మహిళా... ఓ మహిళా....!!

Mar 8, 2024 - 19:33
Mar 10, 2024 - 03:40
 0  3
మహిళా... ఓ మహిళా....!!

ఏడాదికోమారు అట్టహాసంగా పాలకులు జరిపే మహిళా దినోత్సవాలు నీదరిచేరవు

భారత రాజ్యాంగం కల్పించిన మహిళా హక్కులు నీ పట్ల అమలు కావు

ఆకాశంలో, అవనిలో సగం కాదుగాని ఇంకోమాట చెప్పుకుందాం

గనిలో, పనిలో, సమస్త వృత్తులందు నీ భాగస్వామ్యం తప్పనిసరి, శ్రమదోపిడి నీకు తప్పనిది

ఆయనతోబాటు నీవు పనికెళ్లాలి

అయితే ఇంటికొచ్చాక పిల్లాడికి పాలుపట్టాలి,
కుటుంబానికి ఇష్టమైనవి ఒండి పెట్టాలి, తిన్నాక మిగిలితే తిని పండాలి, లేదంటే
పస్తులుండాలి

తెల్లారి పనికిమాత్రం ఎగనామం పెట్టొద్దు

నాట్లు వేయడం, కలుపుతీయం, కోత కోయడం, సమస్త వ్యవసాయపనులో నీపాత్ర తప్పనిసరి

సుతారిపని, ఇటుకల తయారీ, పరిశ్రమలలో పని మీకు రోజువారి జీవితంలో రోటిన్

అంతస్థుల్లో, అద్దాలమాటున ఉండే ఆధునిక మహిళలు నిన్ను ఆదుకోరు

వారికి సంతానం కావాల్సివస్తే సరోగసీలుంటాయి, టెస్ట్యూబ్ బేబీలుంటారు, ఆయాలు, పాలడబ్బాలు, బ్యూటీపార్లర్లు ఆధునికస్త్రీ జీవితంలో నేడు కామన్

 ఎటోచ్చి కష్టాలన్నీ కడగొట్టు మహిళలకే

స్త్రీస్వామ్య వ్యవస్థ నుంచి పితృస్వామ్య సమాజందాకా నేటి ప్రజాస్వామ్యం దాకా వివక్షకు గురౌతుంది బడుగు, బలహీనవర్గాల స్త్రీలేనన్నది అంగీకరించాల్సిన సత్యం

సమ్మక్క సారక్కలనుంచి చాకలి ఐలమ్మలదాకా బడుగు మహిళల జీవితమంతా
పోరాటాల చరిత్రే

మగాడి ఆదిపత్యబావజాలానికి బలౌతుంది మహిళలే

రిజర్వేషన్లు ఇచ్చి ప్రజాప్రతినిధులుగా చేసినా పెత్తనం మొగుళ్ళదే కదా

స్త్రీతత్వం, వ్యక్తిత్వం మనువుబావాజాలానికి బద్దలౌతుంది

ఇన్నేళ్ళ స్వర్ణోత్సవ భారతావనిలో ఆడదాని స్థితి, పరిస్థితి నానాటికీ చీకినసాప, చినిగినబొంతయ్యింది

 శ్రమనీది, పేరు మగాడిది

కష్టం నీది, ఇష్టం ఆయనది

జీవితంలో సమిధలు మీరు,
ఫలితం పురుషపుంగవులకు

 మీకు చట్టాలెన్నినున్నా చట్టబండలవుతున్నాయి

మీ కోసం చట్టాలు చేసేది మగాళ్ళు, వాటిని అమలు చేయాలన్నా మగాళ్ళు

బయట ఆడది కనిపిస్తే మాత్రం మృగాళ్ళు

అడుగు బయటపెట్టిన ఆడపడుచు
ఇంటికి క్షేమంగా చేరుతుందా అన్న సంకటం కన్నవారిపాలిట గుదిబండగా
మారుతుంది

రోజురోజుకు సమాజం కామాంధుల రాజ్యంగా మారుతుంది

ఆడవారిపై అకృత్యాలు, ఆగడాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, గొంతులు
నులిమేస్తారు, లేదంటే కాలబెడతారు, పూడ్చిపెడతారు


ఇదీ నేటి ఆధునిక మగాళ్ళ రాజ్యం

 చెయ్యెత్తావా, నోరు పెగిలిందా, ప్రాణం గోవిందా

జోగినివ్యవస్థ ఇంకా జోరుగానే ఉంది

జోగిని, బసివిని, దాసిని పేరేదైనా ఊరందరికి, ఉన్నవాళ్ళకి,
కలిగినోళ్ళకి ఉంపుడుగత్తెలు పేదింటి స్త్రీలేకదా

దేవుడు రమిస్తాడని చెప్పే అబద్దాలు
ఊరి పాలికాపులకు, భూస్వాములకు నీశరీరంతోనే అవసరం

మాతంగులు, చిందులు అందాలను ఆరగించే కామాంధులకు అప్పుడు ఏ కులం, మతం
అడ్డురాదు

మనువు పేదస్త్రీల మానంతో ఇంకా ఆటలాడుకుంటున్నాడు

రంగం చెప్పాలంటే అంగాంగం ఆడించాల్సిందే

ఎక్కడున్నాం మనం, ఎటుపోతుందీ
సమాజం

అలిశెట్టిప్రభాకర్ ఆనాడే చెప్పినట్టు ఒకరికి పుండై, మరొకరికి పండై, ఒకరికి శవమై, మరొకరికి వశమై బతకడానికి అంగట్లో శరీరాన్ని బలిపెట్టే
అభాగ్యజీవులు ఎందరో... ఇంకెందరో..

ఇంకెనాళ్ళకు వస్తుంది మార్పు, మనిషి
ఆలోచనలో, మగాడి ఆవేశంలో

మనిషిని మనిషిగా చూసే సమస్త మానవాళిలో
మార్పు ఎప్పుడొస్తుందో

స్త్రీ, పురుషడనే వివక్ష అంతమయ్యే రోజు ఇంకెన్నాళ్ళు మహిళా దినోత్సవాలు జరుపుకుంటే వస్తుందో కదా

యత్రనార్యంతు.... అంటూ స్త్రీలను పూజించే రోజు కాదు కావాల్సింది, పూజల మాటున స్త్రీ ఉనికే లేకుండా చేసే బ్రూణహత్యలను ఆపకుండా సాధ్యమెలా అవుతుంది

ఆడపిల్ల పుడితే పురిట్లోనే చంపేసే రోజులు, అమ్మేసే రోజులకు అంతం లేదా

స్త్రీవ్యాపారవస్తువుగా కాకుండా తోటి మనిషిగా, సాటి మహిళగా మానవజాతికి జన్మనిచ్చి ప్రాణంపోసే తల్లిగా, చెల్లిగా చూద్దాం

వివక్ష, అంతరాలు లేని సమాజం కోసం కృషి చేద్దాం

✍️ రచన
డాక్టర్ బంటు కృష్ణ, గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత, సామాజిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు, విమర్శకులు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333