మట్టి కరిచిన మహానుభావులు..! అందలమెక్కిన అమాయకులు...!!!

Feb 15, 2026 - 21:57
Feb 15, 2026 - 22:13
 0  4
మట్టి కరిచిన మహానుభావులు..! అందలమెక్కిన అమాయకులు...!!!
మట్టి కరిచిన మహానుభావులు..! అందలమెక్కిన అమాయకులు...!!!

ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అయిన వేళ...!!!

ప్రతి కుక్కకు ఓ రోజు వచ్చిన సందర్భం...! ఓటర్ల చేతిలో చిత్తయిన రాజకీయ ఉద్దండ పండిత వర్గం...!

✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్

రాజకీయ క్రీడలో ఎక్కే నిచ్చెన మెట్లు ఉంటాయి, కిందికి మింగేసే నాగుబాములూ ఉంటాయి. అట్లా అని రాజకీయాలలో శాశ్వత శత్రువులు గానీ, శాశ్వత మిత్రులు గానీ ఉండరనేది జగమెరిగిన సత్యం. అధికారం శాశ్వతం అనుకుంటే అది భ్రమే అవుతుంది. మనిషి జీవితమే శాశ్వతం కానప్పుడు మనిషి జీవితంలో ఏదో కొద్దిగా కాలం అనుభవించే అధికారం మొత్తం ఎలా శాశ్వతం అనుకుంటాం. బతికినన్ని రోజులు మాదే అధికారం అనుకుంటే పొరపాటు, అలా అనుకోవడం కొందరికి గ్రహ పాటు. రెప్పపాటున రాలి పోయే జీవితానికి, కప్పదాటు కబుర్లు చెబుతూ, మెప్పును పొందుదాము అనుకుంటే చేతిలో చిప్పను మాత్రమే పెట్టే చరిత్ర తెలంగాణ ప్రజల సొంతం. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది రాజకీయ ఉద్దండులు, మహానుభావులు, తిరుగులేని చరిత్ర లిఖించిన నియంతలు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇక నాకు జీవితమంతా తిరుగులేదు, ఎదురు లేదు అనుకున్న రాజకీయ గర్విష్టులను పుట్టగతులు లేకుండా చేసిన చరిత్ర కాలానిది. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అధికారం ఎవరికి శాశ్వతంగా ధారా దత్తం ఓటర్లు చేయరని విషయాన్ని స్పష్టంగా వెల్లడి చేస్తుంది. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యాయి అన్న నానుడి ప్రకారం అధికారం, అనధికారం రాజకీయ జీవితంలో నిరంతరం కొనసాగే ఒక ఎన్నికల ప్రక్రియ. ఈసారి జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో ఓటమితో మట్టి కరిచిన మహానుభావులు ఎందరో కాగా, విజయంతో అందలమెక్కిన అమాయకులు ఉన్నారు. ఎవరిని ఎక్కడ వంచాలో, ఎవరిని ఎందుకు ఎక్కడ తుంచాలో చైతన్యవంతులైన తెలంగాణ ఓటర్లకు కొత్తేమి కాదు. తెలంగాణ సాయుధ పోరాటానికి పురిటిగడ్డగా నిలిచిన తెలంగాణ బిడ్డలకు అందలం ఎక్కించడం తెలుసు, అద: పాతాళానికి తొక్కడం తెలుసు, తెలియని దల్లా రాజకీయ నాయకులకే తమ భవిష్యత్తు ఎప్పుడు ఎలా ఉంటుందో అని. కీలెరిగి వాతపెట్టే తెలంగాణ ఓటర్లను డబ్బులు ఇచ్చి, మందు బోసి, విందు ఇచ్చి తాయిలాలు అందించి, బహుమతులు కట్టబెట్టి బుట్టలో వేసుకుందాం అంటే "నక్కజిత్తులన్నీ నా దగ్గర ఉంచుకొని తప్పించుకొని పారా తాంబేలు బుర్ర" అన్న చందంగా ఎక్కడ నానినా గానీ కాలు కింద మాత్రం నానకుండా గట్టిపట్టు పట్టి, నీటిలో మొసలికి ఉండే బలం గొప్పగా తనకంటే పెద్ద ఏ జీవినైనా పట్టు పట్టిన విధంగా ఎన్నికల యుద్ధంలో వార్ వన్ సైడ్ చేసేలా గొప్ప చారిత్రక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఓటరు, మేధావితనంతో బుర్ర పెట్టి ఆలోచించి, మహా విజ్ఞానిలా ఎన్నికలలో పోటీలు చేసిన వారిని, వారి పార్టీలను, వారి చరిత్రను పరీక్షించి, పరిశీలించి ఓటు వేసి ఇచ్చిన తీర్పు చరిత్రలో ఒక మైలు రాయి. కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు, కానీ అందరిని అన్నివేళలా మోసం చేద్దామనుకుంటే అది మోసం చేసేవారి అమాయకత్వం అవుతుంది. తెలంగాణ ఓటర్లు నమ్మితే విజయంతో కూడిన ప్రాణం ఇస్తారు, మోసం చేస్తే ఓటమి అనే పాఠం చెప్పి ప్రాణం తీస్తారు. "నమ్మి నాన్న పూస్తే పుచ్చి బుర్రలు అయ్యాయి" అన్నట్టుగా నమ్మకద్రోహం చేసే రాజకీయ నాయకుల భరతం పట్టడానికి తెలంగాణ ఓటర్లు ఎప్పుడు ఎన్నికల యుద్ధభేరి మోగిస్తూనే ఉంటారు. సావో, రేవో తెలుసుకోవడానికి, తేల్చుకోవడానికి, తేట తెల్లం చేయడానికి ఎన్నికల కథనరంగాన కాలు దువ్వుతుంటారు. రాజకీయ నాయకులు గెలిచినాక మరిచిపోయే తత్వాన్ని మట్టిగరిపిస్తారని, కరుణ దయ, ఆదరణ, అనుబంధం, ఆప్యాయతలతో మానవులుగా మానవత్వంతో ప్రవర్తించే రాజకీయ నాయకులకు వందనం అభివందనాలు తెలుపుతూ, హృదయం నిండా ప్రేమతత్వం నింపుకుని సలాములు కొట్టే గులాములుగా ఉండడం, మంచి పాలకులకు మరింతగా మద్దతు నందించడం కూడా తెలంగాణ ఓటర్లకు తెలుసు. ఈ విషయం ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ ఓటర్లు స్పష్టం చేశారు. 

గొప్పది కాలం... వేయకు గాలం...!

కాలం ఎంత గొప్పదంటే ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ ఉంచాలో కాలానికి (ప్రకృతికి) తెలిసినంతగా మరి ఎవరికీ తెలియదేమో. కాలాన్ని చేతితో బంధించి ఓటర్లకు గాలం వేసి కాలం వెళ్లపుచ్చుదామంటే కాలం ఊరికనే కూర్చుంటుందా, మార్పు తీసుకురాదా. ఓటర్లను అమాయకులుగా, చవటలుగా, దద్దమ్మలుగా, చులకనగా, చేవ చచ్చి చేతకాని వారిలా చూడటం ఇటీవల రాజకీయ నాయకులకు మహా ఫ్యాషన్ అయిపోయింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన ఓటు అనే వజ్రాయుధం ఎంత విలువైనదో ఓటర్లకు తెలియదని, వారు చాలా అమాయకపు గొర్రెలని, తోక ఊపుకుంటూ వచ్చే కుక్కలని, తాము తినగా మిగిలిన చేతి వేళ్ళకు అంటిన మెతుకులను తిని బతికే బహుపరాన్న జీవులని, కరెన్సీ నోటుకు, ఆల్కహాల్ సీసాకు అలా వోకగా ఓట్లు కొని ఐదేళ్లు అధికారంలో కులక వచ్చనే రాజకీయ నాయకుల కుటిల రాజకీయ యుక్తులను, కుయుక్తులను చాకచక్యంగా, అలవోకగా తిప్పి కొట్టిన గొప్ప చరిత్ర ఈ తెలంగాణ నేలది, తెలంగాణ ఓటర్లది. తెలంగాణ గాలికి, నేలకు మట్టికి,మంచినీటికి, చెట్టుకు పుట్టకు, రాయికి రప్పకు గొప్ప చారిత్రక నేపథ్యం, పోరాట వారసత్వం ఉన్న విషయం రాజకీయ నాయకులు మరిచారా. రాజకీయాలలో అధికారం సంపాదించి కోట్లు కూడా పెట్టి మళ్లీ ఆ కోట్లతోనే మళ్లీ ఓట్లనుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చి వీడు పోతే వాడు, వాడు పోతే వీడు మళ్లీ మళ్లీ గల్లి గల్లి లో అధికారం మాదే అని విర్రవీగితే ఏమి జరుగుతుందో తెలంగాణ ఓటర్లు తమ ఓటు ద్వారా తీర్పు చెప్పారు. రాజకీయ నాయకుల హామీలన్నీ నీటి మీద రాతలని తెలుసుకున్న తెలంగాణ ఓటర్లు ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవరిని ఎప్పుడు తొక్కలో తెలుసుకున్న విజ్ఞులు. అమాయకత్వం మాటున అవసరం దాగి ఉంటుంది, అవసరం మాటున మాయ మాటలు చెప్పి ప్రలోభానికి గురిచేసి ఒక్కసారి ఓటు గుద్దించుకున్నామా ఐదేళ్లు తెలంగాణ ఓటర్లు ఇక మాకు బానిసలే అన్న విర్రవీగి రాజకీయ అహంకారానికి తెరదించుతూ, తెలంగాణ ఓటరు చైతన్యవంతుడై ఎవరికి గుణపాఠం చెప్పాలో వారికే విలువైన ఓటుతో చురుక్కుమనిపిస్తూ మెరుపులు మెరిపించి మట్టి కరిపించి చుక్కలు చూపించిన శూరులు, తెలంగాణ వీరులు, నా ప్రియమైన తెలంగాణ ఓటర్లు. 

దిక్సూచిలా..

దివిటి కాగడాలై...

వేగుచుక్కలై...

వెలుగు దివ్వలై...

మార్గదర్శకులై..

మార్పు కోసం పోరాడిన *యోధులు...

తెలంగాణ ఓటర్లు...!!!

ఓట్లు అయిపోయినవి ఇక మాకు తెలంగాణ ఓటర్లతో మాకేం పని అని రాజకీయ నాయకులు అనుకుంటే అది వారి అజ్ఞానానికి ఓ మచ్చుతునక. సమయం చూసి లెక్క సరిజేసి, తిక్కను కుదిర్చి, బొక్కలు పూడ్చేసి, పక్కకు తిరిగి చూసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చుక్కలు చూపించి, మూసుకు కూర్చో అంటూ షాకింగ్ ల మీద షాకింగ్ న్యూస్ అందిస్తూ దెబ్బ కు దిమ్మ తిరిగేలా, నోటితో వెక్కిరించి, నొసలు చిట్లించి రాక్ షాకులతో కిరాక్ డ్యాన్సులు వేయిస్తూ రాజకీయ నాయకులకు ఊహించని ఎన్నికల రిజల్ట్స్ అందించిన తెలంగాణ ఓటర్లు ఈ మధ్యన బాగా పాపులర్ అయ్యారు. తాము చెప్పిన ఈ ఎన్నికల తీర్పుకు తామే పాయసం తిన్నంతగా సునాయాసంగా, పరవశం చెందుతూ, పరమానందం పొందుతున్నారు. ప్రకృతి నేర్పిన పాఠాలు, గుణ పాఠాలు, భావాలు, అనుభవాలు, తప్పొప్పులు, కష్టాలు ఇష్టాలు, లాభాలు నష్టాలు, బాధలు సంతోషాలు, మెరిట్ లు, డీ మెరిట్ లు, కోపాలు తాపాలు, చీకట్లు వెలుగులు, గెలుపులు ఓటములు, దుఃఖాలు సుఖాలు, పాపాలు పుణ్యాలు, విశ్వాసాలు అవిశ్వాసాలు, నమ్మకాలు అపనమ్మకాలు ఇలా కలిగిన ఎన్నో రకాల మంచి చెడు లక్షణాల కలబోత తెలంగాణ ఓటర్లు. భిన్న విభిన్న అభిప్రాయాలతో లోకో భిన్న రుచి అన్న సామెత ప్రకారం తమకు నచ్చిన, తాము మెచ్చిన వారిని అధికారం పీఠంలో కూర్చోబెట్టి ఐదేళ్లు గౌరవిస్తారు, తిరిగి ప్రతి గౌరవం ఉంటుందా, ప్రజలను గాలికి వదిలేసి పరిపాలన చేస్తే మళ్లీ వచ్చే ఎన్నికలలో అడ్రస్ లేకుండా చేయడానికి తెలంగాణ ఓటర్లు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలను చదువుకోకుండా, అందుకు బడ్జెట్ కేటాయించకుండా నిరక్షరాస్యులుగా ఉంచాలనుకోవడం, నిరక్షరాస్యులు అయితేనే తాము చెప్పిన విధంగా తలలూపుతూ, దేనిని ప్రశ్నించకుండా, ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోకుండా మా అడుగులకు మడుగులోత్తుతూ వత్తాసు పలుకుతారని భ్రమలకు మీరు చరమగీతం పాడండి. సగటు జీవి సంపాదన మొత్తం విద్యకు, వైద్యానికి ఆవిరైపోతుంటే సంసారాలు సాగేదేట్ల, జీవితంతో వేగేదెట్లా అని మదనపడే మనుషులకు మీరు ఆసరాగా నిలుస్తారా, ప్రైవేట్ రంగంలో విద్య వైద్యాన్ని అలానే ఉంచి పేదవాడిని దోచుకోవడానికి ఆస్కారం ఇస్తారా, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేనికైనా టైం రావాలి టైం రావాలి అంటారు, కానీ ప్రజలకు మంచి చేయడానికి మాత్రం ఏ రాజకీయ నాయకుడికి టైం ఉండదు, అలాంటి వారికి సరైన టైంలో సరైన విధంగా ఓటు ద్వారా జీవితపులో సరైన టైము చూపించే విధంగా చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ఓటర్లు అందవేసిన చేయి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాకు ఏమీ అవసరం, అధికారమే మాకు శాశ్వతం అనుకొని విర్రవీగిన ఎంతోమంది రాజకీయ నాయకులు మరణం నుండి తప్పించుకోలేక తాము సంపాదించిన అవినీతి కోట్ల సంపాదనను వదిలేసి మట్టిలో సమాధి అయ్యారు. స్మశానంలో బూడిదగా, మట్టిలో మట్టిగా మిగిలారు చూడు. తెలంగాణ ఓటర్లకు ఎవరిని రాజకీయ సమాధి చేయాలో బాగా తెలిసిన విద్య. ప్రజలను అవివేకులుగా అనుకుని, అంచనా వేసి వారికి కూడు గూడు కూడా లేకుండా చేసి, సొంత సంపాదనకు మరిగి కోట్ల అవినీతి సొమ్ముతో ఊరేగితే మిగిలేది రాజకీయ సమాధి అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రజా సంక్షేమ కోసం, సమాజాభివృద్ధి కోసం నిస్వార్ధంగా సేవలందించి ప్రజాసేవనే పరమావధిగా తమ తమ జీవితాలనే ప్రజలకు అంకితం చేసి త్యాగం చేసిన నైతిక విలువలు ఉన్న రాజకీయ నాయకులను తెలంగాణ ఓటర్లు ఎప్పుడు గుండెల్లో గుడి గట్టి పూజిస్తారు అన్న విషయాన్ని కూడా రాజకీయ నాయకులారా మరవకండి. తెలంగాణ ఓటర్లను కులాల వారిగా, ప్రాంతాలవారీగా, మతాలవారీగా, వర్గాల వారీగా, వర్ణాల వారిగా, జాతుల వారీగా విభజించి, మతం, కులం మత్తులో ఉంచి ప్రజలను పావులుగా వాడుకొని అధికారం సంపాదిస్తామంటే మీరు ప్రజలకు చేసే ద్రోహానికి మీకు చెల్లు చీటీ చించినట్లే అని భావించండి. మీరు గెలిచి, అధికారం సంపాదించి ప్రజల కోసం, మంచి సమాజం కోసం, మంచి పాలన సాగిస్తూ ప్రజల కోసం నిరంతరం పాటుపడతారా, సొంత సంపాదనకు అలవాటు పడి ప్రజల డబ్బును దుర్వినియోగం చేసి కోట్లు వెనకేసుకుంటారా, ప్రజల మనసులలో ద్రోహులుగా మిగులుతారా అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333