ఆత్మీయ సమ్మేళనాలు  మానవతా విలువలకు అద్దం పట్టాలి

May 11, 2024 - 21:15
Jun 7, 2024 - 18:55
 0  118
ఆత్మీయ సమ్మేళనాలు  మానవతా విలువలకు అద్దం పట్టాలి

విద్యార్థి దశ నుండి నేటికీ వచ్చిన పరిణామాలను విశ్లేషించుకోవడానికి వేదిక కావాలి .

ఈ సమ్మే ళనాలు గురువుల పట్ల  గౌరవం, ఆదరణ,  ప్రేమానురాగాలకు  నిలయం కావడం సంతోషకరం.

---వడ్డేపల్లి మల్లేశం

ఇటీవల  పాఠశాల స్థాయి (10th ) పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు  తరచుగా జరగడాన్ని అభినందించాలి. అదే సందర్భంలో  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా ఒకవైపు కొనసాగుతుంటే  మరొకవైపు ఏడవ తరగతి  మాత్రమే అప్పట్లో ఉన్న పాఠశాలల విద్యార్థులు  ఏడవ తరగతి  ఆత్మీయ సమ్మేళనాలు కూడా జరుపుకోవడం ముదావహం . .విద్యార్థి దశలో  10 ,20, 30 ఏళ్ల క్రితం  తమ చిలిపి చేష్టల ద్వారా తరగతి గది ఆట స్థలం,  బయట చిలిపి అల్లరి చేష్టలు చేసినటువంటి ఆనాటి విద్యార్థులే నేడు  యువతగా  తమనాటి గురువులను  ఆహ్వానించుకొని  ఆనాటి గౌరవానికి రెట్టింపు గౌరవాన్ని ఇవ్వడంతో పాటు గతంలో చేసిన పొరపాట్లను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమించమని కోరుతూ మాట్లాడుతున్న తీరు నిజంగా అభినందనీయమే.  అదే సందర్భంలో  నాటి గురువులు నేడు ఈ సమ్మేళనాలకు హాజరైన సందర్భంలో మాట్లాడినప్పుడు  స్నేహితులుగా మిత్రులుగా సంబోధిస్తూ  పూర్వ విద్యార్థులను ఆత్మీయంగా పలకరించడాన్నీ మనం చూడవచ్చు.  దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కలుసుకోవడం ఒక ఎత్తు అయితే  చిన్ననాడు ఉన్నటువంటి ముఖ కవళికలను  సరిగా పోల్చుకోలేము గుర్తుపట్టలేము కనుక ఇంటి పేరుతో సహా అడిగి తెలుసుకుని కొంత జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నాన్ని ఉపాధ్యాయులు చేయడాన్నీ మనం స్వాగతించాలి. అదే సందర్భంలో  ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిగత ప్రవర్తన, కోపతాపాలు, ఆనాటి శిక్షలు ,లేదా బోధించిన తీరు,  భోధ నా పటిమ, హాస్యము, చలోక్తులు  వంటి గత స్మృ తులను అనుభవాలను విద్యార్థులు  తమ పరిచయ కార్యక్రమంలో వల్లే వేస్తుంటే గురువుల హృదయం పులకరించి పోతున్నది.  అది తప్పైనా ఒ ప్పైనా  మంచి విమర్శైనా చెడు విమర్శైనా ఉపాధ్యాయుల గురించినటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని ఆనాటి విద్యార్థులు వ్యక్తం చేయడానికి ఉపాధ్యాయులు స్వాగతించాలి. తప్పనిసరిగా నిండు మనసుతో  పిల్లలను అభినందించాలి ఎందుకంటే ఆనాటి పిల్లలకు వివాహమై పిల్లలై కుటుంబ సమేతంగా కూడా ఈ సభలు నిర్వహించుకుంటున్న వారిని కూడా మనం గమనించవచ్చు.  ఇక మరికొందరు  కుటుంబ సభ్యులతో హాజరైనట్లయితే  తమ స్వేచ్ఛ స్వాతంత్రాలకు బంగమని నిర్మోహమాటంగా మాట్లాడుకోవడం కష్టమని గత స్మృతులను నెమరు వేసుకోవాలంటే  తొలి దశలో కుటుంబ సభ్యులతో కాకుండా  నాటి తరగతి  విద్యార్థులే హాజరుకావడం ముఖ్యమని భావించి ఆ రకంగా నిర్వహించుకుంటున్న సందర్భాలను కూడా మనం గమనించాలి .అయితే ఇలాంటి సమావేశాలలో చర్చకు వస్తున్న అంశాలలో ప్రధానమైనది  తమ అనుభూతులను అనుభవాలను పాఠశాలతో గల అనుబంధాన్ని నెమరు వేసుకుని మధుర క్షణాలను కుటుంబ సభ్యులు కూడా చూడాలనేటువంటి ఆలోచన విద్యార్థులకు రావడం, ఉపాధ్యాయులు కూడా అనేక సందర్భాల్లో సూచించడం వలన  ఇలాంటి సమ్మేళనాలు  రెండు మూడేళ్ల కు ఒ క్కసారైనా నిర్వహించుకోవాలని కుటుంబ సభ్యులందరం హాజరుకావాలని నిర్ణయం తీసుకోవడాన్నీ కూడా మనం గమనించవచ్చు .

సభలు సమావేశాలు జరుగుతున్న తీరు

నెల రెండు నెలల నుండి ఆనాటి నుంచీ విద్యార్థుల యొక్క జాబితాను సిద్ధం చేసుకోవడంతో పాటు  చదువుకున్న పాఠశాలకు వెళ్లి వారి వివరాలను సేకరించడం కష్ట  పడి ఫోన్ నెంబర్లను కూడా సేకరించి అందరికీ సమాచార ఇవ్వడం  సుమారుగా ఒక తేదీని నిర్ణయించుకొని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయించి అందరూ తప్పకుండా హాజరు కావాలని డబ్బులతో ప్రమేయం లేకుండా హాజరుకావడమే ముఖ్యమని కూడా సమావేశాన్ని నిర్వహించే క్రమంలో ముందు వరుసలో ఉంటున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు అందరినీ  కోరడం చాలా సంతోషించదగ్గ పరిణామం.  విద్యార్థి దశలో ఉన్న నాటికి ఈనాటికి వాళ్లలో శారీరకంగా మానసికంగా  భావనాపరంగా వచ్చిన మార్పులను ఈ సందర్భంలో మనం గమనించవచ్చు.  ఓర్పు నేర్పు మర్యాద మన్నన  తొందరపాటు లేకుండా పని విభజన చేసుకొని  కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి నిర్ణయించుకున్న తేదీ రోజున ఉదయం 9 గంటలకి అందరూ  పాఠశాలకు చేరుకోవాలని పిలిపివ్వడం అందరూ కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చి తమ  విలువైన సమయాన్ని స్నేహపూర్వకంగా గడపడాన్ని కూడా మనం  సామాన్య విషయంగా చూడకూడదు . ఇక పండుగ వాతావరణంలో కొనసాగే ఈ కార్యక్రమం పాఠశాల ప్రాంగణంలో వంటలు, భోజనాలు,  వేదిక అలంకరణ  సమావేశంలో  ఆనాటి  విద్యార్థులు తమ పరిచయాలతో పాటు ఉపాధ్యాయుల పట్ల పాఠశాల పట్ల అనుభవాలను వ్యక్తం చేయడం మొదటి దశగా కొనసాగడం అంతకుముందు ఎవరైనా అనివార్యంగా ఆ బ్యాచ్కు సంబంధించినటువంటి  విద్యార్థులు మరణించినట్లయితే వారి స్మృతికి మౌనం పాటించడం ఇటీవల కాలంలో సంస్కారంగా  గౌరవంగా  కొనసాగుతున్న విధానంగా మనం భావించాలి .ఆ తర్వాత ఉపాధ్యాయుల యొక్క అనుభవాలను  ప్రసంగా రూపంలో వినడానికి  ఎదురుగా సభాస్థలిలో కూర్చున్న ఆనాటి విద్యార్థులు నేటి యువత చాలా ఆసక్తిగా గమనించడానిమనం చూడవచ్చు .మధ్య మధ్యన చప్పట్లు,  హర్షాతిరేకాలు, ఆమోదాలు, ఆనందాలు వ్యక్తం చేయడం  నాటి అనుభూతులను నెమరు వేసుకున్నప్పుడు లేదా విద్యార్థులను ప్రేమతో ఆత్మీయంగా పలకరించినప్పుడు వారిలో  అనుభూతిని మనం ఈ సందర్భంగా కల్లారా చూడవచ్చు.  ఉపాధ్యాయులుగా మీరు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారని మరికొంత కాలం ఇలాగే ఉండాలని తరచుగా మేము నిర్వహించే కార్యక్రమాలకు మీరు రావాలని  కోరినప్పుడు ఉపాధ్యాయులు కూడా  మీ ప్రేమానురాగాలు మాకు ముఖ్యమని మాకు కానుకలు  సన్మానాలు అవసరం లేదని పలకరింపుకు  ఆత్మీయంగా రావడం మా యొక్క కనీస బాధ్యత అని చెమ్మగిల్లిన కళ్ళతో ఆనంద భాష్పాలు రాలుతుంటే మాట్లాడుతున్నటువంటి మాటలు  విద్యార్థి ఉపాధ్యాయుల మధ్యన ఉన్నటువంటి  అనుబంధానికి నిదర్శనం గా మనం చూడాలి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో చదువుకొని తిరిగి ఎక్కడెక్కడికో ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్లిపోయినప్పటికీ  బోధన అభ్యసన ప్రక్రియ సందర్భంగా పాఠశాలలో కలిసిన కొంతకాలం  ఆ బంధమే ఇంత గాడమైన అనుబంధానికి కారణం అవుతున్న సందర్భంలో ప్రపంచంలో గురు శిష్యుల మధ్య ఉన్న బంధం ఇక ఎవరి మధ్యన లేకపోవడాన్ని మనం గౌరవించాలి దానిని గొప్పగా భావించాలి. ఉత్కృష్టమైన  సంబంధం గా కొనియాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలో అనేక రంగాలకు సంబంధించి నిపుణులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుని మాత్రమే ఇంత ఉత్కృష్టమైన స్థానంలో నిలబెడుతున్న దానికి ప్రధాన కారణం  ఉపాధ్యాయులు తమ జీవితాలను  తీర్చిదిద్దినారని భావించడమే కదా!  ప్రపంచంలో అనేక రంగాల నిపుణులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడికి మాత్రమే ఈ గొప్ప స్థానం లభించడం అనేది అరుదైన సంఘటన అందుకే ఉపాధ్యాయులు విద్యార్థులు పులకరించి పోతారు,  పరస్పరం పలకరించుకుంటారు,  ప్రేమానురాగాలతో కలకాలం కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు,  ఆ బంధం అజరామరం, అనూహ్యం,  అద్భుతం.

ఈ ఆత్మీయ సమ్మేళనాలు  మానవతా విలువలను సామాజిక బాధ్యతలను  కుటుంబ ఎదుగుదల తో పాటు తమ వంతుగా ఈ సమాజానికి చేయవలసిన సేవ భావాన్ని గుర్తింప చేయడానికి  తమ తోటి మిత్రులతో పాటు సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారిపట్ల జాలి దయ ప్రేమ అనురాగంతో కర్తవ్యాన్ని నిర్వహించడానికి సహనం  శాంతి ప్రేమ  పేదల పట్ల జాలి  అవసరమైతే తోడ్పాటు అందించగలిగే  త్యాగశీలతను పెంపొందించడానికి ఈ వేదికలు  కావాలని మనసారా కోరుకుందాం.  మంచిని పెంచడానికి, అందరికీ పంచడానికి ,తోటి మనిషిని సాటి మనిషిగా చూడడానికి  సంబంధించినటువంటి చర్చ ఈ సమ్మేళనాల సందర్భంగా కొనసాగాలి. మనిషిని మనిషిగా చూడగలిగే మహోన్నత భావానికి ఈ వేదికలు నిలయాలుగా మారాలి . కల్లా కపటం, మూర్ఖత్వం,  అహంకారం, ఆధిపత్యం, గర్వం ,స్వార్థం వంటి చెడు వ్యసనాలను దూరంగా తరిమికొట్టగలగడానికి ఈ వేదికల్లో అందరూ ప్రతిజ్ఞ చేయాలి.  ఈ సామాజిక మార్పుకు తమ వంతుగా త్యాగం చేయడానికి కృషి చేయడానికి కర్తవ్యంతో బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రమాణ పూర్వకంగా  ఉపాధ్యాయుల సమక్షంలో స్పష్టమైన హామీ ఇవ్వగలగాలి. అప్పుడు ఈ వేదికలు కేవలం పండుగలుగా మాత్రమే కాకుండా సామాజిక పరిణామ క్రమంలో ఎంతైనా కొంత ఉపయోగపడతాయని పడాలని   ఆశిద్దాం. అందరం ఆ వైపుగా ఆచరిద్దాం,  కలకాలం ఇలాగే కలిసుందాం, మనసులు పంచుకుందాం.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333