ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పదాకాలను పొంది ఆర్దికంగా ఎదగాలి

– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

Mar 18, 2026 - 21:13
Mar 18, 2026 - 21:24
 0  1
ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పదాకాలను పొంది ఆర్దికంగా ఎదగాలి

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలపై నిరుద్యోగ యువతీ, యువకులకు

 ఎలక్ట్రానిక్ వాహనాలు, వ్యవసాయ పరికరాలు

ఈ నెల 24 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలి 

సూర్యాపేట, 19 మార్చి తెలంగాణవార్త ప్రతినిధి :- షెడ్యూల్‌ కులాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అండదండలు అందిస్తోందని, షెడ్యూల్‌ కులాల నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కల్పనకు 2025 – 26   ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలపై అందించే ఆర్దిక సాయాన్ని పొంది నిరుద్యోగ యువతీ, యువకులు ఆర్దికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ యువతకు సూచించారు. షెడ్యూల్ కులాల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ట్రాన్స్పోర్ట్, విద్యుత్, బ్యాంకర్స్ తో  కలెక్టర్ వెబ్ ఎక్స్ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ స్వయం ఉపాధి కల్పనకు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రాయితీలపై నిరుద్యోగ యువతీ, యువకులకు ఎలక్ట్రానిక్ వాహనాలు, వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు కార్యాచరణ ను ప్రకటించిందన్నారు. జిల్లాలోని ఎస్సీ యువతీ యువకులు స్వయం ఉపాధి పథకములకే దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ 2025 – 26  కార్యాచరణ పథకంలో భాగంగా ట్రాన్స్ పోర్ట్ రంగం కోసం 193 ఈవి ద్విచక్ర వాహనాలు కేటాయించిందని, ఈవీ టూవీలర్‌ యూనిట్‌ విలువ రూ.లక్ష కాగా, అందులో 90శాతం రాయితీ ఉంటుందని, 10 శాతం బ్యాంకు లోన్ ఉంటుందని తెలిపారు. అలాగే అదే విధంగా  95 త్రీవీలర్‌ యూనిట్‌ విలువ రూ.3లక్షలు కాగా, 80శాతం రాయితీ, సోలార్‌ యూనివర్సల్‌ కంట్రోల్‌ యూనిట్‌ విలువ రూ.3లక్షల నుంచి రూ.7లక్షలు కాగా, ఒక్కోదానికి 60శాతం రాయితీగా, 40 శాతం బ్యాంక్ లోన్ ఇవ్వనుందన్నారు.

ఆటోలతో పాటు వ్యవసాయ రంగంలో వినియోగించే  సోలార్‌ యూనివర్సల్‌ పంప్‌ కంట్రోల్‌ యూనిట్లు 20 మంజూరు చేయబడినవని,  యూనిట్ ధర రూ. 3 లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు  ఉండగా  60 శాతం సబ్సిడీ మరియు 40శాతం బ్యాంకు లోన్ ఉంటుందని అన్నారు.  శిక్షణా రంగంలో 77 వెజ్ ఎంప్లాయ్మెంట్ నైపుణ్యత అభివృద్ధి మరియు 19 సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ యూనిట్లు మంజూరు చేయబడినవి అని  ఈ రెండు పథకాలలో 100శాతం సబ్సిడీ ఇస్తుందని వివరించారు. వీటికి ఈనెల 24వ తేదీలోగా అర్హులైన షెడ్యూల్డ్‌ కులాల నిరుద్యోగ యువతీ, యువకులు https://tgobmms.cgg.gov.in//  వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రాయితీ పథకాలను రానున్న ఐదేళ్లలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మంజూరు చేస్తారని, స్వయం ఉపాధి పథకాన్ని మొదటి సారి వినియోగించుకుంటున్న కుటుంబంలోని వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. నైపుణ్యం, అనుభవం ఉన్న దరఖాస్తుదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తామనీ, జిల్లాకు కేటాయించిన ఈ యూనిట్లలో దివ్యాంగులకు 5శాతం, మహిళలకు 33.3శాతం ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఈవీ వాహనాలు, సోలార్‌ కంట్రోల్‌ యూనిట్లు రాయితీపై పొందేందుకు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు ఉండాలని, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలలోపు వార్షిక ఆదాయం ఉండాలని, రవాణా పథకాలకు 21 నుంచి 50 సంవత్సరాల వయసు, వ్యవసాయ ఆధారిత యూనిట్లకు 21- నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, రవాణా యూనిట్లకు శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌, రెండెకరాల వ్యవసాయ భూమి, బోరు బావి ఉన్నట్టు పంచాయతీ కార్యదర్శి తో ధ్రువీకరణ అందజేయాల న్నారు. ఆన్‌లైన్‌లో నమోదుచేసిన దరఖాస్తులను ఆర్జీదారుడు డౌన్‌లోడ్‌ చేసుకుని, సంబంధిత ధ్రువ పత్రాలను జత చేసి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం రూమ్ నెంబర్ ఎఫ్3 ఫస్ట్ ఫ్లోర్ కలెక్టర్ కార్యాలయంలో అందించాలన్నారు. ఈవీ ద్విచక్ర వాహనాల యూనిట్లను ఊబర్‌, రాపిడో, జొమాటో, స్విగ్గీ వంటి సేవలు అందిస్తున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని, లబ్ధిదారులను జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.

 కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, కార్యనిర్వాహక సంచాలకులు దయామణి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి జయప్రకాశ్ రెడ్డి ఎల్ డి ఎం ఎంవి ఎన్ ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏ డి అశోక్ వ్యవసాయ శాఖ నుండి ప్రణవి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333