ఇప్పుడు పొలాల కంటే మిన్నగా మనుషుల మెదళ్లను దున్నాలి.
ఇప్పుడు పొలాల కంటే మిన్నగా మనుషుల మెదళ్లను దున్నాలి.
సమాజం పురోగతి చెందాలంటే మానవ వికాసం మానవాభివృద్ధి ముఖ్యమే కదా!
ఈ డిమాండ్ కు ప్రధాన కారణం సామాజిక రుగ్మతలు, అమానవీయ బంధాలు.
---- వడ్డేపల్లి మల్లేశం
ప్రతి చోటా స్పష్టంగా వినబడేది సమాజం మారాలని అసమానతలు అంతరాలు పోవాలని స్వార్థ చింతనకు అతీతంగా నైతిక విలువలతో విశ్వ మానవ భావనతో జీవించాలని అప్పుడే సామాజిక ప్రగతి సాధ్యమని ప్రతి వ్యక్తి తన భావాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటాడు.. నైతిక విలువలతో బ్రతికే వాళ్ళు అమానవీయ విలువలతో జీవితం గడిపే వాళ్ళు ఆకృత్యాలు అరాచకాలకు పాల్పడే వాళ్ళు సమాజానికి దిశా దశను నిర్ణయించే దార్స నికులు అందరూ ఇదే మాట్లాడినప్పుడు ఈ వ్యవస్థకు నష్టం చేసే వాళ్ళు ఎవరు? ఎవరి మనసులను మార్చాలి? సామాజిక వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమిటి? మానవ వికాసాన్ని విస్తృతం చేసే విద్య సాంకేతిక నైపుణ్యాలు శిక్షణలు శాస్త్రీయ నైపుణ్యం అన్ని కొనసాగుతున్నాయి కదా అని అనిపించవచ్చు. కానీ విద్యతో సహా అన్ని రంగాలు కూడా బ్రష్టు పట్టిన సమాజాన్ని మార్చడానికి తోడ్పడకపోవడం మనుషులు మూర్ఖపు ఆలోచనలతో మూడ ఆచారాల ముసుగులో స్వార్థ చింతనతో అసూయ ద్వేషాలతో గూడు కట్టుకున్న ఆలోచనల మధ్య జీవించినప్పుడు ప్రగతి ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వాల కార్యక్రమాలలో భాగంగా విద్యా వైద్యము తాగునీరు రవాణా సౌకర్యాలు వ్యవసాయము పశుపోషణ రోడ్లు భవనాలు వంటి సుమారు 140 కి పైగా శాఖలను నిర్వహిస్తూ ప్రజా క్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి సమాంతరంగా కొనసాగుతున్నటువంటి సామాజిక రుగ్మతలు, ప్రభుత్వాల అణచివేత, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, మద్యపానం, ధూమపానం వంటి అసాంఘిక ప్రవర్తన మనుషుల మెదళ్లు కుంచించుకు పోవడానికి దోహదపడుతున్నాయి. ఇ o దుకు ప్రభుత్వం కూడా కొంత కారణమే . గూ డుగట్టుకుపోయిన మనుషుల మెదల్ల దున్నాలి, సమాజాన్ని మేల్కొలపాలి. అడ్డదారిలో నడుస్తున్నటువంటి యువత ఇతర వర్గాలను సక్రమ దారిలో తేవాలంటే ఆ వ్యక్తులను సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీ ర్చిదిద్దాలంటే మానసిక మార్పు అనివార్యం. ఆ మానసిక పరివర్తనకు ఉపయోగపడే విద్య సభలు సమావేశాలు సదస్సులు, చర్చ, సాహిత్య కళా రంగాలు ఉత్కృష్ట పాత్ర పోషించాల్సి వుంది.
మనుషుల మెదలను ఎందుకు దున్నాలి?
భూమిని ఎందుకు దున్నుతున్నాం? గడ్డ కట్టి ఘ నీ భవించి పంటలకు తోడ్పడే స్థితిలో లేనందున. పైరు పెరగాలంటే గుల్ల బారిన భూములే శరణ్యం, భూమిలోని సారవంతమైన పోషకాలు మొక్కలకు సమగ్రంగా అందాలంటే భూమిని గుల్ల బారే విధంగా చేసే అత్యద్భుత సాంకేతిక పరిజ్ఞానమే దుక్కి దున్నడం. యంత్రాలు చేసినా మనిషి దున్నినా జరిగేది ఒకే పరిణామం అది భూమిని వదులుగా చేసి పండించే పంట లోతుగా వెళ్లడానికి పోషక విలువలను అందుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఈ సందర్భo గా ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక సాహితీవేత్త కత్తి పద్మారావు గారు కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానించిన నినాదం లేదా సూక్తి జనరo జకంగానే కాదు ప్రజోపయోగ కరంగా సామాజిక మార్పుకు దోహదపడే విధంగా ఉన్నది అనేది నిర్వివాదాంశం. "" భూమిని దున్నాల్సిందే పంటలు పండించాల్సిందే అంతకుమించిన స్థాయిలో ఇవ్వాలా మనుషుల మెదళ్లను కూడా దున్నాలి." ఎందుకంటే మానవ పరిణామ క్రమమే వక్రదారి పడుతున్నటువంటి సందర్భంలో సమ సమాజ స్థాపనకు విఘాతం కలిగించే ఈ మానవ స్వభావాన్ని మార్చకపోతే ఎలా? అందుకే కంకర లాగా బండ బారి పోయినటువంటి మనుషుల మెదల్ల ను మార్చడానికి కృషి చేయాలి. అది కవులు కళాకారులు మేధావులు సాహితీవేత్తలు సామాజికవేత్తలు తమ బాధ్యతగా తీసుకోవాలని గుర్తు చేయడం నిజంగా అభినందనీయం. ఆ ఒక్క మాట మనల హెచ్చరిస్తూ దారి చూపుతూ లోపాలను సవరించుకోడానికి తోడ్పడుతున్నది. కనుకనే ఆ మాట పతాక శీర్షికన నిలబడింది. కుటుంబ సభ్యులు బంధువులు సమాజంలోని భిన్న వర్గాల మధ్యన అమానవీయ సంబంధాలు కొనసాగుతున్నాయి. ప్రతిచోట నైరాస్యం, ఏవగింపు, అసూయ, ఒంటెద్దు పోకడ, అవమానపరిచే సంఘటనలు సన్నివేశాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. కక్షలు కార్పన్యాలు పెచ్చు మీరి సోదర భావన అడుగంటి పోయింది. సభ్యుల మధ్యన ఘర్షణ పెరిగి కుటుంబాలు వీధిన పడుతున్న సందర్భాలు అనేకం. ఈ పరిణామ క్రమంలో హత్యలు ఆత్మహత్యలు దాడులు ప్రతి దాడులతో సమాజం ఒకవైపు దద్దరిల్లుతూనే ఉన్నది. మరొకవైపు కొద్ది మంది మాత్రం ఆర్థికంగా బలోపేతంగా ఉండి ఆధిపత్యం తోడుగా ప్రశాంతంగా మౌనంగా పెద్దరికంగా ఉన్నట్లు కనపడుతూనే పాలకులుగా చలామనవుతున్న సందర్భాలను మనం గమనించవచ్చు. కక్షలు స్వార్థ ప్రయోజనాలతో ఘర్షణ పడుతున్నటువంటి మెజారిటీ ప్రజానీకం అధికార ప్రయోజనాలకు దూరంగా
అమాయకంగా స్వార్థ చింతనకు బలవుతూ చిక్కి శల్యమై పోతున్నారు. మరొకవైపు సామాజిక రుగ్మతలు ధూమపానం మద్యపానం డ్రగ్స్ క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు సామాన్య పేద మధ్యతరగతి వర్గాలను ఆకర్షించి సంపాదించిన ఆమాత్రం కూడా కొల్లగొట్టబడుతూ ఉంటే పేదలు ఏ రకంగా చైతన్యవంతులు అవుతారు మత్తు ముసుగులో కాక.
మానసిక మార్పుకు బలమైన ప్రేరణ కావాలి:-
మరొకవైపు విద్యా సాంకేతిక నైపుణ్యాలు శిక్షణ లాంటివి జనాన్ని ఏమాత్రం మార్చక పోగా నామమాత్రంగా మిగిలిపోయిన సందర్భాలు అత్యంత విచారకరం. కోట్లాది రూపాయలతో పాఠశాలలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్వార్థం సంకుచిత మనస్తత్వం ఘర్షణలు జీవితానికి దూరంగా ఊహ లోకంలో బ్రతికే విధానం కొట్టవచ్చినట్లు కనపడుతున్నప్పుడు వీళ్ల మనసులు మొద్దు బారకుండా ఎలా ఉంటాయి?.
విద్యా విధానంలో మౌలిక మార్పులు తీసుకురావడం, యువతకు ప్రత్యేక శిక్షణను ఇప్పించడం, యువజన విధానాన్ని స్పష్టంగా ప్రభుత్వాలు ప్రకటించడం ద్వారా కార్యోన్ముఖులను చేయడం, వారిలో ఉన్న ఆసక్తిని గమనించి తగిన కోర్సులలో శిక్షణ ఇప్పించాలి. ప్రభుత్వమే నిర్వహిస్తూ ప్రజలకు ద్రోహం చేస్తున్న కొన్ని సామాజిక రుగ్మతలను కార్యక్రమాలను నిషేధించడం, మద్యపానం ధూమపానం వంటి వాటికి దూరంగా యువతను ఉంచగలిగితే మరింత మెరుగైన సామాజిక పరిస్థితులను ఆశించడానికి అవకాశం ఉంటుంది. తరచుగా మేధావులతో సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజలు యువతలో బాధ్యతలు గుర్తింప చేయడం, వివిధ అంశాల పైన అవగాహన కల్పించడం, పాఠశాలల్లో కళా రంగాలతో ప్రదర్శన ఇప్పించడం ద్వారా వాస్తవాలు గుర్తించేలా చేయడం, తమ తప్పులను సవరించుకోవడానికి అవకాశం కల్పించడం ద్వారా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజాస్వామ్యం ఫరి డవిల్లు తుంది. అందుకే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాగరూకులైన ప్రజా వలి ప్రజాస్వామ్య విజయానికి తోడ్పడుతుంది అని హెచ్చరించినప్పటికీ స్వార్థ ప్రలోభాలతో అన్నింటిని మరిచి కర్తవ్యానికి దూరంగా సామాజిక ఎదుగుదలకు మరీ దూరంగా నిస్తేజంగా బ్రతికితే ప్రయోజనం ఏముంటుంది? ప్రపంచంలోనే యువత ఎక్కువ ఉన్న భారతదేశంలో ఈ దుర్దశ కొనసాగడం బాధాకరం కనుక ఎక్కడికక్కడ మనుషుల మెదళ్లను కదిలించాలి. బండ బా రిపోయిన ఆలోచనలకు పదును పెట్టి, తప్పుడు భావనలకు సవరణ చేసి బలంగా దున్నగలిగే కళా రూపాల సృష్టించి మార్పుకు తోడ్పడాల్సిన బాధ్యత సామాజికవేత్తలపైన ఎక్కువగా ఉన్నది. ప్రభుత్వం కూడా స్వార్థ చింతనతో తమ వరకే కాకుండా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని సమ సమాజ స్థాపన ధ్యే యంగా పనిచేయగలిగితే మేధావులు బుద్ధి జీవులు, సామాజికవేత్తలు మానసిక నిపుణులు సూచించిన సూచనల ప్రకారంగా కొన్నింటిని నిషేధించడం ద్వారా ఆకృత్యాలు సమాజంలో జరగకుండా చూడవచ్చు మనుషుల ఆలోచనలలో కొత్తదనాన్ని ఆచరణలో సాధించవచ్చు. ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ తల్లిదండ్రులు సమాజము విద్యాసంస్థలతో పాటు మించిన స్థాయిలో ప్రభుత్వాలు బాధ్యత తీసుకున్న రోజున మాత్రమే మనుషుల మెదళ్లను బలంగా దున్ని నట్లు నూతన ఆలోచనల పండించినట్లు.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు )