గత పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపడం ఎంత ముఖ్యమో
ప్రస్తుత కర్తవ్యాలను ప్రజల ముందు ఉంచడం అంతే ముఖ్యం
తాత్కాలిక ప్రలోభాలతో ప్రజల శాశ్వత జీవన ప్రమాణాలను కొలువలేము.
విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి ప్రపంచముతో పోటీ" అన్న పిలుపును నిజం చేసి తీరాలి.
----వడ్డేపల్లి మల్లేశం
ఒక ప్రభుత్వ హయాములో ప్రజా విశ్వాసాలకు ద్రోహం చేసి, ప్రజా సంపదను కొల్లగొట్టి , అక్రమార్జనకు వత్తాసు పలికి, ప్రజలను అప్పులపాలు చేసి , ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన సందర్భంలో రాబోయే ప్రభుత్వాలు ఎంత ఇబ్బందులకు గురైతాయో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదుర్కొంటున్న సందర్భాన్ని గమనిస్తే తెలుస్తుంది . 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాడు 64 వేల కోట్ల మిగులు బడ్జెట్తో పరిపాలనలోకి వచ్చిందని చెప్పినప్పటికీ 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరిగే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును మిగిల్చి
ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన బారాస ప్రభుత్వానికి తగిన శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది . ఒక ప్రభుత్వ హయాములో జరిగిన నష్టాలు చేసిన అప్పులను ఆ ప్రభుత్వమే తీర్చాలని నిబంధన గతంలో కొన్నిసార్లు వాట్సాప్ లో ప్రకటించబడిన పిలుపు నిజంగా ఆమోదయోగ్యమైతే బాగుండు. ఎందుకంటే తమ మనుగడ కోసం, ప్రజా సంపదను కూలదోయడానికి, అవకాశవాద ప్రభుత్వాలు పనిచేస్తాయని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అలాగే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు .2014లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి 50 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు తెలుస్తుంటే 10 ఏళ్ల తర్వాత రెండు టర్మలు పరిపాలించిన అనంతరం ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్ల అప్పును ఈ దేశ ప్రజల మీద రుద్దిన వాస్తవాలను ఎలా మర్చిపోగలం? ఇంతటి ప్రజా ద్రోహానికి తలపడుతున్న ఏ ప్రభుత్వానికైనా ప్రజలు శిక్ష విధించాల్సిందే. ఆ ప్రభుత్వమే అప్పులను థీర్చాలని నిబంధన విధించవలసినదే.
గత పాలకుల వైఫల్యాలను ఎత్తిచూపడం అవసరమే:-
*""*****
ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన నాడు గత పాలకుల యొక్క వైఫల్యాలను ప్రజలకు చేసిన ద్రోహాన్ని నేరాన్ని అవినీతిని ప్రజలకు విప్పి చెప్పడం ముఖ్యమే. అంతే స్థాయిలో తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి కొంత సమయాన్ని తీసుకోవడం ద్వారా ప్రజల ముందుకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తమ విజ్ఞతను వినయ విదేయ తలను ప్రకటించుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలలో గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం బాధ్యతాయుతమైనది తప్పనిసరి చేయాల్సిన పని .అదే సందర్భంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు వాగ్దానాలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రభుత్వ ప్రణాళికను కూడా ప్రజల ముందు ఉంచాలి. రైతు రుణమాఫీ, రైతుబంధు , ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రజలు రైతులు కార్మికులు, పెన్షన్దారులు అనుమానాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఈ అవకాశాన్ని విద్రోహ బా రాస పార్టీ అవకాశవాదంగా తీసుకొని ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పడం అవగాహన రాహిత్యమే కాదు తమ పరాభవాన్ని ఓటమిని అంగీకరించక మరింత ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అహంకారపూరితంగా వ్యవహరించడమే. ప్రజలే న్యాయనిర్ణేతలు కనుక ప్రతి ప్రభుత్వం యొక్క లోపాలను, వైఫల్యాలను, విద్రోహాన్ని తప్పక పరిశీలిస్తారు. ఆ క్రమంలోనే పదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని , ఉద్యమ పార్టీ అని చెప్పుకొని ,ప్రజల కోసమే పని చేస్తున్నామని ప్రగల్బాలు పలికి, కుటుంబ పాలనకు తెర తీసి, ఒకే కుటుంబముతో పాటు ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు నాయకులు క్రింది స్థాయి కార్యకర్తల వరకు కూడా దేశ సంపదను మూలుగలాగా పీల్చిన చరిత్ర అందరికీ తెలిసిందే. ఈ విద్రోహానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ప్రస్తుత ప్రభుత్వం హెచ్చరిక చేయడంతో పాటు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సమస్యలు, ప్రజల డిమాండ్లు, పాలకుల వైఫల్యాలను ప్రజా సమక్షంలో విపులీకరించడం ద్వారా ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని చూర గొ నడానికి అవకాశం ఉన్నదని అనేకమంది మేధావులు ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు చేసిన సూచన ప్రస్తుత ప్రభుత్వం తప్పక పాటించాలి .
గత ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ హామీలు ఇచ్చినారు కదా ఆ పథకాలను వెంటనే అమలు చేయాలి అని ప్రజలు ఒకవైపు ప్రశ్నిస్తుంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను పూర్తి చేస్తామని దుందుడుకుగా ఉడుకు రక్తంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన అనేక సమస్యలను పరిష్కరించే క్రమంలో భాగంగా ప్రజల ముందుకు వెళ్లి సమయం ఇవ్వమని అడిగి వాస్తవాలను విప్పి చెప్పి నప్పుడు గత ప్రభుత్వం యొక్క ద్రోహాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు. ప్రస్తుత ప్రభుత్వానికి తమ ఆశీస్సులు అందిస్తారు సహకరిస్తారు అని విజ్ఞులు చేస్తున్న సూచన కాంగ్రెస్ ప్రభుత్వం పాటిస్తే తమ ఉనికికే మేలు జరుగుతుంది.
" ఆర్థిక పరిస్థితి మొత్తం కొల్లగొట్టబడినది మేము ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా పరిష్కరిస్తాం, కొంత సమయం కావాలి ,గత పాలకుల అవినీతి కారణంగా రాష్ట్రం ఇబ్బందుల పాలైంది, రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది ,ఒకవైపు గత పాలకుల అవినీతిని విచారణ జరిపే పరిస్థితిలో ఉన్నాం మా పాలనకు మా ఆలోచనకు సహకరించండి" అని ప్రజలతో విజ్ఞప్తి చేస్తే తప్పకుండా ఆదరిస్తారు అని మేధావులు చేస్తున్న సూచన ప్రస్తుత ప్రభుత్వ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని ఆశించడంలో తప్పులేదు..
తాత్కాలిక ప్రలోభాలతో జీవన ప్రమాణాలను మెరుగుపరచలేము:-
*""""""*****
ఏ ప్రభుత్వానికైనా సోయి ఉండాలి. తాత్కాలిక ప్రలోభాలతో జీవన ప్రమాణాలను మెరుగుపరచలేము, కొనుగోలు శక్తిని పెంచలేము, పేదరికం నిర్మూలించలేము.
తమ స్వార్థం, మనుగడ, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రభుత్వాలు ఆలోచించే ఉచితాలు తాయి లాలు, పథకాలు, వాగ్దానాలు, హామీలు తాత్కాలికమే తప్ప శాశ్వతమైనటువంటి మార్పును సమాజంలో తీసుకురాలేవు అని ప్రతి ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. ఇదే సందర్భంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఏ రకంగా మోసపోయిందో గమనించి ఉన్నాము కనుక ప్రజల మద్దతును కూడగట్టి బారాస పాలకవర్గాల యొక్క ద్రోహాన్ని ప్రజలకు విప్పి చెప్పి అంతకుమించిన స్థాయిలో ప్రపంచంతో పోటీపడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగించవలసిన అవసరం ఉన్నది . అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకు వెళ్లే క్రమంలో గత లోటును సవరించుకుంటూ నే, రావలసిన పన్ను లను నిక్కచ్చిగా వసూలు చేస్తూనే, కేంద్రముతో సఖ్యత ద్వారా నిధులను రాబట్టుకొని రాష్ట్ర పురోగతికి తోడ్పడాలి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ,ఉద్యమకారులు, రాజనీతిజ్ఞులు ,విద్యావంతుల యొక్క మద్దతును పూర్తిగా సమీకరించి పాలనలో వైఫల్యాలు మచ్చుకైనా కానరాకుండా ఉద్యమ ప్రజాస్వామిక స్ఫూర్తిని, మానవ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పాలించవలసిన అవసరం ఉన్నది . ఈ క్రమములో పాలిస్తే విప్లవకారులు మేధావులు విప్లవ సంఘాలు ప్రజా సంఘాలు తప్పకుండా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయి. కానీ గత ప్రభుత్వం మేధావులను ఉపా కేస్తో ఇబ్బందుల గురి చేసిన విషయాలను గమనించి ఈ రాష్ట్రంలో ఆ చట్టాన్ని రద్దుచేసి పాలనలో వారి సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే అది ప్రజా పరిపాలన అవుతుంది. "ప్రపంచముతో పోటీ పడడం అంటే మానవ హక్కులను ప్రజాస్వామిక విలువలను కాపాడడమే" అని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తే మంచిది . ఆ పునాది పైన మాత్రమే ప్రజల యొక్క ఆకాంక్షలను, తెలంగాణ ఉద్యమకారుల యొక్క లక్ష సాధనను, ప్రజల జీవన ప్రమాణాలను, కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ప్రైవేట్ రంగానికి ప్రాముఖ్యత లేకుండా అన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగే ఒక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ప్రజలకు ఉచితంగా అందించగలిగినప్పుడు మాత్రమే ప్రజలు విశ్వసిస్తారు . ఆ కోణంలో ఆలోచించకపోతే బారాషా స్థానంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు త్రుణీకరిస్తారు అని పాలకవర్గాలు గుర్తిస్తే మంచిది . ముఖ్యంగా పట్టణాలలో హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ రంగంలో విద్య వైద్యము మచ్చుకైనా కనిపించదు. ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా ప్రభుత్వ రంగంలో విద్యను వైద్యాన్ని బలోపేతం చేసిన నాడు , సామాన్య ప్రజానీకానికి అవకాశాలు మెరుగై తమ పిల్లలకు తమ కుటుంబాలకు సౌకర్యాలను ఉచితంగా పొందగలిగిన నాడు, గత ప్రభుత్వముతో పోల్చుకొని ఈ ప్రభుత్వం నిజంగానే ప్రపంచంతో పోటీ పడిందని ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారు ,ఆలోచిస్తారు, ప్రచారం చేస్తారు, మద్దతిస్తారు . ప్రకృతి గుట్టల విధ్వంసాన్ని అరికట్టి, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించి, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే క్రమములో పబ్బులు క్లబ్బులు ఈవెంట్ లను పూర్తిగా నేలమట్టం చేసి, ప్రజా సంపదను కొల్లగొట్టే అక్రమార్కులు బూకబ్జాదారులను కటకటాల్లోకి తోసి, ప్రజా సంపదను ప్రజలందరికీ సమానంగా పంచగలిగితేనే ప్రపంచంతో పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి మాటకు సార్థకత ఉంటుంది. ప్రకటించడం ముఖ్యం కాదు దాని వెనుక ఉన్నటువంటి అంతరంగాన్ని ఆలోచించి ఐదు ఏళ్లలో సా కారం చేయడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలి. సవాలుగా తీసుకుంటేనే ప్రజలు సమర్థిస్తారు మద్దతిస్తారు లేకుంటే గత అక్రమ ప్రభుత్వంతో జతకట్టి మార్పు ఏమి లేదని నిట్టూర్పు విడుస్తారు. కొత్త ప్రభుత్వం ఏమి కోరుకుంటుందో అది పాలకులకే వదిలిపెడదాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )