గ్రామాలు అభివృద్ధికి తమ వంతు కృషి
జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: ఇటిక్యాల . గ్రామాలలో స్వయం ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సృజన అన్నారు.మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంలోని ఎం.పి.డి.ఓ కార్యలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు మరియు రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ(పీఆర్) కమిషనర్ సృజన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాలు రాజ్యాంగానికి పునాది ఒంటివని, మన దేశ అభివృద్ధికి మూలాధారమని అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రతి గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన పనులను, పథకాలను, సాధించిన విజయాలను ఈ గ్రామ సభల ద్వారా ప్రజలకు వివరించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో రైతులు, ప్రజల అభివృద్ధి కోసం ఏ పని ఉపయోగకరమో దాన్ని గుర్తించి, అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేస్తాయని తెలిపారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పని చేస్తామని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం వర్మీ కాంపోస్టు గుంటలు, అజోలా గుంటలు, పొలం బాటలు, పశువుల కొట్టాలు, ఇంకుడు గుంటలు వంటి అనేక ఉపయోగకరమైన అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రాబోయే రోజులలో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితిని తగ్గించి, గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి,అమలు చేయడానికి పనిచేస్తామని అన్నారు. అంతకు ముందు మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన పశువుల కొట్టం ప్రారంభించి, తరువాత ఎం.పి.డి.ఓ కార్యాలయ ఆవరణంలో వర్మీ కాంపోస్టు గుంటను ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత సంవిధానము ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కాంతమ్మ, డిపిఓ శ్యామ్ సుందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎం.పి.డి.ఓ అజర్ మొహిముద్దీన్, పంచాయతీరాజ్ ఈ.ఈ దామోదర్ రావు, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.