పుర స్కారాలు, గుర్తింపు కోసం కాదు కవులు ఆరాటపడవలసింది ప్రజా సమస్యల పరిష్కారం గూర్చి
అహంకారం కాదు ఆత్మవిశ్వాసం, పొగడ్తలు కాదు ప్రజల కడగండ్లపై పోరాటం, స్వార్థం కాదు
జన బహుల్యంతో మమేకం కవి, రచయితల నిత్య కృత్యం కావాలి !
---- వడ్డేపల్లి మల్లేశం
వ్యక్తి ఆరాధన రాజకీయం రంగంలో పాలనా క్షేత్రంలో నిషేధించబడినట్లే సాహిత్య రంగంలో కూడా అతిగా పొగడడం ప్రశంసల జల్లు కురిపించడం ఆకాశానికి ఎత్తడం రచయిత చుట్టే వర్ణనలు కొనసాగడం కూడా నిషేధించతగినదే .రాజకీయ రంగంలో వ్యక్తి ఆరాధన నిషేధించవలసినదని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కాలంలో చేసిన సూచన నిజమైన ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని ఏ రకంగా హెచ్చరించినారో అదే అర్థాన్ని సాహిత్య రంగంలో కూడా అన్వయించుకోవాలి. ఒక రచయిత సృష్టించిన సాహిత్యం సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా తోడ్పడుతుంది అనే విషయమే ప్రధానం కావాలి కానీ పుస్తకావిష్కరణ, అంకిత కార్యక్రమం, రచయితకు సన్మానం వంటి కార్యక్రమాల సందర్భంలో
ఆ గ్రంథములోని సాహిత్యాన్ని చర్చించకుండా పక్కనబెట్టి హాజరైన ప్రతి ఒక్కరూ రచయితను సన్మానాలతో ముంచెత్తడం అంటే సాహిత్య రంగం తన బాధ్యతను కొంత విస్మరించడమే అవుతుంది. మరీ ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే వేదిక మీద ఉన్న వాళ్లకు మాత్రమే సభా కార్యక్రమాన్ని పరిమితం చేస్తూ ప్రేక్షకులను పట్టించుకోకుండా ప్రేక్షక లోకంలో ఉన్నటువంటి నిపుణులు మేధావులు సాహిత్యకారులను కూడా గుర్తించకుండా కొనసాగే ఏ సభ అయినా కూడా దాని లక్ష్యాన్ని పూర్తిగా నెరవేర్చదు. ఎందుకంటే ఇక్కడ కావలసింది చర్చ , పుస్తకంలోని వివిధ అంశాల పైన విశ్లేషణ, రచయిత యొక్క సమాధానం, సబికుల ప్రశ్నలు , అంతిమంగా సభ సమాధానమివ్వడం వంటి సోపానాలలో సాహిత్య సభలు జరగాలి. ఇదే సందర్భంలో అవసరమైతే సాహిత్యానికి సంబంధించి భిన్న కోణాలలో హాజరైన ప్రముఖుల నుండి చర్చను ఆహ్వానిస్తే మరింత బలవంతంగా ఉంటుంది. కానీ ఎంతసేపు సభ నిర్వాహకులు రచయిత ఆహ్వానితులను కేంద్రంగా చేసుకొని వారిని ఆరాధించడం సన్మానించడం స్వాగతాలు పలకడం వరకు మాత్రమే పరిమితమైతే అది మొక్కుబడిగా గంటల తరబడి కార్యక్రమం జరగవచ్చు కానీ దాని ప్రయోజనం సబికులకే అందనప్పుడు ప్రజల్లోకి ఎలా వెళుతుంది? . సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉంటుందని అందరికీ తెలుసు అదే కోణంలో రచయితలు పాఠకులు ఇతర కవులు కళాకారులు ప్రజలు ఆలోచిస్తారు కానీ సాహిత్య ప్రయోజనాన్ని సామాన్య ప్రజానీకానికి చేరవేయడం ఎలా ?అనే అంశం మాత్రం నిరంతరం నిర్లక్ష్యానికి గురవుతున్నది.
ఇక రచయితలు కవులు కళాకారులు కూడా తమ నిత్యజీవితంలో నిబద్ధతగా నమ్మిన సిద్ధాంతం కోసం రచనలు చేయాలి.కానీ మించిన స్థాయిలో గుర్తింపు కావాలని పురస్కారాల కోసం పాకులాడే ప్రయత్నం, అందుకు సంబంధించిన సందర్భాలను లేదా పరిస్థితులను వెతుక్కోవడం, తన మనసుకు అయిన గాయాన్ని గేయాలుగా ఏ లా మలుచుకోవాలి అనే దాని పైన అంత శ్రద్ధ ఉండడం లేదు . రచన చేసే సందర్భంలో నిబంధనలు , ప్రమాణాలు , ప్రామాణిక భాష, ప్రయోజనాలు రచయిత పాటిస్తూనే ప్రజాక్షేత్రంలో వీలైన ప్రతి చోట పాల్గొనడం ద్వారా మరింత సహజంగా రచనలు చేయడానికి గల అవకాశాలను గ్రహించాలి . తన గూర్చి తాను గొప్పగా చెప్పుకోవడం కంటే తన ఆలోచన ధోరణి, లక్ష్యాలు, కార్యాచరణ , నమ్మిన సిద్ధాంతాన్ని పాఠకులు మిత్రులు శ్రేయోభిలాషుల ముందు పెట్టడం ద్వారా మరింత ఎక్కువగా మద్దతు పొందే అవకాశం ఉంటుంది తద్వారా రచనలో మరింత చిక్కదనం చక్కదనం సాధించవచ్చు. ఊహకు మాత్రమే పరిమితమై , అంచనాను కుదించుకొని, ఊగిసలాట అవగాహనతో చేసే రచనలు జీవం ఉండకపోగా క్షేత్రస్థాయిలో నిలబడలేవు అంటే రచనకు జవము, జీవము రెండు సమపాళ్లలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలను తట్టి లేపి చలన శీలమైన సమాజానికి నీ ట్టాడవుతుంది.
కవి రచయితల నిత్యకృత్యం ఎలా ఉండాలి :-
***********
వివిధ వృత్తులకు అంకితమై పని చేసే వాళ్ళు ప్రతిరోజు లేవగానే తాము చేసే పని వైపు దృష్టి సారించి ఉత్పత్తులు లేదా సేవను అందించడం ద్వారా ఆదాయము సంపాదించి నిత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాగే రచయితలు కవులు తమ కుటుంబ బాగోగు లు నిర్వహణకు సంబంధించి ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవడంతో పాటు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రజల ప్రయోజనం కోసం ఏ సిద్ధాంతాన్ని అయితే తను నమ్ముతున్నాడో మానవతావాదం పునాదిగా , అసమానతలు అంతరాలు దోపిడీ పీడనను తుద ముట్టించడానికి, హక్కులు కోల్పోతున్న అభాగ్యులకు రక్షణ కల్పించడానికి తన సాహిత్యం ఊతగా ఆలంబనగా కార్యోన్ముఖులను చేసేదిగా ఉండాలి . ఇక్కడ రచయిత కొన్ని విలువలకు కట్టుబడి ఉంటేనే అది సమాజం చేత ఆదరించబడుతుంది ఎందుకంటే సమాజంలో మిగతా ఏ వర్గాలకు లేనటువంటి ప్రాధాన్యత గుర్తింపు రచయితలు కవులు కళాకారులకు మేధావులకు ఉన్నది కనుక . ఆ గుర్తింపుకు కృతజ్ఞతగా, సామాజిక బాధ్యతగా తాను ఈ సమాజానికి నిరంతరం రుణపడి ఉన్నాను అనే భావనతో పని చేయవలసి ఉంటుంది . ఈ సందర్భంలో తాను గొప్ప రచయితను అనే అహంకారాన్ని వదిలిపెట్టి ఆత్మ గౌరవo తో సమాజ హితాన్ని కోరి తన బాధ్యతను నిర్వహించాలి అంతేకానీ తాను మాత్రమే గొప్ప రచయితనని తన గూర్చి తాను గొప్పగా చెప్పుకొని గర్వాన్ని ప్రదర్శించే ఆడంబరమైన జీవితానికి అలవాటు పడితే సమాజం నిరాకరిస్తుంది అంతేకాదు తృణీకరిస్తుంది కూడా . అంటే సమాజం ముందు వినయ విధేయతలతో ఉన్నప్పుడు మాత్రమే రచయితలు మరింత ఎక్కువగా గౌరవించబడతారు వారి కృషికి
తగిన స్థాయి లభిస్తుంది . అదే సందర్భంలో ఇతరులతో ఎక్కువగా పొగడ్తలు ప్రశంసలు పొందాలని ఆరాటపడడం మాని ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని వేతకడానికి తాను రెట్టింపు స్థాయిలో పనిచేయడానికి సిద్ధపడాలి. ఆ కృషి మాత్రమే రచయిత ఉనికికి కొలమానం అవుతుంది కానీ పురస్కారాలు బిరుదులుకాదు అని తెలుసుకుంటే మంచిది . కలిసి వచ్చిన అవకాశాన్ని తన స్వార్థం కోసం అక్రమార్జన కోసం వినియోగించడం మాని ప్రజలతో మమేకం కావడం ద్వారా క్షేత్రస్థాయిలో తాడిత పీడిత ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహనను పెంచుకోవడానికి తగిన పరిష్కారాల దిశగా సాహిత్యాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది . అది మాత్రమే కొలమానం కానీ స్వార్థపు ఆలోచన, అక్రమ సంపాదన , పురస్కారాల ఆరాటం ,సంపన్న వర్గాలకు ఊడిగం చేసే ధోరణి రచయితలను నిలువునా ముంచుతుంది అని తెలుసుకుంటే మంచిది. వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతమే కానీ పబ్లిక్ లో నిలబడి ప్రజల కోసం రచనలు చేస్తామని రచనావృత్తిని భుజానికి ఎత్తుకున్నప్పుడు ప్రజలతో మమేకం కావాల్సిందే ప్రజల కోసం బతకాల్సిందే .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ)