ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ ఈ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు...!
శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారుల సందడి.. భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు.
విశిష్ట అతిథిగా గద్వాల్ సంస్కార్ స్కూల్ ప్రిన్సిపాల్ సంధ్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
జోగులాంబ గద్వాల 05 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండల కేంద్రంలోని ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు, కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలో ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన భక్తి గీతాలు, కీర్తనలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో చిన్నారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి మధులిక గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..! శ్రీకృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, ధర్మం, సత్యం, నీతి మార్గంలో నడవాలనే గొప్ప సందేశాన్ని అందించే పవిత్రమైన పర్వదినమని అన్నారు. శ్రీకృష్ణుడి జీవిత చరిత్ర, భగవద్గీత బోధనలు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని కరస్పాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి స్రవంతి వైస్ ప్రిన్సిపల్ నవీన్ కుమార్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు ప్రియాంక, లాలు, నరేంద్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధినేతర సిబ్బంది తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.