30 ఏళ్ల ఉద్యమ ఫలాలను మాదిగ యువత సద్వినియోగం చేసుకోవాలి : ఆరెల్లి మల్లేష్ మాదిగ
బోథ్ నియోజకవర్గం, న్యూస్ జనవరి 12:(తెలంగాణ వార్త : మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 30 ఏళ్లుగా సాగిన ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఫలితంగా మాదిగ జాతికి రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, వాటిని మాదిగ యువత సద్వినియోగం చేసుకొని విద్యా-ఉపాధి రంగాల్లో ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది త్యాగాల ఫలితంగానే నేటి అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మాదిగ జాతికి చెందిన ఉద్యోగస్తులు తమ వంతు బాధ్యతగా పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుని ప్రోత్సహించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎమ్మార్పీఎస్‌ను నిర్మాణాత్మకంగా, సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం జిల్లా కమిటీతో పాటు మండల అధ్యక్షులు పూర్తిస్థాయిలో చొరవ చూపాలని సూచించారు. చదువు, అభివృద్ధి, రాజకీయ ఎదుగుదలనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ జాతి ప్రజలకు అండగా నిలబడి, సమస్యల పరిష్కారం కోసం ముందువరుసలో పోరాడుతుందని స్పష్టం చేశారు. మాదిగ ఉపకులాల ఐక్యతను చాటేలా అతి త్వరలో జిల్లా కేంద్రంలో భారీ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మాదిగ ఉపకులాల నుంచి గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు త్వరలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కాంబ్లే బాలాజీ మాదిగ, సందూరి వినయ్ సాగర్, ఇండ్ల ఎల్లన్న, ఆరేపల్లి గణేష్, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి ప్రేమ్ రాజ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా పెళ్లి నవీన్ మాదిగ, దాసరి రాంప్రసాద్, గజ్జల కాంతారావు, కృష్ణ పెళ్లి అంకుష్, మేకల దీపక్, జామ్లే నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.