76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు

Apr 2, 2026 - 19:44
Apr 2, 2026 - 20:47
 0  15
76 మంది విద్యాశాఖ సిబ్బందికి  షోకాజ్ నోటీసులు
76 మంది విద్యాశాఖ సిబ్బందికి  షోకాజ్ నోటీసులు

జోగులాంబ గద్వాల 2 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్.ఆర్.ఎస్(ఫేస్ రికగ్నైజ్ సిస్టం) హాజరు విధానం సక్రమంగా నిర్వహించకపోవడం వలన 76 మంది విద్యాశాఖ సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

గురువారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అమలవుతున్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ హాజరు నమోదుపై సమగ్రంగా పరిశీలించగా, పలుచోట్ల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఎఫ్.ఆర్.ఎస్ యాప్‌లో హాజరు సక్రమంగా నమోదు చేయకపోవడం గమనించారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ జిల్లా పరిధిలోని 61 పాఠశాలలకు చెందిన 76 మంది బోధన మరియు బోధనేతర సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. సంబంధిత సిబ్బంది తమ సంజాయిషీని మూడు రోజుల లోపు సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను కచ్చితంగా పాటించడంతో పాటు, ప్రతి రోజూ ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా హాజరును తప్పనిసరిగా సమయానికి నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి నిర్లక్ష్యం పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State