కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే పారదర్శక పాలన సాధ్యమవుతుంది.

Mar 31, 2024 - 00:01
 0  1

 లక్ష్యాలను సాధించాలన్న,  సమర్థవంతమైన  సుపరిపాలన అందించాలన్న, 

ప్రజల   ఆకాంక్షలు ప్రతిఫలింప చేయాలన్న  ప్రభుత్వానికి సాహసం కావాలి.

రాజీ పడితే నిష్ప్రయోజనమే. కొత్త సర్కారు ప్రజా ప్రభుత్వం గా నిలబడాలంటే ---4

--వడ్డేపల్లి మల్లేశం  

ప్రస్తుతమున్న స్థాయికి భిన్నంగా  మరింత మెరుగైన సమాజాన్ని  కోరుకోవడం  సామాజిక బాధ్యత గల  ప్రతి ఒక్కరూ చేసే పని.  అయితే పారదర్శకమైన పరిపాలన,  నిబద్ధత,  రాజీ లేనటువంటి పోరాట స్ఫూర్తి,  కఠిన నిర్ణయాలు తీసుకోగల నేర్పు,  ప్రజా ఆకాంక్షల పట్ల స్పష్టమైన ఆరాటం తపన  పాలకులకు ఉన్నప్పుడు మాత్రమే  అసాధ్యమైన  పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది . ప్రజల పక్షాన  ఆలోచించినప్పుడు  అసహయులు నిసహాయులకు ఊరటగా,  కర్తవ్యాన్ని ఎంచుకున్నప్పుడు  అసమానతలు అంతరాలను  దోపిడీ పీడన వంచన వంటి అసాంఘిక రుగ్మతలను  సమాజం నుండి తరిమి కొట్టి  సమ సమాజాన్ని స్థాపించడానికి  పాలకులు నిర్ణయం తీసుకున్నప్పుడు  ప్రజల మద్దతు ఉంటుంది . ప్రగతి సాధ్యమవుతుంది కూడా.  పాలనలో పెట్టుబడి దారి భూస్వామ్య దోపిడీ వ్యవస్థల యొక్క భాగస్వామ్యాన్ని  నిరోధించగలిగితే,  సామాన్యులు పేదల  సమస్యలను  ఎజెండాగా స్వీకరించగలిగినప్పుడు,  పేదరిక నిర్మూలన  ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన  మౌలిక సౌకర్యాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల  అమల్లో స్పష్టమైనటువంటి  పురోగతిని గమనించవచ్చు.  నిధుల కొరతతో  గత పాలకుల వలె   స్పష్టమైన నిబంధనలు లేకుండా  ఒంటెద్దు పోకడగా పథకాలను అమలు చేసినప్పుడు  తప్పకుండా పాలకులకు పరాభవం తప్పదు . పథకాలకు సంబంధించిన నిధులు తమ జేబు నుండి ఇచ్చినట్లు  అతి ఉత్సాహం ప్రదర్శించి  ఉన్నత స్థాయిలో ప్రచారం చేసుకుంటే సరిపోదు.  పాలకులకు త్యాగం కూడా అవసరం,  అదే సందర్భంలో సాహసంతో  కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా  మెరుగైన పాలన అందించవచ్చు.  అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు,  ఆటంకాలను అధిగమించి  పరిపాలనలో దూకుడు పెంచే అవకాశం ఉంటుంది.  అలాంటి పురోగతిని , మార్పును,   తేజస్సును ఆశించిన తెలంగాణ ప్రజలు  ఎన్నికల్లో  తమ తీర్పును  కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టింది  నిధుల పంపిణీ,  పథకాల అమలు , ఉచితల ప్రలోభాల  రుచిని ప్రజలకు చూపించడం కోసం మాత్రమే కాదు.  కఠిన నిర్ణయాల ద్వారా,  ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థ యొక్క  పునాదులను పటిష్టపరిచి,  ప్రక్షాళన చేసి,  అవినీతిని కూకటి వేళ్ళతో పెకి లించివేసి,

వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్న రాజకీయ అధికార యంత్రాంగాన్ని  అంతం  చేయడం ద్వారా  మౌలిక సమస్యలను పరిష్కరించవలసిన అవసరం  ఉన్నది.  ఆ వైపుగా తీసుకోవలసిన కొన్ని చర్యలను,  చేదు వాస్తవాలను, కఠిన నిర్ణయాలను  ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం .

   అమలు చేయదగు కొన్ని కఠిన నిర్ణయాలు:-

************

--  గత పాలకులు మద్యపాన నిషేధం ద్వారా  ఆదాయాన్ని సమకూర్చుకునే దుష్ట ఆలోచనతో  పటిష్టంగా అమలుపరిచిన మద్యపానాన్ని  రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణంగా నిషేధించడానికి ప్రభుత్వం  పూనుకోగలదా ?బెల్ట్ షాపులవిచ్చల విడి తనం etc.

-- విద్యా వైద్య రంగాలను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే  నిర్వహించడంతోపాటు  నాణ్యమైన  ఉచిత పద్ధతిలో ప్రజలకు  అందించే సాహసం చేయగలదా?

-- గత ప్రభుత్వం  కొన్ని వర్గాలకు అప్పనంగా కట్టబెట్టిన , చౌకగా అమ్మిన  ,రియల్ ఎస్టేట్ కు అక్రమంగా వినియోగించిన ప్రభుత్వ భూములను  తిరిగి ఆక్రమించుకోగలదా ?

-- ముఖ్యమంత్రితో సహా శాసనసభ్యులు వరకు  పోలీసు బందోబస్తు పైన  వెచ్చిస్తున్న కోట రూపాయల ఖర్చును

  పరిమితం చేసుకోవడానికి  స్వేచ్ఛగా ప్రజల్లోకి  సేవకులుగా తిరగడానికి   ప్రభుత్వం సిద్ధంగా   ఉన్నదా?

--  అశ్లీల, అక్రమాల,  అర్ధ నగ్న  దృశ్యాలకు వేదికగా  యువతను నిర్వీర్యం చేస్తూ బ్రష్టు పట్టిస్తున్న  క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు , ప్రదర్శనలను  ప్రభుత్వం  బేష రత్తుగా నిషేధించగలదా ?

---   గత ప్రభుత్వం   దేశంలోనే భారీగా పెంచినటువంటి శాసనసభ్యులు మంత్రులు, ముఖ్యమంత్రి వేతనాలను 

ప్రస్తుత ప్రభుత్వం  తగ్గించుకోగలరా?  విచ్చలవిడి అలవెన్సులు, పెన్షన్లు , ప్రభుత్వ సౌకర్యాల వినియోగ0లో కోత విధించుకొని తమ చిత్తశుద్ధిని  రుజువు చేస్తే మంచిది.  అప్పుడే పాలకులు కాదు ప్రజా సేవకులు అని  సమర్ధించుకోవడానికి అవకాశం ఉంటుంది .

-- గత పాలనలో శాసనసభ్యులు మంత్రులు, ముఖ్యమంత్రి  అక్రమాస్తులు భూకబ్జాలు  ప్రభుత్వ అవినీతి పైన  సమగ్ర దర్యాప్తుకు ఆదేశించి శిక్షించాలి.  అదే సందర్భంలో ప్రస్తుత శాసనసభ్యులు  తమ ఆస్తిపాస్తులను ప్రకటించి  రాబోయే ఐదేళ్ల తర్వాత  బహిరంగంగా  ఆనాటి ఆస్తులను  తెలియజేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలి.  అక్రమ సంపాదనకు పాల్పడితే  రాళ్లతో కొట్టి చంపండి అని  బహిరంగ ప్రకటన చేయగలరా ?

--- ఉచితాలను క్రమంగా  తగ్గిస్తూ పూర్తిస్థాయిలో  రద్దు చేస్తూ  విద్యా వైద్యం, సామాజిక న్యాయం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు,  మౌలిక సౌకర్యాల కల్పన  వంటి అంశాల పైన దృష్టి సారించి  ప్రజా ప్రభుత్వంగా నిలబడడానికి  సాహసం చేయగలరా  

---ఉద్యోగ వర్గంలో నెలకొన్న అవినీతి, లంచగొండితనం,  రెడ్ టేపిజం   పైన  ఉక్కు పాదం మోపి  ప్రజా సేవకులుగా ఉద్యోగులను  తీ ర్చిదిద్ద గలదా

--   అనారోగ్యానికి దారితీస్తున్న బీడీలు ,సిగరెట్లు , మత్తు పదార్థాలు,  గంజాయి  తో పాటు  ఆహార పదార్థాల కల్తీ  అధిక ధరలు  మార్కెట్లో వస్తువుల కృత్రిమ కొరత  వంటి అంశాల పైన  ప్రభుత్వం ఉక్కు పాదం మోపగలదా?

---  ఉన్నత వర్గాల పైన  పన్ను లను పెంచడం ద్వారా  పేద మధ్యతరగతి దారిద్రరేఖ దిగువన ఉన్న ప్రజలకు  ఆర్థిక భరోసా,  పలు రాయితీలు,  భూ పంపిణీ, ఉపాధి  ఉచితంగా కల్పించడం ద్వారా  అంతరాలు లేని వ్యవస్థకు అంకురార్పణ చేయగలదా?  

----సమగ్ర భూ పరిమితి చట్టాన్ని  తీసుకువచ్చి,  మిగులు భూములను నిర్ధారించి , భూమిలేని పేదలకు పంపిణీ చేసి,  ప్రజాధనాన్ని  సమానంగా పంపిణీ చేయడానికి సాహసం చేయగలరా?

--+ బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు విద్యావంతులు, విద్యార్థి ప్రజా సంఘాల పైన  నిషేధం విధించకుండా పూర్తిస్థాయిలో స్వేచ్ఛను ప్రకటించి  నిర్బంధం అన చివేత కానరాకుండా  వారి భావజాలాన్ని అభిప్రాయాలను ప్రభుత్వం  పంచుకోవడానికి సిద్ధంగా ఉందా.?

---  వ్యక్తులు శక్తులు ప్రాబల్యం కలవాళ్ళు  ఆక్రమించుకున్న భూములను,  అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులను,  నిరుపయోగంగా ఉన్న ప్రజా సంపదను  క్రమబద్ధీకరించి ప్రభుత్వ సంపదను పెంచుకునే సాహసం చేయగలదా?

-- ఉచితాల పేరుతో ప్రజాధనాన్ని  పంపిణీ చేయడం కాదు  ఉత్పత్తిలో ప్రజలను భాగస్వాములను చేసుకోవడం ద్వారా  సంపదను సృష్టించి  పేదరికాన్ని  తరిమి వేసే ప్రయత్నం  సాధ్యం కాదా.?

---  లాకప్ డెత్తులు, పోలీసుల హింస,  పోలీసులను ప్రభుత్వపక్షం  అక్రమంగా వినియోగించుకోవడం,  అక్రమ అరెస్టులు, ముందస్తు  నిర్బంధాలు , ప్రజా ఉద్యమాలను అణచివేసే  దుర్మార్గ సంస్కృతికి ప్రభుత్వం  తిలోదకాలు ఇవ్వగలదా?.

--- ఉద్యోగుల విధానంలో  కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ , స్పెషల్ స్కీం,  నిర్ణీత మొత్తంలో వేతనం  వంటి వెట్టిచాకిరి విధానాన్ని   తరిమికొట్టాలి . సమాన పనికి సమాన వేతనం అనే విధానాన్ని  వేతన స్కేల్ క్రమబద్ధీకరణ ద్వారా  సంతృప్తికరమైన స్థాయిలో వేతనాలను అమలు చేయాలి . తద్వారా అవినీతిని లంచగొండితనాన్ని  వృత్తిపట్ట నిర్లక్ష్యాన్ని  తగ్గించడానికి గంతేయగలరా?

--  గత ప్రభుత్వం రైతుబంధు  పేరుతో పండించని భూములకు గుట్టలు, చెట్లకు  పెద్ద పెద్ద భూస్వాములకు  అప్పనంగా కట్టబెట్టిన సుమారు 30 వేల కోట్ల రూపాయలను  ప్రభుత్వం నిర్బంధంగా వసూలు చేసి  ఐదు ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేస్తూ  కఠిన నిర్ణయం తీసుకోగలదా? 

---  దళిత బంధు పేరుతో కేవలం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే  అనుమతించి , సంపన్న వర్గాలు  ఉద్యోగులు చివరికి కలెక్టర్ల స్థాయిలోని  వారికి కూడా పది లక్షల  ఉచిత ఆర్థిక సాయం  ప్రకటించి  నిబంధనలను తుంగలో తొక్కిన  గత ప్రభుత్వ విధానంపై  సమీక్షించి అల్పాదాయ వర్గాలకు మాత్రమే  ఆర్థిక భరోసాగా  అమలు చేయగలదా?  .

---ఉచితాలను వివిధ పథకాలను రద్దు చేస్తూ  అల్పాదాయ  ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు  వృత్తులను  స్వయం ఉపాధి పథకాలను  జీవనోపాధిని ప్రోత్సహించే విధంగా  గతంలో మాదిరిగా ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర సబ్ ప్లాన్ నిధులను బడ్జెట్లో  కేటాయించి  ఆ వర్గాల ఉన్నతికి , ఉపాధికి ఆదాయ మార్గానికి  ఆసరాగా  నిలబడగలగాలి .

          ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవడంతోపాటు  కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా కూడా  పరిపాలనలో సంస్కరణలు చేపట్టి ప్రక్షాళన చేసుకోవడానికి  లోటుపాట్లను సవరించుకోవడానికి సమానత్వ సాధనకు  అవకాశం ఉంటుంది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ తోటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333