విస్తరిస్తున్న వ్యాపారాలు ఇరుకవుతున్న రహదారులు
నిత్యం రద్దీగా ఉండే రోడ్డు ఆక్రమణలు
రోడ్లే షాపులాయె.. రాకపోకలు బందాయె
చెమటోడ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
సూర్యాపేట. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి పూల సెంటర్ అలంకార్ రోడ్డు లో షాపుల ముందు వరకే పరిమితం కావాల్సిన వ్యాపారాలు ఏకంగా రోడ్డు మీదకు విస్తరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో అతి రద్దీ ప్రాంతమైన పూల సెంటర్ అలంకార్ రోడ్డు ఫుట్‌పాత్‌లను దాటుకుని రోడ్డు మధ్యలోకి దుకాణాలు వెలుస్తుండటంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.ముఖ్యంగా పూల దుకాణాలు, పండ్ల బండ్లు రోడ్డును ఆక్రమించడంతో నిత్యం ట్రాఫిక్ నిలిచిపోతోంది. పాదచారులు నడవడానికి కనీస స్థలం లేక ప్రాణాలకు తెగించి వాహనాల మధ్యే వెళ్లాల్సి వస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. మున్సిపల్ యంత్రాంగం వెంటనే స్పందించి, రోడ్ల ఆక్రమణలను తొలగించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు
రహదారులపై ఆక్రమణలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా పట్టణ ప్రణాళికా అధికారులు కళ్లున్నా కానరాని చందంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారాలు నడిరోడ్డుపైకి వస్తున్నా నోటీసులు ఇచ్చే నాథుడే కరువయ్యారు. అధికారులు మాత్రం ఏసీ గదులకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం తనిఖీలు నిర్వహించకపోవడం వెనుక ఏదైనా *అంతర్గత ఒప్పందం* ఉందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు
చుక్కలు చూపిస్తున్న ఆక్రమణలు.. చెమటోడ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు*
సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్సై సాయిరాం ఆధ్వర్యంలో పోలీసులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా శ్రమిస్తున్నారు. ఇరుకైన రహదారుల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఎండను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో నిలబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.పోలీసులు ఎంత కష్టపడినా, ఆక్రమణలు తొలగించడంలో మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడకపోతే ప్రయోజనం ఏముంటుంది?అని ప్రశ్నిస్తున్నారు.