ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే మరి అన్ని పార్టీలకు అది వర్తించదా.?

దొంగ తాను తప్పించుకోవడం కోసం ఇతరుల దొంగ అన్నట్లుoది రాజకీయ పార్టీల తీరు.
ఉచితాల ప్రకటనలో పోటీ పడిన టిఆర్ఎస్ కాంగ్రెస్ ఉచిత విద్య వైద్యం గురించి ఏనాడైనా చాలెంజ్ చేసినాయా?
--- వడ్డేపల్లి మల్లేశం
భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన విద్య వైద్యాన్ని అందిస్తాం అన్న సోయి కానీ స్పృహ కానీ ఛాలెంజ్ చేసే సత్తా కానీ లేదు. ఉండి ఉంటే 77 ఏళ్ల స్వదేశీ పాలనలో ఏనాడైనా ఒక్క రాజకీయ పార్టీ ఆ విషయంలో ప్రజలకు హామీ ఇచ్చి ఉండేది కదా! రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉచిత విద్య వైద్యాన్ని పాలకులు ప్రజలకు ఏ కోశాన కూడా అనుమతించరు, అవకాశం కల్పించరు, ఎందుకంటే ఏకు మేక యినట్లుగా ప్రజలు విద్యావంతులై పాలకుల కుట్రలను చెదిస్తారు" అనే సందేహాన్ని ఆనాడే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇదే అంశం పైన రష్యన్ ప్రఖ్యాత రచయిత టా ల్ స్టా యి కూడా స్పందిస్తూ "పాలకులు ప్రజలకు ఈ రెండింటిని సూటిగా ప్రకటించరు, కానీ విద్యను వైద్యాన్ని ఉచితంగా అందించినట్లు నటిస్తారు, నటనలో జీవిస్తారు, అదంతా కల్ల మాత్రమే" అని ప్రజలను ఏనాడో జాగృతం చేయడం జరిగింది.అయినప్పటికీ ముఖ్యంగా "భారతదేశంలో మాత్రం ఇప్పటికీ ప్రజలు చైతన్యo కాకపోవడం, పాలకులను ప్రశ్నించకపోవడం వల్లనే రాజకీయ పార్టీల గ్యారడి, పరస్పర ఆరోపణలు, నటన, నాటకాలు కొనసాగుతున్నాయి. అని విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బుద్ధి జీవులు మేధావులు ప్రజలు ఈ విషయంలో మౌనంగా ఉండకుండా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సిందేనని హెచ్చరిస్తున్నారు కూడా. ".
" ఏ రాజకీయ పార్టీ అయినా తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సిందే. ముఖ్యంగా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రుల స్థాయిలో సభలు సమావేశాలలో అధికారిక కార్యక్రమాలలో ప్రకటించినటువంటి ఏ ప్రకటన అయినా కూడా చట్టబద్ధమని, అది అమలు చేసి తీరాలని, అమలు పరచకపోతే చట్టపరంగా పోరాడే అధికారం ప్రజలకు ఉంటుందని గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన పాలకులకు స్పృహ లేకపోవడం విచారకరం." ఇక ప్రజలు అయితే ఆ తీర్పును ఏనాడో మరిచిపోయినారు కనుకనే ఉచితాలకు తాయిలాలకు వాగ్దానాలకు ప్రలోభాలకు లొంగి బానిసలుగా బతకడానికి జీవిస్తున్నారు ఇది మాత్రం విచారకరం. ఏ రాజకీయ పార్టీ అయినా తన అవసరాల కోసమే హామీలు ఇస్తుందని, ఈ హామీలను ఉచి తాలను నిరాకరించడానికి ప్రజలు ఎప్పుడైతే సిద్ధపడతారో అప్పుడే తమకు రాజ్యాంగబద్ధంగా రావలసిన నిజమైన హక్కులను పొందడానికి అవకాశం ఉంటుందని తెలుసుకుంటే మంచిది లేకుంటే భవిష్యత్తు అంధకారమే.
ప్రస్తుతం వివరాలలోకి వెళితే
2023 డిసెంబర్ 7వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగా అప్పటివరకు పాలన కొనసాగించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రజల ఆగ్రహానికి గురై ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా ఓటమిపాలైన విషయం మనందరికీ తెలుసు. అయినా బి ఆర్ ఎస్ పార్టీ తన పదేళ్ల కాలంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయకుండా ప్రలోభాలతోనే మభ్యపెట్టింది. అదే దారిలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగుతున్నది 2023 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పోటాపోటీగా ఒకరిని మించి మరొకరు హామీలు ఇవ్వడం జరిగింది హామీలు ఇచ్చిన నాడు ఏరకంగా అమలు చేస్తాము? నిధులు ఎక్కడి నుండి వస్తాయి? అనే సోయి లేకుండా మాట్లాడినటువంటి రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఓడిపోయిన టిఆర్ఎస్ గెలిచిన కాంగ్రెస్ పార్టీని ఎ లా హామీలు అమలు చేస్తావు? నిధులు ఎక్కడివి? ఎందుకు చేయడం లేదు?ఆరు గ్యారెంటీ ల సంగతి ఏమిటి? అని ఆనాటి నుండి నేటి వరకు ప్రశ్నిస్తూనే ఉంటే ముఖ్యంగా 12 మార్చి 2025వ తేదీన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ చేసిన ప్రసంగం పైన ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ లో కేటీఆర్ గారు
గవర్నర్ ప్రసంగం తప్పులతడకా అని రుణమాఫీ పూర్తిగా చేయలేదని రైతు భరోసా అందరికీ అందలేదని నిరుద్యోగులకు ఇతరులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాట్లాడడం జరిగింది. అది సంతోషమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల చేతిలో శిక్ష తప్పదు అని తెలుసుకోవాల్సిందే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తా మిచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు? రుణమాఫీ ఎందుకు నిర్లక్ష్యానికి గురైంది? రైతుబంధు పేరుతో కోట్లాది రూపాయలను ఎందుకు వృధా చేసినారు? పండని భూములకు అడవులకు చెట్లకు గుట్టలకు రోడ్లకు కూడా ప్రజాదనాన్ని చెల్లించి చేసిన ద్రోహానికి శిక్ష ఏమిటి? అనే విషయం మరిచిపోతే ఎలా? అంటే ఒకరిని మించి మరొకరు ద్రోహం తలపెట్టిన రీతి తవ్వి నాకొద్దీ పెంకులు వెళ్లినట్లు ఎల్లుతూనే ఉంటాయి. అసలు ప్రజలు ఏనాడైనా ఉచితాలు తాయిలాలు హామీలను కోరినారా? ప్రజలను బలి పశువులను చేయడానికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కులాలవారీగా సమావేశాలు పెట్టడం, కులాల వారిగా పాఠశాలలు నిర్మించడం, ప్రజలకు తాగుడు డబ్బులను ఎరచూపి ఎన్నికల్లో ఓటు వేయించుకోవడం మొదలుపెట్టి ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఆ అంటు వ్యాధిని సోకేలా చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే ప్రయోజనం ఏముంటుంది? దళితులను ముఖ్యమంత్రి చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ప్రజలను వంచన చేసి 7 లక్షల కోట్ల అప్పులతో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పితే ప్రస్తుత ప్రభుత్వం కూడా రైతుల పేరు చెప్పుకొని తన సంవత్సరం పైగా పరిపాలన కొనసాగిస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఇంకా విస్మరించబడిన వర్గాలు లేవా? ప్రస్తుతం రియంబర్స్మెంట్ పేరున ఇవ్వాల్సినటువంటి సుమారు 5000 కోట్ల పైగా రూపాయలు బి ఆర్ ఎస్ హయాంలో పెండింగ్ ఉన్నవే కదా! ఉద్యోగులకు ఇవ్వవలసిన నాలుగు డీఏలు, టిఆర్ఎస్ అమలు చేయనివే కదా! సర్పంచులకు ఇవ్వవలసినటువంటి కాంట్రాక్టు ఇతర ఖర్చు చేసిన బిల్లులను పెండింగ్లో ఉంచింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఇలాంటి పరిస్థితులలో ఒక దొంగ మరొక వ్యక్తిని దొంగ అని అంటే ఎలా సమాజం ఒప్పుకుంటుంది? నేరంతో సంబంధం లేకుండా నిజాయితీకి మారుపేరుగా ఉన్నవాడు మాత్రమే దొంగను దొంగ అంటే అర్థం ఉంటుంది కానీ ప్రజలకు ద్రోహం చేసినటువంటి వ్యక్తి మరొక వ్యక్తిని దొంగ అంటే ఎలా? ఇద్దరు కూడా తోడు దొంగలే అవుతారు కదా!
ఇప్పటికైనా రెండు పార్టీలతో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఉచిత విద్య వైద్యాన్ని నాణ్యమైన స్థాయిలో ఈ దేశ ప్రజలకు ఇవ్వడానికి సిద్ధపడితే సంతోషం.లేకుంటే ప్రజా చైతన్యం వెళ్లి విరియుచున్న నేపథ్యంలో రాబోయే కాలంలో ప్రజల ఆగ్రహానికి పార్టీలు పాలకులు ఎవరైనా గురికాక తప్పదు. ఎంతకాలం ప్రజలను వేధించి మోసగించి నయవంచనకు గురిచేస్తారు? అది సాధ్యం కాదు .విద్యను వైద్యాన్ని ప్రభుత్వం తన ఆధ్వర్యంలో కొనసాగించకుండా పెట్టుబడిదారీ వర్గాలకు ధారాధత్తము చేసి మౌనంగా ఉంటూ ప్రేక్షక పాత్ర వహిస్తే పేద ప్రజలు పడుతున్న బాధలకు అంతే లేదు. ఆమాత్రం స్పృహలేనటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఒకరిని మరొకరు విమర్శించుకొని కాలయాపన చేస్తే ప్రజలు మరిచిపోతారు అనుకోవడం మూర్ఖత్వం. "ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ తన పాత విధానాన్ని మరిచి ఉచిత విద్య వైద్యం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలిగితే భవిష్యత్తులో అధికారానికి వస్తే తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇవ్వగలిగితే కొంతవరకు ప్రజలు సంతోషిస్తారు. ఈ అంశాలు మినహాయించి పాత పాటనే పాడినట్లయితే ప్రజలు ఎవరూ సహకరించరు మీ తోడు దొంగల మోసం దగా దోపిడిని ప్రజలు తిరస్కరించడమే కాదు పెకిలించి వేస్తారు అని తెలుసుకోవడం చాలా అవసరం." ఎందుకంటే రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల ఓట్లకు పుట్టిన ప్రజా సంపదకు కేవలం కాపలాదారులు మాత్రమే. అంటే ఈ ప్రజా సంపదకు యజమానులు లేదా ప్రభువులు ప్రజలే అని గుర్తించి ఇప్పటికీ రాజకీయ పార్టీలు ప్రజలకు వివరణ ఇచ్చుకుంటే సంతోషం. ఇక భవిష్యత్తులో ఉచితాలు తాయిలాల జోలికి ఏ రాజకీయ పార్టీ కూడా వెళ్లకుండా చూడాలి. కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉచిత విద్య వైద్యాన్ని ప్రజా ఉద్యమంగా తీసుకురావడానికి కృషి చేస్తే సంతోషం. లేకుంటే అందరూ ఒక్క తానులోని ముక్కలే అని ఇప్పటికే ముక్కున వేలేసుకుంటున్న ప్రజలు విద్రోహుల భరతం పట్టడానికి సిద్ధపడతారు జాగ్రత్త!
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )