వృద్ధులకు భరోసాఏది?  బహుగా బతికిన వాళ్లకు  తప్పని తిప్పలు

Aug 22, 2025 - 18:29
 0  1

 అంత్య దశలో  మానసిక క్షోభకు గురి చేయడమంటే  అంతం చేయడమే.* ప్రభుత్వ చట్టాలైన ఆసరా కల్పించి   ఆదుకోవాలి,  కుటుంబ సభ్యులలో మార్పు రాకపోతే ఎలా ?
****************
----వడ్డేపల్లి మల్లేశం 9014206412 
----05....08....2025*********
జీవితంలో  బహుగా బతికిన వాళ్ల నుండి  కరువు కాటకాలతో కష్టాలతో  జీవితమంతా కన్నీరే కార్చిన పెద్దలు   వృద్ధాప్యంలో కూడా  బాధలకు గురి కావడం అంటే  సమాజం సిగ్గుతో తలవంచుకోవలసిo దే.  కుటుంబ సభ్యులు తమ బాధ్యతను విస్మరించడంతోపాటు  బాధ్యతలు ఉపాధి ఇతర కారణాల వలన ఇంటికి  దూరంగా ఉండడం వలన కూడా  వృద్ధులు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు.  ఇక అనేక సందర్భాలలో  కుటుంబ సభ్యుల మధ్యన ఉన్నప్పటికీ వివక్షత, అణచివేత, నిర్లక్ష్యము, చులకన భావంతో  ప్రతీకారం తీర్చుకుంటున్నారా? అనే స్థాయిలో ఇబ్బందులకు గురి కావడాన్ని మనం గమనించవచ్చు.  అనేక చోట్ల తల్లిదండ్రులను గెంటివేసిన,  దారి తప్పించిన,  బాధ్యతల నుండి నిష్క్రమించిన  కేసులు కూడా అనేకం.  వృద్ధాప్యంలో వారికి రక్షణ కల్పించడం కోసం  అనేక చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో  ఎదురవుతున్నటువంటి  సమస్యలు,  వృద్ధులు ధైర్యంగా బయటికి రాకపోవడం, సమాజం కూడా వృద్ధులకు సహకరించకపోవడం వలన  అంత్య దశలో నిజంగా వారిని అంతం చేయడానికి కుటుంబ సభ్యులు  తెగబడుతున్నారా? అనిపించక మానదు.  ఈ పరిస్థితుల నుండి  విముక్తి కల్పించడానికి సమాజము ప్రభుత్వాలు  అందుబాటులో ఉన్న చట్టాలతో పాటు తీసుకురావాల్సిన సంస్కరణలు  ఏమేరకైనా ఉపయోగపడితే అంతే చాలు.  వయసు మీద ఉన్ననాడు కష్టపడి సంపాదించి,  పిల్లలు కుటుంబ బాధ్యతలు నెరవేర్చినప్పటికీ వృద్ధాప్యంలోకొడుకులు, కొడండ్ల తో సహా హింసిస్తున్న కుటుంబాలే అనేకం.  కొన్ని కుటుంబాలు ఆర్థికంగా బాగా ఎదిగినప్పటికీ  పోషణలో చూపే వివక్షత కారణంగా వాళ్ళు ఒంటరి వాళ్ళు గా అనాధలుగా మిగిలిపోతున్నరు.బండ బూతులతోపాటు బండ రాళ్ళతో మోదీ కసి తీర్చుకుంటున్న దుర్మారుగులు మరేందరో!  అంటే ఆర్థిక ఇక్కట్లతో పాటు  సామాజికంగా వివక్షత,  నిర్లక్ష్యం, హింస, మానసిక క్షో భతో  వృద్ధులను వేదిస్తున్న  పరిస్థితులను చక్కదిద్దడమే నేటి  మన అందరి కర్తవ్యంగా భావించాలి.
      వృద్ధులకు సంబంధించిన కొన్ని గణాంకాలు :-
**************
ఒంటరి మహిళతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు కూడా  పట్టించుకునే వారు లేక రేపటి పైన ఆశ  చాలక బె oగతో 30% మానసిక క్షోభతో కృంగిపోతున్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా   60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా  16 కోట్లు కాగా 2o50 నాటి వరకు రెట్టింపు  అవుతుందనే అంచనాల మధ్యన  మరీ ముఖ్యంగా దక్షిణాదిలో  దేశ సగటు కన్నా ఎక్కువగా వృద్ధుల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో  వారి రక్షణ కోసం ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో   ఉన్నది.  హెల్ప్ ఏజ్ ఇండియా నివేదిక ప్రకారం  71 శాతం వృద్ధులకు కుటుంబం నుండి ఎలాంటి ఆర్థిక సామాజిక రక్షణ భరోసా  లేదని తెలుస్తుంటే ,తల్లిదండ్రుల పోషణకు సంబంధించినటువంటి  నిబంధనలు చట్టాల పైన 88 శాతం మందికి అవగాహన లేదని  దానివల్లనే కుటుంబ సభ్యులతోనే దాడులకు తప్పడం లేదనే  ఆందోళన సర్వత్రావ్యక్తమవుతున్నది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 70 శాతానికి పైగా వృద్ధులకు పింఛన్ సౌకర్యం లేదని  కొన్ని రాష్ట్రాల్లో ఈ అవకాశం ఉన్నప్పటికీ  అధిక రక్తపోటు మధుమేహం కీళ్ళ సమస్యలతో  సతమతమవుతున్నట్లు వారిని పట్టించుకునే వాళ్ళు లేక  ప్రాణంతో ఉన్న  ఆందోళన తప్పడం లేదని తెలుస్తుంది. ప్రభుత్వ వైద్యశాలల్లో అరకొ ర సౌకర్యం  అందుకోలేక లేని పరిస్థితుల్లో  ప్రైవేటు వైద్యశాలల్లో పెట్టుబడి పెట్టలేక  రెoటికి చెడిన రేవనలుగా మిగిలిపోతున్నారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం  70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని  విస్తరింప చేసినప్పటికీ  అమలులో ఏర్పడుతున్న ఇబ్బందులు,  సమాచార లో పం వల్ల  కలిసి రాకపోవడంతో  మానసిక ఆందోళనతో ఇతర రంగాలలో మాదిరిగా  వృద్ధులలో ఎంతో మంది కూడా ఆత్మహత్యలకు  పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది.  వయసుమీద ఉన్న నాడు కుటుంబాలకు దిక్కుగా ని ట్టాడుగా మిగిలిన వాళ్ళు  మలిదశలో  దుఃఖాలలో  మునిగిపోవడం అంటే నాగరిక సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిందే. అన్ని పరిణామలకు బాధ్యత వహించవలసినదే.
         పరిష్కార మార్గం పైన దృష్టి పెట్టకపోతే  ఎలా?
******-****** 
వారి వారి  ఉపాధి వృత్తుల రీత్యా కుటుంబ సభ్యులు అందుబాటులో లేని పరిస్థితిలో  వృద్ధుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక  కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఆ లనా పాలనాతో పాటు విభిన్న రకాల  మానసిక ఉల్లాస కార్యకలాపాలు నిర్వహించడం  సంతోషదాయకం వారికి శాశ్వత ప్రాతిపదికన  పూర్తి  సౌకర్యాలు కల్పించి  కన్నీరు తుడవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా  పెద్దల సంరక్షణ కోసం  వృద్ధాశ్రమాలను ఎక్కువగా నిర్మించి  ఆదుకోవాలని సంకల్పించినట్లుగా తెలుస్తున్నది.  అనాగరిక సమాజాలలో  వృద్ధులను ఆదుకోవడం  అసాధ్యమని తెలుస్తున్న నేపథ్యంలో  చివరి దశలో తృప్తిగా బ్రతకవలసినటువంటి వృద్ధులను కాపాడవలసిన బాధ్యత  ప్రభుత్వం చట్టాల ద్వారా  కుటుంబ సభ్యులలో మార్పు చేయడానికి ప్రయత్నిస్తూనే  తమ చొరవతో కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా  మానసిక కు o గుబాటుకు దారి తీయకుండా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.  కొందరు కన్న కొడుకులే  ఇబ్బందులు కలిగిస్తుంటే మరికొన్ని కుటుంబాలలో  కోడండ్లు  మరిన్ని దారుణాలకు పాల్పడడాన్ని మనం గమనించవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే  భవిష్యత్తు లోపల కూడా  తల్లిదండ్రుల పోషణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. త మదాక వస్తే కానీ తెలియదు అన్నట్లు  ఇబ్బందులకు గురి చేసిన వాళ్లు  భవిష్యత్తులో వృద్ధులయ్యి  కష్టాలకు,చీత్కరింపులకు గురైతే  అప్పుడు తెలుస్తుంది వృద్ధాప్యంలోని వారి  కుంగుబాటు, వేదన, మానసిక ఆందోళన. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలను పకడ్బందీగా అమలు చేయడంతో పాటు కుటుంబ బంధాలను మానవ సంబంధాలను  పటిష్టంగా అమలు చేయడానికి  ఇలాంటి సంఘటనలు జరుగుతున్న కుటుంబాలను  దర్శించి కౌన్సిలింగ్ ఇవ్వడానికి మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా  చట్టాలను ప్రత్యక్షంగా అమలు చేయడానికి ప్రయోగాత్మకంగా  చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది.  వైద్య సౌకర్యాలు, రక్షణ చర్యలు, వసతి సౌకర్యాలను కల్పించడంతోపాటు  కుటుంబ సభ్యుల నుండి ఆదరణను కూడా పెంపొందించడానికి శక్తి మేరకు ప్రయత్నం చేయడం నేడు మన అందరి ముందున్న కర్తవ్యం. అది అమలు కానప్పుడు  ప్రత్యామ్నాయంగా  అనాధాశ్రమాలు వృద్ధాశ్రమాలకు  ప్రాధాన్యత ఇవ్వక తప్పదు కదా!  ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరు చివరిదాకా తృప్తిగా బ్రతకాలి కానీ మధ్యలోనే ఆత్మహత్యలకు పాల్పడితే  చూస్తూ ఉన్న మనం మనుషులమేనా ?
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333