శాసనసభ్యులు, మంత్రులకు పాలనాపరమైన అంశాలతో పాటు ప్రజా సంబంధాలపై శిక్షణ ఇవ్వాలి

Mar 31, 2024 - 00:03
Apr 1, 2024 - 17:57
 0  1

 సమర్థత,  సంపూర్ణ అవగాహన,  ప్రజాస్వామ్య దృక్పథం,  సామాజిక బాధ్యత  పాలకులకు కీలక అంశాలు.*  మాన

వత్వ మున్నా   సమర్థత లేకుంటే  నిష్ప్రయోజనమే!*

కొత్త సర్కార్ ప్రజాప్రభుత్వంగా నిలబడాలంటే?--3

---  వడ్డేపల్లి మల్లేశం  

ఏ ప్రభుత్వంలోనైనా  చట్టసభల సభ్యులు  మంత్రులు  ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి వరకు  అందరికీ కూడా ప్రజా  సమస్యల పట్ల అవగాహన,  మానవీయ కోణంలో ఆలోచించే ప్రజాస్వామిక దృక్పథం,  ప్రాపంచిక పరిజ్ఞానం , సమర్థవంతంగా తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించే  సమయస్ఫూర్తి, ప్రతిభ  ఉన్నప్పుడు మాత్రమే ఆ పరిపాలన  ప్రజలకు అనుగుణంగా  ప్రజల అవసరాలను తీర్చేదిగా  ప్రజా రంజకంగా  కొనసాగుతుంది.  భారతదేశంలో  కొన్ని ప్రభుత్వాలు తమ పరిపాలన గురించి  ఆకాశానికి ఎత్తి  తమను తామే పొగడిన  సందర్భాలను నినాదాలను  గమనించవచ్చు.  అయితే సమర్థత కానీ వైఫల్యాలు కానీ  వైరి వర్గాల నుండి  వచ్చినప్పుడు మాత్రమే దానికి అర్థం ఉంటుంది  తమను తాము ప్రశంసించుకొని  సమర్థులు అని నిర్ధారణ చేసుకుంటే  ప్రజలు అంగీకరించరు. అంతేకాదు  అనేక సందర్భాలలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా పాలకులను తరిమికొట్టినప్పుడు  కొత్త ప్రభుత్వాలను  కోటి ఆశలతో స్వాగతించినప్పుడు  మనము గుర్తించవలసిన అవసరం ప్రజలకు  పరిపాలకుల పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది అని తెలుసుకుంటే మంచిది.  అయితే మరింత సంపూర్ణ అవగాహన కోసం , శాస్త్రీయ వైఖరులను పెంపొందించడానికి,  న్యాయాన్ని విచక్షణను  అవగాహన చేసుకోవడానికి,  శాస్త్రీయమైన అంశాల లోతుపాతులను వివరించి చెప్పడానికి  మేధావులు బుద్ధి జీవులు  ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తే తప్పకుండా తమ హక్కుల సాధన కోసం ప్రజలు ఉద్యమిస్తార నడంలో ఎలాంటి సందేహం లేదు . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు గత పది సంవత్సరాలుగా కొనసాగిన బి.ఆర్.ఎస్ పరిపాలన పట్ల విసుగు చెందిన ప్రజలు  నిరంకుశత్వం, ఏకపక్ష పాలన , నిధుల దుర్వినియోగం, అధికారకాంక్ష , అంతులేని అవినీతికి వ్యతిరేకంగా  ప్రజలు పోరాడి బారాసాను ఓడించిన సంగతి మనందరికీ తెలిసిందే.  కనుక  అవగాహనను చైతన్యాన్ని పెంచగలిగితే  ప్రజలు ఎట్లా మారి  తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకున్నారో  అలాగే పాలకులకు కూడా  తమ బాధ్యత పట్ల సంపూర్ణ అవగాహన పెంచుకున్నట్లయితే  మంచి పాలకులుగా  రాణిస్తారు.  అందుకు కొన్ని  పాటించ తగిన సూచనలను   చర్చిద్దాం.

  సమర్థవంతమైన ప్రభుత్వంగా  నిలబడాలంటే :-

***********

  కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ  ప్రజా దృక్పథంతో  ప్రజల కోణంలో ప్రజల ఆకాంక్షల మేరకు పాలన చేసినప్పుడే రాణిస్తారని మనం చర్చించుకోవడం జరిగింది.  అయితే పాలకులు కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్లే కనుక  కొందరు అక్షరాశ్యు లు  కొందరు నిరక్షరాశ్యు లు కూడా ఉండే అవకాశం ఉన్నది.  అంతేకాదు అందరికీ సామాజిక దృక్పథం, ప్రాపంచిక పరిజ్ఞానము, సమర్థత, విషయం పట్ల అవగాహన  మనం అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు.  అప్పుడు కచ్చితంగా  ముఖ్యమంత్రితో సహా మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా  నిపుణుల దగ్గర శిక్షణ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది.

---  ప్రజా సంబంధాలు,  పాలనా దక్షత,  శాఖల పైన పట్టు కోసం సంపూర్ణ అవగాహన,  సామాజిక బాధ్యతతో నాయకత్వాన్ని మరింత పెంపొందించుకోవడానికి  మానసిక నిపుణులు,  విద్యావేత్తలు, మేధావులు,  ప్రత్యేక నిపుణుల వద్ద  శిక్షణ పొందాల్సిన అవసరం ఉన్నది  ఈ చర్య ప్రభుత్వపరంగా కొనసాగవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.--

---  సమస్యలను విని సానుకూలంగా పరిష్కరించడానికి,  పెండింగ్ సమస్యల చిక్కుముడులను   విప్పడానికి  ఆయా శాఖలకు సంబంధించి  ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆర్థిక లావాదేవీలు నిధుల సమీకరణ  తో పాటు  ప్రతిపక్షాల ప్రజల విమర్శలకు  సరైన సమాధానం  ఇవ్వాలంటే  నిబద్ధత, సామాజిక బాధ్యత  ,సంపూర్ణ అవగాహన , వాగ్ధోరని  కూడా చాలా అవసరం.  బాధ్యత రీత్యా  నేర్చుకోవలసినవి కూడా కొన్ని ఉంటాయి  మాతృభాషతోపాటు  హిందీ ఆంగ్లం  వంటి భాషలలో  సంపూర్ణ అవగాహనను పెంపొందించుకోవడం కూడా చాలా అవసరమే .

--- స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి  సంపూర్ణ అవగాహన అవసరం .అదే సందర్భంలో  పాలన గాడి తప్పకుండా చూడడానికి  ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ స్థానికంగా పరిష్కరించడానికి  అనుసంధానమై ఉన్న సమస్యలను అర్థం చేసుకోవడానికి  కూడా  అవగాహన పెంపొందించుకోవడానికి శిక్షణ పొందిన వలసిన అవసరం ఉన్నది.

      ముఖ్యంగా  లెజిస్లేచర్ పార్టీ నాయకుని ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  ఆ నాయకుని సారథ్యంలో ప్రభుత్వం   సమర్థవంతంగా పని చేయాలంటే  నాయకుడు అంటే ముఖ్యమంత్రి తో పాటు  మంత్రులు  ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులకు కూడా నిపుణులతో శిక్షణ ఇప్పించవలసిన అవసరం  ముఖ్యంగా ముఖ్యమంత్రిపై ఉంటుంది.  శిక్షణ పొందకుండా అవగాహన పెంపొందించుకొనకుండా  వ్యవస్థలో కొనసాగడం అంటే కష్ట సాధ్యమే . పలు విమర్శలకు దాడులకు  నిరసనలకు  గురి కాక తప్పదు.

  అంతేకాదు ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారులకు కూడా  గత ప్రభుత్వాలు మానవీయ కోణంలో  హరగోపాల్ లాంటి మేధావులతో శిక్షణ ఇప్పించిన సందర్భాలను మనం  చూసి ఉన్నాము  .ఆ రకమైనటువంటి  చర్యలకు సిద్ధపడితే  ప్రజలకు ఇచ్చిన హామీలు,  చేసిన వాగ్దానాలు,  నొక్కి చెప్పిన గ్యారెంటీలు,  సాధారణ పరిపాలన వంటి అంశాలు  సమర్థవంతంగా నిర్వహించడానికి  ప్రజలను మెప్పించడానికి  ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 

    ప్రజల అవసరాల మేరకు ఏ ఏ పంటలు పండించాలి?  ఎ లాంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి ? విద్యకు ఎంత శాతం నిధులను సమకూర్చాలి?  విద్యా ప్రైవేటీకరణను నిరోధించడం ఎలా?  వైద్య ఆరోగ్యశాఖను పటిష్టపరచవలసిన అవసరాలు,  నాణ్యమైన మందులు,  వైద్యుల అందుబాటు, నిధుల సమీకరణ,  దుబారాను అరికట్టడం,  పొదుపు చర్యలు చేపట్టడం,  సమర్థవంతమైన పాలన అందించి ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి  శాసనసభ్యుల నుండి మంత్రులు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు  ప్రధాని వరకు  ఎవరికైనా ఈ రకమైన శిక్షణ,  విషయ అవగాహన  చాలా అవసరం.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో  రాష్ట్రం లోటు రాష్ట్రంగా అప్పుల కుప్పగా మారిన వేళ  గత పాలకుల హామీలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీలను అమలు చేయాలంటే  నిధులు పుష్కలంగా అవసరం.  మరొక్కవైపు ప్రతిపక్షం  హామీల అమలుపట్ల  ఒత్తిడి చేస్తున్న తరుణంలో  మంత్రివర్గం ఉమ్మడిగా  నిర్ణయం తీసుకోవడం  అందుకు పునాదిగా వారి యొక్క అవగాహన పెంపొందించడం చాలా అవసరం . అదే సందర్భంలో శాసనసభ్యులు   లేదా పార్లమెంటు సభ్యులు కూడా ఆయా నియోజకవర్గాలలో పర్యటించి  ప్రజల సమస్యలను తెలుసుకొని  మొక్కుబడిగా కాకుండా  పూర్తిస్థాయి సమయాన్ని వెచ్చించి సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలంటే  పొందిన అకాడమిక్ విద్య  మాత్రమే సరిపోదు . చొరవ, చర్చ , శిక్షణ,  క్షేత్ర పర్యటనలు,  సమస్యల సేకరణ,  సమస్యల విశ్లేషణ  వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి . ఇంత సుదీర్ఘమైన బాధ్యతను  చిత్తశుద్ధిగా నిర్వర్తించడానికి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రి ప్రధాన మంత్రి కి  కచ్చితంగా  మానవీయ కోణంలో  సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా మెలగడానికి  శిక్షణ ఎంతో తోడ్పడుతుంది.  ఉపాధ్యాయులకు మానసిక నిపుణుల శిక్షణ ఎంత అవసరమో పాలకులకు కూడా  మేధావులు, మానసిక నిపుణులు, ఆరోగ్య నిపుణులు,  ఆర్థిక నిపుణుల యొక్క శిక్షణ చాలా అవసరం.  తెలంగాణలో కొత్త ప్రభుత్వము కొలువు తీరిన వేళ  ఎదురుగా ప్రత్యక్షమైన సమస్యల మాలను,  నిధుల లేమిని , దుర్వినియోగ ముఖచిత్రాన్ని  ఇచ్చిన హామీలకు అనుగుణంగా మార్చవలసిన అవసరం చాలా ఉన్నది . కేవలం ఇది ఊహతో  లభించేది కాదు  మనసుపెట్టి  బాధ్యతాయుతంగా ఆలోచించినప్పుడు  అందుకు తగిన చైతన్యాన్ని శిక్షణ రూపంలో పొందినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది . రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు  మంత్రులు శాసనసభ్యులు అధికారులు సిబ్బందికి కూడా అవసర అనుగుణంగా  తమ ప్రాధాన్యత లక్ష్యాల మేరకు  శిక్షణ ఇప్పించడం ద్వారా  ప్రభుత్వం  తన ఉనికిని కాపాడుకోవడానికి ఎంతో ఆస్కారం ఉన్నది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333