తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఐదవ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింపు
తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఐదవ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
తెలుగు భాష, సంస్కృతి, కళలు, జానపదం, గిరిజన విజ్ఞానపీఠం మొదలైన అనేక పీఠాలతో విరాజిల్లుతున్న సరస్వతి నిలయం మా తెలుగు విశ్వవిద్యాలయం.
అలాంటి మా విశ్వవిద్యాలయాన్ని జయధీర్ తిరుమలరావుకు ఒక్క ఫ్లోర్ కాదు కదా, ఒక్క అంగుళం కూడా ఇవ్వమంటూ విశ్వవిద్యాలయ విద్యార్థులు హెచ్చరించారు.
హైదరాబాద్, 6 జూలై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- చెన్నప్ప రెడ్డి కమిషన్ ప్రకారం ఒక్కసారి విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములు, భవనాలను తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకునే హక్కు లేదని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులను ఖాళీ చేయించి మరీ ఆయనకు విశ్వవిద్యాలయ భవనాలను ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయ సమస్యలపై ప్రభుత్వం ముందు గట్టిగా నిలబడి విద్యార్థుల పక్షాన పోరాడాల్సిన వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్‌లు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని, వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా సమస్యలకు సమాధానం చెప్పాల్సిన వీసీ, రిజిస్ట్రార్‌లు ప్రభుత్వానికి కొమ్ము కాయడం సహించబోమని హెచ్చరించారు.
HYDRA ద్వారా ఖాళీ చేయించిన ఎన్నో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా తెలుగు విశ్వవిద్యాలయంపైనే దృష్టి సారించడం విద్యార్థుల కడుపుకొట్టడమేనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అగ్నిగోళంలా నినాదాలతో ఉద్యమ ప్రాంగణాన్ని హోరెత్తించారు.
"మా విశ్వవిద్యాలయం – మా హక్కు!"
"ఒక్క అంగుళం కూడా ఇవ్వం!"
"తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడాలి!"
"విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయొద్దు!"
"తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలి!"
విద్యార్థుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరినైనా చరిత్ర క్షమించదని పేర్కొన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు. జర్నలిజ స్టూడెంట్, విన్నపం ఒక పోరాటం సత్యం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతి, ఏబీవీపీ అఖిల భారత విశ్వవిద్యాలయాల సహ కన్వీనర్ కమల్ సురేష్, ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కన్వీనర్ గండం నరేందర్, పీహెచ్‌డీ పరిశోధకులు జనార్ధన్, సుజాత దీక్షిత్,, కూల సంతోష్, అజయ్, సురేష మరియు విద్యార్థులు, పూర్వ విద్యార్థులు డా. రాంబాబు, తలావత్ గోపాల్, బి. శారద, ఎస్. ఆదిత్య, వి. ప్రకాశ్, ఆర్. ఉదయ్ కిరణ్, అఖిల్ సాగర్, కల్యాణ్, అంజి, నర్సప్ప బోధనా సిబ్బంది డా. శ్రీనివాసన్, డా. బి.వి. సత్యనారాయణ,డా. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొని ఉద్యమానికి తమ మద్దతు ప్రకటించారు.