ఏపీలో రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్ ..
ఏపీలో రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో నేటి (అక్టోబర్ 11) నుంచి నెల ఆఖరు వరకు పామోలిన్ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఒక్కో రేషన్ కార్డుపై 3 లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ చొప్పున నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ధరల నియంత్రణపై వారితో చర్చించారు. ఇండోనేసియా, మలేసియా, ఉక్రెయిన్ నుంచి దిగుమతులు తగ్గడంతో పాటు పన్నులు, ప్యాకేజి ఖర్చులు పెరగడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు మంత్రికి వివరించారు.