ప్రతి వ్యక్తి తనకూ ఓ చరిత్ర నిర్మించుకోవడమెంత ముఖ్యమో అక్షర రూపం ఇవ్వడం కూడా అంతే
ప్రతి వ్యక్తి తనకూ ఓ చరిత్ర నిర్మించుకోవడమెంత ముఖ్యమో అక్షర రూపం ఇవ్వడం కూడా అంతే. బాధ్యతలు గుర్తించి, అవగాహన పెంచుకోవడానికి, భావితరాల కోసం, కుటుంబ చరిత్రలు దోహదపడి,
నిబద్ధతకు నిజాయితీకి కొలమానాలు అవుతాయి
వడ్డేపల్లి మల్లేశం
గతం ఏరకంగా ఉన్నప్పటికీ దాని పునాదుల మీద వర్తమానాన్ని నిర్మించడానికి అది భవిష్యత్తుకు దోహదపడే విధంగా ఉండడానికి చేసే ఆలోచన దానికి లిఖిత రూపమే చరిత్రగా మనం భావించవచ్చు. కొన్ని విషయాలలో" వెను తిరిగి చూడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పోరు బాటలో పయనించినారు " అని చెప్పుకుంటాం అంటే అంకిత భావముతో సరైన మార్గంలో పయనించి లక్ష్యాన్ని చేరుకున్నార ని అర్థం.మరొక సందర్భంలో వెనుక ముందు చూడకుండా, సమయస్ఫూర్తిగా ఆలోచించకుండా, గుడ్డిగా ప్రయాణం చేయడం వలన ప్రమాదం సంభవించింది అని చెబుతాం. ఈ సంఘటనలో దాని పర్యవసానాలు చెడు పరిణామాలు రాబోయే ప్రమాదాలను ఊహించకుండా గుడ్డిగా వ్యవహరించడం జరిగింది అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మనిషి ప్రయాణం చేసే దిశను, సందర్భాన్ని, లక్ష్యాన్ని, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఒక పనికి ఉద్యుక్తులైనప్పుడు ఆలోచించి పూర్వాపరాలను పరిశీలించి, పరిణామాలను విశ్లేషించుకుని, లక్ష సాధన వైపుగా వెళ్లాలనే ఆలోచన సామాన్యుల నుండి అసమానుల వరకు కూడా ఉండాల్సిందే. ఇటువంటి సందర్భంలో మనం ఎదుర్కొన్న అనుభవాలు, కొన్ని సంఘటనలు, ఎదురైన ఆటుపోట్లు, త ట్టుకున్న అవమానాలు, చేసిన తప్పిదాలు, గమనించిన లోపాలను మనసులో పెట్టుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు కనుక వాటిని రాసి పెట్టుకున్నట్లయితే ఆ లోపాలు తిరిగి పునరావృతం కాకుండా చూసే అవకాశం ఉంటుంది. అంటే ఎన్నో రకాల సంసిద్ధమైనప్పటికీ కొన్ని కారణాల వలన విఫలమైనట్టుగా మనకు తెలిసి వస్తుంది కనుక ఆయా సంఘటనలకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలను రాసి పెట్టుకోవడం మంచిదేనేమో! ఇప్పటివరకు ఇలాంటి అంశాలను సన్నివేశాలను సందర్భాలను మనసులోనే నిక్షిప్తం చేసుకున్న సందర్భాలు ఎక్కువ. ముఖ్యంగా మన పూర్వీకులకు ఈ జ్ఞాపకశక్తి ఎక్కువ కనుక వాళ్ళు అన్ని విషయాలను కూడా తేదీ సమయం చెప్పలేకపోవచ్చు కానీ సందర్భం సన్నివేశం ఆనాడు పాల్గొన్న మనుషులు జరిగిన బాధలు అన్నింటినీ పూస గుచ్చినట్లు చెప్పగలరు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రకంగా జ్ఞాపకం ఉంచుకోవడం సాధ్యం కాకపోవడం, వాతావరణం అనేక రకాలుగా విచ్ఛిన్నమైపోవడం, మానవ సంబంధాలు దెబ్బ తినడం, అనారోగ్య పరిస్థితులు, మానసిక సంఘర్షణ వంటి కారణాలు ఏవైతే నేమి నిన్న మొన్న జరిగిన సంఘటనలే జ్ఞాపకం ఉండకపోవడం మనం అనుభవిస్తున్న విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన పొరపాటును సవరించుకొని మంచి దారిలో ప్రయాణం చేసి తోటి వాళ్లకు కూడా మన అనుభవాన్ని రంగరించి వ్యవస్థను ప్రక్షాళన చేసే క్రమంలో తోటి మనిషిని సాటి మనిషిగా చూసే సందర్భంలో మనం ఎదుర్కొన్నటువంటి అనుభవాల అన్నింటిని కూడా రాసుకోవడం మంచిదే. దానినే మన కుటుంబ చరిత్ర అని అంటే అర్థవంతంగా ఉంటుంది.
కొందరు దినసరి కార్యక్రమాలకు పరిమితమై వృత్తిని మాత్రమే అంకితభావంతో పనిచేసి కనీస విలువలకు కట్టుబడి జీవిస్తారు. మరికొందరు వృత్తి తో పాటు ప్రవృత్తి సామాజిక చింతన వీలైన మేరకు ఇతరులకు తోడ్పాటు అందించే కృషిలో భాగస్వాములు అవుతారు. ఇoకొందరు అవగాహన చేసుకున్న తీరు, ఎదిగిన స్థాయి, సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించే ధోరణిని బట్టి మరింత విస్తృతంగా సంఘ జీవితానికి అలవాటు పడిన వారు ఉంటారు. ఈ రకంగా వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో త్యాగాలు, వృత్తులు, ప్రవృత్తులు, విధినిర్వహణ ఉంటే అదే స్థాయిలోపల మనం చేసినటువంటి పనులకు సంబంధించి పదిమందికి ఆచరణ సాధ్యంగా ఆదర్శంగా ఉన్నటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా నిక్షిప్తం చేసినట్లయితే ఇతరులకు ఎంతో కొంత మార్గదర్శకంగా ఉంటుంది కదా!. అందుకే భారత మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక సందర్భంలో "చరిత్రలను అధ్యయనం చేయాలి తద్వారా జ్ఞానాన్ని, దాగి ఉన్న విజ్ఞానాన్ని సేకరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి వ్యక్తి కూడా తన కార్యక్రమాలు ఆచరణ ఆదర్శం ద్వారా తనకంటూ ఓ చరిత్రను కూడా నిర్మాణం చేసుకోవాలి. తద్వారా మానవ జీవితానికి సార్థకతను సమకూర్చుకుంటే మంచిది" అని చెప్పిన అంశంలో కూడా ప్రతి వ్యక్తి చరిత్రత్మకంగా జీవించడమే మంచిదని నలుగురు తలుచుకునే స్థాయిలో ప్రతి వ్యక్తి యొక్క జీవన అనుభవాలు ఉండాలని అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుందని మనకు అర్థం అవుతున్నది.
చారిత్రక వ్యక్తులు కొందరే కావచ్చు కానీ తమ చరిత్రను అందరూ రాసుకుంటే మంచిదే:-
చరిత్రకు అందనంత దూరంలో అనేకమంది త్యాగదనులు, పోరాట వీరులు, నిపుణులు మనకు గతంలోకి తొంగి చూస్తే కనిపిస్తారు. ఆనాటి చరిత్రకారులు గుర్తించకపోవడం, చరిత్రను నిక్షిప్తం చేయకపోవడం, ఆ స్థాయిలో స్ఫూర్తి లేకపోవడం, నిర్లక్ష్యం వంటి అనేక కారణాల వలన చరిత్ర ఎన్నదగిన లక్షలాదిమంది వ్యక్తులు ఇవాళ చరిత్ర కందకుండా పోయిన మాట వాస్తవమే. అయితే ఇటీవలి కాలంలో కొందరి పరిశోధనల ద్వారా వాళ్లకు చరిత్రను కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నది భౌతిక చారిత్రక ఇతర ఆన వాళ్ళ ఆధారంగా పరిశోధకులు ఎంతోమంది చరిత్రలను నిక్షిప్తం చేసిన సందర్భాలను మనం గమనించవచ్చు. తెలంగాణ సాయుధ పోరాటంలో పూర్వ నలగొండ జిల్లా కడివెండి గ్రామానికి చెందినటువంటి నల్ల నరసింహులు వీరోచి తంగా పోరాడినప్పటికి ఆయన భార్య నల్ల వజ్రమ్మ కూడా తన శక్తి మేరకు దళములో సభ్యురాలుగా సేవలందించినట్లు జనములో ఉన్న ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని, అందుకు సంబంధించిన ఆధారాలను కొన్ని సేకరించి, కొంతమంది పరిశోధకులకు దొరికిన కొన్ని ఆధారాల ద్వారా చరిత్రను " తెలంగాణ సాయుధ పోరాటంలో నల్ల వజ్రమ్మ" అనే పేరుతో నేను వ్యాసం రాయడం జరిగింది. ఈ రకంగా కాలానుగుణంగా చరిత్రకేక్కే వాళ్ళు కొందరైతే మరికొందరు శాశ్వతంగా కనుమరుగైన వాళ్ళు కూడా లేకపోలేదు . మామూలు వ్యక్తుల చరిత్ర మనకు అందుబాటులో ఉంటే విరోచితమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొన్న వారి యొక్క చరిత్ర కూడా అందకుండా పోయిన సందర్భాలను గమనించవచ్చు కాబట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి ఆయా రంగాలలో ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు చరిత్రకారులు రచయితలు, , కళాకారులు, మేధావులు నిపుణులు, సామాజికవేత్తలు ఇలాంటి అంశాల పైన దృష్టి సారించి చరిత్రలో వారిని నిలబెట్టడం అవసరం. ఇక అదే సందర్భంలో నెహ్రూ గారన్నట్లుగా ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే అంతరార్థంలోనే చరిత్ర నిర్మాణం చేసుకోవాలి అని చెప్పినాడు కనుక సామాజిక స్పృహతో తన ఆసక్తుల మేరకు ప్రత్యేక రంగాన్ని ఎంపిక చేసుకొని కృషి చేయడం ద్వారా తనకంటూ ఒక స్థానాన్ని పదులపరుచుకోవడం బాధ్యతగా స్వీకరించాలి. ఆ అంశాల క్రమాన్ని రచన రూపంలో నిక్షిప్తం చేస్తే భావితరాలకు పరిశోధనకు, ఆదర్శంగా తీసుకోవడానికి, అనుభవాలకి ఎంతో తోడ్పడతాయి. ప్రస్తుతము అనేకమంది కవులు రచయితలు, కథా రచయితలు, సామాజికవేత్తలు తాము రాస్తున్నటువంటి రచన వ్యాసంగాలలో తమ అభిప్రాయాలను పూసగుచ్చినట్లు వ్యక్తం చేస్తూ పుస్తక రూపంలో ప్రచురిస్తూ భావితరాలకు అందజేస్తున్న విషయాన్ని మనం అభినందించవలసిన అవసరం ఉంది .అయితే ప్రతి వ్యక్తి లేదా ప్రతి కుటుంబం ఆ స్థాయిలో కాకుండా వాళ్ల వంశ చరిత్ర గ్రామ చరిత్ర కుటుంబ చరిత్ర చిన్ననాటి పరిస్థితులు ఏ రకంగా ప్రభావితులైనారు ఏ వృత్తిని స్వీకరించినారు వాళ్ల విద్యార్హతలు వాళ్ల కాలంలో మానవ సంబంధాలు ప్రేమానురాగాలు కుటుంబ సంబంధాల వంటి వాటిని కొంత అధ్యయనం చేయడానికి తర్వాతి తరాలకు వీలుంటుంది. కనుక అది పెద్ద బైండింగ్ పుస్తక రూపంలోనే కాదు కానీ వాళ్ల అభిప్రాయాలను నోటుబుక్కుల లోనైనా పది లపరచవలసిన అవసరం ఉంది. ఇప్పటికీ కొన్ని పురాతన కాలపు వ్యక్తుల ఇండ్లలో వాళ్ళ అభిప్రాయాలు రాసుకున్నటువంటి చి ట్టాలు ప ద్దులు ఆనాటి జ్ఞాపకాలు వాళ్ల వంశంలో ముఖ్యమైన వాళ్ళు వంటి విషయాలను మనం గమనించవచ్చు. ఇటీవల కాలంలో మరికొందరు తమ ఉమ్మడి కుటుంబ చరిత్రను ఒక పుస్తక రూపంలో అచ్చువేసి ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో దానిని విడుదల చేసి ఉత్సవాలను నిర్వహించడం ద్వారా వంశ చరిత్రను రాస్తున్న వాళ్లను కూడా మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా పాఠకులకు మాత్రమే ఉపయోగపడతాయి.ప్రాథమికంగా మనం చదవడానికి,తెలుసుకోవడానికి, ఆలోచించడానికి, ఆచరించడానికి సిద్ధంగా లేనట్లయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పుస్తకాలు గ్రంథాలు పత్రికలతో పాటు ఇలాంటి కుటుంబ చరిత్రలు కూడా వృధా అవుతాయి అనడంలో సందేహం లేదు అంటే ప్రస్తుతము అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గా వివిధ రూపాలలో ఉన్నటువంటి సాహిత్యాన్ని చదువుతున్న వాళ్లు కేవలం 10 శాతం కూడా లేరు అని ఒక అంచనా అలాంటప్పుడు కుటుంబాల చరిత్ర అవసరమా అని కొందరు ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు.కానీ కుటుంబాల చరిత్ర కొందరైనా రాసుకుంటే దాన్ని వాళ్ళ పిల్లల పిల్లలు భావితరాలు స్ఫూర్తి గా తీసుకోవడానికి, అనుభవాలను వినియోగించుకోవడానికి,వంశ గౌరవాన్ని ప్రశంసించడానికి, గతంతో పోటీ పడడానికి, మనకంటూ ఓ స్థానం నిలబెట్టుకోవాలనే ఆరాటం వ్యక్తుల్లో పెరుగుతుంది. కుటుంబంలోని అందరూ అనుభవాలను రాయకపోవచ్చు కానీ కుటుంబం గురించి ఆ కుటుంబంలో ఎదిగిన వ్యక్తి రాయడం ద్వారా ఈ ఆలోచనను పాఠశాలల్లో ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులకు లేదా విశ్వవిద్యాలయ స్థాయిలో ఆచార్యులు ఎదిగిన విద్యార్థులకు అందించడం ద్వారా నాగరికమైన సంస్కారమైన అలవాటుకు నాంది పడుతుంది. తమ కుటుంబ చరిత్రను తానే రాసుకుంటే సక్రమంగా ఉంటుంది ఇతరులు రాస్తే వక్రమవుతుంది అట్లా అని నేరస్తులు దొంగలు అవినీతిపరులు అఘాయిత్యాలకు పాల్పడిన వారు కూడా తాము మంచివారమని రాసుకుంటే చరిత్ర క్షమించదు అని తెలుసుకుంటే మంచిది. చరిత్ర మనకు గౌరవాన్ని పెంచుతుంది తప్పుదారిలో పోతే చరిత్ర మనలా హెచ్చరిస్తుంది కూడా.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )