ప్రాణాలు తీస్తున్న హుక్కా పీల్చడం ఏ ప్రయోజనాల కోసం ? సిగరెట్, బీడీ, తంబాకు, పొగాకు , హుక్కా గ0 జాయి, మత్తు పదార్థాలను నిషేధించలేమా?

Apr 7, 2024 - 12:03
 0  2

పాలకులకు  సామాజిక బాధ్యత,  

ప్రజల ఆరోగ్యం పై  శ్రద్ధ ఉంటే  పొగలేని భారతo సాధ్యమే .

మాటల్తో కాదు  కేంద్ర రాష్ట్రాలు ఉత్పత్తి, అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలి.

---  వడ్డేపల్లి మల్లేశం  

బీడీలు సిగరెట్లు  తo బాకుతో పాటు  పొగాకు వినియోగం భారీగా పెరుగుతూ  పొగాకు ఉత్పత్తులు  విపరీతంగా అందుబాటులోకి రావడాన్నీ  ప్రభుత్వం ఏమాత్రం కట్టడి చేయడం లేదు.  ప్రజారోగ్యాన్ని  పీల్చి పిప్పి చేసే  ఈ ధూమపానం  లో ఎక్కువగా హుక్కా  ప్రధాన పాత్ర పోషిస్తుంటే  ఈ కేంద్రాలపై పోలీసులు  ఇతర విభాగాలు దాడి చేసిన సందర్భంలో  గంజాయి ఇతర మత్తు పదార్థాలు  పట్టుబడుతున్న సందర్భాలను గమనించవచ్చు.  ఇటీవల కాలంలో హుక్కా వినియోగం భారీగా పెరగడంతో  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)  సిగరెట్ బీడీ తంబాకు పొగాకు వినియోగం వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో  హుక్కాతో  అంతకుమించిన స్థాయిలో నష్టం తప్పదని  ప్రపంచ దేశాలను  హెచ్చరించిన తీరు  పాలకులకు  కనువిప్పు కలగకపోతే ఎలా ? ఇక అదే సందర్భంలో  45 నిమిషాల పాటు హుక్కా గనుక పిలిస్తే  100 సిగరెట్లు తాగిన దానితో సమానమని  అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం తన పరిశోధనలో వెల్లడించడం  మన దేశానికి పరిమితమై చూసినప్పుడు మరింత ఆందోళన కలిగించే విషయం . సాధారణంగా  ధూమపానం వల్ల  క్యాన్సర్ ఇతర అనారోగ్య సమస్యలు  ఎక్కువగా వస్తాయని  మనందరికీ తెలుసు కానీ హుక్కా పీల్చడం వల్ల  నోరు ఊపిరితిత్తులు మూత్రపిందాల క్యాన్సర్లు, గుండె సంబంధించిన సమస్యలు  పెద్ద ఎత్తున  వచ్చే ప్రమాదం ఉన్నదని  వైద్య రంగ నిపుణులు  హెచ్చరించడాన్నీ  వినియోగదారులు ప్రభుత్వాలు  చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది . పొగాకు ఉత్పత్తులతో పాటు ఇతర  మత్తు పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లు  సిగరెట్ డబ్బాలపైన  "స్మోకింగ్ ఇస్ ఇంజురియస్ టు హెల్త్" అని స్పష్టంగా రాయబడి ఉన్నప్పటికీ  అదే మాదిరిగా టీవీ ప్రసారాలలో  పొగ తాగుతున్న సందర్భంలో  స్క్రీన్ పైన హెచ్చరికలు కన పడినప్పటికీ  ఎందుకు ప్రదర్శిస్తారో  ఎందుకు ప్రజల రెచ్చగొడతారో ఇప్పటికీ అర్థం కావడం లేదు.  వైద్య రంగనిపుణులు ప్రభుత్వానికి పలు సూచనలు చేసినప్పటికీ  కొన్ని ప్రాంతాలలో  ఇలాంటి మృత్యువాత పడిన సందర్భాలలో ప్రత్యేకంగా పరిశీలన జరిపిన బృందాలు కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించిన సమయంలో  తాత్కాలికంగా చర్యలు తీసుకోవడమే కానీ శాశ్వతంగా  ధూమపానాన్ని ఈ దేశంలో నిర్మూలించాలనేటువంటి స్పృహ కేంద్ర రాష్ట్రాలకు లేకపోవడం బాధాకరం.  కొంతమంది ఉపాధి కోసం,ప్రభుత్వాలకు  ఆదాయంగా గమనించిన  కేంద్ర రాష్ట్రాలు  బాధ్యతారహితంగా వ్యవహరించడం  నిజంగా సిగ్గుచేటు.  అంకిత భావం ఉంటే, సామాజిక బాధ్యతగా తీసుకుంటే  పొగపీల్చడాన్ని తద్వారా  రోగాల బారిన  ప్రజల అనారోగ్యాన్ని కట్టడి చేయలేమా?

హుక్కా పీల్చడం మరింత ప్రమాదకరం - వెంటనే నిషేదించాలి - కేంద్ర రాష్ట్రాలు చొరవ చూపాలి:-

         భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాదు వంటి నగరాలలో విద్యార్థులు యువత  జరుపుకునే  పుట్టినరోజులు ఇతర ఆడంబర కార్యక్రమాలకు హుక్కా కేంద్రాలు వేడుక కావడం మరింత ఆందోళన కలిగించే విషయం . ఈ కేంద్రాలలో విభిన్న రుచులలో పొగాకు అనుభూతిని పరిచయం చేయడం ద్వారా  ముఖ్యంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, ఫిజి విద్యార్థులు,యువత ఈ కేంద్రాలకు ఎక్కువగా అలవాటు పడి  తాత్కాలిక  ఆనందంలో మునిగిపోవడంతో  ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు.....  పౌర అధికారులు కట్టడి చేస్తే ఎక్సైజ్  పోలీసుల అండతో నిర్వహిస్తున్నట్లు , పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు కట్టడి చేస్తే పౌర అధికారులు లేదా రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో అమలవుతున్నట్లుగా తెలుస్తున్నది.  అంటే  రాజకీయ నాయకత్వం పౌర అధికారులు ఉమ్మడిగా  దాడులు చేసి చట్టబద్ధంగా నిషేధం విధిస్తే తప్ప హుక్కా వ్యాపారాన్ని,  పొగ నిషేధాన్ని  మరింత కట్టడి చేయలేము.  ఆసియా ఆఫ్రికా ఐ రోఫాల లోని  చాలా దేశాలలో హుక్కా వినియోగం ఎక్కువగా ఉండడంతో  ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత దశాబ్దాకాలంగా భారతదేశంలోకి  మరింత ఎగబాకినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.  ఆఫ్రికా వంటి వెనుకబడిన ఖండాల్లోని దేశాలలో 30 శాతానికి పైగా ప్రజలకు  దీనిని పీల్చడం దినచర్యలో భాగమని తెలుస్తున్నది.  అమెరికాలో ప్రతి 13 మంది ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో ఒకరు  బానిస అయినట్లు  ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది హుక్కా  పీ లుస్తున్నట్లు  గణాంకాలు తెలియజేస్తున్నాయి  .గత నాలుగేళ్ల క్రితం ఢిల్లీలోని కళాశాలల్లోపల నిర్వహించిన సర్వేలో  23 శాతం మంది విద్యార్థులు వివిధ రూపాలలో పొగాకు తీసుకుంటుంటే  అందులో హుక్కా ద్వారా 20% మంది పొగాకును పీలుస్తున్నట్లు  ఆ సర్వే తెలుపడం  పాలకులకు ఇప్పటికీ చెవికి  ఎక్కకపోతే ఎలా  ?ఈ విషయం పైన చేసిన పరిశోధనలో భాగంగా  రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు, పబ్బులు, కేఫులు  సామూహిక విందు వినోదాలలో కూడా    పీల్చడం అనేది ప్రధానంగా కనిపిస్తున్న సందర్భంలో  కట్టడి చేయలేక అధికారులు రాజకీయ నాయకత్వం చేతులెత్తేసిన సందర్భాన్ని మనం గమనిస్తే  కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో  కమిటీలను వేసి ఎక్కడికక్కడ అడ్డుకోవడం ద్వారా  తమ సామాజిక బాధ్యత నిర్వహించాలని  అనేకమంది బుద్ధి జీవులు మేధావులు ప్రభుత్వాలకు  హెచ్చరిక చేస్తున్నారు . రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల స్థాయిలో హుక్కా నిషేధం  చట్ట రూపం దాల్చడమే  పరిష్కారమని భావించి దేశంలోని 11 రాష్ట్రాలు  వాటి శాసనసభలలో  నిషేధిస్తూ  తీర్మానాలు చేసినప్పటికీ  అమలు  సాధ్యం కావడం లేదని తెలుస్తున్నది . చట్టాలతో  ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలను అమలు చేయలేమని,  పాఠశాల కళాశాల స్థాయి విద్యార్థుల్లో  అవగాహన కల్పించడంతోపాటు  కుక్క ఇతర పొగాకు  ఉత్పత్తులు, సిగరెట్లు, బీడీలను  కాల్చడం ద్వారా  ఆరోగ్యం ఎలా గుల్లబారి పోతుందో  హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది  .అదే సందర్భంలో సమాజంలో చైతన్యం తీసుకురావడంతో పాటు  యువత  బాధ్యతలను గుర్తింప చేయడం ద్వారా  ఆరోగ్యకరమైన  జీవితాన్ని  బుగ్గి పాలు చేసుకోకూడదని  హెచ్చరించాలి . తల్లిదండ్రులు కూడా  తమ పిల్లలకు  హెచ్చరిక చేయడంతో పాటు నిరంతరం నిఘా వేసి ఉంచాల్సిన అవసరం కూడా ఉన్నది.  ఇవన్నింటికి భిన్నంగా ఈ ఉత్పత్తులను, కేంద్రాలను,  అందులో వాడే వివిధ రకాల  పదార్థాలను, పొగాకు ఉత్పత్తులను బీడీలు సిగరెట్లు  క్షేత్రస్థాయిలో ఉత్పత్తి కాకుండా నిరోధించి  భారీ జరిమానాలను విధించడం ద్వారా  ఆరోగ్య భారతాన్ని సా కారం చేసుకునే అవకాశం ఉన్నది.  అదే సందర్భంలో ఎక్సైజ్, పోలీసు, ఆహార భద్రత అధికారులు, స్థానిక పాలకులు,  రాజకీయ యంత్రాంగం , రాజకీయ పార్టీల నాయకులు కూడా  ప్రజా క్షేత్రంలో పర్యటించి సమన్వయంతో  పనిచేసినప్పుడు  సమర్థవంతంగా సమాజం నుండి దీనిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది.  ఈ ఉత్పత్తుల పై  ఆధారపడిన కుటుంబాల ఒత్తిడి కూడా  అక్రమంగా అమ్మకాలు వినియోగానికి కారణం కావచ్చు.  ఆ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించడం ద్వారా  వారి కుట్రలను  అక్రమ ఉత్పత్తిని  కట్టడి చేస్తూ  శిక్షలు విధించడం ద్వారా కూడా  దేశానికి తలవంపులు తెస్తున్నటువంటి పొగాకు ఉత్పత్తుల యొక్క వాడకాన్ని   నిర్మూలించి  భవిష్యత్తు భారతాన్ని  ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దవలసిన అవసరం పౌర సమాజంతో పాటు  ప్రభుత్వాల పైన కూడా ఉన్నది.  నిషేధము,  శిక్షలు, చైతన్యము, అవగాహన ఎంత ముఖ్యమో  అంతకుమించిన స్థాయిలో  ప్రజలు కూడా  తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని  స్వయంగా  ఈ ఉత్పత్తులను బహిష్కరించి  తమ చిత్తశుద్ధిని చాటుకున్నప్పుడు మాత్రమే  ప్రభుత్వ కృషి  అధికారుల  దాడులు ఫలవంతమవుతాయి.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు , అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333