వివిధ పథకాల కింద డబ్బులు పంచడమే పరిపాలన కాదు

Apr 26, 2024 - 22:10
Jun 7, 2024 - 18:58
 0  31
వివిధ పథకాల కింద డబ్బులు పంచడమే పరిపాలన కాదు

పేదరిక నిర్మూలన, ఉపాధి హామీ,  ప్రజల జీవన ప్రమాణాల పెంపు, మానవాభివృద్ధి  సాధించడం ప్రధానం.

సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న  మద్యపానం, ధూమపానం, క్లబ్బులు, పబ్బులు ,ఈవెంట్లు,  మత్తు పదార్థాలు,  

కూల్ డ్రింక్స్   దేశంలో నిషేధించి   కేంద్రం తన సత్తా చాటాలి.*

---- వడ్డేపల్లి మల్లేశం

ఎన్నికలు వచ్చినప్పుడు  ఇతరత్రా కూడా రాజకీయ పార్టీలు  ప్రజల జీవన ప్రమాణాల పెంపుదల కోసం, సామాజిక సంస్కరణ కోసం,  మానవాభివృద్ధి కోసం కాకుండా  తమ మనుగడ ప్రశ్నార్థం కాకుండా చూసుకోవడం పైననే ఎక్కువగా  దృష్టి సారిస్తున్న విషయాన్ని మనం నిరంతరం గమనించవచ్చు. ఈ ధోరణి ఇటీవల కాలంలో  గత పదేళ్లుగా మరింత పెరిగిపోయిన విషయం  పచ్చి నిజం.  ఎన్నికలను నిర్వహించే ఎన్నికల సంఘం యొక్క  చైతన్యం, అధికారం, సమర్ధతను  అధికార పార్టీలు లొంగదీసుకోవడం, ప్ర లోభ పెట్టడం, హెచ్చరించడం, భయపెట్టడం వంటి కారణాలు ఏవైనా  కొంతమంది ఎన్నికల  అధికారులు కూడా రాజీనామా చేయవలసి రావడం ఈ దేశంలో ఒక దౌర్భాగ్యం . నిజాయితీ సమర్ధులైనటువంటి అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు కొనసాగినప్పుడు  ఎన్నికల నిబంధనలు పూర్తిగా అమలు జరిగినప్పుడు కచ్చితంగా  రాజకీయ నాయకుల దృశ్చర్యలకు అడ్డుకట్ట వేసే ఆస్కారం ఉంటుంది. కానీ స్వీయ క్రమశిక్షణకు  తలవంచని,  నిబంధనలను నిత్యం ఉల్లంఘిస్తూ, అధికారకాంక్ష ముసుగులో పనిచేస్తున్న రాజకీయ పార్టీల కుటిల పన్నాగాల ఫలితంగా స్వచ్ఛంద సమర్థవంతమైన స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం నిర్వీర్యం కావడం బాధాకరం.  దానికి పూర్తి బాధ్యత ఈ దేశంలో రాజకీయ పార్టీలు  వహించవలసి ఉంటుంది.  రాజ్యాంగంలో  రాయబడినటువంటి  అనేక  హక్కులు రక్షణలు ఫలాలను ప్రజలకు అందించే క్రమంలో పనిచేయవలసినటువంటి పాలకవర్గాలు  తమ అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని పెత్తందారీ వర్గాలకు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజలను  బానిసలుగా, కేవలం ఓటర్లుగా, అంతేకాదు యాచకులుగా ,ఎన్నికల సమయంలో బిచ్చగాళ్ళుగా మార్చుతున్న సందర్భంలో  ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్లో ఇంత దుస్థితి ఉండడానికి  ఈ కారణాలు సరిపోవా?

పాలకులు దృష్టి సారించవలసిన కొన్ని అంశాలు

పరిపాలన అంటే ప్రభుత్వ పథకాలను అమలు చేయడం, ఇచ్చిన హామీలను రాయితీలను పథకాలను వివిధ ఆర్థిక  పెన్షన్లు నిధుల రూపంలో పంపిణీ చేయడం వరకే పరితమనుకొని  పాలకులు పబ్బం గడుపుకుంటున్నారు . నిర్మాణాత్మకమైనటువంటి బాధ్యతను విస్మరించిన కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు దినదినం  భూగర్భ జలం మాదిరిగా అడుగంటి పోవడాన్ని మనం గమనించవచ్చు.  ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు,  ప్రజాధనాన్ని సమానంగా పంపిణీ చేయడం, సంపద కొద్ది మంది చేతుల్లో పోగు పడకుండా చూడడం,  సంపదను సృష్టించడం, సంపద సృష్టిలో ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకోవడం వంటి క్రియాశీలక బాధ్యతలను ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తూ  ఎన్నికల కోలాహాలంతో పాటు నిరంతరము కూడా సభలు సమావేశాలు సంబరాలతో   రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటే  ఈ దేశంలో అభివృద్ధి సాధ్యం కాలేదు. అందుకే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో   81 లక్షల మందికి ఇప్పటికి ఉచిత  రేషన్ బియ్యాన్ని సరఫరా చేయవలసిన పరిస్థితి  ఉందంటే ఇక ఈ దేశంలో  నాణ్యమైన పోషకాహారాన్ని సరఫరా చేసే పరిస్థితి ఎక్కడిది?  కరోనా సమయంలో దేశ ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఇచ్చిన నివేదికలను  బుట్ట దాఖలు చేసినట్లే కదా ! వలస కార్మికులు, దారిద్రరే క దివనున్నటువంటి అట్టడుగు వర్గాలు,  దినసరి కూలీలు, చిరు వ్యాపారులు,  నికృష్టమైన జీవితం గడుపుతూ ఉంటే రాజకీయ పార్టీల నాయకులు  విలాసవంతమైన జీవితాలతో ఊరేగుతూ ఉంటే పెట్టుబడిదారి వర్గాలు  కోటాను కోట్ల రూపాయలను  పోగుచేసి సంపన్న వర్గాల జాబితాలో  స్థానం కోసం ప్రయత్నిస్తుంటే  ఈ దేశంలో సామాన్య ప్రజల గురించి పట్టించుకునేది ఎవరు?  అందుకే దేశ బడ్జెట్లో కనీసం 6 శాతం కూడా మెజారిటీ  సామాన్య ప్రజలకు కేటాయించడం లేదంటే అర్థం చేసుకోవచ్చు.  ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచి   స్వయం ఉపాధి పథకాలకు ఊ తమిచ్చి,  స్పష్టమైన యువజన విధానాన్ని ప్రకటించి, యువతకు  ఆదాయంతో కూడిన సౌకర్యాలు కల్పించినప్పుడు  దేశ భవిష్యత్తు మరోలా ఉండేది.  కనీస అవసరాలను తీర్చుకోగలిగే స్థితిని మానవ అభివృద్ధి అంటారు  ఆ మానవాభివృద్ధికి కడు దూరంగా హీనంగా  బతుకుతున్న పేద ప్రజలు ఈ దేశంలో కొనసాగుతూ ఉంటే ఈ దేశం వెలిగిపోతున్నది! వికసిస్తున్నది! అని చెప్పడం  అతిశయోక్తి కాక మరేమిటి?  ఎన్నికల సమయంలో ఇప్పటికైనా ఎన్డీఏ ,  ఇండియా కూటములు  తమ స్పష్టమైన విధానాన్ని ప్రకటించవలసిన అవసరం ఉన్నది

ఇక ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి సామాజిక రుగ్మతలకు ప్రధాన కారణాలైనటువంటి  మద్యపానం, ధూమపానం, క్లబ్బులు, పబ్బులు, ఈవెంట్లు, మత్తుపదార్థాలు, కూల్డ్రింక్స్  ఈ దేశ యువతను ప్రజలను పట్టిపీడిస్తుంటే  ఏనాడైనా కేంద్రం రాష్ట్రాల సహకారంతో వీటిని నిర్మూలనకు చర్యలు చేపట్టిందా?  ప్రధాని సొంత రాష్ట్రంతో పాటు ఒకటి రెండు రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తే సరిపోతుందా?  అనేక సామాజిక అకృత్యాలకు కారణమవుతున్నటువంటి మద్యపానాన్ని నియంత్రించడానికి ఎందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు?.  అందుకే" ఆకృత్యాలు అత్యాచారాల  నిర్మూలన, వివక్షత వంచన దోపిడీ లేని  సమాజం, అసమానతలు అంతరాలు లేని వ్యవస్థ  నిర్మాణం మాత్రమే పరిపాలన అనబడుతుంది"  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్లబొల్లి కబుర్లు మాని ఈ వైపుగా దృష్టి సారించాలి ఇప్పుడు ఎలక్షన్ల సందర్భంగా  దేశ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చిన పార్టీలకు మాత్రమే ప్రజలు మద్దతు పలుకుతారు.  ప్రజలను వంచించే ఏ రాజకీయ పార్టీలకైనా ప్రజల చేతిలో పరాభవం తప్పదు అని గుర్తిస్తే మంచిది.
(  వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333