ఏటి ప్రవాహంతో ఏర్పడిన ఇసుక మేటలు

Oct 9, 2025 - 05:10
Oct 9, 2025 - 16:22
 0  2
ఏటి ప్రవాహంతో ఏర్పడిన ఇసుక మేటలు

బిక్కేరు వాగు మళ్లీ ప్రాణం పోసుకుంది.

ఇసుకతో నిండిన గుంతలు సాగు నీటి నిల్వలైయ్యాయి.

భూగర్భ జలాలతోపాటు.. తరలిపోయిన ఇసుక వచ్చి పడింది.

తిరుమలగిరి 09 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ : మండలం పరిధిలోని జానకిపురం,చిర్రగూడూరు, కోటమర్తి,ధర్మారం,లక్ష్మీదేవి కాల్వ గ్రామాల అనుసందానంగా ఉన్న బిక్కేరు వాగు ఇటీవలి వర్షాలతో మరోసారి జీవం పొందింది.ఇసుక అక్రమ రవాణా కారణంగా గుంతలుగా మారిన వాగు తీరాలు ఇప్పుడు మళ్లీ ఇసుకతో నిండిపోతూ ప్రకృతిసిద్ధంగా పునరుద్ధరించుకున్నాయి. ప్రవహించిన నీటి బలంతో తొలగిపోయిన రాళ్లు పక్కకు చేరి,లోతైన గుంతల్లో మళ్లీ ఇసుక పేరుకుపోవడం వాగుకు కొత్త శోభను తీసుకువచ్చింది. ఒకప్పుడు పాడుబడినట్టుగా కనిపించిన ఈ వాగు,ఇప్పుడు నీటి ప్రవాహంతో జలకళను సంతరించుకుని, రైతుల కళ్లలో ఆశాకిరణం నింపింది. భూగర్భజలాలు పెరగడంతో బిక్కేరు పరివాహక గ్రామాల రైతులు సాగునీటి సౌకర్యం పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాగు ప్రక్కన ఉన్న పొలాలు తడిసి ముద్దయి పంటలకు జీవం అందిస్తున్నాయి.  ప్రకృతిని కాపాడితేనే మనుగడ సజావుగా సాగుతుందన్నది ఈ దృశ్యం మరోసారి రుజువుచేసింది. వాగులలోని ఇసుకను అతి మితంగా తవ్వి ప్రకృతిసమతౌల్యాన్ని దెబ్బతీస్తే, అది మానవజాతి మనుగడకే ప్రమాదమని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. “ప్రకృతిని దోచుకుంటే విధ్వంసం తప్పదు, కాపాడితే వరం దొరుకుతుంది” అని వారు అభిప్రాయపడ్డారు.   బిక్కేరు వాగు ఈ పునరుజ్జీవనం స్థానికులకు ప్రేరణగా మారింది. ప్రకృతి స్వయంగా తనను తాను తిరిగి సవరించుకునే శక్తి కలదని మరోసారి చాటింది.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి