దీపావళి అంటే వరుసదీపాలు వెలిగించడం.
అంతే కాదు సంతోషం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, పంటలకు స్వాగతం పలకడం కదా !
టపాసులు కాల్చి ప్రమాదాలలో ఎందరినో మసీ చేసి ఘనంగా దీపావళి జరుపుకున్నారు అంటే ఎలా ?
టపాసులు కాల్చే వాళ్ళని, తయారీకి అనుమతించే ప్రభుత్వాలను బోనులో నిలపాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
( దీపావళి ప్రత్యేక కథనం )
ప్రతి పండుగకు పౌరాణికంగా శాస్త్రీయంగా మానవతా విలువల పరంగా పునాదులు ఉన్నట్లే దీపావళి పండుగ కూడా గొప్పగా జరుపుకోవడానికి అనేక చారిత్రక పౌరాణిక పర్యావరణ సంబంధమైన కారణాలను వెతకాల్సిన అవసరం ఉంది. భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసే సమూహాలు పలు కథనాలను వర్ణించి అందుకోసమే పండుగ జరుపుతున్నట్లుగా తెలియజేస్తున్న తరుణంలో వాటికి సైదాంతిక చారిత్రక శాస్త్రీయ పునాదులు లేకపోయినప్పటికీ ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలనే కారణంగా పండుగలు గొప్పగా జరుపుకోవడాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. అయితే శాస్త్రీయ మైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు కనీసం ఆ రకంగా నైనా ఆధునిక ధోరణులు జీవన విలువలు ప్రకృతిని పరిరక్షించుకునే సందర్భాలను ఎత్తిచూపుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఆ రకంగా దీపావళి పండుగకు సంబంధించి పలు కోణాలలో చర్చించుకోవడం ముదావహం .భూదేవికి వరాహ స్వామికి జన్మించినటువంటి నరకాసురుడు అనివార్యమైతే తన తల్లి చేతిలో మరణిస్తాను కానీ శ్రీహరి చేతిలో మరణం లేకుండా వరాన్ని తన తల్లితోనే పొందడం వలన అవకాశాన్ని నరకాసురుడు ఉపయోగించుకుని దేవలోకాన్ని మునులను ప్రకృతిని యావత్తు తన ఆగడాలతో హింసించిన సందర్భాలను శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా మంచిని కాపాడి చెడును తుంచే ప్రయత్నంలో భాగంగా నరకాసురుని చంపడానికి శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ వెంటతీసుకెళ్లాడు. యుద్ధంలో సత్యభామ చేత చంపించినట్లు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు న రకాసురుని పీడ విరగడైనందుకు అన్ని ఇండ్లలోను విశ్వమంతా దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేసినట్లు అప్పటినుండి ప్రతి ఏటా దీపావళి ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లుగా పౌరాణిక కథ సారాంశం . సుమారు 50 సంవత్సరాల కు పూర్వం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలలో దీపావళి అంటే దీపాల వరుస అని , నరకాసురుని సంహరించినందుకు సంతోషంగా పండుగ జరుపుకుంటారని , వర్షాకాలం శీతాకాలం మధ్యన సంధి కాలంలో ఈ పండుగ వస్తుందని వాతావరణం అంతా చిత్తడిగా ఉంటుందని అనేక క్రిమి కీటకాలు దోమలు ఈగలతో తలడిల్లుతున్న సందర్భంలో టపాసులు పేల్చడం వలన వాతావరణం శుద్ధి అవుతుందని అన్ని క్రిమి కీటకాలు చనిపోతాయని చదువుకున్నది నాటి సారాంశం .
అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రతి సంవత్సరం కూడా టపాసులు ఊహించని స్థాయిలో పేల్చుతున్న కారణంగా పర్యావరణం మొత్తం నాశనమై ప్రాణవాయువు కరువై వాతావరణమంతా వేడెక్కి అనేక రోగాల బారిన పడుతున్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. యిందు కోసమేనా మనం దీపావళి జరుపుకునేది అనీ ఎవరికి వారి మీ ప్రశ్నించుకోకపోతే భవిష్యత్తు మరింత గందరగోళానికి దారి తీయవచ్చు. ఢిల్లీ నగరంలో పరిశుభ్రమైన వాయువు దొరకక ఆక్సిజన్ కొరవడి వాయు కాలుష్యం ఏర్పడుతున్నది. ప్రతి సంవత్సరం అనేక రోజులపాటు ఈ రకంగా ముఖ్యంగా ఢిల్లీలో గమనించినట్లయితే కారణాలు పరిశీలిస్తే పంజాబ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో పండించిన పంట కొయ్య కాలును కాల్చడం వలన పొగ ఆకాశంలోకి చేరి గాలిలో కలిసిపోయి ఆ ప్రాంతమంతా ముఖ్యంగా ఢిల్లీ నగరాన్ని అద్వాన స్థితిలోకి నెట్టుతున్న విషయాన్ని ఇప్పటికీ పాలకులు ప్రజలు రైతులు ఆలోచించకపోతే ఇంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు . వాస్తవంగా నరకాసురుని చంపిన సందర్భంలో దీపాలు వెలిగించి పండుగ నిర్వహించుకున్నారు కానీ టపాసులు పేల్చిన దాఖలాలు గాని ఆ ప్రస్తావన కానీ ఎక్కడ కనిపించదు. అసలు దీపావళి అంటేనే దీపాల వరస అనే నిర్వచనం ఉన్నది కనుక దీపాలను వెలిగించుకోవడం ద్వారా చీకటిని తరిమేసి వెలుతురును ప్రసరింప చేయడం ద్వారా అది విజ్ఞానానికి, చురుకుదనానికి, పురోగతికి, మార్పుకు , అంతిమంగా అసమానతలు లేని సమసమాజ స్థాపనకు ఒక దిక్సూచిగా భావిస్తే తప్పులేదు . శివకాశి తో పాటు టపాసులను తయారు చేస్తున్న అనేక సంస్థలు నగరాలలో నిల్వ ఉంచినప్పుడు, తయారు చేస్తున్నప్పుడు అందులో పని చేస్తున్నటువంటి ముఖ్యంగా బాల కార్మికులు వేలాది మంది మృత్యువాత పడుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రమాద భరితమైన పేలుడు లక్షణం కలిగినటువంటి ఈ భాన సంచాను రవాణా చేస్తున్నప్పుడు, కొనుగోలు చేసి ఇంటికి తీసుకుపోతున్నప్పుడు, నిలువ ఉంచినప్పుడు, ఇతర వాహనాలకు తగిలి ఘర్షణ జరిగినప్పుడు కూడా పేలుడు వలన వేలాదిమంది మృత్యువాత పడడాన్ని గమనిస్తే ఈ పని ఎంత మూర్ఖత్వము పర్యావరణానికి ఎంత నష్టమో ఆలోచించలేని పాలకులున్న ఈ దేశంలో తయారీ సంస్థలకు అనుమతి ఇస్తూనే ఉంటారు సామాజిక బాధ్యతను విస్మరిస్తూనే ఉంటారు.
టపాసులతో ప్రమాదాలలో వేలాదిమంది చనిపోవడం వాటిని కాల్చడం వలన గాలి కాలుష్యం పర్యావరణం అంతా కలుషితం కావడం నిరర్థకమైన ఉత్పత్తిని పెంచడం వలన ఎవరికి ఉపాధి కలిగించకపోగా పండుగ పూట పలు కుటుంబాలలొవిషాధాన్ని నింపుతున్నది నిజం కాదా? కొనుగోలు చేయలేని గడ్డు పరిస్థితుల మధ్యన నలిగిపోయే వాళ్లను కూడా గమనించినప్పుడు ఎవరికి దోహదపడని ఈ పండుగను పూలతో, మామిడాకులతో, పంట దినుసులతో, దీపాలతో పరస్పరం ప్రజల అనురాగం అభిమానాలతో భిన్న మతాల కలయికతో ఆనందాన్ని పంచు కుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఉమ్మడి పర్యావరణాన్ని నాశనం చేసే అధికారం మనకు ఎవరిచ్చారు. ఈ సందర్భంలో తయారీ సంస్థలతోపాటు ఆ పారిశ్రామికవేత్తలకు అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వాలను కూడా బోనులో నిలబెట్టినప్పుడు మాత్రమే పర్యావరణాన్ని నాశనం చేసే వారికి తగిన శిక్ష పడుతుంది వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అనేక కుటుంబాలు అప్పుల పాలై వీధిన పడే ఆస్కారం కూడా లేకపోలేదు . ఇది ఒకరిని మరొకరు అనుకరించడం ద్వారా సంపదను వృధా చేయడమే తప్ప సాధించేది ఏమీ లేదు పైగా ప్రశాంతంగా నిర్మలంగా ఆరోగ్యంగా ఉన్న వాతావరణాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం అంటే కొరివితో తల గోక్కో వడమే అవుతుంది. ఈ టపాసులను అమ్మే దుకాణా దారులు ఈ వ్యాపారానికి బదులుగా ఇతర వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ ఇది బ్రతుకుదె రువుగా భావించి అమ్మకాలను ప్రారంభిస్తే ప్రమాదము జరుగుతే మొదటికే మోసం అన్న సోయి ఉంటే మంచిది . సుమారు మూడు నాలుగు రోజులపాటు ధ్వని కాలుష్యం వాతావరణ కాలుష్యం తీవ్రమైన శబ్దాలతో అనారోగ్యం కూడా ఏర్పడే అవకాశం ఉన్నటువంటి ఈ టపాసులు బాణసంచా కాల్చే విధానాన్ని ప్రభుత్వం నిషేధించి సామాజిక రాజకీయ బాధ్యతను నిర్వహిస్తే బాగుంటుంది. లేకపోతే పాలకులు ప్రజా క్షేత్రంలో దొ షిగా నిలబడవలసి వస్తుంది. రాజకీయపార్టీలు ఈ మధ్యన టపాసులు కాల్చడం రివాజుగా మారింది వెంటనే నిషేధించాలి. ముఖ్యంగా పంటలు చేతికి వచ్చే సందర్భంలో ఈ పండుగ వస్తుంది కానీ ఇటీవలి కాలంలో అకాల వర్షాలతో పంటలు తడిసి వరదల్లో కొట్టుకపోయిన దౌర్భాగ్య పరిస్థితుల మధ్యన రైతులు ఏ రకంగా సంతోషంగా గడపగలరు ఒక్కసారి మనం ఆలోచించాలి. వాళ్లకు మన స్నేహ హస్తాన్ని అందించాలంటే ఆత్మీయతను భరోసాను పంచాలి ప్రభుత్వం కూడా ఆ వైపుగా సహకరించాలి సంతోషానికి టపాసులు బాణసంచాకు ప్రత్యామ్నాయంగా పూలు ఆకులు కాయలు పండ్లు దీపాలు ఆత్మీయతలనీ నిర్వచించుకున్నట్లయితే నిజమైన దీపావళినీ ప్రజలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఒకరిని చూసి మరొకరు అనుకరణ ధోరణిలో అఘాయిత్యాలకు అడ్డదారులకు అక్రమ బాణసంచాను కాల్చడానికి ఇండ్లను కూల్చడానికి అలవాటు పడిన వాళ్లను క్రమంగా మన దారిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. వినాయక దుర్గాదేవి నిమజ్జనాల సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను జలాశయాలలో నిమజ్జనం చేసి ఇప్పటికే ప్రకృతికి స్వచ్ఛమైన నీటికి ద్రోహం చేస్తున్నాము బాణసంచా కాల్చడం కూడా అంతకు మించిన పెద్ద ద్రోహం . మానవత్వం ఉన్న మనుషులమైతే ఈ తప్పులను సవరించుకుందాం ఏమంటారు?
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)