పరిషత్ ఎన్నికలా...! జిహెచ్ఎంసి ఎన్నికలా.
bantu krushnaiah
అర్బన్ ఓటర్ ఆశీర్వాదం లభించింది...!*గ్రామీణ ఓటరు అనుగ్రహము ఉంది...!
ఏ ఎన్నికలకు వెళ్లాలా అని ఆలోచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
వరుస విజయాలతో కాంగ్రెస్ పార్టీ...ప్రభావం చూపని ప్రతిపక్షాలు
✍️ డాక్టర్ కృష్ణ బంటు, స్వతంత్ర పాత్రికేయులు
రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా విజయదుందిబి మోగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది అని తర్జనభర్జన పడుతున్నారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికలు జరపాలా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాల అనేది ఈనెల 23న జరిగే మంత్రివర్గ భేటీలో ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్టీ గుర్తు లేకుండా నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో 70% కు పైగా సర్పంచ్ పదవులను దక్కించుకుంది. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అదే ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏడు కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించి ఎన్నికలలో కూడా తన విజయ యాత్ర కొనసాగించింది. నగర, పట్టణ ఓటర్ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఆశీర్వదించి, పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికలలో అధిక శాతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలిపించారు.
వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో త్వరలో మండల పరిషత్, జిల్లా పరిషత్, హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా జరపటానికి సిద్ధంగా ఉంది. అయితే ముందుగా హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికలకు వెళ్లాలా, పరిషత్ ఎన్నికలకు వెళ్లాలా అన్న విషయంపై ఇంకా ఒక స్పష్టత రాలేదు. అందుకుగాను ఫిబ్రవరి 23వ తారీఖున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుండడంతో, ఆ మంత్రివర్గ సమావేశంలో ఏ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న విషయంపై దీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఎన్నిక ఏదైనా, ఎక్కడ జరిగినా ప్రజలంతా కాంగ్రెస్ వెంటనే ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దూకుడు మీద కాంగ్రెస్... దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షాలు
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తదుపరి జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఎన్నికలు ఇలా ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించి విజయాలను తన ఖాతాలో మెజార్టీగా వేసుకుంటే, అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ స్పీడును అందుకోలేని రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బీ ఆర్ఎస్ బిజెపి, తదితర పార్టీలు అరకొర విజయాలు సాధిస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పరిపాలన పూర్తి అయి మూడో సంవత్సరం లోకి ప్రవేశించడంతో కాంగ్రెస్ ప్రజా పాలనకు ప్రజామోదం లేదని ఊదరగొట్టిన ప్రతిపక్షాలు ఓటమిల పాలవుతున్నాయి. ప్రజాపాలనతో ప్రజల మనసులను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నిక ఏదైనా, ఏ ప్రాంతంలో జరిగినా విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తుంది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ప్రజల మెప్పును పొంది ఎన్నికలలో విజయం దిశగా పయనించాలని ప్రతిపక్షాలు కంటున్న కలలన్నీ కల్లలు అయ్యాయి. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పుడు జరుగుతున్న స్థానిక ఎన్నికలలో గెలిచి సత్తా చాటుకుని పార్టీని రెండు సంవత్సరాల ముందుగానే బలోపేతం చేసుకుందామనుకున్న ప్రతిపక్షాలు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయ ని చెప్పవచ్చు.
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాలు, సూచనల మేరకు మంత్రులు శాసనసభ్యులు డిసిసి అధ్యక్షులు ఇతర పలు రకాల హోదాలు ఉన్న అన్ని రకాల కేడర్ను ఎన్నికలకు సంసిద్ధం చేసి, పలు ప్రాంతాలకు ఇన్చార్జిలుగా నియమించి ఎన్నికలలో గెలిచే విధంగా బాధ్యతలను అప్పజెప్పారు. దీంతో తమకు అప్ప చెప్పిన బాధ్యతలలో అందరూ సక్సెస్ కావడమే కాకుండా ముఖ్య మంత్రి కూడా రాష్ట్రంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారా అని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసినా పార్టీ గెలుపు కోసం ఆయన కంకణ బద్ధుడై వ్యవహరించి పార్టీని విజయ పధాన సమిష్టి కృషితో నడిపించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా పదునైన విమర్శలు చేస్తూ, తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించినప్పటికీ తాము అనుకొన్న ఫలితం రాక ప్రతిపక్షాలు బొక్క బోర్లా పడ్డాయి. తాము చెప్పే విషయాలను ప్రజలు విశ్వసించడం లేదన్న విషయం ప్రతిపక్షాలకు ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే తెలిసి వచ్చింది.
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, ఘాటు పదజాలంతో ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్ని నప్పటికీ తెలంగాణ ఓటర్లు చైతన్యంతో, తెలివిగా వ్యవహరించి ఎవరికి, ఎప్పుడు, ఏ విధంగా, ఎక్కడ కీలెరిగివాత పెట్టి సందర్భోచితంగా వివరించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషంతో ఉండగా, తాము అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి ఎందుకా అని ప్రతిపక్షాలు అయోమయంతో జుట్టు పీక్కోక తప్పకుండా లేదు. కనీసం హైదరాబాద్ నగరపాలక సంస్థ, పరిషత్ ఎన్నికల్లోనన్న గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకోవడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగా, ఎప్పటి మాదిరిగానే ఈసారి మరింతగా మెజార్టీ పెంచుకొని క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఊపు మీద ఉండగా, ప్రతిపక్షాలు ఊసురుమంటున్నాయి. ఈసారి ముందుగా నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతాయా, పరిషత్ ఎన్నికలు జరుగుతాయా, తెలంగాణ ఓటర్ ఎవరిని కరుణిస్తాడు అన్నది వేచి చూడాల్సిందే.