చదువును ఆయుధంగా చేసుకుంటే పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
చదువును ఆయుధంగా చేసుకుంటే పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా కష్టపడి చదవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, ఆరోగ్యం, భద్రత, మెరుగైన వసతులు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. గురువారం పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పాఠశాలకు చేరుకున్న ఆయన వంటగది, తరగతి గదులు, విద్యాబోధన, వసతులు, విద్యార్థుల సంక్షేమం, భోజన నాణ్యత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు
విద్యార్థులతో ముఖాముఖి
కలెక్టర్ 10 వ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థుల హాజరు శాతమును అడిగి తెలుసుకున్నారు విద్యార్థులను బాగున్నారా అని పలకరించి యూనిఫామ్, సిలబస్ గురించి అడిగి తెలుసుకున్నారు, హోంవర్క్ చేస్తున్నారా అని అడిగి ఇంగ్లీష్ హోమ్ వర్క్ ను, క్లాస్ వర్క్ ను పరిశీలించారు విద్యార్థులు హోంవర్క్ క్లాస్ వరకు మంచిగా చేయుట వలన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఇలాగే మంచిగా చదువుకోని స్కూలుకు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు.
భోజనం, వసతులు ఎలా ఉన్నాయని కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
క్రమశిక్షణతోనే లక్ష్యసాధన
చదువుతో పాటు క్రమశిక్షణ, బాధ్యత, వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారి లక్ష్యాలను చేరుకునేలా ఉపాధ్యాయులు నిరంతరం మార్గనిర్దేశం చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలో మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ రవీందర్ బాబు,ఉపాధ్యాయులు ఉపేందర్, నాగరాజు, రాజేశ్వరి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
-------------------------------
జారీ చేసిన వారు... జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యాపేట.