ఓదార్పులు నిట్టూర్పులతో  అఘాయిత్యాలకు అంతం లేదా? అంటే ఎలా?  

Nov 1, 2024 - 19:07
Nov 7, 2024 - 20:25
 0  4
ఓదార్పులు నిట్టూర్పులతో  అఘాయిత్యాలకు అంతం లేదా? అంటే ఎలా?  

అగంతకుల  అంతు చూస్తేనే  లైంగిక దాడులు అత్యాచారాలు, హత్యలకు అంతం  మూలాలను కూకటి వేళ్లతో   పెకిలించాలి.

 డ్రగ్స్,  టీవీ ప్రసారాలు, సినిమాలు, సెల్ ఫోన్ అశ్లీల దృశ్యాలను  ప్రభుత్వాలు నిషేధించాలి.

---  వడ్డేపల్లి మల్లేశం

మహిళల పట్ల జరుగుతున్న  లైంగిక దాడులు, వేధింపులు, నేరాలు-ఘోరాలకు  అంతం లేదా అంటూ నిట్టూర్పులు ఓదార్పులతో  విసిగిపోతే ప్రయోజనం ఏమున్నది? . మూలాలను అలాగే ఉంచి  పై పైన ఆలోచించి  వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా  కారణాలను అన్వేషించి దృష్టికి వచ్చిన  వాటి జోలికి పోకుండా  పెట్టుబడిదారీ వ్యవస్థను  ప్రైవేటు  క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యం మత్తు పదార్థాలను కొనసాగిస్తూనే  ప్రభుత్వం చూసి చూడనట్లు ఊరుకుంటే    ప్రజలు ప్రజాస్వామిక వాదులు మహిళలు మహిళా సంఘాలు  ఇంకా వేల సంవత్సరాలు   ఈ నిట్టూర్పు  విడిచినా ప్రయోజనం శూన్యం.  వ్యవస్థ మారాలని,  నైతిక విలువలు పునరుద్ధరించబడాలని,  మహిళలు  సాధికారతగా  జీవించాలనే  ఆలోచన ప్రభుత్వాలకు లేనంత కాలం  మహిళ పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంటుంది మృగాల రాజ్యం  నడుస్తూనే ఉంటుంది . అయితే ఇది  శాశ్వతం మాత్రం కాదు.  ఆ గంతకుల దాడులను  ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని  అడ్డుకునే రోజు వస్తుందనేది  నిజం.  ఆ ప్రవాహంలో ప్రజా ఉద్యమాలలో  పాలకులతో సహా అందరూ కొట్టుకొని పోవడం  వాస్తవము కూడా ..
      కార్యాలయాలు, పనిచేసే  చోట,  నిర్మాణాలు, వ్యవసాయం , ఆటవిక ప్రాంతాలలో,  ఇతర పనులు  లో నిమగ్నమైన ప్రతి చోట  స్త్రీలు పురుషులతో వేధింపులకు  గురవుతూనే ఉన్నారు . మనసు కలిసిన  కలవకపోయినా బలవంతంగా నైనా అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేని మృగాళ్ళు  బలాత్కార్యానికి పాల్పడి  వ్యతిరేకిస్తే చంపడానికైనా వెనకాడడం లేదు . ఈ రకంగా ఎన్నో  మహిళా లేత మొగ్గలు చిదిమి వేయబడుతున్నాయి.  ఒక సంఘటన జరిగితే దానిమీద  దర్యాప్తు  అరెస్టులు  విచారణ జరుగుతుండగానే మరొకచోట  ఇదే అలజడి ఇదే సంఘటన.   దిశా చట్టం ఏర్పాటుకు కారణమైన  అత్యాచారం హత్య  ఆ తర్వాత దుండగుల ఎన్కౌంటర్  చక చకా సాగిపోయినప్పటికీ  ఆ తర్వాత కూడా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.  పసిపాపల నుండి పండు ముదుసలి వరకు  ఈ దౌర్జన్యాలు  కొనసాగుతుంటే  పాఠశాలలో కళాశాలల్లో  సిబ్బంది  తోటి విద్యార్థులతో  జరిగినటువంటి లైంగిక దాడులు  సమాజాన్ని కలచివేస్తున్నాయి .  ఐదవ తరగతి నుండి ఆపై విద్యార్థులు కూడా  ఇలాంటి సామూహిక కార్యక్రమాలలో పాల్గొనడం  ఏ రకంగా సాధ్యమవుతుంది? దీనికి ప్రేరణ ఏమిటి? అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. 
       మహిళలపై దాడులకు అంతం లేదా? :-
**********
సామాన్యుల నుండి అసమాన్యుల వరకు  మహిళా లోకం తో పాటు  సమాజం కూడా  ఆందోళనకు గురై ఆశ్చర్యంతో  ఆవేదనతో  ఈ దాడులు ఇలాగే కొనసాగవలసిందేనా? వీటికి అంతం లేదా ?అని  సర్వత్రా మాట్లాడుకోవడం  ఒక సవాల్ గా మారింది.  సంఘటన జరిగిన తర్వాత  పూర్వాపరాల పరిశీలన కోసం  కొంత కాలాయాపన , రాజకీయ జోక్యంతో మరికొంత కాలయాపన,  అరెస్టు సందర్భంలో అనేక ఆటంకాలు ఇబ్బందులు , అంతిమంగా అరెస్టు చేసినా అనేక  సవాళ్ల మధ్యన   కోర్టు  దోషి అని తేల్చడానికి  సంవత్సరాలు పడుతున్నది.  ఆ కేసుకు సంబంధించి ఆత్రుత తగ్గిన తర్వాత  కేసు యొక్క పూర్వాపరాలు కూడా సమాజానికి తెలియకుండా పోతున్నది  ఇది  అత్యంత దయనీయ స్థితి.  ప్రభుత్వాలు, పోలీసులు, న్యాయవ్యవస్థ, అధికార యంత్రాంగం  ఇలాంటి వాళ్ల పట్ల చాలా కఠినంగా వ్యవహరించి  ప్రత్యేక కోర్టు ద్వారా తక్షణమే  నిగ్గు తేల్చకపోతే  ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి . ఈ సందర్భంలో శిక్ష మాత్రమే పరిష్కారం కాదు పరివర్తన ముఖ్యమని చెప్పేవాళ్లు మరి కొందరు  కానీ  అత్యాచారంతోపాటు హత్య చేసినటువంటి దుండగుణికి  అంతే స్థాయి శిక్షను అమలు చేయకపోతే  సిగ్గులేని ఈ సమాజానికి  గుణపాఠం ఎలా వస్తుంది?  బాధితుల కన్నీటికి  పరిష్కారం ఎలా దొరుకుతుంది  ?ప్రభుత్వాలు  మహిళల  ఆత్మగౌరవాన్ని బాధ్యతగా  గుర్తించక పోతే  మహిళా ప్రజా పోరాటాలు  ఉధృతం చేసి పాలకవర్గాల కళ్ళు తెరిపించాలి  .ముఖ్యంగా పేదలు, అభాగ్యులు, ఆదివాసీలు, అట్టడుగు వర్గాలు , యాచకులు , మతిస్థిమితం లేని వాళ్ళతో పాటు  అన్ని రకాల స్త్రీలు కూడా  ఈ దాడులకు పాల్పడుతుంటే    కారణం పేదరికం అని సామాజిక స్పృహ పాలకులకు ఉండాలి కదా ! ఆశ జూపి లోబరుచుకుని, పరిచయాన్ని పెంచుకొని, ప్రేమ పెళ్లి అనే మాటలతో  కల్లబొల్లి కబుర్లతో   సాన్నీహిత్యం పెంచుకున్నప్పుడు  మహిళలు కూడా  ఆలోచించకుండా పరిణామాలను ఊహించకుండా  తొందరపాటుకు గురి కావడం కూడా ఇందుకు ప్రధాన కారణమని మరిచిపోకూడదు . ఏది ఏమైనా నేరస్తులకు శిక్ష  మరణానికి మరణం  హత్యకు హత్య  సవాలుగా తీసుకున్నప్పుడు మాత్రమే  ఇలాంటి ఆగడాల కొంతవరకైనా అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
        బాధ్యత విస్మరిస్తున్న ప్రభుత్వాలు :-
*******
టీవీలలో సినిమాల్లో  చూపిస్తున్న సన్నివేశాలు,  స్త్రీని ఆట బొమ్మగా అంగడి సరుకుగా  అర్థనర్థంగా  ఒప్పించి  ప్రేక్షక లోకాన్ని అలరింపడ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను  ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు ప్రభుత్వాలు కూడా అలాంటి సినిమాలను నిషేధించాలి . సంస్కృతి సంప్రదాయాలను  శ్రీ జాతి గౌరవాన్ని కాపాడడానికి  సినిమాల పైన కొంత అదుపు ఆజ్ఞలు లేకపోతే ఎలా?  సెల్ ఫోన్లలో  దర్శనమిస్తున్నటువంటి అర్థనగ్న దృశ్యాలు  అశ్లీల సంభాషణలు చూపులు  అసభ్యకరమైనటువంటి  చిత్రాలు  పసి పిల్లలనుంచి  ముసలి వరకు  ఆలోచింప చేయడంతో పాటు ప్రేరణకు గురి చేయడం  తాత్కాలిక  ఆవేశాలతో  రెచ్చిపోయే విధంగా  మార్చడంలో  పోషిస్తున్న దుష్ట పాత్రను ఎందుకు ప్రభుత్వాలు నిషేధించడం లేదు?  వీటి పరిణామాలు పర్యవసానాలు  ప్రభుత్వాలకు అధికారులకు పోలీసులకు తెలియకనా?  ఈనాడు ప్రతి వ్యక్తి చేతిలో ఉంటున్న సెల్ఫోన్లు  రాజకీయ నాయకుల నుండి  పాఠశాలలో విద్యార్థి వరకు  ఇవే దృశ్యాలను చూస్తూ  పరధ్యానముతో పనులు చేస్తున్న వారిని  అడ్డుకోవడం కాదు  అదుపు చేయడాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తే  ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. అందుకు ప్రభుత్వాలు నైతిక బాధ్యత వహించవలసి ఉంటుంది.  ఇక మద్యం మత్తు పానీయాలు  డ్రగ్స్  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ల ద్వారా  ముఖ్యంగా యువత  పెడదారి పడుతూ     తాత్కాలిక  ప్రలోభాలకు గురై  జీవిత విలువలను ధ్వంసం చేసుకోవడంతో పాటు  కన్న తల్లిదండ్రులకు దూరమవుతూ కాటికి చేరుతున్న విషయాన్ని  మనం అనునిత్యం కల్లారా చూస్తూనే ఉన్నాం . వీటిని అంతం చేయాలన్నా , మహిళా లోకాన్ని గౌరవించాలన్న,  స్త్రీలకు రక్షణ కల్పించాలన్న  ఇలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు తల్లి, చెల్లి , అక్క, అమ్మ  అందరికీ స్త్రీలేననే  ఆలోచన రేకెత్తించడంతోపాటు  అడ్డదారులు తొక్కితే అదే చివరి రోజు అవుతుందని  ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన హెచ్చరిక మాదిరిగా  తల్లిదండ్రులు సమాజము పోలీసులు ప్రభుత్వాలు హెచ్చరించినప్పుడు మాత్రమే  ఇలాంటి ఆగడాలకు ముగింపు పలకవచ్చు.  స్త్రీల చైతన్యం,  సమాజం మద్దతు,  న్యాయ వ్యవస్థ  కొరడా జులిపించినప్పుడు మాత్రమే  కొ 0తవరకు అయినా వీటికి అడ్డుకట్ట వేయవచ్చు.  నిట్టూర్పులతో మాత్రం ఏదీ సాధ్యం కాదు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333