొని ముందుకెళ్తాం *"అని  బహిరంగంగా ప్రకటించడం  ప్రభుత్వము తన తప్పును అంగీకరించినట్లుగా  భావించాల్సి ఉంటుంది.  మా పార్టీని ప్రభుత్వ విధానాన్ని ప్రక్షాళన చేసుకుని  మళ్లీ గెలిస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని  ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నప్పుడు   పదేళ్లుగా చేయలేనిది ఇప్పుడెలా చేస్తారని గుచ్చి గుచ్చి అడిగినప్పుడు  సంజాయిషీ ఇస్తు సరిదిద్దుకుంటాం అని అంటూనే  తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏ రాష్ట్రంలో జరగలేదని నమ్మబలికే ప్రయత్నం చేయడం  ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే అవుతుంది.

ఇక రియల్ ఎస్టేట్ సమ్మి ట్ సమావేశంలో  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ  అనేక ప్రయోజనాలను భవిష్యత్తులో కల్పిస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తూనే  ధరణి ప్రపంచంలోనే గొప్పదని ఇంతకాలం అంగీకరించిన ప్రభుత్వం  "త్వరలోదరణిలో  ఉన్న సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని" మాట మార్చడం అంటే  ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు చేస్తున్న ధరణి లోపాలను ప్రభుత్వం అంగీకరించినట్లే కదా!  భారతదేశ సగటు అక్షరాస్యత 72 శాతం ఉంటే తెలంగాణ 66%తో వెనుకబడి ఉన్నప్పటికీ  అన్నింటిలో నంబర్ వన్ అని చెప్పుకునే ప్రభుత్వం ఈసారి మాత్రం  ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడంతో పాటు 100% అక్షరాస్యతను  పూర్తి చేస్తామని హామీ ఇచ్చే ప్రయత్నం చేయడం  మళ్లీ రాబోయే కాలంలో జరిగే మోసానికి  గుర్తుగా హెచ్చరికగా లేదా నటనగా భావించాల్సి ఉంటుంది.  కాలేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతి నాణ్యత లోపం పైన మాట్లాడిన  మంత్రి కేటీఆర్  పలు సందర్భాలలో సమర్ధించుకునే ప్రయత్నం చేసి  ప్రాజెక్టులు కట్టినప్పుడు కొంత  పొరపాటు జరగడం సహజమని మొదట్లో   మాట్లాడి అనేక రకాల ఒత్తిడి వచ్చిన తర్వాత కూడా  ఇప్పటికీ ముఖ్యమంత్రి దానిపై స్పందించకపోవడం బాధ్యతను విస్మరించడమే.  పైగా  కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాజకీయాలు చేయవద్దని,  పొరపాటు జరగడం సహజమని కూడా మంత్రి కేటీఆర్  మాట్లాడిన తీరు గర్హనీయం.  నిరుద్యోగుల పట్ల    నిర్లక్ష్యం,  ధరణిలోని లోపాల ను అంగీకరించినట్లే  కాలేశ్వరం ప్రాజెక్టు  అవినీతిని లోపాలను అంగీకరించి ప్రభుత్వం చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

  చిరు వ్యాపారులు, పేద కుటుంబాలు , కూలీలు, కార్మికులు,  భూమి లేనటువంటి నిరుపేదలు,వలసజీవులకు  ఇప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేదు . ఆదాయాన్ని పెంచే అవకాశాలు లేవు  విద్యా ఉద్యోగాలలో  ఉచిత సౌకర్యం లేకపోవడంతో పేద వర్గాలు తమ అరకొర ఆదాయంలో  60 శాతానికి పైగా  దవాఖాన్లకు  చదువులకు ఖర్చు పెట్టడం వలన  మరీ పేదలవుతున్న విషయాన్ని ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించకపోవడం  బాధ్యతారాహిత్యమే  .ఈ విషయంలో కూడా ప్రభుత్వం  తమ లోపాన్ని నేరాన్ని అంగీకరించి తీరాలి.  అలాగే రైతుబంధు విషయంలో  భూస్వాములకు ఇవ్వడం , గుట్టలు చెట్లు, పుట్టలు ఇండ్ల స్థలాలకు కూడా ఇవ్వడం  వలన కోట్లాది ప్రజాధనం దుర్వినియోగమైన విషయంపై  నేరాన్ని ఒప్పుకొని తీరాలి . భవిష్యత్తులో ఐదు ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి  సమాంతరంగా భూమి లేనటువంటి నిరుపేదలకు భూమిని పంచడంతోపాటు  కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఆదాయ మార్గాలను కల్పించి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించడానికి ప్రయత్నం చేయాలి.  బారాస పార్టీ మాత్రమే కాదు అధికారానికి రావడానికి అర్రు లు చా స్తున్న ఏ రాజకీయ పార్టీ అయినా  ఈ లోపాలను సవరించుకొని  సూచనలను పాటించి  పేదరికం నిర్మూలించే దిశగా అసమానతలు అంతరాలను  తొలగించి సమానత్వాన్ని సాధించడానికి కృషి చేసినప్పుడు మాత్రమే  ప్రజలు ప్రజాస్వామి కవాదులు మేధావులు విశ్వసిస్తారు . లేకుంటే కచ్చితంగా నిరంతరం ప్రజా ప్రతిఘటన తప్పదు అని తెలుసుకోవడం పాలకులకు మరీ మరీ అవసరం.

--వడ్డేపల్లి మల్లేశం 
     ( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333