తెలుగు రాష్ట్రాలలో మంచానబడ్డ ప్రజారోగ్యం

Sep 24, 2024 - 17:09
Nov 12, 2024 - 08:42
 0  18
తెలుగు రాష్ట్రాలలో మంచానబడ్డ ప్రజారోగ్యం

పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణ లో వైఫల్యం  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స అందక  రోగాలతో అప్పుల బారిన పడాల్సిందేనా?

వైద్య సేవలను ముమ్మరం చేయడం,  ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరిస్తేనే  

విష జ్వరాల అదుపు సాధ్యం.

వడ్డేపల్లి మల్లేశం

వరదలు  వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కావడం  నీ టి నిలువ పారిశుద్ధ్య లోపం దోమల బెడద  వంటి అనేక కారణాల వలన  ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో  విష జ్వరాల బారిన పడుతున్న వాళ్లు వేలల్లో  ఉంటే  ఎందరో గర్భిణులు  పిల్లలు  అన్ని వయస్సులవారు కూడా మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం.  .ఆగస్టు చివర్లో సెప్టెంబర్ మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు  ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ  పారిశుద్ధ్య వాతావరణం సన్నగిల్లి  మరింత  రోగాల బారిన పడడానికి  కారణమైనప్పటికీ  ముఖ్యంగా వర్షాకాలంలో ఈ బెడదను ఉద్దేశించి  ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా  వైద్యశాలలో మెరుగైన పరిస్థితులను కల్పించి అన్ని మందులను అందుబాటులో ఉంచవలసివుండగా  పేద వర్గాలకు అందకపోవడంతో అనివార్యంగా ప్రైవేటు ఆసుపత్రిలో చేరి  వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని  అప్పుల పాలవుతున్న విషయం కూడా  పరోక్షంగా పాలకుల వైపల్యమే. వర్షాలు పడినా పడకపోయినా పారిశుధ్య నిర్వహణ దోమల నివారణలో యంత్రాంగం నిరంతరం జాగరూ గత వహించవలసి ఉంటుంది  .ఫాగింగ్ మిషన్లు నామ మాత్రం  కాగా ,  దోమల నివారణకు సంబంధించి ఎలాంటి  మందులు స్ప్రే చేయకపోవడం,  మురుగు కాలువల పరిశుద్ధ  పనులు మందకొడిగా సాగడం,  వర్షాల వల్ల చిత్తడి నేలలు మరింత  చెత్తాచెదారం తో విషపూరితంగా మారడంతో  పరిసరాల్లో జీవించే ప్రజలకు  విష జ్వరాలు మరింత  ఆందోళన కలిగిస్తున్నాయి.

 ముఖ్యంగా డెంగ్యూ  విష జ్వరాలు  చికెన్ గున్యా  అనేక రూపాలలో  ఆ న్ని వయసుల వారిని  భయకంపితులను చేస్తున్న విషయాన్ని గత రెండు మూడు నెలలుగా మనం గమనించవచ్చు . విద్యార్థులు, బాలబాలికలు, వృద్ధులతో పాటు ఏ వయసులో వారిని వదలకుండా కాటేస్తున్న విషయాన్ని  పాలకులు తగు జాగ్రత్తగా గమనించి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా  తమ సామాజిక బాధ్యతను నిర్వహించాలి.  ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణ రాష్ట్రంలోని  అనేక ప్రాంతాలలో  మలేరియా  ఇతర జ్వరాల కేసులు వేల సంఖ్యలో నమోదైనట్టుగా పత్రికలు సంపాదకీయాల ద్వారా తెలుస్తున్నది.  దృష్టికి వచ్చినవి కాకుండా నమోదుకానివి అనేక  మందికి  సోకుతున్నటువంటి జ్వ రాల సంఖ్యకు ఇక అంతే లేకపోవచ్చు . స్థానికంగా ఉండే ఆసుపత్రుల్లో వైద్య సహకారం అందకపోవడం,  మందులు సిబ్బంది అందుబాటులో లేక అరకొర సౌకర్యాల కారణంగా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటే  వేల రూపాయలను కోల్పోవాల్సి వస్తున్నదని అనేక పేద వర్గాలు వాపోతున్న విషయం కూడా  ప్రభుత్వాలు గమనించాలి.   డెంగీ వ్యాధుల తీవ్రత పెచ్చుమీరడంతో  ప్లేట్ లేట్ కొ రత కూడా  తీవ్రమై ఆందోళన గురి చేస్తున్నట్టుగా తెలుస్తున్నది . ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చిన్నాచితక  పల్లెటూరి  డాక్టర్ల దగ్గర కూడా  జనం రోగాల బారిన పడి  చికిత్స పొందుతున్న సందర్భంగా జాతరను తలపిస్తున్నట్టుగా  తెలుస్తుంటే  ముఖ్యంగా పేద వర్గాలకు  ఈ పరిస్థితి ఆందోళన కలిగించే విషయం  .ఇక ఇటీవల వర్షాలు వరదలు  కారణంగా కూడా  ఆహారము త్రాగునీ రు కలుషితం కావడంతో  టైఫాయిడ్, మలేరియా, డయేరియా  వంటి అనేక వ్యాధులు ఒకదాని తర్వాత మరొకటి స్వారీ చేస్తున్నాయి  ఇలాంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో అధికార  యంత్రాంగము ముఖ్యంగా వైద్య సిబ్బంది  తోచిన మేర కృషి చేస్తున్నప్పటికీ వారికి అందుబాటులో ఉంచాల్సినటువంటి ముడి సరుకులు వైద్య సౌకర్యాలు  మందులు  బ్లీచింగ్ పౌడర్ ఫాగింగ్ మిషన్స్  ఇతరత్రా కట్టడి చేసే ఔషధాలను అందుబాటులో ఉంచకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా మనం భావించాలి.  ప్రభుత్వాలకు తెలుసు ముందు జాగ్రత్తగా  ఇలాంటి సీజనల్ వ్యాధులను అదుపు చేయవలసి ఉంటుందని అందుకు సంబంధించి ముందుగానే అన్నింటిని సమకూర్చుకోవాల్సినది పోయి  నిండా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేకపోగా ప్రభుత్వాలు అప్రతిష్ట పాలు కాకుండా తప్పడం లేదు.  కనీసం గ్రామీణ ప్రాంతాలలో గ్రామపంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కూడా అందుబాటులో లేదని గ్రామ  పంచాయతీలు మున్సిపాలిటీలకు నిధులు లేకపోవడం కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అధికార యంత్రాంగం  వాపోతుంటే ఈ నేరాన్ని ఎవరిపైన  వేయాలో అర్థం కాని పరిస్థితి .

కఠిన చర్యలు తప్పనిసరి :- అల్పపీడనం కారణంగా ఇటీవలి వరదలు వర్షాలకు  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో యంత్రాంగం ముమ్మరంగా కృషి చేసినప్పటికీ ఆ కృషి ఆరోగ్యరీత్యా సరిపోవటం లేదు . స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులు, ఇతర అధికార యంత్రాంగం కూడా వరదల్లో  సహాయక చర్యలను  చేసినట్లుగా మన ఇటీవలి కాలంలో  ప్రత్యక్షంగా గమనించి ఉన్నాం . అయితే తాగునీరు అందుబాటులో లేకపోవడం,  ఆహార పదార్థాలు కలుషితం కావడం ,జ నావాసాలు ముంపుకు గురి కావడంతో అనివార్య పరిస్థితి లోపల  సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడంతో వాళ్లకు అవసరమైనటువంటి  నిత్యవసరాలు సకాలంలో అందుబాటులోకి రాకపోవడం కూడా  ఈ రోగాలు  ఎక్కువగావడానికి కారణం అవుతున్నది.  నిధులు లేక స్థానిక సంస్థలు,  నిధులు మంజూరు చేయక ప్రభుత్వాలు,  వైద్య సౌకర్యాలు మందులు లేక ఆసుపత్రులు,  సిబ్బంది ఉన్నా  ఏమి చేయలేని పరిస్థితి ఒక దగ్గర ఉంటే  అనేక చోట్ల తగిన సిబ్బంది నిపుణులు లేకపోవడంతో  వైద్యులు లేరని  రోగులను ఇతర ప్రాంతాలకు పంపించడం కూడా మనం కల్లారా చూస్తున్నాం ఇది ప్రభుత్వ వైఫల్యం కాథా?  ఇలాంటి పరిస్థితిలో  ప్రభుత్వాలు  వైద్య సౌకర్యాలను ముమ్మరం చేయాలి,  వైద్య సేవలను  ఇంటింటికి విస్తరింప చేయాలి,  నిపుణులైన వైద్య సిబ్బందిని నియమించడం ద్వారా మందులు ఇతర సామాగ్రికి ఔషధాలకు  బ్లీచింగ్ పౌడర్ తదితర క్రిమిసంహారక మందులకు కొరత లేకుండా అందుబాటులో ఉంచి  సరఫరా చేయాలి .  జనావాస ప్రాంతాలలో చెత్త కుప్పలు  పేరుకుపోయి  దోమలు ఈగలు విషక్రీములు  రోగాలకు కారణమవుతుంటే  ఆ చెత్త కుప్పల ను తొలగించే చర్యలు వెంటనే  తీసుకోవడం ద్వారా  నీటి కాలువలను శుభ్రం చేయడం ఔషధాలను  స్ప్రే చేయడం పాగింగ్  మిషన్ల ద్వారా  పొగ వదిలి  క్రిమి కీటకాలను  నశింప చేయడం కూడా వెంట వెంటనే నిరంతరం జరగాలి . ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం లేదని  డాక్టర్లు, మందులు  లేరని ఉద్దేశంతో అనేక మంది రోగులు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం పట్టణాలకు ప్రైవేటు ఆసుపత్రులకు తరలి వెళుతున్న చోద్యాన్ని మనం గమనించినప్పుడు  ప్రభుత్వాలు చేయవలసిన చోట ఖర్చు చేయకపోవడం, ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇవ్వకపోవడం, ప్రజల ప్రాణాలను  రాజకీయాలకు బలిపెట్టడాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు.  ప్రజారోగ్యం పడకేస్తే  ప్రభుత్వాలు కూడా  పడకేసే కాలం వస్తది.  ఆ పరిస్థితులు  రాకముందే  నిపుణులతో సంప్రదించి  సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలను ముమ్మరం చేయడం ద్వారా ప్రత్యేక కమిటీల ద్వారా  పరిష్కారాన్ని చూపవలసిన బాధ్యత ప్రభుత్వాలది.  ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అఖిలపక్షాలు కూడా ప్రభుత్వాల  నిస్సహాయ స్థితిని  ప్రశ్నించడం ద్వారా  పాలకులలో  నిద్దుర మత్తును తొలగించాలి.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ  రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333