ఎన్నికలవేళ బాధ్యతారాహిత్య ప్రసంగం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది
దీనికి ప్రధాని సహా ఎవరూ అతీతులు కారు .
ఇటీవల ప్రధాని, బిజెపి నాయకుల ఎన్నికల ప్రసంగాలు వివాదాస్పదం కావడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది
----వడ్డేపల్లి మల్లేశం
రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లు సందర్భం ఏదైనా మాట్లాడిన ప్రతి మాట పరిగణనలోకి తీసుకోబడుతుంది . ప్రతిపక్షాలు రాజ్యాంగబద్ధ సంస్థలు రికార్డు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది . ప్రధానమంత్రి మినహాయింపు కాకపోగా ఇటీవల రాజస్థాన్లోని బన్స్ వారాలో ఏప్రిల్ 2024, 21వ తేదీన జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే సంపాదనంతా ముస్లింలకు పంచిపెడుతుందని, పిల్లలు ఎక్కువగా కనే వాళ్ళు చొరబాటుదారులు అని కూడా ముస్లింలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ గారు వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది . అయితే ఈ మాట ప్రధాని మాట్లాడడానికి మూలం ఎక్కడైనా ఉందా అంటే ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా కనిపించకపోవడాన్ని గమనించవలసి ఉంటుంది . ప్రతిపక్షాలు మాట్లాడకపోయినా ముందుగానే ఊహించి, ఎదుటివారిని అంచనా వేసి, నిందలు చేసే విధానం ఉన్నత స్థాయిలో ఉన్న వారికి ఎవరికైనా తగదు. "ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఒక దశలో మాట్లాడుతున్నారంటే అది చట్టబద్ధమైన మాటగానే గుర్తించవలసి ఉంటుంది. అంతే కాదు చేసిన ప్రకటన ఇచ్చిన హామీ నిండు సభలో ప్రజల కోసం చేసిన ఏదైనా ఆదేశం కూడా చట్టబద్ధమైనదే" అని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గమనిస్తే మనకు అర్థమవుతుంది .
తీరా ఈ మాటకు మూలం ఎక్కడైనా ఉందా అని గమనించినప్పుడు 2006 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జాతీయ అభివృద్ధి మండల లో చేసిన వ్యాఖ్యలను తప్పుడుగా అన్వయించి ప్రధాని తన వాదనకు బలాన్ని చేకూర్చినట్లుగా తెలుస్తుంది . ఆనాడు ప్రధాని షెడ్యూల్డ్ కులాలు తెగలు, మైనారిటీలు స్త్రీలు పిల్లలు అభివృద్ధి కోసం చేయవలసిన ప్రణాళికా రచన గురించి మౌలిక సదుపాయాల కల్పన గురించి ప్రస్తావించడంతోపాటు, అభివృద్ధి పలాలలో మైనారిటీలు న్యాయమైన భాగం పొందడానికి ప్రభుత్వం పతక రచన చేయాలని సూచన చేసినట్టు తెలుస్తున్నది. అంతమాత్రాన మైనారిటీ పదం వాడినందుకు దానిని ఎత్తి ప్రధాని సంపాదనంతా ముస్లింలకు ఖర్చు పెడతారని కాంగ్రెస్ వస్తే అని మాట్లాడడం పైన కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర ప్రజా సంఘాలు, మేధావులు ప్రధాని హోదాలో ఇలా మాట్లాడడం దేశ ప్రతిష్టను దిగజార్చడమేనని చేసినా వ్యాఖ్యలను మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. ఏప్రిల్ 22, 2024 రోజున అంటే ప్రధాని మాట్లాడిన మరుసటి రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మరో సభలో మాట్లాడుతూ వనరుల మీద మొదటి హక్కు ఆదివాసులకు దళితులకు ఓబీసీలకు ఉన్నదని వ్యాఖ్యానిస్తూ ముస్లింలను మినహాయించడాన్నీ మనం గమనించవచ్చు . ఇదే సందర్భంలో ప్రధాని గారు అన్న మాటలు వివాదాస్పదమని భావించినారో ఏమో తన వ్యక్తిగత వెబ్సైట్లో వాటిని తొలగించి తక్కిన ప్రసంగం పోస్ట్ చేసినట్లుగా పత్రికల ద్వారా తెలుస్తున్నది. ప్రజల దగ్గర ఉన్న ఆస్తులను బంగారాన్ని నగలను ఆ పార్టీ లాగేసుకుంటుందని స్త్రీలను భయభ్రాంతులను చేసే విధంగా నిందించడం మరోసారి బిజెపి వంతు అయ్యింది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కులగననను మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ ఈ కులగ ణన ద్వారా ఆస్తుల వివరాలను సేకరించి అపహరిస్తారు అనే విధంగా బిజెపి వ్యాఖ్యానించినట్టు తెలుస్తున్నది. అయితే విమర్శ వేరు వక్రీకరించడం వేరు నిర్మాణాత్మకమైన విమర్శకు ఎవరికీ అభ్యంతరం ఉండదు కానీ తప్పుడుగా ఊహించడమే ఇక్కడ రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉన్న వారికి తగని పని.
రాజ్యాంగ విలువలను కాపాడాలి
సమాజంలోని ఒక వర్గం మీద మిగతా ప్రజలకు ఒక రాజకీయ పార్టీ పైన మరొక రాజకీయ పార్టీ ఆ ప్రస్తుతముగా అకారణంగా ద్వేషాన్ని వ్యతిరేకతను పెంచే వ్యాఖ్యలు ఎవరు కూడా చేయకూడదు. ముఖ్యంగా ఎన్నికల సమరంలో అలాంటి తప్పుడు విధానాలకు పాల్పడకూడదని ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123(3 )123 (3a)మేరకు మతం జాతి కులం భాష ప్రాంతం ప్రాతిపదికల మీద ఓటు వేయమని కానీ వేయవద్దని కానీ చెప్పడం నేరమని, ప్రజలలో శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం శిక్షార్హమని, నేరం నిరూపణ జరిగితే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
ఎన్నికల సంఘం నిర్దేశించే నమూనా ప్రవర్తన నియమావళి ప్రకారంగా కూడా ప్రజలలో ఇప్పటికే ఉన్న వైశమ్యా లను పెంచడం కానీ కొత్త వైశమ్యా లను సృష్టించడం కానీ అనైతికమని ఈ సందర్భంగా నియమావళి ఉల్లంఘించిన ఆరోపణలను స్వయంగా ప్రధానమంత్రి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక ఆందోళన అయితే గమనించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థ కూడా కల్పించుకోవాల్సిన పరిస్థితి రావచ్చునని విశ్లేషకులు విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు .గత రెండు మూడు మాసాలుగా 400 సీట్ల లక్ష్యం గురించి మాట్లాడి పదేపదే ఆపైన సీట్లు వచ్చి మూడవసారి అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని అనేక వేదికల్లో మాట్లాడిన బిజెపి నాయకులు అకస్మాత్తుగా మాట మార్చి ఒకవేళ కాంగ్రెస్ అధికారానికి వచ్చే అవకాశం ఉంటే అంటూ హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారంటే బిజెపికి ఎదురుగాలి వీస్తున్నథా? కాంగ్రెస్ గెలుపు గురించి బిజెపి భయాందోళనలతో కొట్టుమిట్టాడుతున్నథా? ఏది ఏమైనా గత పది ఏళ్లుగా బాధ్యతాయుతమైన అధికారంలో ఉన్న పార్టీ బిజెపి ఒకేసారి కాంగ్రెస్ పార్టీ పైన బాధ్యత రాహిత్యమైన ప్రచారాలకు ఒడిగట్టడం వివాదాస్పదం కావడం దేశ ప్రజలు గమనించవలసిన అవసరం. ఇదే సందర్భంలో రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్లను ఎవరికి వేస్తారో నిర్ణయించుకోవడానికి ఈ వ్యాఖ్యలు కూడా ప్రేరణ కల్పిస్తాయనడం లో సందేహం లేదు.
లౌకిక రాజ్యమైన భారత దేశంలో మతం, దేవుడు, విశ్వాసాలను ఎన్నికలలో అతిగా వినియోగించి లబ్ధి పొందాలని చూసే అసాధారణమైనటువంటి ప్రచారం సరైనది కాదు. అంతే కాకుండా ఒక మైనారిటీ వర్గానికి చెందిన ప్రజా సమూహం పట్ల ప్రధాని హోదాలో ఉన్న
వ్యక్తి చేసిన ఈ కామెంట్ పట్ల బిజెపి శ్రేణులు కూడా కొంత ఆందోళనకు గురైనట్లుగా పత్రిక కథనాల ద్వారా తెలుస్తున్నది. ఒక పార్టీ నాయకుడు ఎన్నికల సమయంలో మాట్లాడిన సందర్భంలో ప్రతిపక్షాలను ఒప్పించడంతోపాటు తన పార్టీ వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టుకోవలసినటువంటి అవసరం ఉంటది. అందుకు భిన్నంగా ఏ కామెంట్ జరిగినా అది సమస్యగా మారే ప్రమాదం లేకపోలేదు .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ )