ఆత్మవిశ్వాసంతో జీవించడం  నవ్వుతూ బతకడంతో  అంతర్గత బహిర్గత  శత్రువులను కూడా  జయించవచ్చు

Nov 11, 2024 - 21:24
Nov 18, 2024 - 11:42
 0  3
ఆత్మవిశ్వాసంతో జీవించడం  నవ్వుతూ బతకడంతో  అంతర్గత బహిర్గత  శత్రువులను కూడా  జయించవచ్చు

ఆత్మవిశ్వాసంతో జీవించడం  నవ్వుతూ బతకడంతో  అంతర్గత బహిర్గత  శత్రువులను కూడా  జయించవచ్చు. అయితే జీవితం నిరంతర పోరాటమని  మరువకూడదు.  సంపద ఉన్న అనారోగ్యవంతుని కంటే  పూరి గుడిసెలోని ఆరోగ్యవంతుడు  ఎక్కువ సుఖ పడినట్లు,  ప్రశాంతత సంపద కంటే గొప్పదని  గుర్తించి ఆచరించాలి

వడ్డేపల్లి మల్లేశం 20...09....2024

ఆరోగ్యం, మానసిక ప్రశాంతతలో కొంచెం వెసులుబాటు ఉన్నంత మాత్రాన  తా మే గొప్పవాళ్ళమని  ఇది తమ సమర్థత అని చెప్పుకునే వాళ్ళు అనేకం..  కానీ అంతర్గత బహిర్గత  శత్రువులు,  పరిస్థితుల కారణంగా కూడా  కొందరు అనివార్యంగా  సమస్యల లోకి నెట్టు వేయబడతారు  వారిని  అసమర్థులుగా భావించడం అవివేకమే . తను నమ్మిన సిద్ధాంతాన్ని  నిరంతరము ఆచరిస్తూ  అది సామాజిక  ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నదా లేదా అని  సమీక్షించుకొని  అంకితమై పని చేస్తూనే  మానసిక ప్రశాంతతతో  పాటు  నవ్వుతూ బ్రతకగలిగిన జీవితం  అందుకు ఆరోగ్యాన్ని  జత చేసుకోగలిగితే  అంతకుమించిన  ఉత్కృష్టమైన జీవితం మరొకటి ఉండదు . కొందరు తమ శరీరాన్ని,  సంపదను, ఆరోగ్యాన్ని,  ప్రశాంతతను మాత్రమే చూసుకొని ఎలాంటి సామాజిక ప్రయోజనాలకు పాల్పడకుండా  గడుపుతున్న జీవితమే గొప్పదని అనుకునే వాళ్ళు మనలో కోకోళ్ళలు  అది చుక్కాని లేని నావ లాంటిది . జీవిత రహస్యాన్ని,  జీవిత ధర్మాన్ని,  జీవిత లోతుపాతులను  బహు పార్శ్వలలో అన్వేషించి  తమ వల్ల ఈ వ్యవస్థకు ఏమైనా మేలు జరుగుతుందా? అని ఆలోచించడమే  మానవ ఉనికికీ ప్రమాణం అని భావించాలి.  ఉత్పత్తిలో భాగస్వాములు కాక,  సామూహిక ఆలోచనతో సంబంధం లేకుండా,  సుఖవంతమైన జీవితము గడపడమే  జీవన రహస్యం అని భావించే వాళ్లను  ఈ సమాజం పక్కకు ఉంచడమే మంచిది . ఎందుకంటే వాళ్ల వల్ల మిగతా చైతన్యవంతమైన ప్రజలు కూడా  సోమరిపోతులయ్యే ప్రమాదం ఉన్నది . సమాజం నిరంతరం చలనశీలమైనది  ఆ" చలన శక్తిని  అందిపుచ్చుకోవడం, కలిసి పోవడం,  ప్రమాణాలను పాటిస్తూ లక్ష్యాలను నిర్ధారించుకుని  గమ్యాన్ని కొంత అటు ఇటుగా చేరుకోవడమే  మానవ జీవితానికి  సరైన నిర్వచనం గా భావించాలి".  ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ  పలు రంగాలకు సంబంధించిన  ఆలోచనలు ఉండవచ్చు  కానీ మనిషిని కేంద్రంగా చేసుకొని  చేసే పనులు  ప్రయోజనాలు మాత్రమే  చర్చకు కలకాలం నిలుస్తాయి.  ఇక వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఆలోచించినప్పుడు  ఎంత అభ్యుదయ భావజాలాన్ని కలిగి ఉన్నప్పటికీ  కుటుంబ సభ్యుల యొక్క సహకారం లోపించడం,  వ్యతిరేక ఆలోచనలతో  అడ్డుకోవడం, ఆటంకముగా పరిణమించడం,  సామాజిక స్ఫూర్తికి భిన్నంగా  పనిచేస్తూ  లక్ష్యం లేని పద్ధతుల్లో వ్యతిరేకించే వాళ్లు కూడా  అనేకమంది ఉంటారు.  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త  సోక్రటీస్ కుటుంబ చరిత్రను గమనిస్తే  గడసరి ఇల్లాలు అయిన అతని భార్య  ఏ రకంగా ఆటంకాలు కల్పించినదో  అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో తన సామాజిక బాధ్యతను ప్రాపంచిక దృక్పథాన్ని  నిర్వహించిన తీరు మనందరికి ఆదర్శంగా నిలవాలి . ఆటంకాలు కుటుంబ పరంగా బయటి పరంగా ఎన్ని ఉన్నా  మనం ఎంచుకున్న లక్ష్యాన్ని, మార్గాన్ని,  గమనాన్ని  విడవకుండా  సాగిపోవడ0  ప్రతి వ్యక్తి ఆచరించగలగాలి.
   జీవితమంటేనే పోరాటం:- సామాజిక మార్పుకు ఆలోచించగలిగిన  సామాన్యుల తో పాటు  రచయితలు తత్వవేత్తలు మేధావుల వరకు కూడా ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి  నిరంతరం కృషి చేయవలసినదే ఇది ఒక సామాజిక బాధ్యత.  ఆ కోణంలోనే అనేకమంది  సమాజం కోసం  అణచివేత నిర్బంధాలకు  బలి కావడంతో పాటు బలవన్ మరణాలకు పాల్పడిన సందర్భాలను మనం గమనించవచ్చు . తమ కుటుంబాలను కూడా పక్కనపెట్టి సమాజం కోసం  చిత్రవధలకు, పేదరికానికి, నికృష్ట జీవితానికి అలవాటు పడి  అవసరమైతే తమ సంపదను  సమాజానికి పంచి పెట్టిన సందర్భాలను తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి కొన్ని భూస్వామ్య కుటుంబాలలో చూడవచ్చు . తన ఆలోచనలు  తన తర్వాత కూడా ప్రపంచాన్ని కదిలిస్తూ ఉండాలి ఇది  సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన వాళ్ళ లక్షణం . అంతవరకు కాకున్నా తను బతికినంతకాలం తన ఆలోచనలకు భిన్నంగా నడవకుండా  సమాజాన్ని నడిపిస్తూనే ఉండాలి.  ఈ లక్ష్యసాధనలో అనేకమంది ప్రముఖ  రచయితలు మేధావులు  సామాజికవేత్తలు కార్యకర్తలు   భార్యలు భర్తలు సమాజం నుండి ఎదురైన అనేక చిత్కారాలు అవమానాలు  ఎదిరించి పోరాడి  కుటుంబ జీవితంలో కంటే  సామాజిక జీవితమే గొప్పదని  నిలబడిన వాళ్లు కూడా ఎందరో.  ప్రముఖ మార్క్సిస్టు రచయిత్రి  రంగనాయకమ్మ గారి   వ్యక్తిగత జీవితంలో భర్తతో ఎదుర్కొన్న అనుభవాలు అవమానాలు  పోరాటాలతో విసుగు చెంది  దూరంగా ఉన్నప్పటికీ  లక్ష్యాన్ని మరిచిపోకుండా  వృద్ధాప్యంలో నేడు కూడా సమాజాన్ని  కదిలిస్తూనే ఉన్నారు.  ఈ రకంగా భర్తలు భార్యలతో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో  చివరికి సమాజంతో కూడా  ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ తమ లక్ష్యాన్ని మర్చిపోకుండా  కొనసాగడమే నిజమైన జీవితం అనబడుతుంది.  సంసారిక సుఖం ,సంపదలు,  రాజభవనాలు , సన్మానాలకే పరిమితమైతే  అది నిజమైన సామాజిక జీవితం కాదు ప్రయోజనంతో కూడుకున్నది  అంతకు అనబడదు.  అంటే నిరంతరము పోరాటం చేయకుండా  సామాన్యుల నుండి అసమాన్యుడి వరకు కూడా జీవితం కొనసాగదు అనేది మన నిత్యజీవిత అనుభవం ద్వారా ప్రతి వ్యక్తి గుర్తించాలి.  మనుగడ కోసం పోరాటం,  సాధన కోసం పోరాటం,   నిర్బంధాలను ప్రతిఘటించడానికి పోరాటం,  లక్ష్యాన్ని సాధించడానికి ఎదురయ్యే ఆటంకాలను  ఎదుర్కోవడంలో పోరాటం  అంటే జీవితమే పోరాటం అని  గుర్తించడం అవసరం. అయితే  ఇటీవల కాలంలో  ప్రజల ఆలోచనలను మళ్లించడానికి,  చైతన్యాన్ని నిర్వీర్యపరచడానికి , వ్యక్తులను శక్తులను  మత్తు లోకి దించడానికి,  ప్రభుత్వ పెట్టుబడిదారీ వర్గాల యొక్క  దోపిడిని ప్రశ్నించకుండా ఉండడానికి  ప్రభుత్వాలే చట్టబద్ధంగా  చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ  సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న సందర్భాలను మనం గమనించాలి . మద్యపానం మత్తు పదార్థాలు డ్రగ్స్, క్లబ్బులు పబ్బులు  ఈవెంట్లు,  సినిమాలు టీవీ ప్రసారాలలోని కొన్ని  ప్రజా వ్యతిరేక దృశ్యాలు, సెల్ఫోన్ వ్యవస్థలోని అశ్లీల భంగిమలు  మనిషిని తన కర్తవ్యం వైపు  దృష్టి పెట్టకుండా చేస్తున్న అవరోధాలు.  ఈ అవరోధాలకు  అనుమతి ఇచ్చినటువంటి ప్రభుత్వాల యొక్క  దుర్నీతిని ఎండగట్టాలంటే ప్రజలు తమ మత్తు నుండి తేరుకుని  కర్తవ్యాన్ని గుర్తించాలి  బాధ్యతలను విస్మరించకుండా పోరాటం నేర్చుకోవాలి . .ఇప్పటికీ రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు, వలస కార్మికులు,  దా రిద్రరేఖ దిగువన ఉన్నటువంటి  కోట్లాదిమంది ప్రజానీకం  కుటుంబాలను  పోషించుకోవడానికి  రోజు సంఘర్షణకు గురవుతూనే ఉన్నారు.  మిగతా సమాజం అనుభవిస్తున్న విలాసాలు,  భోగభాగ్యాలు,  ఆనంద అనుభూతులు  ఈ పేద వర్గాలకు అందకపోయినా  వాళ్లు ఈ దేశ సంపదలో  ఉత్పత్తిలో  భాగస్వాములు కావడాన్నీ మనమంతా అభినందించాలి.  ఉత్పత్తిలోనూ ప్రజాస్వామ్య  పరిరక్షణలోనూ  భాగస్వాములు కానటువంటి సంపన్న వర్గాలు  కష్టజీవులు కార్మికులు రైతుల ముందు  ఓడిపోయినట్లుగానే భావించాలి.  అంటే "జీవితానికి అర్థం లేకుండా  ఆర్థికంగా  ఉన్నంత మాత్రాన  అనుభవించే సారం  వ్యక్తిగతమైనదే కానీ  సమాజానికి  ఆమోదయోగ్యం కాదు".
         
  ఆరోగ్యము ప్రశాంతత అనే రెండు అంశాలు  మనము కల్పించుకునే పరిస్థితులు,  ఆలోచన ధోరణి,  కుటుంబ ఆర్థిక పరిస్థితులు,  కుటుంబ సహకారం పైన ఆధారపడి ఉంటాయి .అయినప్పటికీ  ఉన్నంతలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం,  ఆత్మస్థైర్యంతో జీవించడం,  ఇతరులకు చేతనైన మేరకు సహకరించడం,  నవ్వుతూ బతకడం వలన  ఎండార్పిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి  అయ్యి ఆరోగ్యకరమైన  మానసిక ప్రశాంతతకు  దారితీస్తాయి. మానసిక ప్రశాంతత ఆరోగ్యము వుంటే అనారోగ్యముతో కూడుకున్న  కోటీశ్వరుల   జీవితo క0టే గొప్ప అనుభూతి  పొందవచ్చు . "సామాన్యులతో పాటు అసామాన్యుల జీవితాలను పరిశీలించడం, అధ్యయనం చేయడం  ద్వారా  మనం మన జీవిత ఆశయాలను  నిర్ధారించుకోవడం  సమర్తవంతమైన ప్రయోజనకరమైన జీవితానికి  అర్హతగా భావించాలి .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం  రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట (చౌటపల్లి) తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333