సర్పంచ్ పదవి కొనుగోలుపై ఈసీ ఆగ్రహం: కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల వేళ ఏకగ్రీవాల కోసం గ్రామాల్లో వేలంపాటలు నిర్వహిస్తుండటంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్పంచ్ పదవిని అంగట్లో సరుకుగా మార్చి, డబ్బులు కుమ్మరించి కొనుగోలు చేయడం సరికాదని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు ద్వారా ఎన్నుకోవాల్సిన పదవిని వేలంపాటల ద్వారా కొనుగోలు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య పద్ధతికి పూర్తిగా విరుద్ధమని హితవు పలికింది.
ఎస్ఈసీ హెచ్చరిక:
ఇలాంటి అప్రజాస్వామిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తీవ్రంగా హెచ్చరించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని కమిషన్ ఉద్ఘాటించింది.