అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థలో

భవిష్యత్ భారత జనాభాకు  వృద్ధ భారతంతో సహా సవాలక్ష సవాళ్ళు

Nov 11, 2024 - 21:16
Nov 18, 2024 - 11:53
 0  0
అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక వ్యవస్థలో

 విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలపై  ప్రభుత్వ వ్యయం పెరిగితేనే  ప్రజా జీవితాలకు భద్రత ,అభివృద్ధి సాధ్యం.

వడ్డేపల్లి మల్లేశం 21...09...2024

ప్రపంచ ఆకలి సూచీలో 127 దేశాల గాను 105వ స్థానంలో ఉండి  భారతదేశం  మన ప్రగతిని వెక్కిరిస్తుంటే  ప్రపంచంలో  ఉన్న110 కోట్ల  పేదల లో 23 కోట్ల మంది భారత్లోనే ఉండడం  మరింత ఆందోళన కలిగించే అంశం.  3.6 లక్షల కోట్ల డాలర్ల  పరిమాణముతో  ప్రపంచంలో భారతదేశం 5వ ఆర్థిక వ్యవస్థ గా ఉన్నదని  గర్వంగా చెప్పుకుంటున్నామే కానీ  కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఈ దేశంలో ప్రజల యొక్క దుర్భర పరిస్థితులు ఇంకెంతకాలం అని  ప్రశ్నించక తప్పదు..  20 సంవత్సరాల లోపు  వయస్సున్న వారి శాతం భారత జనాభాలో 50 శాతానికి పైగా ఉంటే  35 సంవత్సరాల  వయస్సు ఉన్న వారి శాతం 65 శాతానికి పైగా  ఉన్న విషయం  వాస్తవమే కావచ్చు. యు వభారతమని  గర్వంగా చెప్పుకుంటే సరిపోదు  పాలనా వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు,  ప్రభుత్వాల యొక్క  నిర్లక్ష్యం,  మౌలిక రంగాల మీద ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు భారీగా  దినదినం తగ్గించడంతో  భవిష్యత్తులో  ప్రజలు మరిన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొనే  ప్రమాదం ఉన్నదని  గుర్తించాలి . ప్రపంచ ఆరోగ్య సంస్థ  సూచనల ప్రకారం గా  1000 మందికి ఒక డాక్టర్ ఉండాలని నిర్దేశిస్తుంటే  భారతదేశంలో  834 మందికి ఒక డాక్టర్ చొప్పున ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం  ప్రకటించినట్టు తెలుస్తున్నది కానీ  ఇదంతా  ఊహ మాత్రమేనని వాస్తవంగా దేశవ్యాప్తంగా 10,926 మందికి  ఒక్క  అల్లోపతి వైద్యులు ఉన్నట్లు గతంలోనే  వాస్తవాలు వెలుగు చూసినట్లు  ఆధారాలున్నాయి . పోషకాహారం అందని జనాభా  54 శాతానికి పైగా ఉంటే  మరొక పక్క  దేశ సంపదలో 40 శాతం 1 శాతం సంపన్న వర్గాల చేతిలోనే ఉండడం  ప్రజల సంపదను కొద్దిమంది బడా పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం  రుణమాఫీ చేయడం వంటి చర్యలు సంపద  కేంద్రీకరణను పెంచడంతోపాటు  సంపద సృష్టించడానికి ఏ రకంగా ను తోడ్పడకపోవడం వలన  రాను రాను వృద్ధభారతం అవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో  ఉత్పత్తిలో పాల్గొనే వారి సంఖ్య తగ్గి  భారతదేశ0 అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.  ఆర్థిక అసమానతలు అంతరాల  ఉచ్చులో భారతదేశం చిక్కిపోవడమే కాకుండా మానవ సంబంధాలు  రోజురోజుకు మస్కబారుతున్న నేపథ్యంలో కుటుంబంలో సంపాదించే వ్యక్తుల సంఖ్య తగ్గడం,  కొద్దిమంది పైన కుటుంబ సభ్యులందరూ ఆధారపడి జీవించడం,  చాలీచాలని వేతనాలతో అనేక కుటుంబాలు  జీవించడం వంటి పరిస్థితుల కారణంగా  రా నున్న కాలంలో జన జీవితాలు దుర్భరమయ్యే అవకాశాలు ఉన్నాయి . 2047    ప్రాతిపదికగా దేశం పరుగులు పెడుతున్నదని,  2030 నాటికి మూడవ ఆర్థిక వ్యవస్థగా  నిలబడుతుందని,  భారతదేశ వికసిస్తుందని  కేంద్ర ప్రభుత్వం  ప్రకటిస్తున్నప్పటికీ  దేశంలో ఉన్న పరిస్థితులను గమనిస్తే చదువులకు తగినటువంటి నైపుణ్యాలు లేక, సరైన ఉద్యోగాలు కానరాక,  యువశక్తి నిర్వీర్య మవుతుంటే కోట్లాది ప్రజానీకం ఇతర దేశాలకు వలస బాట పడితే   యువభారతమని చెప్పుకున్నా  నిరుద్యోగం గుప్పిట్లో నలిగిపోయినప్పుడు  భవిష్యత్తు భారతదేశం  సవాళ్లను ఎదుర్కోక తప్పదు కదా!  విద్యా ఉపాధి అవకాశాలతో పాటు  సామర్ధ్యాలను నైపుణ్యాలను పెంపొందించేదిగా  సమ్మిళిత అభివృద్ధి దేశములో సాధ్యమైనప్పుడు  ఆ వైపుగా ప్రభుత్వాలు కృషి చేసినప్పుడు మాత్రమే  ప్రగతి సాధ్యమవుతుంది.   రాబోయే కాలంలో  వయసు పైబడిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంటే  ఒక అంచనా ప్రకారం గా 2036 నాటికి దేశవ్యాప్తంగా బాల బాలికల సంఖ్య తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వారి  జనాభా భారీగా పెరుగుతుందని  కేంద్రం తాజాగా తన నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తున్నది.  కుటుంబ నిర్వహణకు అయ్యే ఖర్చు పెరగడం , ఉత్పాదకత తగ్గిపోవడం,  సంక్షేమ రంగాల పైన ప్రభుత్వం ఖర్చు  భారీగా పెంచవలసి రావడంతో  భవిష్యత్తు నిరాశాజనకంగా  ఉంటుంది అనడంలో సందేహం లేదు .
 

కొన్ని గణాంకాలను పరిశీలిస్తే:- స్వాతంత్ర అనంతరం  కలిసి వచ్చిన కొన్ని అవకాశాలు  సంక్షేమ అభివృద్ధి  వలన  సగటు ఆయుర్దాయము దాదాపుగా రెట్టింపు కావడం వలన  జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం  సంతానోత్పత్తి రేటు తగ్గడం   వలన  బాల బాలికల రేటు  తగ్గిపోతున్నది.  కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం 2021లో దేశ జనాభాలో 15 ఏళ్ల లోపు వారు సుమారు 26% ఉంటే 2036 నాటికి 20 శాతానికి తగ్గనున్నారు.  ఇదే కాలములో  60 ఏళ్లకు పైబడిన వారు  పురుషులు 9.5% నుండి 13.9%,  మహిళలు 10.7% నుండి 16%  పెరగనున్నట్టు తెలుస్తున్నది.  ఉపాధి రీత్యా గ్రామాలలో ముఖ్యంగా యువత వలస బాట పడుతుంటే  గ్రామాలలో వృద్ధులు ఎక్కువగా కనబడుతున్నట్లు  సామాజిక ఆర్థిక రంగాలలో  దుష్పరిణామాలకు కారణమవుతున్న ఈ ముఖచిత్రం  మారాలంటే  స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం తో పాటు  యువత నైపుణ్యాలను పెంపొందించే ఏర్పాటు చేయడం  ఎంతో కొంత విరుగుడుగా పనిచేస్తుంది.  ఇప్పటికే    అన్ని రకాల కాలుష్యాలతో భారతదేశ అట్టుడికి పోతుంటే,  పంటల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం,  రసానిక పదార్థాల వాడకం విరివిగా పెరగడంతో  అనారోగ్యం బారిన పడి పోషకాహారం అందకపోవడం  వంటి పరిణామాలు నిత్య కృత్యం అవుతుంటే  ఇలాగే కొనసాగితే  భవిష్యత్తులో వృద్ధులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో  మరిన్ని విపరిణామాలు జరగనున్నాయి.  ఈ పరిణామాన్ని ముందే పసిగట్టి పాలకులు  మేధావులు సమాజం కూడా  పరిష్కార మార్గాలను ఆలోచించాలి.  ప్రభుత్వాలు ముఖ్యంగా విద్యా వైద్యం  ఉపాధి సామాజిక న్యాయం  పేదరిక నిర్మూలన  వంటి అంశాలపైన వ్యయాన్ని భారీగా పెంచడం వలన  కుటుంబాల యొక్క ఆదాయాన్ని గణనీయంగా పెంచడానికి  పోషకాహారాన్ని  ప్రభుత్వమే సరఫరా చేయడం వలన  ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు  అభివృద్ధి సంక్షేమం పైన  సమాంతర దృష్టిని నిలపడం వలన  సవాల నుంచి భవిష్యత్తును  రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది.   ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం,  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే క్రమములో  స్వేచ్ఛ స్వాతంత్రాలు  జీవించే హక్కుకు  భరోసా ఇవ్వడంతో పాటు,  బడ్జెట్లో పేద వర్గాలకు సామాన్య ప్రజానీకానికి  వారి వాటాను కేటాయించడం వలన  కూడా  ఎన్నో దుష్ట పరిణామాలను అడ్డు కోవడానికి  సవాళ్లను అధిగమించడానికి  ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి  వృద్ధుల సంక్షేమాన్ని  ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా  ఆకలి సూచీలో  మెరుగైన స్థానాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది.  ఆ వైపుగా ప్రభుత్వం  కఠిన చర్యలు నే టి నుండే ప్రారంభించడం  ఎంతో దోహదపడుతుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు (చౌటపల్లీ)హుస్నాబాద్  జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333