అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
తుంగతుర్తి 06 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పోలీసులకు చిక్కింది. ఎస్సై క్రాంతి కుమార్ బుధవారం రాత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈస్ట్ గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన గోపాయి వెంకటేష్ అలియాస్ పెద్దగోపాయి మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద పెయింటర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఇదే రాష్ట్రం ప్రాంతానికి చెందిన గోసాయి అక్షయ్ కుమార్ అలియాస్ చిన్న గోసాయి అమెజాన్ లో డెలివరీ బాయ్ గా,అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం చల్లిరేవు గ్రామానికి చెందిన బొక్క బాలు మహేందర్ బైక్ మెకానిక్ గా,వెస్ట్ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెంది పెయింటర్ గా పనిచేస్తున్న దాసరి సాయిరాం,ఈస్ట్ గోదావరి జిల్లా కాజులూరి మండలం అయితపూడి గ్రామానికి చెందిన ముద్ధంశెట్టి శ్రీ వంశీ అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు.వీరంతా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ మేరకు ఒక గోపాయి గ్యాంగ్ గా ఏర్పడి రెండు మాసాలుగా రాత్రి, పగలు సమయాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ గా చేసుకొని దొంగతనం చేయడానికి తిరుగుతున్నారు. తుంగతుర్తి పట్టణంలో ఉదయం హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ మహేష్,రాజు లు పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నామని ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. వీరు గతంలో సెల్ ఫోన్,మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు."ఈ మేరకు తమ విచారణలో దొంగతనాలు చేయడానికి తాము తిరుగుతున్నామని సదరు వ్యక్తులు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఒక కటింగ్ ప్లేయర్,స్క్రూ డ్రైవర్, ఇనుపరాడ్, సుత్తితో పాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉంటే.. గుర్తు తెలియని వ్యక్తులు సమూహంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తుంగతుర్తి మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాంటి వారి వివరాలను తమకు వెంటనే తెలియపరచాలని కోరారు. అంతేకాకుండా మోటార్ సైకిల్ లపై చైన్ స్నాచింగ్ కు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.