రైతుల విద్యుత్ సమస్యపై ఆందోళన — అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.
జోగులాంబ గద్వాల 11 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- మండలం సాతర్ల గ్రామంలోని 33 కేవీ సబ్‌స్టేషన్ వద్ద రైతులు విద్యుత్ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆరు, ఏడు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నప్పుడు వ్యవసాయానికి మాత్రం ఎందుకు సరైన విద్యుత్ అందించడం లేదని ప్రశ్నించారు.? ఈ సమస్యను ఎన్నిసార్లు ఏఈ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని రైతులు ఆరోపించారు.? పొలాల్లో ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్ద వేచి చూడాల్సి వస్తోందన్నారు. రాత్రివేళల్లో పాములు, తేళ్ల భయాన్ని కూడా లెక్కచేయకుండా పొలాల వెంట తిరుగుతూ వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎందుకని రైతులు ప్రశ్నించారు.? వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని, సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోకపోతే తమ నిరసనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల సమస్యపై విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పై విషయంపై విద్యుత్ లైన్మెన్ వెంకటేష్ ను సూర్య న్యూస్ నుంచి చేరవాణి ద్వారా సంప్రదించగా వారు ఉన్నత అధికారుల ఆదేశం మేరకు మేము కరెంటు సప్లై చేస్తున్నాము. రైతులు వారికి అనుకూలంగా ఉన్న సమయం కోరుతున్నారు దానిపై వారు నిరసనలు చేస్తున్నారని వారు లైన్మెన్ వెంకటేష్ తెలియజేశారు.